బ్రహ్మ మహా పురాణము
కల్యాణ సన్నాహము
హిమవంతుని మాటవిని శివునితో ‘వివాహమగు గాక’ అని నేననగా లోకేశుడగు శంకరుడు అట్లేయగుగాక! అనగా మేమందరము అందమైన కల్యాణ పురము నిర్మించితిమి. నవరత్నములు మూర్తిని ధరించి కల్యాణ వేదికను స్వయముగ అలంకరించినవి. అందలి కుడ్యములు స్ఫాటికములు భూమి మరకతమాణిక్యమయము. స్తంభములు స్వర్ణమయములు. ద్వారములందు ముక్తాహారములు తమంత వ్రేలినవి. అమ్మణుల జిగజిగ కాంతులు వెదజల్లుచు వాని ముందు సోమ సూర్యులు స్వప్రభల వెలయించిరి. శివభక్తిని ప్రకటించుచు వాయువు మనోహరపరిమళముల వెదజల్లుచు అందందు వాహ్యాళి వెడలెను. చతుస్సముద్రములు, శక్రాది సురలు, దేవనదులు, మహానదులు, సిద్ధులు, మునులు, గంధర అప్సర, యక్ష, రాక్షస, నాగ, కిన్నర, చారణులు, జలచరులు, ఖేచరులు, తుంబుర, నారదులు హాహా హూహూ వంటి ప్రముఖ దేవగాయనులు రమ్య మంగళ వాద్యములుగొని ఆమండపమునకు వచ్చిరి. ఋషులును వేద గీతములు మేళవించిరి. జగన్మాతలు, దేవ కన్యలు పాటలు పాడిరి. అప్సరసలు ఆటలాడిరి. ఆఱు ఋతువులు నానా సువాసనల సుఖావహములై మూర్తిమంతములై హిమవంతుని ఇంటికేతెంచి ఈశ్వరునికి ఉపచరించినవి. వర్షర్తు సమాగమము మంత్రధ్వని గర్జనములతో నల్లని మేఘముల కాంతులతో కేకారవ మనోహర మయూర నృత్యములతో విలోల పింగళ రుచి విలాసి విద్యుల్లతాచకచక ద్యుతులతో కుముదకుసుమాపీడ శుక్లములగు బలాక మాలికలతో నపుడ పొడమిన శిలీంధ్ర కందళీలతాద్రుమ హృద్యతర పల్లవ మంజరులతో చల్లని వానధారల కలరి మేల్కొని చేయు కప్పుల అరువులతో, మానవతులు ప్రియులయెడ పొలియలుకవాసి తమంత ప్రియుల కౌగిలికి తార్చు ముచ్చటలతో నునుమబ్బుల చాటున అల్లనల్లన తొంగి చూచు శశిరేఖ సొగసుతో మేఘముచాయ చాయలుకులుకు ఇంద్ర చాపము చూపు సొంపుతో చిత్రవిచిత్ర కుసుమ పరిమళములచే భావితంబై మధురవాసనలు చిందు చల్లని జలసంపర్కమునంది వీచు మనోహర మందమందానిలములచే అల్లనల్లన కదలు సురాంగనల లలితాలక నటనములతో గర్జించు మేఘములు గ్రమ్మిన ఇందు బింబమ్ము డంబరముతో తొలకరివాన చినుకులు ముత్యాల మురువుగొని పచ్చలు దాపినట్లు మెఱయు గరికదుబ్బులు అబ్బురము గొల్పు పచ్చని కాంతులతో హంస నూపురంబులతో సమున్నత పయోధర శాలినియై వర్షఋతు సుందరి సుందరపు కల్యాణ మండపము అలంకరించెను. నీలమేఘ గర్జనలకు హంసలు బెదరినవి. స్వచ్ఛములైన సలిల ధారలకు కలువలు వినమ్రములైనవి. పరిమళకుసుమ కింజల్క పరాగ పరిభూషితాంగియై వర్షఋతువు పార్వతీ వివాహమునకు తనను ముస్తాబు చేసికొనెను.