బ్రహ్మ మహా పురాణము

విష్ణు మార్కండేయ సంవాదము

భగవంతుడట్లు మార్కండేయునిచే వినుతింపబడి, మధుర గంభీరముగ ఇట్లనియెను. నీమనసునగల కోర్కెయేమి? తెలుపుము. అదెల్ల ఇచ్చెదను అనగా ముని ఆ దేవునియెడ మనసు నిలిపి ఇట్లనియె.

స్వామి తామెవ్వరో నీ మాయ యెట్టిదో నీ దయచే నెఱుగకోరెదను. నా జ్ఞాపకశక్తి పోలేదు. నీ ఉదరమందు మేమి వింతలు కంటినో అవి నా మనసులో మెదలుచున్నవి. ఇచట చిన్ని శిశువునై అడుకొనుచున్నావు. ఈ జగత్తెల్ల నీ గర్భమందు ఎందులకు ఉన్నది. ఎంతకాలమిచ్చట ఉందువు. దేవేశ! విస్తరముగ తెలుపుము. నేను తెలుసుకొనవలెనని కోరుచున్నాను. నేను చూచినది ఊహకు అందునది గాదు అని అనగా దేవదేవుడు ఓదార్చుచు ఇట్లనియె! ‘వేల్పులు కూడ నన్ను అచ్చముగ తెలియలేరు. నీకు ప్రీతి కూర్చుటకు తెల్పెదను. నీవు పితృభక్తుడవు. నన్ను శరణందితివి. నీ బ్రహ్మచర్య దీక్ష చూచియున్నాను. ‘నారములు’ అనగా నీరు ‘ఆయనము’ అనగా స్థానముగాగలవాడను కాన నారాయణుడను. నేనే జగత్కారణము. నాకు నాశములేదు. విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు, కుబేరుడు, యముడు, సోముడు, కశ్యప ప్రజాపతి, యజ్ఞము నేనే. ‘నాకు అగ్ని ముఖము, భూమి పాదము, సూర్యచంద్రులు నేత్రములు’ అని ఈ విధముగా తన తత్తమును విస్తారముగా తెలియచేసెను.

ఇట్లు వానికి వేయి యుగములు ముగియగానే స్వామి ‘మఱియేమి కోరెదవన’ ఆ పురాణముని ఇట్లనియె. నీ దయచే లోకహితముగోరి భేద భావము నశించుటకు శివ వైష్ణవవాద భేదము లంతరింప జేయుటకు ఇక్కడ శివాలయము నిర్మించెదను. అందు నీ క్షేత్రమున శంకర ప్రతిష్ఠ జేసెదను. హరిహరులొక్కటే అని లోకమెఱుగునుగాక’ అని జగన్నాధుడు భువనేశ్వర రూపమైన లింగము జగత్కారణము. నా ఆజ్ఞనుగొని వెంటనే ఇట నీశ్వరుని ప్రతిష్ఠింపుము. మా ఇర్వురకు అంతరములేదు. లోకము ఈ విషయమును ఎఱుగక వాదులాడును. నా ఆలయమిది నీ పేర నిర్మించుము. దానికి ఉత్తరముగ మార్కండేయ ‘హ్రదము’ అను పేరనొక తీర్థముకూడ నేర్పడును. అది సర్వ పాపహరమగును. అని సర్వ వ్యాపియైన జనార్దనుడు పల్కి తిరోహితుడయ్యెను. (56)