ఓ సదాశివా! నీ కన్నులు చంద్ర, ఆదిత్యులు. హృదయము బ్రహ్మ. ధర్మకర్మ సంపాదితమైన అగ్నిష్టోమము శరీరము. నీ యథార్థమైన మహిమను బ్రహ్మ, హరి ఋషులును గూడ ఎఱుగలేరు. నీ శివమూర్తులు (మంగళకరములయిన ఆకారములు) సూక్ష్మములు. అవి నాకు దర్శనమిచ్చు గాక! తండ్రి కన్నకొడుకువలె ఆ మూర్తులతో నన్ను రక్షింపుము. నీ సంరక్షణలో ఉండదగిన నన్ను రక్షింపుము. నీవు భక్తానుగ్రాహకుడవు, నేను నీభక్తుడను, ఏ మూర్తి వేలకొలది పురుషులను ఆవరించి సముద్రము అవ్వల ఉండునో ఆ మూర్తి నాకు రక్షకమగుగాక! నిద్రజయించి శ్వాసను అరికట్టి సత్త్వగుణ స్థాయినంది సమదర్శనులైనవారు పరంజ్యోతిని (భ్రూమధ్య స్థానమున) సంయోజన చేసి ఏమూర్తిని చూతురో అట్టి యోగాత్మకుడవైన నీకు నమస్కారము. ప్రళయమందెల్ల భూతములను భక్షించి జలమధ్యమున శయనించు ఆ శివునకు నమస్కారము. అతడు రాహుముఖము జొచ్చి రాత్రి సోముని త్రాగును. పగలు సూర్యుని గ్రసించును. అట్టి నీమూర్తికి నమస్కారము. సోముడు, అగ్ని అంగుష్ఠమాత్రులై సర్వదేవతల దేహమందుండు పురుషులు (శివమూర్తులు) నన్నెల్లపుడు రక్షింతురు గాక నన్నాప్యాయనము చేయుదురుగాక (సంతృప్తుని గావింతురు గాక). ఎవ్వరి వలన పిండోత్పత్తి (గర్భోత్పత్తి) జరుగునో ఎవరు జలగర్భ మందుదురో, స్వాహా స్వధాకారమున హవిర్భాగములను అందుకొందురో ఆరగింతురో ఎవని వలన దేహధారులు పుట్టుదురో ఏ మూర్తులు జీవులను ఏడిపింతురో (రుద్ర రూపులుగా) ఆనంద పెట్టుదురో క్లేశముకల్గింపరో అట్టి నీమూర్తులకు నమస్కారము. సముద్రమందు, నదీదుర్గమందు, పర్వతములందు, గుహలందు, వృక్షమూలమందు, గోశాలలందు, అడవులలో, గహనములలో, చతుష్పథములందు (నాలుగుదార్లు కలిసినచోట), వీధులందు (రాచబాటలందు), చత్వరములందు (సంస్కరింపబడిన భూమి), సభలలో, ఏనుగు, గుఱ్ఱముల సాలలందు, పాడుబడిన ఉద్యానవనములందు, ఆలయములందు, పంచభూతములలో, దిక్కులలో, విదిక్కులలో, ఇంద్రసూర్యుల నడుమ, సూర్య చంద్ర కిరణములందు, పాతాళమందు, అంతకంటెను మీదను, ఇచ్చట ఏ మూర్తులుగలవో వానికి నమస్కారము. సత్వము నీవే సర్వత్ర నీవే సర్వభూతపతివి, సర్వభూతాంతరాత్మవు నీవు, అందుచే నీవు నిమంత్రితుడవు (పిలువబడువాడు) కావు. వివిధములైన దక్షిణలుగల యజ్ఞములచే నీవే యజింపబడుదువు. అంతకును నీవే కర్తవు. అందుచే నీవు నిమంత్రితుడవు కావు సూక్ష్మమైన మాయయునీవే. దానిచే నేనును మోహింపబడితిని. (పొరబడితినన్నమాట) అందుచేతగూడ నిన్ను నేను నిమంత్రింపలేను. నిన్ను పేర్కొనలేదని భావము. నాయెడల ప్రసన్నుడవగుము. నాకు నీవే దిక్కు నీవే నాగతివి. నీవే నా ప్రతిష్ఠయు (ఉనికి లేక ఆధారము). నీకంటె మఱియొక్కడు లేడని నా తలంపు అని ఇట్లు మహేశ్వరుని దక్షుడు స్తుతించి ఊరుకొనెను. భగవంతుడు ప్రీతుడై దక్షునిగని మఱియు ఇట్లనెను. నీ చేసిన స్తవముచే సంతుష్టుడనైతిని. నీవు ఉత్తమ వ్రతనిష్ఠుడవు. ఎక్కువ మాటలు ఎందులకు? నీవు నాసన్నిధికి వత్తువని త్రిలోకేశుడు భవుడు సర్వజ్ఞుడు దక్షునికి ఓదార్పుగ దక్షా! యజ్ఞ ధ్వంసమునకు దుఃఖపడవలదు. చూచితివిగదా. యజ్ఞహననము చేసినది నేనే. ఇదిగో నీ యజ్ఞఫలము ఉత్తమమైన దానిని నావలన మఱల పొందుము. ప్రసన్న సుముఖుడవు ఏకాగ్ర మనస్కుడవై నామాట వినుము. వేయి అశ్వమేధములు, నూరు వాజపేయములు చేసిన ఫలము నా ప్రసాదముచే నీవు ఇప్పుడు పొందగలవు. షడంగ వేదములను సమగ్ర సాంఖ్య యోగములను (జ్ఞానయోగములను) నీవు తెలిసికొనుము. పండ్రెండేండ్లు దేవదానవులు చేయలేని ప్రజ్ఞాహీనులు (అజ్ఞానులు) నిందించు నట్టిదియు వర్ణాశ్రమ ధర్మములతో కూడినదియు, లొంగనిదియు, వ్యవసితమును (వ్యవస్థ చేయబడినదియు) పశుపాశ విమోచనము చేయునది. (జీవుల అజ్ఞానపాశముల త్రెంచునది) సర్వాశ్రమస్థులకు అనువైనదిగ నేను సర్వపశుపాప విమోచన మంత్రమును రూపొందించితిని. ఇది లెస్సగ ఆచరించిన ఎడల పుష్కలమైన ఫలము గల్గును. అది నీకు అనుష్ఠేయము అగుగాక! మహానుభావ! మానసిక జ్వరమును (తాపమును) విడువుము అని ఇట్లు దేవేశుడు పలికి ఉమాదేవితో పరివారముతో అంతర్థానమయ్యెను. మఱియు ఆ భవుడు సర్వధర్మజ్ఞుడు కావున సర్వభూత శాంతి కొఱకు దక్షయజ్ఞ ధ్వంసమునకు తాను అవిర్భవింపజేసిన జ్వరము ఈ క్రింది విధముగా విభజించెను. ఆ వివరము ఓ విప్రోత్తములారా వినుడు.
ఆ జ్వరము గజములలో శిరోతాపముగను, పర్వతములలో శిలాజితముగను, నీటిలో నీలిక (అనుపేరుతోను) పాములలో కుబుసముగను, ఆవులలో భోరకము, భూమియందు ఊషరము (చవిటి నేల) కుక్కలకు నేత్రావరోధము (గ్రుడ్డితనము) గుఱ్ఱములకు రంధ్రా గతము నెమళ్లకు పింఛెములూడి పోవుటయును, కోకిలలకు నేత్ర రాగముగను, మహాత్ములకు ద్వేషము, సర్వజనులకు భేదము (ఒంటెత్తుతనము. ఒకరికొకరికి పడకపోవుట) చిలుకల కెక్కిళ్ళు, పులులకు శ్రమ (అలసట) మనుష్యులకు కేవలము జ్వరరూపమైన వ్యాధిగాను ఉంచబడినది. ఇది నరులకు పుట్టునపుడు, గిట్టునపుడు, ఆరెంటికి నడుమను గూడ ఉంచబడినది. ఇది మహేశ్వర తేజస్సే, జ్వరము (శివజ్వరము) అనుపేర మిక్కిలి దారుణమై ఉన్నది. సర్వ ప్రాణులకును ఈశ్వరుడు నమస్కరింపవలసినవాడు, మాన్యుడు. ఈ జ్వరోత్పత్తి నిండుమనసుతో చదివినవాడు రోగముక్తుడై సంతోషముతోగూడి సర్వాభీష్టములను పొందును.