బ్రహ్మ మహా పురాణము
పౌండ్రక వాసుదేవ వధ
మునులు ఇట్లు అనిరి -
మానుషమూర్తియై శౌరి ఇంద్రుని శంకరుని సర్వదేవతలను లీలామాత్రముగ గెలిచి మహత్కార్యమును ఒనరించెను. దేవతలు తెలియక చేసిన చేతలకు విఘాతము చేసిన హరి ఇంకను చేసిన లీలలను తెలుపుము. మాకు విన వేడుక అగుచున్నదన వ్యాసులు ఇట్లనిరి:
“మునివరులార! తెలుపుచున్నాను. ఆదరముతో వినుడు. కృష్ణుడు నరావతారమున వారణాసి నగరమును కాల్చి వైచెను. పౌండ్రక వాసుదేవుడు ప్రజలు తనతో వాసుదేవు డొకడు భూలోకమున సంచరించుచున్నాడు. నిజముగ అవతరించిన వాడవు నీవే అని పలుకుచుండ వాడు వాసుదేవుడను నేనే, అవని అవతరించితిని ననుకొనెను. దానిచే స్మృతితప్పి వాడు విష్ణు చిహ్నములైన శంఖ చక్ర గదాదులను అయోమయముగ చేయించుకొని పెట్టుకొని కృష్ణునకు దూతను కూడ పంపెను.
ఆ పంపబడిన దూత వాని మాటలుగ కృష్ణునికి ఇట్లు చెప్పెను. ‘ఓ మూఢ! చక్రాది చిహ్నములను నీవు పెట్టుకున్న వాసుదేవుడు అనెడి నా పేరును సర్వమును విడిచి నీవు బ్రతుక తలతువేని నాకు ప్రణతుడవగుము’ అనగా నవ్వి దూతతో భగవంతుడు ‘నా చిహ్నమగు చక్రమును నీ ఎదుట విడిచెదను. అని అంటినని నా మాటగ నీవేగి పౌండ్రకునికి చెప్పుము. నీమాటలోని మంచితనము నాకు తెలిసినది. చేయదగినదేదో చేయుము. నేను నా చిహ్నములను ధరించియే నీ పురమునకు వచ్చెదను. నా చిహ్నమయిన చక్రమును నీ కొఱకు వదలేదను గూడ. సందేహము లేదు. ఆజ్ఞాపూర్వకముగ రమ్మని నీవన్న మాటను రేపే విలంబము లేకుండ నీకు అప్పగించెదను. నీ శరణము (దిక్కు)నకు ఏతెంచి నీవలన మఱి ఏ కొంచెము భయము లేకుండ చేయవలసినపని చేసెదను’ అని పరిహాసగర్భముగ తెలుపబడి దూత చనినంతట స్మరణ మాత్రముచేత వచ్చి వ్రాలిన గరుత్మంతునెక్కి త్వరితముగ హరి తత్పురమునకు ఏగెను.
కాశిరాజు హరి ప్రయత్నమును విని అపుడు పౌండ్రకుని పక్షమున సర్వ సైన్య పరివారముతో పార్ణిగ్రాహియై (మడమల దొక్కికొనుచు) వచ్చెను. అంతట ఆ పౌండ్రక వాసుదేవుడు పెనుబలముతో కాశీరాజు బలముతోడను కేశవునకు ఎదురు నిలిచెను. హరి ఉన్నత రథమందున్న వానిని శంఖ చక్ర గదాహస్తుడైన వానిని, ఒక హస్తమున పద్మమును బట్టిన వానిని వనమాలాధరుని శార్ఙ్గమను విల్లు చేకొన్నవానిని బంగారపు నగిషీ చెక్కిన టెక్కముగల వానిని ఉరమున శ్రీవత్స చిహ్నమును దాల్చినవానిని కిరీట కుండల ధారిని పీతాంబరుని పౌండ్రకుని చూచి మధువైరి భావ గంభీరముగ నవ్వెను.
చతురంగ బలముతో గదాశూలశక్త్యాది సర్వాయుధములతో ఎదిరించినవానితో కృష్ణుడు యుద్ధము చేసెను. శార్ఙ్గ ధనుర్ముక్తములైన అగ్ని జ్వాలలచే దారుణములైన గదా చక్రపాతములచే క్షణములో వాని సైన్యమును హతమొనర్చెను. కాశిరాజు సత్వమును గూడ క్షయింపజేసి తన చిహ్నములను దాల్చియున్న అమూఢునితో భగవంతుడు ఇట్లనియె.
పౌండ్రక! దూతముఖమున నీవు పంపిన కబురంతయు విన్నాను. నా చక్రాది చిహ్నములను వదలమని కదా నీ యాజ్ఞ. అది అట్లే నిర్వహించినాను. ఇదిగో చక్రము. ఇదిగో గద వదలుచున్నాను. గరుత్మంతుడిడుగో. నీ ధ్వజమిందెక్కు గాక! అని పలికిన క్షణమునహరి వదలిన చక్రముచే వాడు చీల్చబడెను. గదచే హతుడై పడెను. గరుత్మంతునిచే గరుత్మంతుడయ్యెను. అనగా రెక్కలు వచ్చినట్లై ఆకాశమునకు ఎగిరిపోయెను. అంతట లోకము హాహాకార మొనరించెను. మిత్రునకు ఉపకారముగ కృతజ్ఞతగ కాశిరాజు వాసుదేవునితో తలపడెను. హరి శార్ఙ్గ ధనుర్ముక్తములైన అమ్ములచే వాని శిరము నరికి లోకమునకు అచ్చెరువు కలుగునట్లుగా కాశిపురికి విసరివేసెను. శౌరి పౌండ్రకుని కూల్చి పరివారముతో కాశీరాజును చంపి ద్వారవతికి వచ్చి స్వర్గమునకు ఏతెంచిన దేవేంద్రునివలె విలసిల్లెను.
కాశీరాజ్య రాజధానియందు పడిన కాశీరాజు తలను చూచి ఇదేమి ఎవరీ పనిచేసిన వారు అని జనము విస్మయమందిరి. వాసుదేవునిచే ఆ కాశీరాజు హతుడయ్యెనని ఎరిగి వాని కొడుకు పురోహితునితో ఏగి కాశీ విశ్వేశ్వరుని స్తుతించెను శంకరుడు ఆ విముక్త మహాక్షేత్రమున వానిచే తోషితుడై ఆ రాజు సుతుని వరము కోరుకొమ్మనెను. వాడు స్వామి! నా తండ్రిని కడతేర్చిన కృష్ణుని కడతేర్చుటకు మహేశ్వర! నీ అనుగ్రహమున కృత్యయను దారుణశక్తి లేచుగాక అనెను. అట్లేయగునని అనినంత వాని అగ్నిహోత్రశాల యందలి దక్షిణాగ్నినుండి మహాకృత్యలేచెను. అగ్నిఙ్గలా భయంకరమైన ముఖము, మంటలెగయుచున్న కేశకలాపముతో, కృష్ణా! కృష్ణా! అనుచు కోపముతో అది ద్వారవతి వంక చనెను. ఆ రౌద్రమూర్తిని వికృతమగు కన్నుల దానిని ద్వారకావాసి జనమెల్ల చూచి జగముల కెల్ల శరణమైన మధువైరిని శరణొందిరి.
కాశిరాజు వృషభధ్వజుని ఆరాధించి ఈ మహాకృత్యను కృష్ణుని చంపుటకు పుట్టించెను. అగ్ని జ్వాలలతోడి జడలచే ఆకులయైన ఈ ఉగ్ర శక్తిని సంహరింపుము అను జనఘోష చదరంగమాడుచు విని ఆటగ అగ్ని మాలాజటిలమై జ్వాలలను గ్రక్కుచు నున్న అతి భీషణమైన అకృత్యను విష్ణు చక్రము సుదర్శనము వెనుకకు తరిమెను. మహేశ్వర దేవతాకయగు ఆ కృత్య హరి చక్ర విధ్వస్తయై వేగమున పరువెత్తెను. దానిని చక్రము వెంబడించెను. అపుడా కృత్య విష్ణు చక్రముచే ప్రభావము గోల్పడినదై, వారాణసిని ప్రవేశించెను.
అవ్వల కాశీరాజు సైన్యము అంతువడని ప్రమథగణ సైన్యము సర్వ శస్త్రాస్తములతో చక్రమున కెదురు పోయెను. శస్త్రాస్త్రాఘాత బహుళమైన ఆ సైన్యమునెల్ల దహింపజేసి అశేష కాశీనగరమును నిండ చతురంగ బలముతో, రాజ భృత్యులతో, పౌరులతో, దుర్గములతో, కోష్ఠములతో కాల్చి గృహ, ప్రాకార, తోరణములందు మంటలు అలముకొన సత్వరము అచక్రము వారణాసిని గాల్చెను. అక్షీణమైన కసితో సాధ్యసాధన కారకములు అన్నింటిని శేషములేకుండా చేసి, ఆ సుదర్శన ఆయుధము, దీప్తిమంతమై విష్ణు హస్తమునకు ఏతెంచెను. (207)