వ్యాసుడు ఇట్లు చెప్పెను-
ఇట్లు గృహస్థు దేవతలను పితృదేవతలను హవ్యకవ్యములచేతను, అతిథులను బంధువులను, భూతములను, నౌకరులను పశుపక్ష్యాదులను, జీవులను, బిచ్చగాండ్రను, సన్యాసులను, యాచకులను, బాటసారులను, సదాచారవంతులను, అన్నము మొదలైన ఆహారములచే పానీయములచే పూజించి నిత్యములయిన సంధ్యావందనాదులను, నైమిత్తకములయిన ఆయా పర్వాదులందు విహితములైన క్రియలను నిర్వర్తించి తీరవలెను. వీనిని అతిక్రమించిన ఎడల పాపము అనుభవించును అనగా మునులు ఇట్లు అనిరి.
“ఓ విప్రుడా! నీవలన నిత్యము నైమిత్తికము కామ్యము (ఏదేని కోరిక సఫలము కావలెనని చేయు కర్మ) అను త్రివిధమైన పురుష కర్తవ్యము (కర్మను) తెలిసికొన్నాము. ఇక సదాచారమనగా ఏమో ఇహమందు పరమందు మానవుడు ఆచరించి సుఖపడు దానిని గురించి వినగోరుచున్నాము అన మునులకు వ్యాసుడు ఇట్లు చెప్పెను.
గృహస్థు నిరంతరమును ఆచార రక్షణము చేసికొనవలెను. ఆచార హీనునికి ఇహపరములందు క్షేమము లేదు. సదాచారమును ఉల్లంఘించి వర్తించువానికి యజ్ఞదాన తపస్సులు సుఖమీయవు. దురాచారుడు ఇక్కడ పూర్ణ ఆయుర్దాయము పొందడు. సదాచార సంపన్నమైన ధర్మమును చేయవలెను. అట్టి ఆచారము యొక్క లక్షణము స్వరూపమును తెల్పెదవినుడు. తాను ఏకాగ్ర మనస్కుడై దానిని నిర్వహింపవలెను గృహస్థు త్రి వర్గమును (ధర్మ అర్ధ కామములు అను పురుషార్థములను) సాధించు ప్రయత్నము చేయవలెను. అది సిద్ధించినయెడల ఇహపర సిద్ధియు కల్గును. ఈ త్రివర్గ మందు నాల్గవ భాగమైనను జరిపిన పరలోక శ్రేయస్సు చేకూర్చును. సగము నిర్వర్తించినచో తన్నుతాను భరించుకొన గలవాడగును. నిత్య నైమిత్తికములను చేయగల్గును. నాల్గవ వంతు సదాచార సహచరణమున ధర్మ మూలమును వృద్ధిగావింప గలడు. ఈ ధర్మాచరణముచే అర్ధము సిద్ధించును. అట్లే పాపమును నిషేధించుటకు తెలిసినవాడు ధర్మమాచరింపవలెను. పరమందు అర్ధము దాని తరువాతిది కామము ఫలప్రదములు అగుటకు వానిని ఇహమందు అనుష్ఠింపవలయును. ప్రత్యవాయ భయముతో (పొరపాటుగ చేసిన పాపము వచ్చునను భయముతో) కామముగానీ మఱియే పురుషార్థమునకు విరుద్ధము కాకుండా (రెండు విధములుగాను) గావించిన కామ పురుషార్థము గూడ త్రివర్గ సాధనమందు విరోధకరము కాదు. ఈ పురుషార్థము ఒక దానికి ఒకటి అనుబంధింపబడునవిగా ఉన్నవా? విపరీతాను బంధములుగా ఉన్నవా? అనువిషయము తెలిసికొనవలయును. ధర్మము ధర్మాను బంధియైన అర్ధమును బాధింపని ధర్మము అట్లే ధర్మార్దానుబంధియైన కామము ఆ రెండిటిని బాధింపని కామము, దానిచే (కామముచే)బాధింపబడని ధర్మార్థములును ఆత్మ బాధకములుకావు. అనగా తనకు కృతార్ధతను కల్గించి తీరునన్నమాట. పురుషార్థములు ఒక దానికి ఒకటి అనుబంధపడి పరస్పర విరుద్ధములు గాకుండ జాగరూకుడై చేసిన ఎడల మానవుడు అన్నింటి ఫలమును పూర్తిగ పొందునని భావము.
బ్రాహ్మ ముహూర్తమున (తెల్లవారుజాము) మేలుకొని తాను ఆనాడు చేయవలసిన ధర్మము, అర్థము అను పురుషార్థ సాధనను గురించి ఆలోచన చేయవలెను. అటుపై ఆచమనముచేసి, స్నానముచేసి నియమవంతుడై శుచియై సంధ్యావందనమును నక్షత్రములుండగా చేయవలెను. సాయం సంధ్యను సూర్యుడు ఉండగా కావింపవలెను. ఈ సంధ్యోపాసనను ఆపద ఏమియు లేనప్పుడు తప్పక చేసితీరవలసినదే. అట్లే అసచ్ఛాస్త్రమును (నాస్తికాది మతములను) అసద్వాదమును (దుష్టవాదము), అసత్సేవను (అధర్మ పరులను సేవించుటను) మానవలెను. నియమవంతుడై సాయం ప్రాతఃకాలములందు హోమము చేయవలెను. సూర్యుని ఉదయాస్తమయములను చూడరాదు. తలదువ్వుకొనుట, అద్దము చూచుట, దంత ధావనము, కాటుక పెట్టుకొనుటయు పూర్వాహ్ణమందే చేయవలెను. దేవ తర్పణము కూడ అప్పుడే కావింపనగును. గ్రామములు ఇండ్లు తీర్థములు క్షేత్రములు అనువానికి పోవుదారులందు దున్నిన పొలములో గోశాలలందు విణ్మూత్రములు చేయరాదు.
దిగంబరమై ఉన్న పరస్త్రీని, తన పురీషమును చూడరాదు. బహిష్ఠయైన స్త్రీని చూచుట, తాకుట పలకరించుట కూడదు! నీళ్ళలో మూత్రపురీషములు చేయుట, మైధునము పనికిరాదు. మూత్ర పురీషములు, వెంట్రుకలు బూడిద, పొల్లు, బొగ్గులు, తెగిపోయిన త్రాళ్ళు, గుడ్డ పీలికలు, దారిలో పడియున్న చింపి గుడ్డలు మొదలగు వానిని తొక్కరాదు.
పితృదేవ మనుష్యులను భూతములను అర్చించి అటుపై గృహ యజమాని భోజనము చేయవలెను. తూర్పు ఉత్తరము దిశలవైపునకు ఉన్ముఖుడై ఆచమనము చేసి మౌనము పూని శుచియై మనసులో తాను తిను ఆహారము వైపు నిలిపి మోకాళ్ళ లోపల చేయి ఉంచి భోజనము చేయవలెను. తెలిసినవాడు చెడిన అన్నమొక్కటి తప్ప మఱియే అన్న దోషములను తెలుపరాదు. కేవల లవణము తినరాదు. ఉచ్ఛిష్టాన్నమును (ఎంగిలిని) విడిచిపెట్టవలెను. నడుచుచు లేక నిలువబడి మూత్ర పురీషములు విడువరాదు. ఎంగిలిని ఏ కొంచెము తినరాదు. ఎంగిలి నోటితో మాటలాడరాదు. వేదము చెప్పకూడదు. సూర్య చంద్ర నక్షత్రములను బుద్ధిపూర్వకముగ చూడరాదు. విరిగిన అసనము, మంచము, పగిలిన పాత్రమును వాడుకొనరాదు. పెద్దలు వచ్చినపుడు తాను లేచి నిలుచుట, ఎదురేగుట మొదలగు సత్కారములు చేసి ఆసనము (పీట, కుర్చీ, చాప మొదలయినవి) వేయవలెను. అనుకూలముగ సంభాషణము చేయవలెను. వారు వెడలి చనునపుడు కొంతదూరము వెంబడింపవలెను. ప్రతికూలముగ సంచరింపరాదు. ఒంటిగుడ్డతో భోజనము, దేవతార్చనము, బ్రాహ్మణాహ్వానము, అగ్నియందు హోమము చేయరాదు. నగ్నుడై (దిస్స మొలతో దిగంబరియై) స్నానము చేయరాదు. వండుకొనరాదు. రెండుచేతులతోను నెత్తిని గోకుకొనరాదు. నిష్కారణముగ మాటి మాటికి తలనిండ స్నానము చేయరాదు. శిరః స్నానముచేసి తైలముతో అంగస్పర్శ చేయరాదు. అనధ్యయన దినములందన్నిట వేదాధ్యయనము మానవలెను. బ్రాహ్మణులను, అగ్నిని, గోవులను, సూర్యుని ఎన్నడు అవమానింపరాదు.
పగలు ఉత్తరాభి ముఖముగను రాత్రి దక్షిణాభి ముఖముగను సంకట సమయములందు యధేష్టముగను మూత్రపురీషోత్సర్జనము చేయవచ్చును. గురువు తప్పును చెప్పరాదు. ఆయన కోపించినయెడ బ్రతిమాలి క్షమాపణ చెప్పికొని ప్రసన్నుని చేసికొనవలెను. ఇతరులు చేయు అపవాదమును వినరాదు. బ్రాహ్మణులకు, రాజునకు, దుఃఖాతురునికి, విద్యాధికునికి, గర్భిణికి, రోగికి, పూజ్యునకు, మూగ, గ్రుడ్డి, చెవిటివాండ్రకు మత్తెక్కినవానికి, ఉన్మత్తునికి దారి ఇచ్చి తొలగినడువవలెను. దేవాలయమును చైత్య వృక్షమును (ఆలయాది పుణ్య స్థానములందు నాటించిన పుణ్యవృక్షము రావి మొదలయిన వానిని) నాల్గుదారులు కలిగిన కూడలిని ప్రదక్షిణముచేసి వెళ్లవలయును. అప్రదక్షిణముగా పోరాదన్నమాట. ఇంకొకడు వాడిన చెప్పులు, బట్టలు, పూలమాలలు మొదలయిన వానిని తాను ధరింపరాదు. చతుర్దశి, అష్టమి, పూర్ణిమ పర్వములు అయిననాడు అభ్యంగము, స్త్రీ సంభోగము కూడదు. బాహువులు, పిక్కలు పైకెత్తి నిలుచుండరాదు. పాదములు ఇట్టట్టు ఆడింపరాదు. ఒక కాలితో ఇంకొకకాలు త్రొక్కరాదు. జారిణిని, తప్పు జరిగిపోయిన తరువాత బాలుని, జాతి భ్రష్టుని, మర్మాఘాతముగ తిట్టుటను, దెప్పి పొడుచుటను (సాధించుటను) మానవలెను. వివేకి అయినవాడు దాంభికత్వము (డంబములు పలుకుట) నేనే ఘనుడనను దురభిమానము తీక్షణత్వమును చూపరాదు. మూర్ఖులను పిచ్చివాండ్రను కష్టములలో ఉన్నవారిని, విరూపులను అంగవైకల్యము గలవారిని నిర్ధనులను పరిహసించి కించపరచరాదు. శిష్యులను, పుత్రులను శిక్షించుటకు ఇంకొకని చేతికి దండమును (కఱ్ఱను) ఈయరాదు. కాలితో అసనము దగ్గరగా ఈడ్చికొని దానిపై కూర్చుండరాదు. తనకుతాను తినుటకు సంయావము (గోధుమపిండితో చేయు పదార్థము) కృశరము (పులగము), మాంసమును సేకరింపరాదు. సాయం ప్రాతః కాలములందు అతిథులను పూజించి భుజింపవలెను. తూర్పు ఉత్తరము మొగమై మౌనియై పండ్లు తోముకొనవలెను. నిషిద్ధములయిన దంత కాష్ఠములను వాడరాదు. ఉత్తరదిశగా, పడమరగా తలపెట్టి పండు కొనరాదు. దక్షిణదిశగా తలపెట్టి పండుకొనవలెను. పరిమళోదకములతో నిద్రపోరాదు. ఉషఃకాలమందు నిదురింపరాదు. గ్రహణమునందు విడుపు స్నానము రాత్రియే చేయవలెను. విడుపు కాగానే రాత్రియే చేయవలెనుకానీ మరునాడు పగలు చేయరాదని అర్థము. ఉప్పును దినరాదు. నిలువ ఉన్నది, తడి ఆరినది, పాసినదియునగు అన్నము తినరాదు. పిండికూరలు, చెఱుకు, పాలు అను వాని యొక్కయు మాంసము యొక్కయు వికారములు అనగా వానివానితో తయారైన పదార్థములను చిరకాలము నిలువయున్న వైనను తినవచ్చును. సూర్యోదయ అస్తమయ కాలములందు పండుకొనరాదు. స్నానముచేయక, కూర్చుండక, మనస్సు నిలుపక, మంచముమీద వట్టినేలమీద కూర్చుండి చప్పుడు చేయుచు లేక మాటలాడుచు భోజనము చేయరాదు. సేవకులకు పెట్టకుండ తినరాదు. సాయంప్రాతః కాలములందు స్నానముచేసి భోజనము చేయవలెను. పరదార సంగము కూడదు. ఆ దోషము ఇష్టాపూర్తముల వలనగల్గు ఫలమును ఆయుర్దాయమును నాశము చేయును. ఇష్టమనగా యజ్ఞము, వాపీకూప తటాకాది నిర్మాణము, సత్రము పెట్టుట, గోడ కట్టించుట, తోటలు వేయించుట మొదలయిన ధర్మకార్యములు పూర్తములు పరదారగమన మంత ఆయుర్దాయమును హరించు తప్పిదము మఱి ఒకటి లేదు.
ఆచమనముచేసియే దేవాగ్ని పితృకార్యములు గురు వందనము భోజనమును చేయవలెను. ఆచమనమునకు ఉపయోగించు జలము నురుగు, వాసన లేనివిగా ఉండవలెను. ఆచమనము చప్పుడు కాగూడదు. తూర్పుగ, ఉత్తరముగ తిరిగి ఆచమనము చేయవలెను. నీళ్ళనుండి తీసినది, ఇంటి పెరటిలో ఉన్నది, పుట్టలోని ఎలుక కలుగులోనిది, శౌచక్రియ యందు ఉపయోగింపగా మిగిలినదియునుగా ఈ ఐదు విధముల మన్ను శౌచవిధికి ఉపయోగింపరాదు. కాలుచేతులు కడిగికొని వానిని ప్రోక్షణము చేసికొని స్థిర మనస్కుడై మూడుసార్లు గాని, నాల్గుసార్లు గాని ఆచమనముచేసి రెండుసార్లు పెదవులను తుడిచికొని ఇంద్రియములను రెండుసార్లు స్పృశించి శుచియై సంధ్యా వందనాది క్రియలను జేయవలెను. తుమ్మునందు, నాకుటయందు, అపానవాయువు నందు, ఉమ్మి వేయుట మొదలగు పనులందు ఆచమనము చేయవలెను. అంటరానివానిని అంటినపుడు సూర్యదర్శనము చేయవలెను. మఱియు కుడిచెవి స్పృశించవలెను. ఈ చెవిని స్పృశించుట ఇంతకుమున్ను చెప్పిన ఆచమన సూర్య దర్శనములకు అవకాశము లేనప్పుడే. మున్ను చెప్పినది ఉన్నప్పుడు తరువాత జెప్పిన పనులు సమ్మతములుగావు. పండ్లు కొఱుకరాదు, తన దేహమును గ్రుద్దుకొనరాదు, పండుకొన్నపుడు, దారినడచునపుడు, భుజించునపుడు స్వాధ్యాయము పనికిరాదు. సంధ్యలందు మైథునము, ప్రయాణమును చేయగూడదు. అపరాహ్ణమున (కుతపకాలమందు) పగటికాలమును మూడు భాగములు చేయగా మూడవ భాగమున పితృ తర్పణము చేయవలెను. దేవ పితృ కార్యముల యందు శిరఃస్నానము చేయనగును. తూర్పు, ఉత్తర దిశమొగమై క్షుర కర్మ చేయించుకొనవలెను. వికలాంగిని వివాహమాడరాదు. ఉత్తమ కులమున పుట్టినది రోగములు లేనిది అగు కన్యను పెండ్లాడవలెను. తండ్రి వైపున ఏడవ తరము దానిని, తల్లివైపున ఐదవతరము దానిని మాత్రమే స్వీకరింపనగును. భార్యను సత్ప్రవృత్తి యందు పెట్టవచ్చును పగటియందు నిద్రా మైథునములు కూడవు. ఇతరులకు తాపము కల్గించుపని, జంతుపీడయు చేయరాదు.
ముట్టయిన స్త్రీని అన్ని వర్ణములవారు నాల్గు రాత్రులు వెలుపల ఉంచవలెను. అయిదవ రోజు కూడ దూరముగ ఉంచినచో నామెకు మఱి స్త్రీ జన్మమురాదు. ఆఱవరాత్రి ఆమెను పొందవచ్చును. మఱియు జ్యేష్ఠయుగ్మాను అనగా ఋతుదినములైన మొదటి పదియారు దినములలో సరిరాత్రులందు పొందనగును. సరిరాత్రులందు గూడిన పుత్రులు, బేసిరాత్రులందు కూడిన ఆడపిల్లలు కల్గుదురు. పర్వదినములందు పొందిన అధర్మపరులు, సంధ్యాకాలమందు కూడిన నపుంసకులు పుట్టుదురు. రిక్తాతిథి క్షురకర్మకు నిషిద్ధము. వినయము లేనివాండ్రేదేని చెప్పుచుండ అది వినరాదు. నీచునకు అత్యున్నత స్థానమీయరాదు. క్షురకర్మ చేసికొన్నపుడు, స్త్రీ సంభోగానంతరము, సంతకు వెళ్ళినపుడు సచేల (తలపై కూడా) స్నానము చేయవలెను. దేవతలను వేదములను ద్విజులను సాధువులు సత్యవంతులు మహాత్ములునైన వారిని, గురువును, పతివ్రతలను, బ్రహ్మ యజ్ఞములు తపస్సు చేయువారిని దూషించుట (అప్రతిష్ట పాలు చేయుట) పరిహసించటము కూడదు.
అచ్చపు తెలుపు వస్త్రములను, తెల్లని పువ్వులను దాల్చి ఎపుడును మాంగల్యవేషియై శుభవేషము గొన్నవాడై యుండవలెను. అట్టివానికి అమంగళములు కల్గవు. తలబిరుసు గలవారితో, ఉన్మత్తులతో, మూఢులతో, వినయహీనులతో, నీచశీలురతో, వయస్సుచే, జాతిచే దూషితులైన వారితో, డబ్బు దుబారా చేయువారితో, శత్రువులతో, కార్యదక్షులు కాని వారితో, నింద్యులతో, జారులతో చేరిన వారితో, నిరుపేదలతో, వాదపరులతో, మఱిపెక్కు తెఱగుల అధములైన వారితో చెలిమి చేయరాదు.
మిత్రుడు, దీక్షితుడు (యజ్ఞము చేసినవాడు), భూపాలుడు, స్నాతకుడు (గురుకులమందు విద్య పూర్తిచేసినవాడు) మామగారు అనువారితో గూడ తానును వేచి వారు వచ్చినపుడు ప్రత్యుత్థానముచేసి అసన పాద్యాదులు ఈయవలెను. వీరు తన ఇంటికి వచ్చినపుడు తనకు ఉన్నంతలో లోటు చేయకుండ పూజింపవలెను.
ప్రతి సంవత్సరోషితాన్=సంవత్సరమునకు ఒకసారి వచ్చియున్నవారిని అనగా ఆబ్దికమునందు యథాస్థానముగ అనగా వైశ్వే దేవస్థానము, పితృస్థానము అనువానియందు అర్చన చేయవలెను. అవ్వల అగ్నికి, ప్రజాపతికి, గృహ దేవతలకు వరుసగా మూడు ఆహుతులు ఈయవలెను. మఱొకటి కశ్యపునకు ఈయవలెను. అటుపైని అనుమతి కొక ఆహుతి ఈయవలెను. పిమ్మట గృహబలిని ఈయవలెను. నిత్య కర్మ విధానమందు నేను ఇంతమున్ను చెప్పిన వైశ్వదేవ క్రియను చేయవలెను. ఆ విధానము తెలుపుచున్నాను వినుడు.
పర్జన్య దేవతకు (వరుణునికి), అబ్దేవతకు, భూ దేవతకు మూడు స్థానములందు విడివిడిగా బలి వేయవలెను. ఆ వేయుట మణికమందు. (మణిక మనగా మట్టిపాత్ర) వాయువునకు అన్ని దిశలందు దిగ్దేవతలకు వరుసగా తూర్పు నుండి బ్రహ్మ అంతరిక్షము సూర్యుడు విశ్వేదేవులు విశ్వభూతములు ఉషస్సు భూతపతి అనువారికి ఉత్తరము వైపు బలివేయవలెను. ‘స్వధాయై నమః’ అని పలుకుచు పితరులకు దక్షిణమునను ప్రాచీనావీతిగ వేయవలెను. ‘యక్ష్మైతత్తే’ అను మంత్రము పఠించుచు వాయవ్యమూలలో అన్నావశేషముతో కూడిన ఉదకము యథావిధిగ వదలవలెను. అటుపై దేవతలకు బ్రాహ్మణులకు నమస్కారము చేయవలెను. కుడిచేతి అంగుష్ఠమునకు (బొటనవ్రేలికి) ఉత్తరమువైపున ఉన్న రేఖ బ్రాహ్మతీర్థ మనబడును. ఆచమనము చేయవలసిన తీర్థమిది. తర్జనికి (చూపుడు వేలు) అంగుష్ఠమునకు నడిమిది పితృతీర్థము. నాందీ ముఖములోగాక మఱి ఎల్లవిధులందును పితరులకు తర్పణాదులు ఈ తీర్థమున చేయవలెను. వేళ్ళ అగ్రము దైవతీర్థము. దేవతలను ఉద్దేశించిచేయు తర్పణాది విధులు ఆ తీర్థమున జేయవలెను. చిటికెన వ్రేలి మొదలు ప్రజాపతి తీర్థము. అక్కడ ప్రజాపతికి జేయవలయును. ప్రజాపతి కాండర్షి కావున ఋషి తీర్థమున చేయవలెనన్న మాట. బ్రాహ్మ తీర్థమునందు ఆచమనము ప్రశస్తము. పితృ క్రియ పితృ తీర్థమున, దేవతలకు దేవతీర్థమున, ప్రజాపతికి నాందీముఖ దేవతలకు పిండ తర్పణాదులు ప్రజాపతికివలె ప్రాజాపత్య తీర్థమున (చిటికెన వ్రేలి మొదట) చేయవలెను.
నీటిని అగ్నిని ఒక్కసారి కలిపి పట్టుకొనరాదు. గురువులు, దేవతలు, తల్లిదండ్రులు, బ్రాహ్మణుల వైపు పాదములు చాచరాదు. పాలు కుడుపుచున్న గోవును చూడరాదు. దోసిలితో నీరు త్రాగరాదు. చిన్నపెద్ద శౌచకాలములందు విలంబము చేయరాదు. ‘నవేగాన్ ధార యేత్క్వచిత్’ అని ఇదే విషయము మఱియొకచో తెలుపబడినది. నోటితో అగ్ని ఊదరాడు. అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎప్పుడు పారు ఏరు, ద్విజుడు. ఈ నాలుగును లేని ఊరిలో నివసింపరాదు.
భృత్యులను జయించినవాడు నౌకరులకు లొంగనివాడన్న మాట. బలశాలి, ధర్మతత్పరుడు అయిన రాజుగల దేశమందు ప్రాజ్ఞుడు వసింపవలెను. చెడ్డరాజు కలచోట సుఖమెక్కడిది? ఎక్కడ పౌరులు (ప్రజలు) కలిసిమెలిసి న్యాయవర్తనులై శాంతులు, మాత్స్యర్య హీనులునై ఉందురో అక్కడ నివాసము సుఖోదయము. ఎక్కడ వ్యవసాయదారులు (కృషికులు) దురభిమాన దురహంకారములు లేనివారో యెక్కడ ఓషధులు సర్వముగలవో అచ్చట వివేకి వసింపవలెను. జయింపవలెనను కోరిక కలవారు పూర్వవైరము కలవారు నిరంతరము వేడుకలకై వేడుకపడు జనము ఈ మూడు లక్షణములు గలచోట వసింపరాదు. ఉత్తమశీలురైన వారు సహచరులు శత్రువుల బెదిరింపులకు లొంగని రాజు సస్య సమృద్ధమైన భూమిగలచోటు నిత్య నివాసార్హము. ఇదంతయు మీ హితము కోరి తెల్పితిని. ఈ మీద భక్ష్యాభక్ష్య విధానము తెల్పెద వినుడు.
నేయి, నూనెలతో మిశ్రితమైనచో, పర్యుషితమైన (నిలువయున్నది చలిది) అన్నము గూడ త్యాజ్యమే. నేయి, నూనెల స్పర్శ లేకున్నను గోధుమ, యవ పదార్థములు ఆవుపాలు, పెరుగు, నేయి మొదలయినవి వానితో జేసిన వంటలును నిలువ ఉన్నవైనను భుజింప తగినవే. కుందేలు, తాబేలు, ఉడుము, పంది చేప (ఒక రకము చేప) అనునవి తినదగినవి. ఊరపంది, కోడియు తినరానివి. పితృశేషము, దేవశేషము శ్రాద్ధమందు బ్రాహ్మణులకు పెట్టు ఉద్దేశముతో ప్రోక్షింప బడినదియు, ఔషధము కొరకైనదియు అగు మాంసము తిన్న దోషము కలుగదు.
శంఖము, రాయి, బంగారము, వెండి, తాళ్ళ వస్త్రములు, కూరలు, దుంపలు, పండ్లు, పువ్వులు, చర్మము, మణులు, వస్త్రములు, పవడములు, ముత్యాలు, పాత్రలు, చమసలు (చతురస్రములైన యజ్ఞపాత్రలు) నీటితో కడిగిన శుద్ధములగును. రాతిచిప్పలు (రాచ్చిప్ప అని వాడుక) నీటిచేతను రాలితో సంఘర్షించుటచేతను శుద్ధములగును. నూనె జిడ్డున్న యెడల వానిని వేడినీట కడుగవలయును. చేట, చర్మము, ఱోకలి, ఱోలు, ముతుక బట్టలు, ప్రోక్షణ చేసిన శుద్ధి గల్గును. నారబట్టలు, నీరు మట్టి (చవుడుమన్ను) ఎండ బెట్టుట అనువానిచే పరిశుద్ధములు అగును. గొర్రె ఉన్నితో నేసిన బట్టలు (ముదుకగా ఉన్న బట్టలు) ఆవాలముద్ద, నువ్వులముద్దచే శోధనము సేయవలెను. దట్టమైన నూలుబట్టలు గూడ పూర్వోక్త రీతిగానే స్వచ్ఛములగును. కఱ్ఱ, దంతములు, ఎముకలు, కొమ్ములు అనునవి నీటితో కడిగినను భస్మముతో తోమినను శుద్ధములగును. అంటు కుండలు మరల వంటకు పనికిరావు. తోమి వంటచేయవలెను. బ్రహ్మచారి, సన్యాసి మొదలగు వారి భిక్షాన్నము, వడ్రంగి (శిల్పి) హస్తము, బజారువస్తువులు, స్త్రీ ముఖమును శుద్ధములు. బాటలోపడి ఉన్నది, తెలియకుండ స్పృశించినది. (త్రొక్కినది), దాసిచే తోముబడినది అదిలో పరిశుద్ధమే. చిరకాలమయినను, వస్తు సమృద్ధితో చేరిన అశుచియైన అల్పవస్తువుగూడ పరిశుద్ధమే.
స్థానభ్రంశము పొందని వెంట్రుక ముసలివాండ్రు రోగాదిపీడితులు చేసినపని, సత్కర్మమరిగిన ఇండ్లు, వాకిండ్లు, స్త్రీ యొక్క పాలిండ్లు పవిత్రములు. ప్రవాహోదకము, వాసనలేని నీరు పరిశుద్ధము. భూమి కాలముచేతను, అగ్ని దాహముచేత, ఉదకము మార్జనముచేత, ఆవులు త్రొక్కుట చేత పవిత్రమగును. గృహము అలుకుట, నీట తడుపుట, నీళ్ళు చల్లుట వలన శుచి అగును. వెంట్రుకల పురుగులచే దూషిత మయినపుడు, ఆవువాసన చూచినప్పుడు, ఈగలు వ్రాలినపుడు అన్నము, మట్టి, నీరు భస్మములను ఇంచుక చిమ్ముట వలన శుచి అగును. చింతపండు రసముచేత మేడి కర్రతో జేసిన పాత్రలు తగరపు సీసపుగిన్నెలు చింతపండు రసముచేతను కంచుగిన్నెలు బేడిద నీరు చేతను శుద్ధి చెందును. ద్రవపదార్థము అశుచియైనతఱి కొంచెము క్రింద పోయుటవలన పవిత్రమగును. అపవిత్ర వస్తువులతో కూడిన ద్రవ్యము మట్టి నీరువలనను, వాసన పోవుదాక తోముట వలనను పవిత్రమగును. మఱి ఇతర వస్తువులు వానిరంగు వాసనను తొలగించిన శుభ్రములగును. చండాలుడు పచ్చి మాంసము తినువాడు తెచ్చిన మాంసము, శుచి, దుకాణము నుండి తెచ్చిన నూనె, గోవునకు తృప్తి గూర్చిన నీరు (ఆవులు త్రావినది) ధూళి, అగ్ని గుర్రములు గోవులయొక్క నీడ కిరణములు, గాలి, భూమి, నీటి చినుకులు ఈగలు మొదలయిన దుష్ట వస్తుస్పర్శ పొందినను మైలపడవు. మేకలు గుర్రములు ముఖముచే పవిత్రములు” (221)