శ్రాద్ధ వర్జ్యములు

శ్రాద్ధమునందు భోక్తలుగా పెట్టతగని అధమ బ్రాహ్మణులను పేర్కొందును వినుడు. మిత్రద్రోహి, పుప్పిగోళ్ళవాడు, నపుంసకుడు, క్షయవ్యాధి, బొల్లికలవాడు, వాణిజ్యము చేయువాడు, గారపండ్లవాడు, బట్టతలవాడు, మెల్లకంటివాడు, గ్రుడ్డివాడు, చెవిటివాడు, మందబుద్ధి, మూగవాడు, కుంటివాడు, పీలచేయిగాని వంకరచేయిగాని కలవాడు, పౌరుష శక్తి లేనివాడు, చర్మవ్యాధి కలవాడు, అవయవములు తొలగింపబడినవాడు, ఓర, వంకర చూపుగల వాడు, కుష్ణువ్యాధితుడు, ఎఱ్ఱని కండ్లవాడు, మరుగుజ్జు, పొట్టివాడు, వికటమైన ఆకారముగలవాడు, చురుకుదనములేనివాడు, మిత్రుని శత్రునిగా భావించువాడు, నీచ వంశమున పుట్టినవాడు, పశుపాలనచే జీవించువాడు, వెలివేయబడిన వాడు, పరివిత్తి (తమ్మునికి వివాహమైన తర్వాత తాను పెండ్లి చేసికొన్నవాడు) పరివేత్త (అన్నకంటె ముందుతాను పెండ్లాడిన తమ్ముడు) పరివేదిని కాసుతుడు (అన్న కంటె ముందు పెండ్లాడిన వాని భార్య కడుపున పుట్టిన కొడుకు) శూద్రస్త్రీని పెండ్లాడిన బ్రాహ్మణుడు, శూద్ర స్త్రీని పెండ్లాడిన బ్రాహ్మణునికి పుట్టిన కొడుకు ఇట్టి వారిని శ్రాద్ధమున భోక్తలుగా తీసికొన కూడదు. ఇట్టి శూద్రస్త్రీకి ఉపనయనాది సంస్కారములు జరిపించిన బ్రాహ్మణుడు పెండ్లాడనివాడు దిధిఘావతి (భర్త మరణించిన తరువాత మరల పెండ్లాడిన స్త్రీయొక్క భర్త) జీతము తీసికొని వేదాధ్యయనము చేయించువాడు జీతమిచ్చి వేదము నేర్చుకొనువాడు, సూతక అన్నముచే జీవించువాడు, వేటాడువాడు, సోమ రసమును, సోమలతను అమ్మువాడు, అభిశస్తుడు (వేదాధ్యయనముచేసిన క్షత్రియుని వధచేసినపాపి), దొంగ, భ్రష్టుడు, వడ్డీ వ్యాపారముచే జీవించువాడు, మోసముచేసి జీవించువాడు, కొండెములు చెప్పువాడు, వేదాధ్యయనము దానము అగ్నిహోత్రము చేయక విడిచి కాఠిన్యము వహించినవాడు, రాజపురోహితుడు, రాజసేవకుడు, విద్యావిహీనుడు, ఇతరులమేలు ఓర్చనివాడు, పెద్దలను ద్వేషించువాడు, భరింపరాని దుష్టుడు, క్రూరుడు మూఢుడు, గుడిపూజారి, నక్షత్ర సూచకుడు (జాతక ఫలములు చెప్పి జీవించువాడు) పర్వకారుడు (రాతిపని చేయువాడు), లోకనింద పొందువాడు, యాగము చేయింపకూడని వారిచే యాగము చేయించినవాడు ఇట్టి వారిని శ్రాద్ధమున భోక్తలుగ గ్రహింపకూడదు.

పాత్రదానము పట్టువాడు, సత్పురుషులను అవమానించువాడుగా ఉన్న వారికి దైవము అప్పటికప్పుడు దారుణమైన దండనము విధించును. వీరు బహు నిషిద్ధులు. అగమ విహితుని విడిచి నీచునికి భోజనము పెట్టిన యజమాని, ధర్మమూలమునకే దూరుడై నశించును. తనతో తనను ఆశ్రయించి ఉండు బ్రాహ్మణుని విడిచి ఇంకొకనిని గొనివచ్చి భోజనము పెట్టినచో ఆ ఆశ్రయించుకొనిన బ్రాహ్మణుని నిట్టూర్పు నిప్పుచే దగ్ధుడై దాన నశించును. వస్త్రములేని క్రియ లేనే లేదు. యజ్ఞములు లేవు. వేదములు లేవు. తపస్సులు లేవు. కావున శ్రాద్ధకాలమందు పితృదేవతలకు వస్త్రములు తప్పక ఇచ్చి తీరవలెను. పట్టుపంచె పొత్తుపంచె నూలు వస్త్రము క్రొత్త దుకూలము శ్రాద్ధము నందు ఇచ్చినవాడు పరమ ఉత్తమాభిలాషలను బడయును.

ఆవులమందలో దూడ, ఎట్లు తమ తల్లి పొదుగునకే చేరునో శ్రాద్ధము నందు విప్రులకు పెట్టిన అన్నము ఆ జీవుని అట్లే పొందును. నామము గోత్రము మంత్రము అనునవి ఈ అన్నమును ఆయా స్థానములకు అందించును. ఆ కులమునందలి అందరకును తృప్తి కలుగును.

దేవతలకు పితరులకు మహాయోగులకు నమస్కారము. స్వధాదేవికి స్వాహాదేవికి నమస్కారము. వీరందరు నిత్యము నాయందుందురు’ అను ఈ మంత్రమును శ్రాద్ధము ముందు అవసానము నందు ముమ్మారులు జపింపవలెను. పిండ నిర్వహణ సమయమందు కూడ ఇట్లు జపింపవలెను. ఈ మంత్రమువలన పితృదేవతలు పరుగు పరుగున వత్తురు. రాక్షసులు పారిపోవుదురు. ముల్లోకములు తృప్తి చెందును. ఇది తరింపజేయును.

పిండములను అగ్ని యందుంచిన భోగసమృద్ధి కలుగును. భార్యకుపెట్టిన సంతానము కలుగును. మధ్య పిండము మాత్రమే ఇట్లు చేయవలెను. గోవులకు పెట్టినచో మంచి తేజస్సును బడయును. ఉదకములందువేసిన ప్రజ్ఞ, కీర్తి, యశస్సు కలుగును. దీర్ఘాయుర్దాయము కోరువాడు కాకులకు పెట్టవలెను. కుమారులను కోరువాడు, కోళ్ళకు పెట్టవలెను. కొందఱు పండితులు అగ్ర భాగమునుండి పిండములను ఎత్తవలె ననిరి. బ్రాహ్మణ అనుజ్ఞ పొంది పిండోద్ధరణము చేయవలెను. ఇది యథావిధిగ ఋషులు చెప్పిన శ్రాద్ధ విధానము. ఇంకొకలాగు చేసిన దోషము కలుగుటయే గాక పితృ దేవతలకు ముట్టదు. యవలు, వ్రీహులు, తిలలు, గోధుమలు, శనగలు, పెసలు, చామలు, ఆవాలు, నీవారము, హస్తి, శ్యామాకములు ప్రియంగులు సతూలిక ప్రసాతిక (అణువ్రీహి) ఇవి శ్రాద్ధ ప్రశస్తములు. మామిడికాయ, ఆచతకము, భిల్వము, దానిమ్మ, బీజపూరము, ప్రాచీనా మలకము, పాలు, కొబ్బరి, పరూషకము, నారంగము (నారింజ), ఖర్జూరము, ద్రాక్ష, నల్లవెల పొట్ల, ప్రియాలు (చారకర్కంధువు) బదరము (రేగు) వితంకతము (కానరేగు) వత్సకము (కొడిసెచెట్టు) కస్తాళువు, వారకము, వీని పండ్లను శ్రాద్ధమునందు పెట్టవలెను. ఆవుపాలు, పెరుగు, నెయ్యి, నువ్వులనూనె, సైంధవ లవణము సముద్ర లవణము సారసము (సరోవర జలము) వీనిని నివేదింపవలెను. చందన అగురు కుంకుమాది సుగంధములను కాలశాకము (కరివేము) జాజి, చంపకము, లొద్దుగ, మల్ల, బాణ కుసుమము, బర్బరి, అశోకము, వృంతాశోకము, అటరూశము, మామిడి, తిలకము, తామరగంధ, సేఫాలిక, కుబ్జకము, తగరము, ఆరణ్యమృగమనునొక జాతిపువ్వు, మొగలి, యూధిక, అలిముక్తము, కమలము, కుముదము, పద్మము, పుండరీకము, ప్రయత్న పూర్వకముగ కొనివచ్చి పితరుల అర్చింపవలెను. నల్లకలువ ఎఱ్ఱకలువ కల్హారము (ఎర్ర తామర) కుష్టము మాంసి బాలకము, కుక్కుటి, జాతిపశ్రకము (జాపత్రి), నశిక, ఉసీర, ముస్తములు, గ్రంధిపర్ణి మొదలైన పరిమళ ద్రవ్యములు పితృ ప్రీతికరములు. అగరు, గుగ్గులు, చందనము, శ్రీవాసము, మొదలగునవి పితృ యోగ్యములైన ధూపములు. ఋషి గుగ్గులము కూడ. రాజమాషములు, (బొబ్బరలు) శనగలు, మసూరములు, కోర దూషకములు, విప్రషములు, మర్కటములు, కోద్రనములు అనునివి పితృతిధియందు నిషిద్ధములు. గేదెపాలు, పెరుగు, తాటిపండు, జంబీరము, ఎర్రమారేడు పండు, శాల ఫలము నిషిద్ధములు. చేప, పంది, తాబేలు, ఆవు అనువాని మాంసములు మిక్కిలి వర్జ్యములు. పూతికము, మృగనాభి, గోరోచనం, పద్మ చందనము, కాలేయకము, ఉగ్రగంథము, తురుష్కము, పాలంకము, వరుమ, చనుపత్రిక, కుమారి కిరాతము, పిండమూలికము, గ్రుంజనము, చుక్రిక, చుక్రము జీవ శతపుష్ప నాలిక, గంధశూకరము, హలభృత్యము, సర్షపము, నీరుల్లి, వెల్లుల్లి మానకందము, విషకందము, వజ్ర కందము, గదాస్థికము, పురుషాల్వము పిండాలువు నిషిద్ధములు. ఆనప తిక్తపర్ణ గుమ్మడి (త్రికటుకము) కరకతిండి ఉసిరికను వార్తాకము (వంకాయ) శివిజాతము. కాలీయము రక్తవాణ చిలికలకుచము విభీతకఫలము (తాండ్రము) అరనాలము. శుక్తము శీర్ణము పర్యుషితము ఉగ్రగంథము కోవిదారము (కాంచన వృక్షము) శిగ్రువు (ములగ) పనికిరావు. మిక్కిలి పులుపు పిచ్ఛిలము. సూక్ష్మము యాతయామము గతరనము, మద్య గంధము, ఇంగువచే ఉగ్రగంధమైన పదార్థములు, ఫణిశము, భూనింబము నింబము రాజికము కలింగదేశపు కుస్తుంబరువు (కొత్తిమీర) అమ్లకేతనము (పుల్ల ప్రబ్బ) నిషిద్ధములు. దానిమ్మ, మాగది. నాగరము, ఆర్ద్రక తిత్తిడి, ఆమ్రాతకము, జీవకము, తుంబురువు అనునవి వినియోగింపవచ్చును. పాయసము, శాల్మలీ ముద్రములు (కజ్జికాయలు), మోచకాదులు, పానకము, తియ్య మామిడి పండ్లు, ఆవుపాలు ప్రశస్తములు. రుచిగల్గి స్నిగ్ధములుకొలది పులుపు కొలది కారముగల పదార్థములు ప్రశస్తములు. కాఱుపులుపు, కాఱుప్పు, మిక్కిలి చేదు కారముగల ఆసురా హారములను దరికి చేరనీయరాదు. స్వాదువులై దైవభోజ్యము లయిన వానినే ఏర్పరు పవలెను. మేక, కార్తికపక్ష, తిత్తిరి, కుందేలు మున్నగువాని మాంసములు పెట్టవచ్చును. వాఘ్రాణనము రక్త శివము శల్కముతో గూడిన లోహము సింహ తుండముఖడ్గము అనునవి యోజ్యములు. రోహితమును (చేపను) హవ్య కవ్యములందు పెట్టవచ్చునని మనువు చెప్పెను.

ఈ శ్రాద్ధ కల్పము వారాహునిచేత తృష్టము దీనికి వారాహ శ్రాద్ధ కల్పమను ప్రసిద్ది కలదు. ఇందు నిషిద్ధ పదార్ధములను శ్రాద్ధములందు బ్రాహ్మణులకు పెట్టరాదు. తినరాదు. రోహితము, శూకరము, తాబేలు, ఉడుము మాంసము పనికిరాదు. చక్రవాకము, మద్గువు, (నీటికాకి), ఎముకలులేని చేపలు, ఎముకలేని కురరము (కురలపక్షి) కలవింకము (ఊరపిచ్చుక), నెమలి, భారాద్వాజపక్షి, శార్ఙ్గకపక్షి, ముంగిస, గుడ్లగూబ, తిత్తిరిపక్షి, నక్క పెద్దపులి, ఎలుగొడ్డు, తరక్షుపు ఈ పదార్ధములు పెట్టిన రౌరవ నరకము వచ్చును. అదిగాక స్వర్గమునందున్న పితృదేవతలను కూడ నరకమున పడవేయుదురు. కుసుంభ శాకము, జంబీరము, సిగ్రుకము, కోవిదారము, పిణ్యాకము (తెలక పిండి) విప్రుషము మనూరము. గుంజనము శణము కోద్రవము కోకిలాక్షము చక్రము కంబుకము పద్మకము చకోరము డేగ గుండ్రానపుకాయ తాళిని తాటుపండు ఇవి నరకప్రదములు. వానిని పెట్టిన యజమాని పితృ దేవతలతో పాటు పూయవహమను నరకమున బడును. వరాహ శ్రాద్ధకల్ప నిషిద్ధములైన ఈ వస్తువులను పెట్టి తినుటకంటె ఆత్మమాంస భక్షణముచేయుట మేలు. పొరపాటుచే తెలియక ఇవి పెట్టినను తిన్నను ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను.