“ధీశాలి బలభద్రుని పరాక్రమము శౌర్యమును గూర్చి ఇంకను వినగోరుచున్నాము. యమునా నదీ సమాకర్షణము మొదలగునవి విన్నాము. అతడు మఱియేమి చేసెను” అని మునులు అడుగగా వ్యాసులు ఇట్లు అనిరి - అనంతుడు భూమిని మోయు ఆదిశేషుడు అగు బలరామమూర్తి లీలలు వినుడు:
స్వయంవరమున దృష్టిపెట్టుకున్న దుర్యోధనుని కూతురును, జాంబవతి కుమారుడు సాంబుడు బలాత్కారముగ హరించెను. దానికి కోపించి కర్ణ దుర్యోధనాదులు భీష్మ ద్రోణాదులును వానిని యుద్ధములో ఓడించి బంధించిరి. అదివిని యాదవులు దుర్యోధనాదులందు కోపము గొని వారిని కడతేర్తుమని ప్రతిక్రియకు పూనుకొనిరి. వారిని వారించి బలరాముడు సగర్వముగ నేనొక్కడనే ఏగెదను. నామాటచే వానిని విడచెదరని నాగసము అను పురికేగి వెలుపలి ఉద్యానవనమందు విడిచెను. నగరములోని ప్రవేశింపలేదు. బలభద్రుడు వచ్చెనని తెలిసి దుర్యోధనాదులు హరికి గోవును పాద్యార్ఘ్యములను ఒసంగిరి. అవి స్వీకరించి కౌరవులతో ఉగ్రసేనుని ఆజ్ఞయిది. సాంబుని వెంటనే విడువుడు అనగా భీష్మ, ద్రోణాదులు, కర్ణ, దుర్యోధనులును విని కోపించిరి. బాహ్లికాదులతో అందరును యదు వంశము రాజ్యార్హము కాదని చూచి ముసలాయుధునితో ఇట్లనిరి.
బలభద్ర! నీవు అన్నమాట ఇదేమి? ఉత్తమ వంశమందు బుట్టిన వారి కొక యాదవుడు ఆజ్ఞ ఇచ్చుటా, ఎవ్వడు అతడు? ఉగ్రసేనుడు గూడ కౌరవుల కాజ్ఞ చేయునేని రాజులకు ఉచితమైన శ్వేతచ్ఛత్రము మీకెందులకు? అలంకారప్రాయములు. ఇవి ఎందులకు? బలభద్ర! నీవు చనుము. అన్యాయవర్తనుని సాంబుని నీ అజ్ఞచే కాని ఉగ్రసేనుని అజ్ఞచేకాని విడిచిపెట్టము. కుకురాంధకాదులు రాజులు మాకు ప్రణతులైనారు. అట్టి ప్రణతి చేయకపోగా, స్వామి భుృత్యునికచ్చినట్లు ఆజ్ఞ చేయుటయేమి? సహాసన సహపంక్తి భోజనములచే మీకు గర్వమెక్కినది. మీ తప్పేమి! ఓ బల! నీ చెప్పిన ఈ ఉగ్రసేనుడు మాకు పూజనీయుడగుట ప్రేమచేతనే. కులమును బట్టి కాదు. ఈ మా మర్యాద మీ కులమునకు తగదు అని కౌరవులు పలుకుచు హరి కుమారుని సాంబుని విడువరైరి. అందరు ఒకటే నిశ్చయముతో హస్తినాపుర నగరమును ప్రవేశించిరి.
అంతట అధిక్షేపముచే గల్గిన కోపముచే మత్తుగొని, ఘూర్జించుచు, లేచి, నేలను మడమలతో త్రొక్కి తాటించుచు, దానిచే ఈ భూమి పగులునట్లు పెద్ద ధ్వని దిక్కుల పిక్కటిల్ల హలి బాహులం జరచి కనులెఱ్ఱపడగా కనుబొమలు ముడివడి, మొగము కుటిలము గాగ బలదేవుడు ఇట్లనియె- “అహో! వట్టి నీరసులు దురాత్ములైన వారికి ఏమి పొగరిది! మాపై కౌరవుల పెత్తనము కాల ప్రభావము. ఉగ్రసేనుని ఆనతి అనుల్లం ఘనీయము (దాటగూడనిది) అని అనుకొనరే ! ఆయన ఆను దేవతలతో గూడ శచీపతి సధర్మముగ గైకొనునే. శచీ ప్రియుని సుధర్మసభను ఉగ్రసేనుడు ఏవేళను అధిష్టించుచున్నాడు. ఛీ! ఛీ! నూరుగురు మనుష్యుల ఉహరిచ్ఛిష్టమైన రాజాసనము నందు వీరికి సంతుష్టియట. పారిజాత తరుపుష్ప మంజరులను ఎవ్వని బంట్రౌతు లయ బలాజనము కొప్పులందు తురుము కొందుఱో అట్టి యుగ్రసేనుడు గూడ వీరికి దొరగాడట. సమస్త సార్వభౌములకు నధినాథుడైన యుగ్రసేనుడు అట్లుండుట! ఇప్పుడు ఉర్వినెల్ల నిష్కౌరవము చేసి ఆ ఊరికే ఏగెదను. కర్ణుని దుర్యోధనుని ద్రోణుని ఇప్పుడు భీష్ముని బాహ్లికుని దుశ్శాసనాదులను భూరిశ్రవస్సును సోమదత్తుని శలుని భీముని అర్జునుని యుధిష్ఠిరునితో కవలలను (నకుల సహదేవులను) మరియుంగల కౌరవులను సాశ్వరథ కుంజరముగ హత మొనర్చెదను. ఆ మీద సాంబుని సభాధ్యకముగ చేకొని ఆ పురికి ఏగెదను. ద్వారకకు ఏగి ఉగ్రసేనాది బంధువులను జూచెదను. లేదా! ఎల్ల కురువర్గముతో కౌరవుల భారము హరింప దేవాధీశు ప్రేరణమున శీఘ్రముగ నాగసమను ఆ నగరమును భాగీరథిలోనికి విసరివైచెదను” అని ఇట్లు కోపమున ఎఱుపు వారిన చూపులతో తాలాంకుడు ప్రాకార వ్రప్రములు అధోముఖముగ నాగలి (క్రిందు ముఖముగ) గ్రుచ్చి లాగెను. అంతట కౌరవులు గగ్గోలువడి ఇట్లు గోలపెట్టిరి.
రామ! రామ! మహావీర! క్షమింపు క్షమింపుము. కోపమును ఉపసంహరింపుము. ప్రసన్నుడవగుము! ఇదుగో సాంబుడు పత్నితో ఇదే వెలువరింపబడినాడు: నీ ప్రభావము ఎఱుగని అపరాధులను క్షమింపుము అని కౌరవులు త్వరగ తమపురమునకు ఏగి భార్యతో సాంబుని విడిచిరి. బలవంతులకెల్ల బలవంతుడగు బలరాముడు భీష్మ ద్రోణ కృపాచార్యాదులకు ప్రణామములు చేసి శాంతుడనైతినని పలికెను. ఇప్పటికిని ద్వారక పెల్లగిలినది పెల్లగిలి నట్లు కనబడుచున్నది. ఇది బల శౌర్యశాలి బలరాముని ప్రభావము. ఓ ద్విజులార! అవ్వల కౌరవులు సాంబుని హరి సహితముగ పూజించి పెండ్లి కానుకలు సారె చీరలు పెట్టి భార్యతో ద్వారకకు పంపిరి. (208)