బ్రహ్మ మహా పురాణము

విష్ణు భక్తులు ఉత్తమ గతులను పొందు విధము

ఆశ్చర్యకరమును సర్వపాపహరమును పుణ్యకరమును ధన్యత కలిగించునదియు సంసారబంధ నాశనమునగు శ్రీకృష్ణ మాహాత్మ్యమును మేము వింటిమి. చాల సంతోషమైనది. ఓ మహామునీ! మానవులు వాసుదేవుని అర్చించుట యందు ఆసక్తులయి భక్తితో విధివిధానమున అతని అర్చించువారు ఏగతిని పొందుదురు? స్వర్గమునా? మోక్షమునా? రెంటినా? మా ఈసంశయమును ఛేదించుము. ఓ ముని శ్రేష్ఠా! అందులకు నీవు తప్ప సమర్థులు మఱెవ్వరును లేరు” అని మునులు వ్యాసుని అడిగిరి.

“ముని శ్రేష్ఠులారా! వైష్ణవులకు సుఖము కలిగించు మీ ప్రశ్నకు సమాధానమును వినుడు. నరులు కృష్ణుని దీక్షా మాత్రముచేతనే ముక్తి పొందుదురు. ఎల్లప్పుడును భక్తితో అ అచ్యుతుని పూజించువారి విషయము చెప్పవలసినదేమి? ఓ మునిసత్తములారా! వారికి స్వర్గముకాని మోక్షముకాని దుర్లభముకాదు. వైష్ణవులు తాము కోరిన కోరికలు ఎంత దుర్లభములైనను పొందగలరు. రత్న పర్వతము నెక్కినవారు రత్నముల వలెను కల్పవృక్షము నాశ్రయించి ఫలములు కోసికొన్నట్లును వారు జగద్గురుడగు వాసుదేవుని విధిని అనుసరించి అర్చించినందులకు ఫలముగా ధర్మ అర్థ కామ మోక్ష ఫలములను పొందుదురు. జగన్నాథుని విశుద్ధమగు అంతఃకరణముతో ఆరాధించిన మానవులు దేవతలకును దుర్లభములగు కామితములు పొందుదురు. సర్వ పాపహరుడును సర్వకామిత ఫలములను ఇచ్చువాడును అగు శ్రీహరిని అర్చించు నరులు లోకమున ధన్యులు. ఏలయన బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులును కడజాతివారును స్త్రీలును ఆ దేవశ్రేష్టుని అర్చించుటచే ఉత్తమగతిని పొందుదురు. కనుక ఓ మునులారా! అట్టి మహనీయులు పొండు ఉత్తమగతిని సంగ్రహముగా చెప్పెదను. వినుడు.

రోగములకు ఆశ్రయము అస్థిరము జరామరణ యుక్తము నీటిబుడగతో సమము మాంస రక్తముల దుర్గంధము కలది మలమూత్రాదియుక్తము ఎముకలనెడి కట్టుకొయ్యలతో కూర్చబడినది అపవిత్రము నులినరములతో చర్మముతో రక్తనాళములతో కూడినది అగు మానవదేహమును విడిచి సంకల్పముతో నడచునది, దివ్యగంధర్వుల సంగీతముతో కూడినది లేత సూర్యుడువలె ప్రకాశించునది, చిఱు మువ్వల గుత్తుల మాలలు కలది అగు విమానము నెక్కి గంధర్వులు గానము చేయుచుండ అప్పరలు అలంకరించుచుండ వేరువేరుగా ఆయా లోకపాలుర లోకములకు పోవుదురు. ఒక్కొక్క లోకమున ఒక్కొక్క మన్వంతర కాలము సర్వ భోగములను అనుభవించి వారు అంతట సర్వ సుఖప్రదమగు అంతరిక్ష లోకమునకు వత్తురు. అచ్చట శ్రేష్ఠమగు భోగములు పదిమన్వంతరముల పాటు అనుభవించి అక్కడనుండి గంధర్వ లోకమునకు పోయి ఇరువది మన్వంతరముల పాటు మనోహరములగు భోగములను అనుభవింతురు. అచటినుండి ఆదిత్యలోకములకు పోయి ఇరువది మన్వంతరములపాటు మనోహరములగు భోగములను అనుభవింతురు. అచటి నుండి ఆదిత్య లోకములకు ఏగి అచ్చట చక్కగా పూజలనందు కొనుచు ముప్పది మన్వంతరముల కాలము దేవతలకును దుర్లభములగు భోగములను అనుభవింతురు. అటనుండి సుఖప్రదమగు చంద్రలోకమునకుపోయి నలువది మన్వంతరములు, అటనుండి నక్షత్ర లోకమున ఏబది మన్వంతరములు, దేవలోకమున అఱువది మన్వంతరములు అటనుండి ఇంద్రలోకమున డెబ్బది మన్వంతరములు అటనుండి ప్రజాపతి లోకమున ఎనుబది మన్వంతరములు జరామరణములు లేక ఉత్తమములగు భోగములను అనుభవించి బ్రహ్మ లోకమునకు పోవుదురు.

ఇట్టి వైష్ణవులు బ్రహ్మలోకమున తొంబది మన్వంతరములు సమస్త సుఖములను అనుభవించి మరల ఈ భూ లోకమునకు వచ్చి బ్రాహ్మణులలో ఉత్తమ వంశమున యోగులుగా వేదశాస్త్రార్థ సారము నెఱిగిన బ్రాహ్మణులుగా జన్మింతురు. మరల క్రమ క్రమముగా పైకి పైకి పోవుచు ప్రతి జన్మమునందును నూఱేసి సంవత్సరములు జీవించి యథేప్సితములగు భోగముల ననుభవించి లోకాంతరమునకు పోవుదురు. ఇట్లు పది జన్మములైన తరువాత వారు బ్రహ్మ లోకమునుండి దివ్యమగు విష్ణులోకమునకు ఏగుదురు. అచ్చట నూరు మన్వంతరముల కాలము సర్వ గుణములతో కూడిన అక్షయభోగములను అనుభవించి జన్మమరణములు లేనివారయి వారాహమూర్తి యొక్క లోకమునకు ఏగుదురు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! ఈ వైష్ణవులు అచ్చట మహాబలము చతుర్బాహువులు కలదియగు దివ్యమగు మహాశరీరము కలిగి సర్వదేవతల నమస్కారములు అందుకొనుచు పదివేలకోట్ల సంవత్సరములు ముక్తి సుఖము అనుభవించుచుందురు. అచనుండి నరసింహదేవుని గృహమునకు ఏగి పదివేలకోట్ల సంవత్సరములు విహరించి తదంతమున విష్ణు లోకమునకు పోయి అచ్చటను అనేక కోట్ల సంవత్సరములు ఆనందింతురు. తరువాత ఈ సాధకోత్తములు బ్రహ్మలోకమున నూర్ల కోట్ల సంవత్సరములు అనేకములు ఆనందించి నారాయణుని పురమునకు ఏగి అర్బుదముల కోట్ల సంవత్సరములు ఉండి యానందించి దివ్య రూపులై మహాబలులై సురాసురుల స్తోత్రములందుకొనుచు అనిరుద్ధుని పురమున జరామరణములు లేక పదునాలుగు వేలకోట్ల సంవత్సరములుండి ఏ సంతాపములును లేక ప్రద్యుమ్నపురమునకు పోయి అచట మూడు వందల లక్షల కోట్ల సంవత్సరములు సుఖింతురు. తరువాత ఈ యోగులు బలశక్తితో కూడి స్వచ్ఛంద గమనము కలవారగుచు సంకర్షణ లోకము చేరి అచట చాలకాలము సహస్ర విధములగు భోగముల ననుభవించి సర్వ మోక్షమును పొంది సర్వదోష రహితము జరామరణ రహితమునగు వాసుదేవ నామముగల పరతత్త్వము నందు ప్రవేశింతురు. ఇది నిశ్చయము. ఓ ముని శ్రేష్ఠులారా! వాసు దేవార్చనమున ఆసక్తులు పొందు ఫలములు సుఖములు ఇట్టివి.