బ్రహ్మ మహా పురాణము

పితృ గాథలు

ఐలుడను రాజును ఉద్దేశించి పితృదేవతలు ఇట్లు గానము చేసిరి. మా సంతతిలో పరమ శ్రేష్ఠుడు ఒక్క కుమారుడు కల్గునా? యోగుల భుక్త శేషాన్నము భూమిపై మాకు పిండములు పెట్టునా? లేదా గయయందు పిండదానము చేయునా? ఖడ్గ మృగ మాంసము హవిస్సు-పులుపుకారము చురుకు వస్తువులు లేని సాత్వికమైన ఆహారము-బలుసు కూర తిలలు ఆజ్యము కృసరము (పులగము) మాకు పెట్టునా? కొమ్ములు మాత్రము విడిచి, పాదము మొదలు శిరసుదాకగల ఖడ్గ మృగముల మాంసము త్రయోదశినాడు మఖా నక్షత్రమందు తేనె నెయ్యితో కలిపిన పాయసముతో దక్షిణాయనము నందు మాకు నివేదించునా? అని ఉబలాటపడుచుందురు. కావున భక్తితో పితృ దేవతలను అర్చించి సర్వాభీష్టములను బడయవలయును ఆ పితృప్రీతి వలన వసువులు, రుద్రులు, ఆదిత్యులు నక్షత్ర దేవతలు, గ్రహములు, తారాగ్రహములు పితృ శ్రాద్ధము వలన తృప్తులై, అయువును, సంతానమును, ధనమును, విద్యను, స్వర్గమును, మోక్షమును, పితృదేవత లొసంగుదురు. అపరాహ్ణకాలము నుండి పితృకాలము. అపుడు స్వాగతము చెప్పి పవిత్రపాణియై ఆచమించి అభ్యాగతుడైన ద్విజులను ఆసనములందు ఉపవిష్టులను జేయవలెను. శ్రాద్ధము పూర్తిచేసి ఉత్తమ ద్విజులకు భోజనము పెట్టి ప్రియ సంభాషణముల చేత ప్రణమిల్లి భక్తితో ద్వారము దాక అనుగమించి విసర్జించి వారి అనుమోదము పొందివచ్చి నిత్యక్రియా కలాపము పూర్తిచేసి కొని అతిథులకు భోజనము పెట్టవలెను. పితృదేవతలకు సంబంధించిన తర్పణాది నిత్యక్రియలు అపుడే చేయవలయునని కొందరందురు. కాదని కొందరందురు. అవి వేరుగా చేయవలెను. కొందరు ముందే చేయవలెనని చెప్పుదురు. అటుపై యజమానుడు శ్రాద్ధాన్నమును తమవారితో పరివారముతో భుజింపవలెను. ఇట్లు ధర్మజ్ఞుడైన బ్రాహ్మణుడు బ్రాహ్మణులందరు సంతోషించునట్లు శ్రద్ధతో శ్రాద్ధము నిర్వహింపవలెను.