బ్రహ్మ మహా పురాణము
ధేనుక వధ
బలరామకృష్ణులు కలసి ఆవులను కాచుచు ఆవనమున తిరుగుచు చక్కని తాల వనమునకు వెళ్ళిరి. ఆ వనమందు నరగోమాంసములను తినుచు గాడిదరూపమున ధేనుకుడను దానవుడు వసించుచుండెను. ఆ వనములో తాటిపండ్లు సమృద్ధిగా ఉండుటను చూచి గోపకులు కుతూహలముతో ఓ రామకృష్ణ! ఈ ప్రాంతము ధేనుకుని కాపుదలలో ఉన్నందున సువాసనగల ఈ పండ్లు వదలి వేయబడి ఉన్నవి. వీనిని మేము కోరుచున్నాము. మీకది సమ్మతమైనచో వీనిని రాలగొట్టుదము అన బలరాముడు, కృష్ణుడును వానిని పడగొట్టిరి.
ఆ చప్పుడువిని రాక్షసుడు గర్దభాకారుడు కోపముతో వచ్చి వెనుక కాళ్ళతో వాని యెదురు రొమ్ముపై కొట్టగా ఆ కాళ్ళను పట్టుకొని గిరగిర ద్రిప్పి ఆకసమున కెగురవేసెను. వాడు ప్రాణములను బాసెను. అట్లు పడుచున్న వాని తాకిడికి పండ్లు గుట్టలుగ పడినవి. వాని జ్ఞాతులు ఖరాసురు లెందరో ఎదిరింపగా వాయువు మేఘములను చెదరగొట్టినట్లు వారిని అందరను బలరామ కృష్ణులు ఆ చెట్లమీదకు విసరిరి. దానిచే తాటి పండ్లు అన్నియు నేలపైబడి చూచుటకు ఇంపుగ తోచెను. క్రూరులగు ఆగర్దభాకారులు చచ్చి పడినంతనే, అవి నిరాబాధమై గోపకులు, గోవులు హాయిగ సంచరింప మిగుల రమణీయమై ఒప్పెను. అందలి పచ్చని లేబచ్చికలయందు ఆ గొల్లపిల్లలు తాళ ఫలములు ఆరంగించిరి. (176)