మార్కండేయ వృత్తాంతము

బ్రహ్మ ఇట్లు అనియె -

మార్కండేయుడు ఆ పాపని కడుపు నందుండి వెడలి వెలుపల ఒక్కటే సముద్రమయిన భూమిని నిర్జనమయిన దానిని దర్శించెను. మున్ను చూచిన ఆ బాలుని కూడ మర్రికొమ్మపై వటపత్ర పర్యంకమున నున్న శిశువును గాంచెను. శ్రీవత్స చిహ్నము ఉరమున దీపింప పీతాంబరము ధరించి ఆ పద్మపత్ర లోచనుడు జగత్తును చేకొని ఉన్నట్లు దర్శించెను. ఆ బాలుడు కూడ తన ముఖమునుండి వెడలి, ఆ మహార్ణమున తేలి చేష్టలు తక్కియున్న ఆ మునిని జూచి ‘వత్సా! నా కడుపునందు ప్రవేశించి విశ్రమించితివా? అందిటునటు పరిభ్రమించి ఏమీ వింత జూచితివి? ఓ మునిశ్రేష్ఠా! నాకు భక్తుడవు. నా అండ చేరితివి. అలసితివి. కావున నీకు ఉపకారము చేయ సంభాషించుచున్నాను. నావంక చూడుమని మెల్లగానవ్వుచు భగవంతుడనెను.

ఆ మాటవిని ఉప్పొంగి ఒడలు గగుర్పొడవ, ఈకన్నులచే కనరాని దివ్య రత్నాలంకృతుడయిన అమ్మేటి వేల్పుని మార్కండేయుడు దర్శించెను. అంత ఆముని తదనుగ్రహమున మిగుల ప్రసన్నమై మరల క్రొత్త సొగసును పొంది ఆవిర్భవించెను. ఎఱ్ఱని వ్రేళ్ళు గల ఆమేటివేల్పు అడుగుల తలవాల్చి వ్రాలి సురవంద్యములయిన ఆ పాద ద్వంద్వమునకు బ్రణమిల్లి హర్ష గద్గదములైన మాటలతో కృతాంజలియై ఆనందభరితుడై అచ్చెరువొందుచు మరిమరి చూచి ఆపరమాత్మను స్తుతించుట ఆరంభించెను.

మార్కండేయ కృతస్తవము-దేవదేవ! మాయాబాలమూర్తిధర! పద్మాక్ష! దుఃఖితుడనై శరణొందిన నన్ను రక్షింపుము. ప్రళయకాలాగ్నికి ఉడికిపోయితి, నిప్పుల వర్షమునకు జడిసిపోతిని. ప్రళయ ప్రచండ వాయువునకు అరిపోతిని. అలసి విహ్వలుడనయి ప్రళయావర్తమునకు అదిరిపోయి శాంతిని కనజాలకున్నాను. ఆకలి దప్పులకు వశుడనైతిని. పురుషోత్తమా నేనొక రక్షనిందు కననైతిని. రక్షింపుము. ఈ ఏకార్ణవ ప్రళయమందు చరాచరము సురిగిపోయిన ఈ ఘోరదశయందు-అంతుదరి కనలేకున్నాను. దేవేశ! నీ ఉదరగోళమున చరాచర ప్రపంచమును కంటిని. ఆశ్చర్య విషాదములను పొందుచున్నాను. దిక్కులేని ఈ సంసారమున-పరమేశ! ప్రసన్నుడవు కమ్ము. ఓ వేల్పుమేటి! ప్రసాదము చూపుము. దేవనాధ! అనుగ్రహింపుము. జగత్కారణులకు కారణుడవు. నీవు పంచభూతములు. అహంకారము నీవు. మహత్తత్వము బుద్ధి నీవు. ప్రకృతివి. సత్వాది గుణత్రయము నీవు. నీవు దిక్పాలురవు. అష్టవసువులు నీవు. ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, గంధర్వులు, దేవదానవులు, మరుత్తులు, పితృ దేవతలు, వాలఖిల్యాదులు, ప్రజాపతులు, సప్త ఋషులు, అశ్వినులు, మరి మనసుకు మాటకు అందని అశేష జీవ సంతతి బ్రహ్మాది స్తంభపర్యంత భూత భవ్య భవిష్య జ్జాలము నీ రూపము. అంతకును మీదనున్న కూటస్థుడవు నీవు. బ్రహ్మాదులు నిన్నెరుగరు. అల్ప మేధసులు నీ జాడను ఎట్లెరుగ గల్గుదురు. నీవు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడవు. ప్రకృతికి ఆవల ఉండువాడవు. అవ్యక్తుడవు. అనంతుడవు. అంతట ఉన్నవాడవు. ఆకాశమువలె శాంతుడవు.

ఇట్లు నిర్గుణుడు, నిరంజనుడు అయిన నిన్ను ఎవ్వరు స్తుతింపగలరు. మనసు చెదిరిన అల్పమతినయిన నేను నిన్ను స్తుతించితిని. ఇదెల్ల క్షమింప అర్హుడవు. ఓ అవ్యయ! దేవదేవేశ! వందనము. (55)