వ్యాసుడు ఇట్లు అనియె -
ఇంద్రోత్సవము చేయ పనిలేదను గోపకుల నిశ్చయముచే మిక్కిలి కోపించి ఇంద్రుడు సంవర్తకమను మేఘగణమును గూర్చి ఇట్లనియె. ఓ మేఘములారా! నేను పలుకు వచనములు ఆలింపుడు. నా ఆజ్ఞను అవిరామముగ వెంటనే కావింపుడు. నందుడు దుర్బుద్ధియై గొల్లలను కూడగట్టుకొని కృష్ణుని ఆశ్రయబలముచే ఉబ్బి ఉత్సవ భంగము చేసినాడు. ఆ గొల్లలకు జీవనాధారము, గోపాలురు అనిపించుకొనుటకు కారణమును గోవులే కావున రాళ్లవానగురిపించి వానిని బాధింపుడు. నేనును కొండశిఖర మట్లున్న ఐరావత గజమునెక్కివచ్చి వాయువులతోడ మీకు తోడయ్యెదను” ఇట్లు ఇంద్రునిచే నాజ్ఞాపింపబడి మేఘములు గోవులకు జడుపుగొలుపు జడివాన గురిసినవి. క్షణములో ఈధరణి దిక్కులు ఆకాశము ఒక్కటిగ ఏకధారగ కురిసిన కుంభవృష్టిచే ఆవులు దెబ్బతిని మెడలు తలలు తిఱుగబడి పడిపోయినవి. కొన్ని గోవులు దూడలను ఱొమ్ముల అదిమికొన్నవి. కొన్నిగోవులు దూడలకెడమైనవి. కొన్ని ఆవులు గాలికి ఒడలు వణకుచుండగా బిక్క మొగము పెట్టి కావుకావుమన్నట్లు అంబారవములుచేసి అల్లన కృష్ణుని గూర్చి మొరపెట్టికొన్నవి. గోవులు గోపికలు గోపకులతో నా గోపకులమెల్ల బెగడువడి వ్యాకులమగుట చూచి హరివారిని రక్షింప అలోచించెను. ఉత్సవ భంగమునకు పగగొని ఇంద్రుడిది చేసెను. నేనీ గో వ్రజమును కాపాడవలయును. ఈ కొండను పెల్లగించి ఈ గోష్ఠమునకెల్ల గొడుగుగా ఎత్తి పట్టెదనుగాక అని నిశ్చయించి ఆ గోవర్థనగిరి ఒంటిఱెక్క అవలీలగ ఎత్తి పట్టెను. మఱియును జగన్నాథుడు “వానకడ్డు చేసితిని. ఈ కొండ గొడుగు క్రింద కందఱు రండురండు. గాలితాకిడి లేనియెడల అనువగుచోట మీరు సర్దుకొనుడు. ఈ కొండ విరిగి మీద పడునేమో అని, ఈ క్రింద నిలుచుటకు జడియ వలదు” అనగా హరి పలుకువిని, గోధనములతో బండ్లకెక్కించు కొన్న కుండలు మండలతో గోపకులు గోపికలు వానదెబ్బతిని ఆ కొండ క్రిందికి జొచ్చిరి. కృష్ణుడు ఆ శైలమును కేలల్లాడకుండ ఎత్తి పట్టెను. వ్రజవాసులు ఆనందపడి అచ్చెరువుగొని విచ్చిన వెడకన్నులప్పగించి కృష్ణుని చూచి బాలకృష్ణ లీలలను గొనియాడిరి. స్వామియు అదియొక ఆటగా ఏడు రాత్రులు ఏకధారగా ఇంద్రాజ్ఞగొని మేఘములు కురియ, ఏకధాటి ఆ గోవర్ధనమును ఎత్తికొనెను. హరి అట్లు ఆపెనుకొండను ఎత్తికొన గోకులము రక్షణగొన ఇంద్రుడు తనప్రతిన అబద్ధమై, ఆకసమున మబ్బువిరిసినట్ల తన ఆలోచనలు వమ్మయిపోగా గోకులమువెడలి సంబరపడి స్వస్థానమునకు తిరిగి వచ్చెను.
కృష్ణుడును గోవర్ధనగిరిని యధాస్థానమునకు దించెను. వ్రజవాసులు ఎనలేని ఉల్లాసమున ఆవింతను చూచిరి. ఈ విధముగ గిరిని పైకెత్తగా గోకులము రక్షణము పొందగా, ఇంద్రుడు కృష్ణ దర్శనము చేసికొననెంచి ఐరావత మెక్కి క్రిందికి దిగివచ్చి ఆ జగన్నాటక సూత్రధారి, ఆ ప్రపంచమునకు అంతటికి కాపరిగా గరుడుడు తనఱెక్కలు విప్పి కల్పించిన నీడక్రింద గరుడవాహనారూఢుడై ఉన్న సాక్షాద్విష్ణువును, మధుసూదనుని దర్శించి, గజరాజము నుండి దిగి ఏకాంతమునందు అల్లన నవ్వుచు ప్రీతిచే కన్నులు విప్పార ఇట్లనియె.