బ్రహ్మ మహా పురాణము

ఋషి ప్రశంస నిరూపణము

లోమహర్షణుడు ఇట్లు చెప్పెను -

వ్యాస వచనములువిని జితేంద్రియులగు మునులు సంప్రీతులై సంతసించి ఆశ్చర్యముతో ఇట్లనిరి. భారతవర్ష ప్రభావమెంత చక్కగ నీవు వర్ణించితివి. అట్లే పురుషోత్తమ క్షేత్ర మహిమము తాము సెలవిచ్చినదివిని వింత చెందితిమి. చిరకాలము నుండి మా ఎదలో ఒక సందేహము పాదుకొని ఉన్నది. దానిని వదలింప తమకంటె వేరొకడు ఈ భూతలమున లేడు. బలరామకృష్ణులు అవనిలో అవతరించుటకు కారణమేమి? భద్రాదేవి అవతారము ఎందులకు వచ్చినది? వసుదేవుని కుమారులై అతని గృహమందు ఆ అన్నదమ్ములు ఎందులకుండిరి? ఈ లోకము దుఃఖప్రాయము, మృత్యురూపము. నీటి బుడగవలె అస్థిరము. పరమపురుషులగు వారు ఈ మలపూరితమైన రొంపిలో ఈ ఘోరమైన గర్భమున ఎందులకు నివాసమును కోరిరి? అవనిపై అవతరించి వారేమేమి పనులు చేసిరి? అవెల్ల సమగ్రముగ మాకు ఆనతిమ్ము. అతి మానుషమైన వాసుదేవ భగవానుని కథ పరమ పుణ్యము. పుణ్యాత్ముల చరిత్రలతో ముడిపడియున్నది. దివినుండి భూమి స్వామి వచ్చుటకు గతమేమి? చక్రపాణి సర్వసృష్టి, చక్రము త్రిప్పు ప్రభువు మనుష్యలోకము ఎడల ఎట్లు తలుపుగొనెను? సర్వ జగద్గోపకుడైన హరి సామాన్య గోపమూర్తి ఎందులకు అయ్యెను? మహాభూతములను భరించు సర్వభూతాత్మకుడైన ప్రభువు శ్రీగర్భుడు (అణిమాద్వైశ్వర్య సంపన్నుడు అగు శ్రీపతి ఒకమానవ స్త్రీ గర్భమున ఎట్లు భరింపబడెను? దేవతల మేలు కొఱకు ముల్లోకములను మూడడుగులచే ఆక్రమించిన త్రివిక్రమమూర్తి. భూర్భువ స్వర్లోకములు అను మూడు దారులను ధర్మార్థకామలు అను మూడు పురుషార్ధములను ఒడుదుడుకు లేకుండ నిలుపు స్థితికర్త అతడు లయకాలమున జలమయ మూర్తి దాల్చి లోకము ఏకార్ణవము ఒనరించి దృశ్యాదృశ్య స్వరూపమున జగమెల్ల దిగద్రావి ఉండు పురాణ పురుషుడు. పురాణాత్మరూపుడు. వరాహరూపధారియై, తన కొమ్ము తుద ఈ వసుమతిని ఉద్ధరించిన మధుసూదనుడు వసుంధరనెల్ల గెలిచి దేవతలకు ఇచ్చిన దేవపతి, నరాకృతి సింహాకృతియునై హిరణ్యకశిపు సంహరించిన శ్రీహరి ఔర్వాగ్ని (బాడబాగ్ని) స్వరూపుడై, ప్రళయమూర్తియై, పాతాళమునకు వెళ్ళి సముద్రమునెల్ల ఆపోశనము పట్టిన నారాయణుడు, ఈ అవని నరాకృతియై ఏల అవతరించెను? సహస్ర చరణుడు, సహస్ర శీర్షుడు, సహస్రపాదుడు, సహస్రాంశువునని ఏదేవుని {పురుష సూక్తమున) వేదజ్ఞులు స్తుతింతురో యుగ యుగమందు ఎవ్వని నాభినుండి పితా మహుని పుట్టినిల్లైన పద్మము ఉద్భవించునో, లోకము ఏకార్ణవమైనపుడు హిరణ్మయమైన ఆ కమలము ఎవ్వని నుండి పొడమెనో, ఎవ్వనిచే తారకాసుర సంగ్రామమున దైత్యులు హతులైరో, ఎవ్వడు సర్వ దేవతాత్మకమైన సర్వాయుధములను ధరించి మేనుగొని మదమెక్కిన కాలనేమిని కూల్చెనో, తుట్ట తుదను క్షీరసముద్రమందు అమృతనిధి యందు యోగమూర్తియై జగత్తు అంధకార బంధురమైనప్పుడు ఎవ్వడు నిద్రించునో ఆస్వామి ఈ అవనిపై అవతరించుటకు కారణమేమి! అని మునులు ప్రశ్నింపగా లోమహర్షణుడు వారికి ఇట్లు ఆనతిచ్చెను.

తపోబలమున దేవతలు అవతరించుటకు అరణియైన (అగ్ని పుట్టుటకు ఆధాంతభూతమైన జమ్మి కర్రల జత అరణి అనబడును) అదితి గర్భమందు ధరించిన దైత్యగణ బద్ధుడైన దేవేంద్రుని ఎవడు జాగరూకతతో రక్షించెనో, మూడడుగులను యోగమయములైన పదములనుగ చేసి, దైత్యులను సముద్రము పాలొనరించి, దేవతలను దేవేశ్వరులను దేవేంద్రుని, కాపాడెనో, గార్హపత్య విధానమున అన్వాహార్య కర్మచే ఆ హవనీయ అగ్నిని వేదమును, దీక్షను సమిధలను, ధ్రువపాత్రను ప్రోక్షణ పాత్రను, స్రువమును, అవబృధ్యమును ఏ మహానుభావుడు ముఖము చేయియు మఱియే అవయవ స్ఫూర్తిలేని నిరాకారుడు ఈ యజ్ఞరూపమును కల్పించెనో ఎవ్వడు హవ్య భాగములను భుజించు దేవతలను, హవ్యముల ఒసగు యజమానులను దేవతలను, కవ్యములను ఆరగించు పితృదేవతలను కల్పించి భోగార్థము యజ్ఞాచరణమందు యజ్ఞవిధిని సమ్మేళనము చేసెనో యజ్ఞపాత్రలు దక్షిణ దీక్ష చెరువు సోమ సాధనములైన యూపము సమిధ సోమము స్రువము పవిత్రములు పరిధులు మఱియు యజ్ఞార్హములైన ద్రవ్యములు చేమసలు సదస్యులను యజమానులను మేధాదులను క్రతు శ్రేష్ఠములను ఎవ్వడు పారమేష్ట్యమగు కర్మచేత (బ్రహ్మచేయవలసిన పనిగా) విభాగముచేసి ఆయా యుగముల కనువుగా ఒనరించెనో అయ్యజ్ఞ పురుషుడు విష్ణువే కృష్ణుడై అవతరించెను.

క్షణములు, నిమేషములు, కాష్టలు, కలలు వీని మానము అనుసరించి ఏర్పడు భూత భవిష్యద్వర్తమాన కాలములు ముహూర్తములు, తిథులు, నెలలు, దినము, సంవత్సరము, ఋతువులు, కాల యోగములు, త్రైకాలిక, కాల ప్రమాణము, ఆయువు, క్షేత్రములు (శరీరము), వాని ఉపచయము (పెరుగుదల), లక్షణము, రూపసౌష్టవము, ముల్లోకములు, ముమ్మూర్తుల, త్రివిధ కార్యము, త్రేతాగ్నులు, త్రికాలములు, కర్మత్రయము, త్రివర్ణములు సత్వరజస్తమ గుణములు ఎవ్వనిచే అంతులేని కర్మ ప్రభావముచే సృష్టింపబడునో, ఆ సృష్టికర్త హరియై అవతరించెను. సర్వ భూతాంతర్యామియై సర్వ భూత గుణ మూర్తియై మానవుల యందు ఇంద్రియముల వెంటనగు యోగముచేత వినోదించునో, గడచిన గడువనున్న కర్మముల యొక్క సంబంధముచేత సర్వ విధాయకుడైన ఈశ్వరుడు తానై (కర్మ ఫలదాన సమర్థుడై) ధర్మపరులకు ఎవ్వడు గతియు పాప కర్ములకు అగతియునై తోచునో, చాతుర్వర్ణ్య విభాగమునకు మూలమై రక్షకుడై ఉన్నాడో చాతుర్వర్ణ్యమున (చతుర్వేద విజ్ఞానమునకు) ఎవ్వడెరుగునో, బ్రహ్మచర్యాది చతురాశ్రమములకు ఎవ్వడాశ్రయుడో, సర్వ దిక్కుల నడిమి భాగము, ఆకసము, భూమి, వాయువు, సూర్యుడు, చంద్ర, సూర్యమయమైన జ్యోతిస్సు చతుర్యుగములకు అధీశ్వరమును ఎవ్వడు పరంజ్యోతి అని పరమ తపస్సని వేదములందు వినబడునో, ఎవ్వని పరుని ఆపరునిగా కూడ (జీవాత్మగా పరమాత్మగా కూడ) పేర్కొందురో, ఎవ్వడు పరుడు పరమాత్మయునో, ఆదిత్యులకు అధినాథుడును, దైత్యులకు అగంతకుడును ఏవిభుడో, యుగాంత మందంతకు డెవ్వడో, ఎవ్వడు లోకాంతకులకు కూడ నంతకుడో లోకసేతువుల కెవ్వడు సేతువో మేద్యకర్ముల కెవ్వడు మేథ్యుడో (మేథ్యము = పవిత్రము) వేదము లెరింగిన వారికి ఎవ్వడు ఎరుగ తగినవాడో సృష్టి హేతువులైన వారికి గూడ ఎవ్వడు సృష్టి బీజమో లేక ప్రభుశక్తి కలవాని కెవ్వడు ప్రభువో, సౌమ్య ద్రవ్యములకెవ్వడు సోముడో, అగ్నివర్చస్సుల కెవ్వడు అగ్నియో, సర్వ లోకేశులగు శక్రులకు (ఇంద్రులకు). ఈశ్వరుడో తపస్సులకు తపస్స్వరూపుడో వినయ శీలురులలో ఎవ్వడు వినయమో, తేజఃశ్శాలురలలో ఎవ్వడు తేజస్సో. కలహ శీలురులలో ఎవ్వడు కలహమో, గతిమంతులలో ఎవడు గతియో, అట్టి హరి ఈ పుడమిలో అవతరించెను. ఆకాశము నుండి వాయువు, ప్రాణవాయువు నుండి అగ్ని పుట్టినవి. ఆకాశము, అగ్ని, ప్రాణము ఈ మూడును విష్ణు రూపములే. రసము నుండి శోణితము, శోణితము నుండి మాంసము, మాంసము నుండి మేదస్సు, మేదస్సు నుండి (క్రొవ్వు) (హృదయస్థమైన) ఎముక ఎముక నుండి మజ్జ (ఎముకలోని క్రొవ్వు) మజ్జ నుండి శుక్రము, శుక్రము నుండి రస నిర్మాణ క్రియచే గర్భము పుట్టును. అందు మొదటి భాగము అప్పులు(ఉదకము) అదే సౌమ్య రాశియని చెప్పబడును. గర్భగతమగు ఊష్మము నుండి రెండవ రాశి పుట్టును. శుక్రము సోమాత్మకము ఆర్తవము (స్త్రీ శోణితము) అనలాత్మకము. అగ్ని సోమాత్మకమైన ఈ ద్రవ్యములు రసమును అనుసరించి ఏర్పడును. శశి పావకులు (అగ్ని) బీజములు. కఫ వర్గమునకు సంబంధించినది శుక్రము (పురుష వీర్యము) పిత్తవర్గములోనిది. స్త్రీ శోణితము. కఫమునకు స్థానము హృదయము. పిత్తమునకు స్థానము నాభి. దేహమధ్య మందున్న హృదయము మనస్సు ఉండుచోట నాభికోష్ఠమునందు అగ్ని దేవుడున్నాడు. మనస్సు ప్రజాపతి, కఫము సోముడు, పిత్తమగ్ని ఈ విధముగ ఈజగత్తు అగ్నిసోమాత్మకము. ఇట్లు ఏర్పడెడి గర్భము వృద్ధిబొందిన కొలది పరమాత్మతోపాటు వాయువు శరీరమునందు ప్రవేశించును. ఆ వాయువు శరీరమందు ప్రాణము అపానము, సమానము, ఉదానము, వ్యానమను అయిదు తెరగుల అయినది. ప్రాణ వాయువు పరమాత్మను పెంపొందించుచు హృదయమందు ఉండును. అపానము నాభి క్రింద భాగమున (గుద స్థానము) ఉండును. ఉదానము కంఠదేవము నందు ఉండును. వ్యానవాయువు శరీరమెల్ల వ్యాపించి యుండును. సమాన వాయువు నాభియందు ఉండును. ఇంద్రియ గోచరమైన ఈ భూతోత్పత్తి ఈ వాయువుల వలననే కలుగును. వాయువు, ఆకాశము, నీరు, భూమి, తేజస్సు అను ఈ పంచ భూతాంశలు ఇంద్రియములందు చేరినవై తమతమ భాగములను నిర్వహించును. దేహము పార్ధివమని అందురు. వాయువును ప్రాణస్వరూప మందురు. శరీరమందు ఉన్న నవరంధ్రములు (అవకాశములు) ఆకాశమూలములు. జలభూతమువలన శరీర మందు రక్త శుక్రాది స్రావమేర్పడును. కన్నులు జ్యోతి (తేజః) స్వరూపములు. మనస్సు వానికి ఆత్మ రూపము. మనశ్శక్తి వలననే విషయాదులు ప్రవర్తితములగును.

ఈ విధముగ సనాతనుడైన పురుషుడు పరమాత్మ సర్వలోకములను సృజించెను అని అనగా మునులు ఇట్లు అడిగిరి -

నశించు స్వభావముగల ఈ లోకమందు నశింపని పదార్థమగు విష్ణువు నర రూపమును ఎట్లు పొందెను అని మా సందియము. విస్మయమును, ఉత్తమగతి కేగువారికి పరమగతి అగు ఈతడెట్లు మానవశరీరి అయ్యెను? దేవతలు దైత్యులుగూడ ఈవిషయము పరమాశ్చర్యముగా పేర్కొందురు. అట్టి ఆశ్చర్యకరమైన విష్ణువుయొక్క పుట్టుక వృత్తాంతము తెలుపుము. ఆయన మహాతేజస్సు. బలవీర్యములు ప్రసిద్ధములు. ఆయన చేష్ట ఆశ్చర్యకరము. అట్టి విష్ణువు యొక్క తత్వమిపుడు చెప్పతగును. ఆ దేవుడు పురుషోత్తముడు దేవతల కష్టములను ఎట్లు హరించెను. సర్వవ్యాపకుడు సర్వలోకేశ్వరుడు సర్వలోక సుఖకరుడు సృష్టి స్థితి లయకారకుడును అగు జగన్నాథుడు శాశ్వతుడు. అంతము లేనివాడు. క్షయ వృద్ధులు లేనివాడు. పాపపుణ్య స్పర్శ లేనివాడు. నిర్గుణుడు. సూక్ష్ముడు, వికార రహితుడు, నిరంజనుడు, విభువు, నిత్యుడు, సత్తామాత్రుడు. అచలుడు, నిర్మలుడు, సర్వవ్యాపి నిత్యతృప్తుడు, నిరాశ్రయుడు అయిన అతడు దేవతలయందు వైకుంఠభావమును (నారాయణత్వం) మానవులందు కృష్ణత్వమును ఎట్లు పొందెను? కృతయుగమందు విశుద్ధమైన హరిత్వమును, సర్వేశ్వరుడగు ఆ భగవంతుని కర్మగతిని దురవగాహము అగు గడచిన, జరుగనున్న దానిని వినగోరుచున్నాము. భగవంతుడు స్వభావముచేత అవ్యక్తుడయ్యు వ్యక్త రూపమును పొందియున్నాడు. ఈయన నారాయణుడయ్యు హరి అనుపేర అవతరించెను. ఆయనే బ్రహ్మ, శక్రుడు (ఇంద్రుడు), రుద్రుడు, ధర్ముడు (యముడు), శుక్రుడు, గురుడు, అయినాడు. తొలుత ఆయనకు ప్రధానాత్మయై బ్రహ్మను సృజించెను. పురాణ పురుషుడగు అతడు పూర్వ కల్పమందు ప్రజాపతులను సృజించెను. అట్టి భగవంతుడు (షడ్గుణైశ్వర్య సంపన్నుడు) సర్వవ్యాపకుడగు విష్ణువు సర్వ లోకేశ్వరుడు మర్త్యలోకమున యదుకులమునందు ఎందులకు బ్రవేశించెను. తెలుపుము అని అడిగిరి (179)