బ్రహ్మ మహా పురాణము

ఉమామహేశ్వర కల్యాణ వైభవము

బ్రహ్మ ఇట్లు చెప్పెను-

విశాలమైన హిమవత్పర్వతము మీద విమానముల సమ్మర్దము అధికమయ్యెను. పార్వతి స్వయంవర సన్నాహమునందు గిరిరాజు తన కుమార్తె అభిప్రాయము హరునిపై ఉండుట నెఱింగియును, వంశాచారము పాలించుటకు స్వయంవర వార్తను ఎల్ల లోకములందును జాటింపించెను. దేవదానవసిద్ధ గంధర్వాదు అందఱి సమక్షమున నా కుమార్తె బ్రహ్మవరకుగల దేవతలందు పరమేశ్వరుని వరించునేని అదినా పుణ్యము, సంస్తవనీయము. నా అభ్యుదయముల కది అనుకూలము. అని మదిలో ఎంచి తన నగరము రత్న తోరణాలంకృతము గావించి, స్వయముగా ఆ వార్తను ప్రకటించెను.

హిమవంతుడు చాటించిన స్వయంవర వార్తవిని యఖిలభువన వాసులయిన యువకులరుదెంచిరి. నేనును అక్కడ గిరిరాజు ప్రార్ధనచే ఎల్ల యోగులు సిద్ధులు సేవింప దేవతలతో పోయి పద్మాసన మందు ఉపవిష్టుడనై ఉంటిని, దివ్యాంబరాంగ రాగహారాది భూషణములు దాల్చి, సురరాజు వేయి కన్నులతో ఆ ఉత్సవము తిలకించుటకు మదధారల కురియు మహిత గజరాజము ఐరావతమునెక్కి వచ్చెను. తేజః ప్రభావమువలన ఎల్లదిశల వెలిగించుచు చలత్పతాకమగు (జెండా నెగురుచున్న) బంగారు విమానమెక్కి భాస్కరుడు అరుదెంచెను. తేజమ్మున బలమ్మున శాసనమున అనదృశుడై మణిమయోజ్వల కుండలములు ధరించి ఆదిత్య మండలమునుండి భగుడును అమరమూర్తి సూర్యుడట్లు అగ్నియట్లు వెలుగు విమానమున ఏతెంచెను. యముడును దండముగొని భయంకర మహిష వాహన మెక్కి జవంబున పెద్ద పర్వత మట్లాడ్డునుం బొడవుం గల్గి, మంగళమూర్తియై మణిమయ స్వర్ణ భూషణ మంజుల వేషియై అచ్చటకు విచ్చేసెను. సర్వజగత్ప్రాణుడైన వాయుదేవుడు విమానమెక్కి సురాసురులకు వెరగుగూర్చు తేజంబున అరుదెంచెను. అగ్నియు దివ్య విమానమెక్కి వరవేషధారియై వచ్చి సురేంద్రుల నడుమ వెలుగుచుండెను. సర్వధనాధ్యక్షుడగు కుబేరుడు కాంతిచే, వేషముచే ఎల్ల సురాసురుల ఆప్యాయన మొందజేయుచు పుష్పక విమానమెక్కి అరుదెంచెను. నవరత్న విచిత్ర విమానమెక్కి చామన చాయ మేనివాడు సువిచిత్రవేషుడు పరిమళ పుష్పమాలను ధరించిన సుధాంశుడు (చంద్రుడు) అరుదెంచెను. పర్వతమువలెనున్న విష్ణువు గదనుదాల్చి గరుడుని అధిరోహించి ఏగు దెంచెను. పరమసుందరులు, దేవలోకభిషగ్వరులు అశ్వినీ దేవతలు ఇరువురు ఒక్కటే విమానమెక్కి ముచ్చట గొల్పు వేషములతో అటకు వచ్చిరి. అగ్ని వర్ణమైన విమానమెక్కి జ్వలనార్క ప్రభతో నాగపరి వారముతో సహస్ర ఫణామణి మండలుడగు నాగేంద్రుడు ఏతెంచెను.

పెండ్లి కుమారులట్లు అలంకరించుకొని, బృందారక (దేవతల) బృందమేతెంచెను. గంధర్వరాజు తన సంఘముతో నప్సరసలతో నింద్రాజ్ఞంగొని ఆముచ్చట కనుగొనుటకు వచ్చెను. మఱియు కిన్నర కింపురుష నాగ గణంబులు వచ్చిరి. అందరిలో అమరేంద్రుడు శచీపతి చూడ ముచ్చటైన సొంపున వెలింగెను. సురాసుర జనని శంభుపత్ని అని పురాణములందు గీర్తింపబడినది. పరాప్రకృతిమున్ను దక్షకోపమునకు గురియై హిమవంతుని ఇంటికి కార్యావసరముగొని వచ్చినది. దివ్య విమానమందు దేవకాంతలు వింజామరలు వీవ సర్వ ఋతువులందలి పువ్వులతో సంతరింపబడిన మాలంగొని సత్వరముగ ఆమె స్వయంవరమునకు బయలుదేరెను. అట్లు అరుదెంచు గిరిరాజ కన్యనుగని ఆమెను బరీక్షింపనెంచి శంభుడు పంచ శిఖల ముచ్చట గొల్పు శిశువై ఆదేవి ఒడిలో అల్లన నిదురించెను. ఆ దేవి చూచి ప్రీతి నంది ఆ రహస్యము గ్రహించి తాను అభిలషించిన పతిగా నెఱిగి ఆ పాపని తన హృదయ మందు నిలిపి స్వయంవర మండపము నుండి వెనుదిరిగి వెళ్ళిపోయెను. ఎవడీ శిశువు? ఇచటికి ఎట్లు వచ్చినాడు! అని మిక్కిలి మోహపడి సురలు కేకలిడిరి. ఇంద్రుడు వజ్రాయుధమును పూని నిలువబడి ఆశిశువుచే అపుడే స్థంభితుడయ్యెను. భగుడెత్తిన చేయి ఎత్తినట్లే ఉండెను. విష్ణువు శిరః కంపనమును జేయుచు శంకరుని వంకచూచెను. అపుడు నేను (బ్రహ్మ) కలతబడి ధ్యానమున నిలచి ఆక్షణమే ఆదేవి ఒడిలోని బాలుడు బాలేందుధరుడని (లేత చంద్రుని ధరించిన శివుడు) గ్రహించితిని. తెలిసినంతలేచి నిలువబడి ఆ దేవదేవు చరణములకు మ్రొక్కి పురాణములచే నామ సంగీతములచే గుహ్యములయిన పుణ్యనామావళిచే పెక్కురీతుల స్తుతించితిని.

ఇట్లు పరమేశ్వరుని నుతించి స్తంభించిన దేవతలనుచూచి మీరీ పాపని శంకరుడని ఎఱుగలేరైరి. పొండు శరణమందుడు. నేను మీతో శరణాగతుడను అయ్యెద అన ఆ దేవతలు భావశుద్ధితో ఆ శర్వునికి నమస్కరించిరి. శీఘ్రప్రసన్నుడు కావునస్వామి, వారియెడ జాలిపడి అందరిని మున్నట్లు స్వస్థుల చేసెను. ఇది అయిన వెనుక ఈశ్వరుడు త్రిలోచనములతో కూడిన అద్భుతమైన శరీరము దాల్చెను. ఆ తేజమునకు వారి కనులు మిరుమిట్లు గొనగా చూడలేక కనులు మూసికొనిరి. ఆయన వారికి తన మూర్తి చూచుటకు అనువైన చూపును అనుగ్రహించెను. దానిచే వారు ఆ ఈశ్వరుని చూచి ఆయన నిటలాక్షుడని తెలుసుకొనిరి. వారందరు కనుగొనుచుండ అప్పుడు ఆ దేవి అదేవదేవుని పాదములయందు స్వయంవరమాలను అలంకరించెను. “బాగు బాగు’ అని ఎల్లవేల్పులు నుతించిరి. ఆ దేవితో గూడ తలలు వాల్చి నమస్కరించిరి. అప్పుడు నేను హిమవంతునితో ఇట్లంటిని. ‘పూజనీయుడ వైనీవు వందనము చేయ తగినవాడవు. ఈశ్వరుని తోడి సంబంధమిది. ఇది నీ భాగ్యమ్ము కానిమ్ము. కల్యాణ మహోత్సవమునకు విలంబము ఎందులకు’ అన హిమవంతుడు మ్రొక్కినాతో ఇట్లనెను. “దేవా! నా అభ్యుదయమున కెల్ల నీవే కారణము. అనుకొనని అనుగ్రమిట్టిది నాకు లభించినది! పితామహ! వివాహము ఎట్లు ఎపుడు చేయనగునో అదెల్ల నీవు నడుప వలయును” అనిన విని బ్రహ్మ,