సముద్ర స్నానానంతరము యజ్ఞ పురుషుని శరీరమందు ఆవిర్భవించిన తీర్థము ఇంద్రద్యుమ్న సరస్సును సేవింపవలెను. ఆ తీర్థ సేవనమందు ‘అశ్వమేధాంగ సంభూత’ అను మంత్రమును ఉచ్చరించవలెను. ఇట దేవర్షి పితృ తర్పణముచేసి దశాశ్వమేధయాగ ఫలమొందవచ్చును. గడచిన ఏడు తరముల, రాగల ఏడు తరములవారిని ఈ పుణ్య మాచరించు వాడు ఉద్ధరింపగలడు. కామగమన విమానమున విష్ణు లోకమునకు పోగలడు. ఏకాదశి ఉపవాసముండి, పంచ తీర్థములను సేవించి, జ్యేష్ఠశుద్ధ పూర్ణిమనాడు పురుషోత్తముని దర్శించు వాడు పునరావృత్తి రహిత పుణ్య స్థానమందును” అని చెప్పెను.
“మాఘాది మాసములను వదలి జ్యేష్ట మాసమునే ప్రశంసించితి వేల? అని మునులు అడుగ బ్రహ్మ ఇట్లనియె. జ్యేష్ఠ శుక్ల దశమి మొదలు ఏడు రోజులు సర్వ తీర్థములు పురుషోత్తమ క్షేత్రమందుండును. కావున ఏకొంచెము పుణ్యమైనను ఇచట అక్షయమగును.
జ్యేష్ఠ శుక్లపక్ష దశమి పది రకముల పాపములను హరించును. కనుక దశహర అనబడును. ఆనాడు బలరామకృష్ణ సుభద్రల దర్శనము విష్ణు లోకప్రదము. ఫాల్గుణ పూర్ణిమనాడు ఊయెల యందున్న గోవిందుని డోలోత్సవమును జూచు నతడు గోవింద పురమేగును. విషువత్తులందు పంచతీర్థ సేవన మొనరించి, ఆమూడు మూర్తులను సేవించు నతడు సర్వయజ్ఞ ఫలమును పూర్తిగా పొందినవాడు అగును. విష్ణులోక గమనము. వైశాఖ కృష్ణ తృతీయ తిధియందు కృష్ణునకు చందనోత్సవము జరుగును. అది చూచునతడు విష్ణు లోకమునకు చేరుకొనును. జ్యేష్ఠా నక్షత్రముతో నున్న జ్యేష్ఠ పూర్ణిమ యందు పురుషోత్తమ దర్శనముచేసి అనతడు ఇరువది యొక్క తరములను ఉద్ధరించి విష్ణుపద మందును. (63)