బ్రహ్మ మహా పురాణము

నరకదుఃఖ నివారణము

మునులు ఇట్లు అనిరి -

“యమలోక మార్గమందు గల్గు ఘోర దుఃఖము ఘోరములైన నరకములు నరక ద్వారమును గురించి ఆశ్చర్యమైన విషయములను నీవు తెలిపితివి. భయంకరమైన ఆ దారిలో సుఖముగ వెళ్ళుటకు ఉపాయము కలదో లేదో తెలుపుము అనగా వ్యాసుడు ఇట్లనియె. ఇహమందు ధర్మపరులై అహింసా నిరతులై గురుశుశ్రూష దేవ బ్రాహ్మణ పూజచేసిన వారు భార్యా పుత్రాదులతో యమ మార్గమున వెళ్ళరు. బంగారు టెక్కెములతో కూడిన దివ్య విమానముల అందు అప్పరసలు సేవించుచుండగా ధర్మరాజు పురమునకు పోయెదరు. బ్రాహ్మణులకు అన్నదానము మొదలైన వానిని భక్తితో పవిత్రముగ చేసినవారు దేవతా తరుణులచేత సేవింపబడుచు విమానముల మీద వెళ్ళెదరు. సత్యము పల్కినవారు మనసులో మాటలో స్వచ్ఛమైనవారు విష్ణు తాత్పర్యముతో గోదానము చేసినవారు అప్సరసలు సేవింప ధర్మపురికి ఏగుదురు.

పాద రక్షలు గొడుగు మంచము ఆసనము వస్త్రాభరణములను ఒసంగినవారు గజాశ్వరథములను ఎక్కి బంగారు వెండి గొడుగులతో ఏగుదురు. శుద్ధాంతః కరణముతో పానకము అన్నము పూజించి ఇచ్చినవారు బంగారు విమానములలో ప్రయాణింతురు. పాలు పెరుగు నేయి బెల్లము మంత్రపూతముగా పరిమళ పుష్పముల నిచ్చినవారు హంస విమానముల మీద అరుగుదురు. నువ్వులను తిలధేను ఘృతధేను దానములను శ్రద్ధతో శ్రోత్రియులకు ఇచ్చినవారు చంద్రమండలమువలె ప్రకాశించు విమానముల మీద గంధర్వులు గానము చేయుచుండ యమపురికి పోయెదరు. వాపీకూప తటాకములు సరస్సులు దిగుడుబావులు పుష్కరుణులు మొదలైన శీతలోదక జలాశయములను త్రవ్వించిన వారు బంగారు విమానముల మీద దివ్య ఘంటానాదము వినిపించుచుండగా ఛత్ర చామరాదులచే వీచబడుచు పోవుదురు. ఈ లోకమందు దేవాలయములు సువర్ణ రత్నమయములుగా నిర్మించినవారు వాయువేగములైన విమానములలో లోకపాలురతో ఏగుదురు. మంచినీళ్ళిచ్చిన వారు దారుమయ పాదులు పీఠములు ఆసనములు ఇచ్చిన వారు సుఖముగ స్వర్ణమణి పీఠమందు గూర్చుండి విమానములలో ఏగుదురు. పుష్పోద్యానములు పండ్లతోటలు ప్రతిష్ఠించినవారు చల్లనిచెట్ల నీడలో దేవతాగానముల వినుచు ఏగుదురు. బంగారము వెండి పవడము ముత్యము దానమిచ్చిన వారు భూదాతలు సాలంకృత కన్యాదానము చేసినవారు సుగంధాగరు కర్పూరములను పుష్పములను ధూప ద్రవ్యములను ఒసంగినవారు సుగంధ లిప్తులై, సువేషులై, సుప్రభులై, సుభూషితులై, ధర్మపురము ఏగుదురు. దీప దానము చేసినవారు సూర్యసదృశమైన విమానములమీద దశదిశలు మెరయించుచు ఏగుదురు. గృహదానము చేసినవారు బంగారు గృహముల వసింతురు. జలకుంభములను కుండికలను కూజాలనిచ్చినవారు ఏనుగులమీద వెళ్ళెదరు. పాదా భ్యంగము. శిరోభ్యంగము చేయించినవారు, స్నానపానోదకములను ఇచ్చిన వారు జాతి గుఱ్ఱమునెక్కి వెళ్ళెదరు. మార్గాయాసమున వచ్చిన బ్రాహ్మణులను విశ్రమింపజేసిన వారు చక్రవాక పక్షులు పూన్చిన వాహనముల ఏగుదురు. ఇంటికి వచ్చిన బ్రాహ్మణులకు స్వాగతము ఇచ్చి (దయచేయుడని గౌరవించి), సుఖాసనమిచ్చి, పూజించినవారు నమో బ్రహ్మణ్యదేవాయ (బ్రహ్మణ్యమూర్తియైన భూదేవునకు నమస్కారము) అని పాదములపై వ్రాలి నమస్కరించి పాపహరయను మంత్రముతో గోదానము చేసిన వారును సుఖ ప్రయాణము చేయుదురు. ద్విజభుక్త శేషము అనగా బ్రాహ్మణులకు భోజనము పెట్టిన తరువాత శేషించిన అమృతమను పేరుగల ఆహారము ప్రసాద రూపముగ ఆరగించిన వారు, దాంభిక వృత్తి అనృతము లేనివారు హంస విమానమున ఏగుదురు. మూడు రోజులు ఉపవాసముండి నాల్గవ రోజున ఏకభుక్తముచేసిన వారు మూర్ఖత్వము డాంబికము లేనివారు నెమలి విమానములో ఏగుదురు. మూడు రోజుల కొకసారి వ్రతము పూని భోజనము చేయువారు గజ రథముల మీద ఏగుదురు. అరురోజుల కొక్కమారే శుచియై భోజనము చేసిన అతడు దేవేంద్రునట్లు ఏనుగును ఎక్కి వెళ్ళును. పక్షమున కొకతూరి భోజనము చేసినవారు పులులుపూన్చిన రథమున పోయెదరు. నెలరోజులు ఉపవాసము చేసినవారు గంధర్వ గానములు వినుచు విమానయానము చేయుదురు. విష్ణుభక్తి తాత్పర్యముతో నారాయణ పారాయణతతో ప్రాణము బాసినవాడు అగ్ని ప్రవేశము చేసినవాడు అగ్నివలె విలసించు రథమున పోవును. విష్ణు భక్తితో తనంతట తాను జలములో దిగి ప్రాణము వదలినవాడు, తన శరీరమును గ్రద్దలకు ఎరవెట్టినవాడు బంగారు విమానమున ఏగును. గోరక్షణకు స్త్రీ రక్షణ కొరకు ప్రాణమర్పించినవాడు దేవతా స్త్రీలు గొలువ సూర్యప్రభతో ఏగును. విష్ణు భక్తితో తీర్థయాత్ర చేసినవారు, యజ్ఞములు చేసినవారు ఇతరులకు ఎట్టి బాధయు కల్గింపనివారు భక్తితో సేవచేయు నౌకర్లను భరించినవారు ఓరిమిగల వారు సర్వ భూతదయ గలవారు అభయమిచ్చినవారు కామాది గుణములు లేనివారు చంద్ర ప్రకాశమైన విమానమున దేవ గంధర్వులు కొలువ యమపురికి ఏగుదురు. బ్రహ్మ విష్ణు శివ మూర్తులను భేదబుద్ధి లేకుండ పూజించినవారు సూర్య ప్రభములగు విమానముల చేయుదురు. సత్య శౌచములుగల్గి మాంసము తినని వారును సుఖముగ ఏగుదురు. భక్ష్య భోజ్యాదులందు మాంసముకంటె రుచికరమైన పదార్థములేదు. పరసుఖాభిలాషి దానిని తినగూడదు. మాంసము ముట్టనివాడు గో సహస్ర దానము చేసినవాడును సమానులే అని వేదవేత్తల కెల్ల శ్రేష్ఠుడైన బ్రహ్మ చెప్పినాడు. సర్వతీర్థ సేవనము సర్వయజ్ఞా చరణము వలన కల్గు పుణ్యమొక్క మాంసభక్షణ చేయనందువలన కల్గును. దానవ్రత ధర్మపరులైన మహానుభావులు సూర్యకుమారుడైన ధర్మ ప్రభువుయొక్క నగరమునకు సుఖముగ ఏగుదురు.

అట్లు వచ్చిన ధర్మాత్ములకు యముడు స్వయముగా స్వాగతముపల్కి పాద్యార్ఘ్యాసనా ద్యుపచారములు చేసి సత్కరించును. మీరు ధన్యులు మహానుభావులు. మీ హితవేదియో తెలిసి పుణ్యముచేసినారు. ఇదిగో! దివ్యస్త్రీ భోగ భాజనమైన ఈ విమానమెక్కి సర్వకామ సమృద్ధమైన స్వర్గమునకు వెళ్ళుడు. మహాభోగములను అట అనుభవించి దానము పుణ్యము చెల్లిన తరువాత శేషించి ఏదైనను కొంచెము పాపమున్నయెడల దానినిక్కడ అనుభవింపుడు. పుణ్యఫలముగా సౌమ్యమైన మనస్సుతో తనకు తండ్రియైన యముని పితృదేవతా రూపమున దర్శింతురు. కావున ధర్మము భుక్తి ముక్తులను ఇచ్చునది అవశ్యము సేవింపవలసినది. ధర్మమువలననే అర్థ కామములు మోక్షముగూడ సిద్ధించును. ధర్మము తల్లి, తండ్రి, సోదరుడు దిక్కు ధర్మము యజమానికి మిత్రుడు రక్షకుడు ధాత పోషకుడును. ధర్మము వలన అర్థము అర్థమువలన కామము కామమువలన సుఖభోగములు ధర్మము వలన సర్వోత్తమ ఐశ్వర్యము ధర్మమువలన స్వర్గగతి పరమగతియు ధర్మమును ఆచరించిన అది మహాభయమునుండి రక్షించును.

దేవత్వము భూదేవత్వము దాని వలననే లభించును. పూర్వపాపము నశించినపుడే జీవులకు ధర్మబుద్ధి కలుగును. వేలకొలది జన్మముల తరువాతగాని లభింపని మానుష్యమును పొందికూడ ధర్మమును ఆచరింపనివాడు దైవవంచితుడు. ధర్మ దూరులైన వారే నీచులు, దరిద్రులు, విరూపులు, రోగులు, నౌకరులు, మూర్ఖులు అగుదురు. దీర్ఘాయుష్మంతులు, శూరులు, పండితులు, భోగులు, ధనికులు, అరోగులు, సురూపులు అగువారు పూర్వము ధర్మము చేసినవారన్న మాట. ధర్మరతులు ఉత్తమగతి పొందుదురు. అధర్మరతులు పశుపక్ష్యాది యోనినందుదురు. నరక ధ్వంసియైన వాసుదేవుని సేవించు వ్రతముగలవారు కలలోగూడ కాలుని నరకములను చూడరు. ఆద్యంతములు లేని దేవుని దైత్య దానవ నాశకుని పరమేశ్వరుని అచ్యుతుని త్రికరణశుద్ధిగ శరణొందినవారిని యముడేమియు చేయజాలడు. నారాయణుని నమస్కరించువారు విష్ణు స్థానమందు మరియొక చోటునకు పోరు. వారికి యమదూతలు, యముడు, యమపురి, నరకములు కానిపింపవు. పొరవడి పెక్కు పాపములు చేసినవారుకూడ సర్వపాపహరుడగు హరిని నమస్కరించిరేని నరకమునకు పోరు. మౌఢ్యము చేతనైనను జనార్దనస్మరణ చేసినవారు శరీరమును విడిచి విష్ణు లోకమునకు పోదురు. పగచేనైనను ఒక్కతఱి హరినామము ఉచ్చరించిన చాలును శిశుపాలుడు అట్లు ముక్తిని పొందెను” అని లోమహర్షుడు చెప్పెను. (216)