బ్రహ్మ మహా పురాణము

రామకృష్ణుల బహువిధ లీలలు వర్ణనము

గర్దభాసురుడు తమ్ములతో హతుడైన తరువాత గోపీగోపాల బృందమునకు తాళవనము చక్కని విహారస్థానమయ్యెను. బలరాములు లేగొమ్ములు గల వృషభములట్లు ఆ గోప సమాజమున రాణించిరి. ఆలమందలను దూరదూరములకు తోలుకొనిపోయి వానిని రకరకములైన పేరులతో పిలుచుచుండిరి. లేగల పలుపులను భుజములందు వైచుకొని వనమాలలు దాల్చి సువర్ణాంజన చూర్ణములచేత మెరయు వస్త్రములు ధరించి, ఇంద్ర ధనస్సులవలె, తెలుపు నలుపు మేఘములట్లు కానవచ్చుచు, విచిత్రములైన జాతీయములయిన ఆటలాడుచు విహరింపజొచ్చిరి. సర్వలోకనాథులు అందరకు దిక్కై అవనింజొచ్చి మనుష్య ధర్మాభిరతులై మానవత్వమును సమ్మానించుచు, మానవజాతికి అనుగుణమైన ఆటలాడుచు ఆ వనమున క్రీడించిరి. మఱియు తూగుటుయ్యాలలపై ఊగుచు, కుస్తీ మొదలైన చిన్నచిన్న యుద్ధములందు తలపడుచు, ఉండీల బద్దలుగొని మీదికి రాళ్లు విసరుట మొదలగు విచిత్ర వ్యాయామములచే వినోదించుచుండిరి.

అంతట ప్రలంబాసురుడు అను రాక్షసుడు గోపవేషమున రహస్యముగా సంచరించుచు ఆ గోపకులనడుమ ప్రవేశించెను. అవకాశము వెదకుచు ఆ బలరామకృష్ణులను అప్పట్టున సంహరింప తలచెను. ఒండొరులను భుజముల నెక్కించుకొని మోయుట అను ఒక వింత ఆటకు జొచ్చి బలరాములతో తలపడెను. శ్రీదాముడను గోపకునితో కృష్ణుడు, ప్రలంబునితో, బలరాముడు మఱి గోపకులతో గోపకులు ఎగిరి ఎగిరి ఆ ఆటలో వినోదించిరి. కృష్ణుడు శ్రీదాముని బలరాముడు ప్రలంబుని ఓడించిరి. కృష్ణునివైపు గొల్లలు ఎదిరి గొల్లలను గెలిచిరి. ఓడినవారు ఓడనివారిని భాండీరస్కందము దాక మోసికొని పోయి తీసికొని రావలెనను పందెముపెట్టి ఆడుకొనజొచ్చిరి. ఆ దానవుడు తానే ఓడినట్లు నటించి మబ్బులో నున్న చంద్రునట్లు తాను బలరాము నెత్తుకొని పోవుచు ఆ బరువు మోయలేనట్లు వర్షమేఘమట్టి తన కాయమును పెంచెను. బలరాముడు కార్చిచ్చునగాలు పర్వతమట్లు పూలమాలలు వ్రేలదలపై కిరీటము దాల్చి బండి చక్రము లట్టి మిడిగ్రుడ్లతో రౌద్రాకారుడై, పాదముల తాకిడిచే భూమి అదర తనను మోసికొని పోవుచున్న వానిని గని కృష్ణా! పెద్ద కొండవలెనై మాయా గోపాలరూపముతో రాక్షసుడే ఒకడు నన్ను మోసికొని పోవుచున్నాడు. వీడు పరమ దుర్మార్గుడు. ఇపుడు నేనేమి చేయవలెనో తెలుపుము అనగా గోవిందుడు చిరునవ్వున పెదవులు తెరచి, బలరాముని బలపరాక్రమము లెరిగినవాడు కావున ఇట్లనియె.

సర్వాత్మకుడు సర్వరహస్యములకు రహస్యము అయిన నీవు మానవ రూపము ధరించుట వీనోదార్థము. ఒకానొక కారణమున నాకు అన్నవై అశేష జగత్ర్పభువైన నీవు సర్వ కారణమైన నీ స్వరూపమును తలచుకొనుము. జగమెల్ల ఏకార్ణవమైనపుడు నీవును నేనును కలిసి ఏకైక పరబ్రహ్మ మగుటయు, ఈ జగమును నిలుపుటకు వేరు అగుటయు సత్యము. కావున నిన్ను నీవెరిగి ఈ దానవుని సంహరింపుము. మానుష భావమిట్లు పూని మనవారికి బంధువులకు హితము చేయుము.

ఇట్లు కృష్ణ భగవానునిచే జ్ఞప్తిచేయబడి బలరాముడు అల్లన నవ్వి, ప్రలంబుని పట్టి ఎత్తి కోపముచే కన్నులెర్రబడ పిడికిట వాని నడినెత్తిపై గ్రుద్దెను. ఆ దెబ్బతో వాడు కనుగ్రుడ్లు వెలికిరాగా తలపగిలి నోట రక్తము గ్రక్కికొని భూమిపైబడి మృతినొందెను. అద్భుతమైన బలముచే బలుడట్లు ప్రలంబుని కూల్ప, గోపకులు బాగు బాగని ఆనంద భరితులై రాముని స్తుతించిరి. అవ్వల గోపకులతో, కృష్ణునితో, బలరాముడు గోకులమునకు చేరుకొనెను.

రామకేశవులట్లు విహరించుచుండగ, వర్షఋతువుగడచి తామరపూలు వికసింప శరదృతువు వచ్చెను. ఆకాశము స్వచ్ఛమై నక్షత్రములు కాంతులను చిమ్మగా చక్కని ఆసమయ మందు వ్రేపల్లె జనము ఇంద్రోత్సవ ఆరంభము చేయ కుతూహలపడుట చూచి కృష్ణుడు పెద్దవాండ్రతో ముచ్చటగ ఇంద్రోత్సవము అనగా ఏమి? దీనికి మీరింత ఆనందపడుటకు కారణమేమీ అని అడుగ నందుడు అతనితో ఇట్లు అనెను.

మేఘములకును జలములకును దేవేంద్రుడు అధిపతి. అతని ప్రేరణముచే జల రూపమున సర్వ ప్రాణాధారకమయిన రసము అనగా నీరు వర్షించును. ఆవర్షముచే పండిన పంటను మనము, ఇతర ప్రాణులు తిని బ్రతుకుదుము. దేవతలను దానిచే తృప్తి పరుతుము. ఆవులు పాలిచ్చును. లేగలతో వానల వలన గల్గిన సస్యము సంతృప్తి పడును. సస్యసమృద్ధి, పచ్చిక (మేత) సమృద్ధి మేఘ నిమిత్తమే. సకాలమున వర్షించు మేఘములుగలచోట ఆకలికి అలమటించు జనముండరు. సూర్య కిరణములచేత మేఘము ఈభూమియందలి ఉదకమును చేకొని ధరించును. సర్వలోక జీవనమునకు భూమిపై అది వర్షించును. అందువలన వర్షఋతువునందెల్ల రాజులు సంతోషముతో ఈ ఉత్సవమునందు దేవేంద్రుని కొలుతురు. మనము మఱి ఎల్లజీవులు అమరపతిని కొలుచుటయు అందులకే అని తెలుపనందుని మాటవిని ఇంద్రుని పూజించు విషయమున కృష్ణుడు దేవేంద్రునకు కోపము గలుగునట్లుగా ఇట్లు అనెను.

మనము కర్షకులము కాము, వర్తకమును జేసి జీవించువారము కాము. గోవులే మనకు దైవము. వనమునందు సంచరింతుము. ఆన్వీక్షకి, త్రయీ, వార్తా(వర్తకము), దండనీతి అని విద్య నాల్గు విధములు. వానిలో వార్త అనగా వ్యవసాయము వాణిజ్యము పశుపాలన మునను పేర మూడు వృత్తులు చెప్పబడినవి.

కర్షకులకు కృషి పుణ్యజీవులకు (వర్తకులకు) వర్తకము, వృత్తులు. మనకన్ననో గోపాలనము ముఖ్యవృత్తి. ఈ విధముగ వార్త అనునది మూడు విధముల చెప్పబడినది. ఎవ్వడు ఏవిద్యను నేర్చునో అదే వానికి పరమదైవము. అదే పూజింపదగినది. ఆరాధింప తగినదియు, అదేవానికి ఉపకారకముకూడ. ఒకదాని ఫలము అనుభవించుచు, వేరొక విద్యను పూజించువాడు ఇహపరములందు శుభమందడు. ప్రసిద్ధమైన మన హద్దులను (ఆవుల దొడ్లను) పూజింతము. వానికన్నిటికి హద్దుగానున్న వనమును పూజింతము. వనములకు పరమావధులైన కొండలు మనకు పరమ దైవములు. కావున గిరియజ్ఞము (కొండదేవతల పూజ), గో యజ్ఞము (గోపూజ) మనము కావింతము. ఇంద్రునితో మనకేమి పని? గోవులు కొండలు మనకు దేవతలు. విప్రులు మంత్ర యజ్ఞపరులు. మంత్రానుష్ఠానమే వారికి యజ్ఞము. కర్షకులకు యజ్ఞము నాగలి. కొండలందును, అడవులందు ఉండుమనకు కొండలను గోవులను గొలుచుటే యజ్ఞము (పూజ). కావున తామందరు రకరకములైన పూజా ద్రవ్యములచే పశువును బలియిచ్చి యథావిధిగ గోవర్ధనగిరిని అర్చింపుడు. వ్రేపల్లెలో ఉన్న సర్వసంభారములను చేకొనుడు ఆలోచింపవలదు. ఆ సామాగ్రిచే విప్రులకు మఱి అన్నార్తులకు సంతర్పణము జేయుదుము గాక! ఆ అర్చింపబడిన కొండను ఉద్దేశించి హోమములు చేసి ద్విజులకు సంతర్పణము చేసిన తరువాత శరర్దృతువు నందలి పూలను శిరముల దాల్చి మన ఆవుల మందలు వ్రేపల్లెకు మరలునుగాక! ఇది నా ఉద్దేశము. దీనిని ప్రీతితో చేసినయెడల గోవులకు ప్రీతిగల్గును. గోవర్ధనగిరికిని నాకును కూడ సంతోషమగును. అని తెలుప కృష్ణుని పలుకులువిని నందాదులందరు సంతోషముచే మోములు విప్పార బాగుబాగని వత్సా! నీ అభిప్రాయము పరమశోభనము. నీవు చెప్పిన మాటనే మేము అనుసరింతుము ఈ గిరియజ్ఞము సాగింపబడుగాక! అని వ్రజవాసులెల్లరు పెరుగు పాయసము మాంసములతో కొండకు బలియిచ్చిరి. నూర్లు వేలుగ విప్రులకు విందులు చేసిరి. అట్లు కొలువబడిన ఆ గిరికి గోవులు ప్రదక్షిణము చేసినవి. సజల జలదములట్లు వృషభములు రంకెలు వేయుచు గిరిప్రదక్షిణము చేసెను. గోవిందుడు కొండ నెత్తమున కూర్చుండి, నేనే మూర్తి ధరించిన కొండ దేవతనని ఆ గోపశ్రేష్ఠులు గొనివచ్చి నివేదించిన పలుతెరంగులైన అన్నములను ఆరగించెను. మఱియు అదేరూపమున కృష్ణుడు గిరి శిఖరమున కెక్కి అది తన రెండవ మూర్తిగ పూజించెను. తరువాత నతడంతర్థానముకాగ అతని వలన గోపకులు వరములు పొంది, ఇట్లు గోవర్ధనోత్సవము చేసి తమతమ గోష్ఠములకు (గోశాలలకు) తరలి వచ్చిరి. (187)