బ్రహ్మ మహా పురాణము

మార్కండేయ ప్రళయ దర్శనము

అంతట ఏన్గులట్లు మెఱుపుదీగల చేత మెరయు మేఘములు వింతగా నింగి అలము కొనెను. అవి కొన్ని నల్లకలువలవలె నల్లనివి, కొన్ని తెల్లకలువలవలె తెల్లనివి, కొన్ని పద్మ కింజల్కములట్లు ఎర్రనివి, కొన్ని పసుపుపచ్చనివి, కొన్ని ఆకుపచ్చనివి, కొన్ని కాకిగ్రుడ్ల వంటివి. కొన్ని తామర రేకులవంటివి. కొన్ని ఇంగువఛాయగలవిగా ఉండెను. కొన్ని పెద్ద నగరములుగను, కొన్ని పర్వతములట్లు, కొన్ని కాటుక కొండలట్లు, మరకత ప్రభలు కలవియునై మెఱుపుతీగలను అలుముకొని మహామేఘములు క్రమ్ముకొనెను. అవి కుండపోతగా వర్షించు వర్షధారలచే ఈ మేదిని నాల్గుదిక్కుల బెందడి అయ్యెను. ఆ వర్షపాతముచే ఇంతకు మున్నేర్పడి అగ్ని ఉత్పాతము ఉపశమించెను. పరమేశ్వర ప్రేరణచే మేఘములు అవిరామముగా పండ్రెండేండ్లు వర్షింప, సముద్రములు పొంగి చెలియలకట్టులుదాటి జగమును ముంచెత్తెను. పర్వతములు పిండిగుండ అయ్యెను. ఆ భూమి నీటిలో మునిగి పోయినది. అట్లు ఉవ్వెత్తుగ క్రమ్మిన కారుమబ్బులెల్ల అల్లంతలో వీచిన పెనుగాలులకు పింజపింజలై విడిపోయెను. ఆ తొలితామర గద్దియపై నున్న విష్ణువు ప్రళయకాల మారు తమును త్రోసివైచి ఆ ప్రళయ పయోధిపై హాయిగ నిద్రపోయెను. అపుడు సర్వ జీవకోటి వినష్ట మయ్యెను.

అంత మార్కండేయ మహర్షి విశ్రమించి పురుషోత్తముని ధ్యానించి కనుతెఱచి ఈ వసుంధరయెల్ల నీటమునిగినట్లు గమనించెను. అంతముందుగల ఆ పెద్ద మఱ్ఱి వృక్షము లేదు, భూమిలేదు. దిక్కులు లేవు. భాస్కరుడులేడు. చంద్రుడులేడు. అగ్నిలేడు. గాలిలేదు. సురాసురులు లేరు. ఏకార్ణవమై కేవలము కారుచీకటి క్రమ్మిన ఆ సమయమున, నిరాశ్రయమైన ఆ నీటమునిగి ఈద యత్నించెను. అట్టిటు ఈతకొట్టుచు ఆయాసపడ జొచ్చెను. తుదకు అందు మునిగెను. కాని రక్షకుని కానలేడయ్యెను. ఆయన ధ్యానమునకు తనివిచెంది పురుషోత్తము డపుడు అదరి చెదరి పోవుచున్న మునిని చూచి ఇట్లనెను.

“వత్స! అలసిపోయితివి. పిల్లవాడవు. నాకు భక్తుడవు. వ్రతనిష్ఠుడవు. ఇటు రారమ్ము, మార్కండేయ! నాదరికి రమ్ము. భయపడకు. నీవు నాముందున్నావు”.

అన్న అముని మిగుల కుపితుడై మరిమరి వెఱగువడుచు ఇట్లనెను.

ఎవడు వీడు? నా తపస్సును కించపరచి మాటలాడుచున్నాడు. పెక్కు వేలేండ్లు ఈడుగల నా శరీరమును బెదిరించుచున్నాడు. దేవతలలో కూడ ఈ విధముగ నన్ను తేలికజేసి మాటలాడు ఆచారము లేదు. దేవేశుడు బ్రహ్మకూడ నన్ను దీర్ఘాయుష్మంతుడవని అనెనే ఎవడురా! జీవితము కడముట్టినవాడు. తపముచే గట్టిపడిన తలకాయగల నాకు (నన్ను) ఇట్లు మార్కండేయ! అని పేరెత్తిపిలిచి నావలన చావుపొంద గోరుచున్నాడు అని పలికి చింతంగొని ఇది కలయా! మోహమా! ఈ వింతయేమనుకొన్న అతడికి అంతలో నిశ్చల చిత్తంబున ధ్యానించుటయు, ఆతనికి సకల దుఃఖ విధ్వంసినియగు మనశ్శక్తి ఆవిర్భూత మయ్యెను. అపుడతడు పురుషోత్తముని భక్తితో శరణాందెదనని మనసు నిలిపి శరణంది ఆ వెంటనే ఆ నీటిమీద విశాలమైన వటవృక్షమును చూచెను. ఆ చెట్టు పెనుకొమ్మపై పరచు కొనియున్న విశ్వకర్మ నిర్మితమయిన చక్కని వింతయిన పర్యంకమును చూచెను. అది వజ్రవైడూర్య నిర్మితము. నానావిధాస్తరణము నానారత్న శోభితము. వింతలన్నిటికి నెలవు. విచిత్ర ప్రభామండల మండితము. అందు కోటి సూర్య ప్రభాజిష్టుని, తేజోమూర్తిని, చతుర్భుజుని, సుందరాంగుని, పద్మపత్రనేత్రుని, శ్రీవత్సవక్షుని, శంఖచక్రగదాధరుని, వనమాలాలంకృత వక్షస్థలముగల వానిని, దివ్యకుండలములచే ప్రకాశించువానిని, హారముల భారముచే వంగిన మెడగల వాడైన బాలకృష్ణుని దర్శించెను.

మార్కండేయుడు అచ్చెరువడి, విచ్చిన కన్నులు పులకించిన మేనుంగొని వ్రాలి “ఆహా! ఈ ఏకార్ణవమందు చరాచరము అణగిపోయిన సమయమున ఈ బాలుడెవ్వడొ భయము లేక మసలుచున్నాడు” అనుకొనెను. భూత భవ్యభవిష్యము ఎఱింగియు అమ్మహాముని మాయా మోహితుడై ఆదేవుని ఎఱుంగడయ్యెను. మఱియు నా తపశ్శక్తి వ్యర్థము-నా జ్ఞానము వృధా-సుదీర్ఘమయిన నాబ్రతుకు వ్యర్ధము. నామానుష ముత్తది. ఈ పర్యంకమున నిదురించు బాలుడెవ్వడో తెలుసుకొనలేకపోతిని” అనుకొనుచు ఈదుచు మైమఱచి మార్కండేయుడు మిగుల వగచెంది రక్షణ కొఱకు తడుములాడెను. కాని బాలసూర్యుడట్లు తనమహిమచే వెఱయుచున్న తేజోమయుడగు ఆ బాలుని చూడలేకపోయెను. ఆ పిల్లవాడు అట్లు వచ్చుచున్న మునిని చూచి మేఘ గంభీరముగ ఇట్లు పలికెను. వత్సా! చాల అలసి తివని ఎఱుగుదును. నిన్ను కాపాడుటకే వచ్చితిని. నా శరీరమందిపుడు ప్రవేశింపుము. నీకు విశ్రాంతికల్గును. అనవిని ఏ భయము ఎఱుగక ఏమియు మాటలాడక ఆ బాలుడు తెఱచిన మోమునందు వివశుడై ప్రవేశించెను. (53)