బ్రహ్మ మహా పురాణము

ప్రద్యుమ్యుని కథ

శంబరునిచే ప్రద్యుమ్నుడు ఎట్లు హరింపబడెను? ప్రద్యుమ్నుడు శంబరుని సంహరించిన విధము ఏమి? తెలుపుడు” అని మునులు అడగగా వ్యాసుడు ఇట్లు చెప్పెను. “ప్రద్యుమ్నుడు పుట్టిన ఆఱవనాడు కాలశంబరుడు తనకు ఈతడు హంతకుడని తలచి ఆ శిశువును పురిటింటినుండి కొంపోయి మొసళ్ళుగల భయంకరమైన సముద్రమున విసరివేసెను. ఆ పడిన శిశువును ఒక చేపపట్టుకొనెను. దాని జఠరాగ్నికి గురి అయిన ఆ బాలుడు చావలేదు. జాలరులు వలవేయగా ఇతర చేపలతో పాటు పట్టువడిన ఆ బాలుని జాలరులు శంబరునికి సమర్పించిరి. జాలరి భార్య మాయావతివాని గృహ యజమానురాలుకు ఇవ్వగా ఆమె చేపను వంటవానికీయ, వాడు అది చీల్చి ఆ చేప కడుపున వృక్షము యొక్క మొదటి మొలకవంటి పరమ సుందరుడు మున్నుదగ్ధుడైన మన్మథుడను శిశువును జూచెను. ఎవడు వీడు? చేప కడుపున కెట్లు వచ్చెను! అని వేడుకపడుచున్న శంబరుని భార్యను చూచి నారదుడు; ఈ శిశువు సర్వసృష్టి సంహారములు చేయగల శంబరునిచే పురిటింట నుండి హరింపబడినవాడు. కృష్ణుని కుమారుడు. సముద్రమున విసరబడి చేప మ్రింగగా నీకు దక్కినాడు. ఇది మానవ రత్నము. శ్రద్ధగ కాపాడుమని తెల్పెను. ఆమె అట్లే ఆ బాలుని సౌందర్యాతిశయమునకు మోహపడి అనురక్తితో పెంచెను.

ఆ బాలుని నిండు యౌవనముగని ఆమె వానికి తనమాయనంతను చెప్పెను. వాని యందు హృదయము చూపులు నిలిపి ప్రవర్తించుచుండ, ప్రద్యుమ్నుడు మాతృభావము విడిచి మరొక తీరున నా యెడల నీవేల ప్రవర్తించుచున్నావని అడిగెను. ఆమెయు నీవు నాకు కుమారుడవుకావు. విష్ణు కుమారుడవైన నిన్ను కాలశంబరుడు హరించి సముద్రమున విసరగా ఒక చేప కడుపునుండి నాకు లభించితివి. నిన్నుగన్న తల్లి నీ కొఱకు ఇప్పుడును ఏడ్చుచునే ఉండును. అని చెప్పెను.

అది విని కోపముచెంది, మనసు వికలమై ప్రద్యుమ్నుడు శంబరుని యుద్ధమునకు పిలిచెను. మరియు వాని సైన్యమంతటిని కూల్చి ఏడురకముల మాయలను దాటి ఎనిమిదవ విధమైన మాయను ప్రయోగించి ఆ శంబరాసురుని జంపెను. ఆ మాయావతితో ఎగిరి తండ్రి పురమునకు వచ్చెను. అంతఃపుర మందు వ్రాలి మాయావతితో కూడియున్న అతనిని జూచి, కృష్ణపత్నులు సంతోషించిరి. రుక్మిణియును ప్రీతితో అతనిపై చూపు నిలిపి ఇట్లనియె.

“ఏ ధన్యురాలి తనయుడో ఇతడు నవయౌవన మందున్నాడు. నా కుమారుడు ప్రద్యుమ్నుడే కనుక జీవించి ఉండిన ఈ వయసులో ఉండెడివాడు. నాయనా! నీచేత సొంపుగన్న ఆ కన్నతల్లి అదృష్టవంతురాలు. అదిగాక నీఈ శరీరము ఈ ఆకారము సరిగా నన్ను పోలియున్నది. స్పష్టముగ నీవు హరి కుమారుడవే అగుదువు” అనెను. ఇంతలో కృష్ణునితో గూడ నారదుడు ఏతెంచి అంతఃపురాంగనల కెల్ల మిన్నయైన రుక్మిణీదేవిని చూచి హర్షముతో కల్యాణీ! మున్ను పురిటింటనుండి హరించిన ఆ శంబరాసురుని చంపి వచ్చిన ఈతడు నీ బిడ్డడే. ఈ మాయావతి పతివ్రత. ఆ నీ కుమారుని భార్య. శంబరుని భార్య కాదు. దానికి కారణమిదిగో వినుము. మన్మథుడు పోయిన తరువాత అతడి పునర్జన్మ కోరుచు మాయారూపమున వివాహాది భోగములందు శంబరుని ఈమె తబ్బిబ్బు చేసెను. మన్మథునిపత్నియే ఈమె. ఆ దైత్యునికి మాయా రూపమును చూపినది. నీ కుమారుడు మన్మథుడు తిరిగి అవతరించినాడు. అతని ప్రాణ ప్రియరతియే ఈమె. శంకింపకుము. ఈ పరమ కళ్యాణి నీ కోడలు అని పలుకగా రుక్మిణీ, కృష్ణులు ఆనందభరితులైరి. ద్వారకా నగరమెల్ల బాగుబాగని హర్షించినది. చిరకాలము క్రిందట పోయిన కుమారునితో కూడుకొనిన రుక్మిణిని చూచి ద్వారకా నగర జనమెల్ల విస్మయము చెందిరి. (200)