బ్రహ్మ మహా పురాణము

దక్షయజ్ఞ విధ్వంసము

వైవస్వత మన్వంతరమున ప్రాచేతసుడగు దక్ష ప్రజాపతియొక్క అశ్వమేధయాగము ఎట్లు నాశమొందెను. దేవి యొక్క క్రోధ వ్యాపార మెరిగి సర్వాత్మకుడగు ఈశ్వరుడెట్లు కోపించెను. అమిత తేజోవంతుడగు దక్షుని యాగము మహాదేవునిచే రోషముతో నశింపచేయబడిన వృత్తాంతము సవిస్తరముగ మాకు ఎఱింగింపుము అని ఋషులు బ్రహ్మను ప్రశ్నించిరి.

ఋషులకు బ్రహ్మ ఇట్లనియె! మేరుశృంగమొకటి ‘జ్యోతి స్థ్సలము’ అను పేర ఉన్నది. అది సర్వరత్న భూషితము. లోకమనోహరము. ఆ పర్వతముపై శైలకన్యతో ఇందుధరుడు (శివుడు) వసించును. ఆదిత్యులు, వసువులు, అశ్వినులు, కుబేరుడు, సనత్కుమారాదులు అప్సరసలు అందరు ఈశ్వరుని సేవింతురు. గంగానది మూర్తిని ధరించి శివునికి సేవలు చేయుచుండును. దక్ష ప్రజాపతి ఆ సమయమున యజ్ఞారంభము చేసెను. ఇంద్రాది దేవతలు వచ్చిరి. అగ్నిసమమైన తేజస్సులతో విమానములమీద గంగా (హరి) ద్వారమునకు వారు అరుదెంచిరి. గంధర్వులు అప్సరసలు ఆడిరి పాడిరి. అందరును చేతులొగ్గి ఆయనను సేవించిరి. మఱియు శ్రీమహావిష్ణువుతో వసు, రుద్ర, ఆదిత్య, సాధ్య మరుద్గణములు, ఊష్మవులు, ఆజ్యవులు, సోమపాయులు అశ్వినీ దేవతలు యజ్ఞభాగార్థులై వచ్చిరి. జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్భిజ్జములను నాలుగు రకముల జీవసమూహము కూడ వచ్చిచేరిరి. దేవతలు, ఋషులు, సపత్నీకులై ఏతెంచిరి. వారిని చూచి దధీచి కుపితుడై

పూజార్హురులు కానివారిని పూజించినను అర్హులను పూజింపకున్నను మానవుడు మహాపాపియగును. అని దక్షుని చూచి పశుపతిని పూజారుని పరమేశ్వరుని నీవేల పూజింపవని యడిగెను. దానికి దక్షుడు, శూలహస్తులు జటాజూటధారులునైన ఏకాదశ రుద్రులు నాకు గలరు. మఱియొక మహేశ్వరుని నేనెరుగను అనెను. అదివిని దధీచి సర్వేశ్వరులకు ఏకైకమూర్తి అయిన మా మహేశ్వరుని నీవు పిలువలేదు శంకరుని కంటె మించిన దైవతమును నేనుగానను. ఈయజ్ఞము సంపన్నముగాదు. అన దక్షుడు విష్ణువునకు హవిర్భాగము లిచ్చితిమి. రుద్రులకు నిచ్చితిమి. మఱియును గల దేవతలందరకు వారివారి భాగములను ఇచ్చుచున్నాను. శంకరునికి మాత్రము ఈయను అనెను.

తండ్రి యజ్ఞమునకు వేల్పులెల్లరు ఏగిరని తెలిసి గిరిరాజకుమారి పార్వతి పశుపతియగు పతితో నిట్లనియె. స్వామి! ఇంద్రాది దేవతలు ఎచటికేగుచు ఉన్నారు. ఆ రహస్య మును సర్వ రహస్యజ్ఞుడవగు నీవు నాకానతిమ్ము అన ఈశ్వరుడు: మహానుభావుడగు దక్షుడను పేరుగల ప్రజాపతి అశ్వమేధము చేయుచున్నాడు. దేవి! ఈ యజ్ఞమునకు మీరేల వెళ్ళరు. వెళ్ళక పోవుటకు అభ్యంతరమేమి? ఈశ్వరుడు: ఇదంతయు దేవతలు చేసిన కుట్ర. యజ్ఞములందు అన్నిటను నాకు భాగము కల్పింపబడుటలేదు. మునుపటి నుండి యేర్పడిన దారినే పోవలెను. దేవతలు యజ్ఞభాగమును నాకు ధర్మము ననుసరించి ఈయవలసినది ఇచ్చుటలేదు అనగా పార్వతి ఏలినవారు ప్రభావము చేతను గుణముల చేతను తేజస్సుచేత కీర్తిచేత అణిమాసంపదచేత దేవతలందరిలో గెలువరానివారు లొంగని వారు. మీకీ హవిర్భాగము ఈయనందుకు నేనెంతో దుఃఖము పొందుచున్నాను. నాకు వణకు పుట్టుచున్నది. సాక్షాత్తు భగవంతుడు ధ్యానమునకందని మహానుభావులు అయిన నా భర్త యజ్ఞభాగము నందుటకు నేనేమి దానము, నియమము తపస్సు చేయుదును అని పలికి క్షోభ పడుచున్న పల్నిని జూచి భగవంతుడు అనందభరితుడై ఇట్లనియె.

ఈశ్వరుడు-

ఓ కృశోదరి! లతాంగి! నన్ను నీవెఱుంగవు. నీ విపుడన్న మాటలేమంత ఉచితములు? విశాలాక్షి! మహానుభావులు అందజు ఏమనుకొందురో నేనెఱుంగుదును. నీకు కలిగిన పొరబాటువలన ఇంద్రునితో గూడ ఎల్ల దేవతలు ముల్లోకములు సర్వము నష్టపడినది. నన్ను యజ్ఞేశ్వరుండందురు. రథంత సామముచే వేదవిదులు నన్ను స్తుతింతురు. బ్రాహ్మణులు నన్ను వేదమంత్రములచే యజింతురు. అధ్వర్యులు నాకు యజ్ఞములందు భాగము కల్పింతురు. అనవిని దేవి ఇట్లనియె. సామాన్యునివలె ఆడువారివద్ద నిన్ను నీవు పొగడుకొనుచున్నావు. నీలో నీవు గర్వపడుచున్నావు. సందేహములేదన నీశ్వరుడు సురేశ్వరి! నీవనుకొన్నట్లు నన్ను నేను పొగడుకొనుటలేదు. ఇక నా యజ్ఞ భాగమును నేనడుగ బోవు చున్నాను. అని ప్రాణముల కంటె ప్రియురాలైన ఉమాదేవిని గూర్చి భగవంతుడు పలికి ముఖము నుండి వెలువడుచున్న క్రోధాగ్ని నుండి ఒక కుమారుని సృష్టించెను. వానిని చూచి దక్షుని యజ్ఞమునకు పొమ్ము. నాఆజ్ఞచే అతడు చేయుచున్న క్రతువును నాశనము చేయుమనెను.

అటు తరువాత ఇట్లు రుద్రుడు ప్రయోగించిన సింహవేషధారి చేతను దేవి క్రోధవశమైనదని యెఱింగి నా దక్షయజ్ఞము అవలీలగ ధ్వంసము చేయబడెను. ఆగ్రహముచే మహోగ్రయై మహేశ్వరి భద్రకాళియై తాను కర్మసాక్షి గావున ఆ కోపమూర్తి వెంటనేగెను. రుద్రక్రోధ స్వరూపుడైన అతడు వీరభద్రుడను పేరందెను. ఆయన శ్మశాన నివాసిగూడ. దాక్షాయణి కోప నివారణము చేసినవాడు. ఆయన తన రోమకూపముల నుండి తనకుదాన గణేశ్వరులను సృజించెను. వారు రుద్రునివెంట ఉండువారు రుద్రుని బలపరాక్రము స్వరూపులు రౌద్రాకారులు. రుద్రుని సేవకులు వందలు వేలకొలది అప్పుడు యటవచ్చి వ్రాలిరి. ఆ రుద్రగణములు చేసిన ఘోరమైన కిలకిలారావములు ఆకాశమెల్ల అలము కొన్నట్లయ్యెను. ఆ ధ్వనికి దేవతలందరు హడలిపోయిరి. పర్వతములు బ్రద్దలయ్యెను. భూమికంపమందెను, ఝంఝామారుతములు విసరెను. సముద్రము క్షోభించెను. అగ్నులు వెలుగవయ్యెను. సూర్యుడు వెలవెల పోయెను. నక్షత్రములు తారా గ్రహములు కాంతి హీనములయ్యెను. ఋషులు, దేవదానవులు ప్రభాశూన్యులయిరి. లోకమిట్ల అంధకారబంధుంమైన సమయమున గణేశ్వరులు విజృంభించి, యజ్ఞశాలను అంటించిరి. బ్రద్ధలు కొట్టిరి. యూపస్తంభములను పెల్లగించి పారవేసిరి. మనో వాయు వేగముల పర్వులెత్తిరి. యజ్ఞ పాత్రములను యజ్ఞాయతనములను పిండి పిండి చేసిరి. తారలు (నక్షత్రములు) తునుకతునుకలై నింగి నుండి రాలుచున్నట్టు కనబడెను. రుద్ర గణము దివ్యాన్నపానభక్ష్య రాసులను, పర్వతములట్లున్న వానిని తినివేయ మొదలిడిరి. క్షీరనదులు, కరడుగట్టిన నెయ్యి, పాయసము, తేనెలు, ఇసుక మేటలు ఇట్లు పడియున్న ఖండ శర్కరలు, కాలువలై పారు బెల్లపు పాకములు, హెచ్చు రుచిగుల్కు మాంసములు, వివిధములైన భక్ష్యములు (తినదగినవి) లేహ్య (నాకదగినవి) చోష్య (జుఱ్ఱదగినవి) పానీయములు (త్రాగ దగినవి)పెక్కునోళ్ళ తినుచున్నారు. ఒలకబోయుచున్నారు. విరజిమ్ము చున్నారు, రుద్రుని బంట్లు కోపస్వరూపులు, మహాకోపులు, కాలాగ్నులట్లున్నారు. నడగొండలట్లు నలుదెసల క్రమ్మి భక్షించిరి. బెదిరించిరి. పలురూపుల ఆడిరి. గంతులిడిరి. దేవతాంగనల బట్టుకొని విసరజొచ్చిరి. ఇట్లు గణముల గూడి ప్రతాపశాలి వీరభద్రుడు రుద్రకోపముచే ప్రయోగంపబడి సర్వదేవతల రక్షణలోనున్న ఆమహాయజ్ఞమును, భద్రకాళి సన్నిధినుండగా దహించి వేసెను. కొందరు గణాధిపులు సర్వభూత భయంకరముగ ఆర్చులు పెట్టిరి. యజ్ఞ పురుషుని తలబ్రద్దలుగొట్టి పెల్లున గర్జించిరి. అంతట ఇంద్రాది దేవతలు దక్ష ప్రజాపతియు చేతులు జోడించి తామెవ్వరో తెలుపుమనిరి.

అపుడు వీరభద్రుడు ఇట్లనియె. నేను దేవుడను కాను. దైత్యుడను కాను. ఇక్కడ విందుకుడుచుటకు వచ్చినవాడనుకాను. మీవేడుకచూడ వేడుకపడువాడనుకాను. దక్షయజ్ఞ నాశనముచేయ వచ్చినవాడను. రుద్రకోపమువలన బయలుదేరినవాడను. వీరభద్రుడను పేరందినవాడను. దేవి క్రోధమునుండి వెలువడి భద్రకాళియని పేరందినదీమె. దేవదేవుడు పంప నీ యజ్ఞము దరికి వచ్చినది. రాజేంద్రా! నీవు దేవదేవుని ఉమాపతిని శరణందుము. దేవప్రభువు కోపించుట మంచిదిగాని నౌకరులతో కోపము మంచిదికాదు.

కలుగులనుండి పెల్లగింపబడి విఱువబడిన యూపములతో మాంసలుబ్ధములై వ్రాలుచు మిక్కిలి విసురగ ఱెక్కలు విసరుచు ఎగురుచు వ్రాలుచున్న గ్రద్దలతో నక్క కూతలతో ప్రతిధ్వనించుచున్న రుద్రగణములచే ధ్వంసము చేయబడిన దక్షయజ్ఞమప్పుడు లేడిరూపుగొని ఆకాశమున కెగిరిపోయెను. అరూపమున పోవుచున్న అయ్యజ్ఞపురుషుని చూచి వీరభద్రస్వామి విల్లు అమ్ములుంగొని వానిని చంప నేగెను. అమిత ప్రతాపశాలియైన అగణేశుని క్రోధమువలన అతని నుదుటినుండి ఘోరమైన ఒక చెమటచుక్కరాలి పడెను. నేలపై పడగానె ఆ స్వేద బిందువు నుండి ప్రజ్వలించు కాలాగ్నివొలె ఒక పురుషుడు ఆవిర్భవించెను. అట్లు ఆవిర్భవించిన పురుషమూర్తి మరుగుజ్జు ఎఱుపు కన్నులవాడు. బవిరి గడ్డమువాడు, భయంకరుడు, నిక్కిన తలవెంట్రుకలు. ఒడలెల్లబొచ్చు, ఎఱుపారు చెవులు, జడుపుగొల్పు కాఱునలుపురంగు, ఎఱ్ఱబట్టలు గలవాడై ఆమహాబలుడు ఆ యజ్ఞము అగ్ని కక్షమును (ఎండుగడ్డిని) వలె కాల్చివైచెను.

దేవతలు భయాకులులై పదిదెసలకు పారిపోయిరి. అందు విక్రమముతో సంచారము చేయుచున్న ఆ వీరభద్రుని తలచే భూమి సప్త ద్వీపములతో కంపించెను. దేవలోక భయంకరమైన ఒక పెనుభూతము ఇట్లు విజృంభించగా అంతట నేను (బ్రహ్మ) మహాదేవుని పూజించుచు ఇట్లు అంటిని.

“దేవతలందరు నీకుకూడ యజ్ఞభాగము ఈయగలరు. ప్రభూ! సర్వదేవాధినాథుడవు. నీవీ భయంకర రూపమును ఉపసంహరింపుము. ఈ దేవతలందఱు, వేలకొలది ఋషులు నీ క్రోధముచే శాంతి పొందలేకున్నారు. ఓ సురేశ్వరా! నీ చెమటనుండి పుట్టిన ఈ పురుషుడు జ్వరమనుపేర లోకములందు చరింపగలడు. ఏకరూపమై ఉన్న ఇతని తేజస్సును ఈ ఎల్ల పృధివియు భరింపజాలదు. కావున దీనిని పెక్కురూపులుగా కావింపుము అని నేనన్నం తట, ఆయనకుగూడ యజ్ఞభాగము కల్పించి అంతట ఆ భగవంతుడు పినాకపాణి తనకుతాను పరమ ప్రీతినందెను. దక్షుడును మనసార ఆ భవుని దేవుని శరణందెను. నేత్ర స్థానమున ప్రాణాపానములను ప్రయత్నముతో నిలిపి బహుదృష్టియగు పరమేశ్వరుడు బహిర్గతమైన చూపును మరలించి నిలిపి అల్లన నవ్వి నీకేమి చేయుదును తెలుపుమని ప్రశ్నించెను. ఈ కథను దేవతలు పితృదేవతలు ఆలించినంతట ప్రజాపతి దక్షుడు చేతులు మొగిచి బెదరిపోయి మదిలో శంకించుచు కన్నుల నీరుకార్చుచు ఇట్లనియె.

భగవంతుడు నాయెడల ప్రసన్నుడగునేని, నేను నీకు ప్రియుడనేని, నేననుగ్రహింప బడుటకు అర్హుడనేని, నాకొక్క వరమీయదగును. ఈ యజ్ఞము కొఱుకు బహుకాలము బహుప్రయత్నముచే సమకూర్చుకొన్న భక్ష్యమెల్ల భక్షింపబడినది. త్రాగదగినదెల్ల త్రాగి వేయబడినది. బెదిరింపబడినది. నాశనము చేయబడినది. పొడిపొడి గావింపబడినది. ముక్కలు ముక్కలు చేయబడినది. అయినను నీ అనుగ్రహము వలన ఓ మహేశ్వరా! ఈ యజ్ఞము అబద్ధము కాగూడదు. సఫలము కావలయునని ప్రార్థించెను.

తథాస్తు (అట్లేయగుగాక!) అని భగుని కన్నులు రాల్చిన ఆహరుడు పలికెను. దక్షుడు నేలపై మోకాళ్ళను ఆనించి ధర్మమునకకు అధ్యక్షుడు త్రినేత్రుడు అగు మహాదేవుని నమస్కరించి శివ యజ్ఞముంబడసి ఎనిమిదివేల శివనామముల చేత ఆ వృషభధ్వజుని బహువిధముల స్తుతించెను. (39)