బ్రహ్మ మహా పురాణము
శరద్దృతు వర్ణనము
ఆ పైని శరద్దృతులక్ష్మి మేఘకంచుకము తొలగించుకొని పద్మ కోశకుచశోభయై హంస నూపుర మనోహరయై దిశలు తెలివిగొన విస్తీర్ణములైన సైకతములు పిరుదులుగా మధుర కూజిత హంసమేఖలయై, వికసించిన నల్లకలువలనెడి నయనముల సొంపుతో పండిన దొండ పండనెడి అధర శోభతో మొల్ల మొగ్గలనెడి దంతకాంతితో, వినూత్న శ్యామలతికా వినీల రోమరాజితో, చంద్రాంశు గౌరహార వితానముతో బృందారక, బృంద హృదయారవిందముల సర్వము ఉల్లాసపరచుచు, శరదృతు లక్ష్మీమనోహర మత్త భ్రమరకుల కలగీత సర్వభాషిణియై చలత్కుముద చారుకుండల మండితయై రక్తాశోక శాఖానిర్గత లలితసుకుమార పల్లవాంగుళియై పలువన్నెల పూలచీర దాల్చి రక్తోత్పలాగ్ర చరణయై జాతీపుష్పసఖనవ్యనఖ రుచియై రంభాస్తంభ రమణీయోరు రుచియై చంద్రవదనయై సర్వా లంకారభూషితయై సర్వలక్షణ లక్షితయై నిర్ముక్త నీలమేఘ కంచుకాంచిత వసనయై పూర్ణేందు బింబ ప్రతిబింబవదనయై సామరాగయగు నాయికవోలె నీలాంభోజ లలిత నయనయై రవికరవికచకమలసుస్తనియై నానా కుసుమ రజః పరిమళ పవన ప్రహ్లాదినియై కలహంస నూపురరవభవ్యయై గిరిసుత కల్యాణమునకు శదర్దృతులక్ష్మి తన్ను సింగారించుకొని వచ్చెను.