విష్ణుమహిమ గానమునకు ఫలము

రెండు పక్షములందును ఏకాడశీ తిథినాడు ఉపవసించి శ్రద్ధాయుక్తుడై లెస్సగా విధానానుసారము స్నానమాడి మడుగువస్త్రము ధరించి జితేంద్రియుడై విధివత్ గా శ్రద్ధతో మనస్సు నిలిపి విష్ణుని పుష్పములతో బహు విధములగు ఉపచారములతో జప హోమ ప్రదక్షిణములతో నానావిధములగు స్తోత్రములతో దివ్యములు మనోహరములు అగు గీత వాద్యములతో నమస్కారములతో ఉత్తమములగు జయశబ్దములతో పూజించి రాత్రి యందు జాగరణముచేసి విష్ణుని యందు పరమ శ్రద్ధ కలిగి ఆ మహనీయుని కథలనో గీతికలనో గానము చేసినచో నరులు విష్ణుని స్థానమును పొందుదురు. ఇది నిశ్చయము” అని వ్యాసుడు పలికెను.

“ఓ వ్యాస మహామునీ! జాగరణము చేసి గీతికాగానము చేయుట వలన కలుగు ఫలమును వినగోరుచున్నాము” అని మునులు అడిగిరి.

“ఓ ముని శ్రేష్ఠులారా! ప్రజాగరము చేసి విష్ణు మహిమ గానము చేయుటవలని ఫలమును క్రమముతో చెప్పెదను వినుడు.

భూ లోకమున ప్రసిద్ధి పొందిన అవంతీ నగరమున శంఖ చక్ర గదాధరుడగు విష్ణువుకలడు. ఆ నగరము చివరలో గానమున నేర్పరియగు ఛండాలుడు కలడు. అతడు సద్వృత్తితో ధనమార్జించి తన సేవకులను పోషించుచుండును. అతడు విష్ణుభక్తుడై ప్రతి మాసమునను దృఢవ్రతుడై ఏకాదశినాడు ఉపవసించి రాత్రి జాగరణము చేసి విష్ణుని అవతారములను గూర్చి అతని నామముచే అంకితములగు గీతికలను సప్త స్వరప్రస్తార యుక్తములగు గానము చేయును. ప్రాతః సమయమున ద్వాదశీ తిథిలో విష్ణునికి నమస్కరించి స్వగృహమునకు వచ్చి తన కూతుళ్లు, అల్లుండ్రు, మేనల్లుండ్రు పరివారము-వీరిని భుజింపజేసి తరువాత తాను భుజించును. ఇట్లు విష్ణు ప్రీతిని కలిగించుచు జీవించు అతనికి చాలవయస్సు గడచెను. ఇట్లుండ ఒకప్పుడు చైత్ర కృష్ణ ఏకాదశినాడు విష్ణుసేవకై అతడు భక్తి తత్పరుడై పూలు తెచ్చుటకై ఉత్తమ వనము0నకు పోయి క్షిప్రానది ఒడ్డున కలి వృక్షము క్రిందనున్న ఒక రాక్షసునకు కనబడెను. ఆ రాక్షసుడు ఈ చండాలుని తిన గోరెను. నీవు నన్ను ఈనాడు తినవలదు. నేను రేపు మరల నిజముగా వత్తును. నేను ఈనాడు పూజ చేసికొనవలయును. కాన రాక్షసా! నన్ను విడువుము. రాత్రి జాగరణము చేసి నేను విష్ణుని సేవింతును. నాకు వ్రత విఘ్నము చేయవలదు అని చండాలుడు రాక్షసుని వేడెను.

ఓ చండాలుడా! పదినాళ్ళు నాకు ఆహారము లేక ఈనాడు నీవు నాకు దొరకితివి. నాకు చాల ఆకలిగా ఉన్నది. నేను నిన్ను విడువను. భక్షింతును అని పలికిన రాక్షసుని బ్రతిమాలుచు, చండాలుడు దృఢములగు సత్యవచనముల ఇట్లు పలికెను:

బ్రహ్మ రాక్షసా! వినుము. జగత్తునకు అంతటికి సత్యమే మూలము. నేను మరల వత్తునని సత్యముతో శపథము చేయుచున్నాను. నరుడు చేయు పనులకు సూర్య చంద్రులు అగ్నివాయువులు, భూమ్యాకాశములు జలము మనస్సు అహోరాత్రములు యముడు ప్రాతః సాయం సంధ్యలు సాక్షులు. నేను మరల నీ దగ్గరకు రానిచో పరదార ధనములందు ఆసక్తి బ్రహ్మహత్య సురాపానము గురుదార గమనము గొడ్రాలికి శూద్ర స్త్రీకి పతి అగుట పూజారితనము చేప, పంది, తాబేలు వీని మాంసము తినుట నిష్కారణముగా మాంసము తినుట, వెన్ను మాంసము తినుట, కృతఘ్నత మిత్ర ద్రోహము, మారుమనువాడిన స్త్రీని పెండ్లాడుట, సూతకము కలుపుకొనుట క్రూరకర్మలు చేయుట పిసినిగొట్టుతనము అతిథులను ఆదరింపకుండుట అమావాస్య అష్టమి షష్ఠీ కృష్ణ శుక్లపక్ష చతుర్దశులు-ఈ తిథుల యందును శ్రాద్ధముచేసిన తరువాతను స్త్రీతో సంగమించుట, బహిష్ఠుఐన స్త్రీని కలియుట, మిత్రుని భార్యను పొందుట, చాడీలు చెప్పుట, కపటము, మోసము చేయుట, తేనెను దొంగిలించుట, బ్రాహ్మణునికి దానమిత్తునని ఒప్పుకొనినది ఈయకుండుట, కన్యను గోవును కంచరగాడిదను ఇత్తునని ఈయకుండుట, స్త్రీ బాలవధ, అసత్యమాడుట, వ్యర్థముగా మాటలాడుట, దేవతలను వేదములను ద్విజులను రాజులను పుత్రులను మిత్రులను పతివ్రతలను గురువులను నిందించుట, అగ్ని హోత్రము విడుచుట, నిప్పు పెట్టుట, గృహేష్టి చేయుట, ద్విజాధముడై గోవధ చేయుట, భ్రూణవధ, తమ్మునకు పెండ్లి ఐన తరువాత తాను పెండ్లాడుట, అన్నకంటె ముందు తాను పెండ్లాడుట వలన కలుగు పాపములు నేను మరల నీకడకు రానిచో నాకు తగులును. ఇంకను భయంకర శపథము వినుము. నేను తిరిగిరానిచో తన కన్యపై జీవించుట సత్యమును మఱుగుపఱచి సాక్ష్యము పలుకుట, యాగము చేయింపరాని వానిచే యాగము చేయించుట, నపుంసకుడగుట, శ్రవణము చేయరానివానినుండి శాస్త్ర శ్రవణము చేయుట, శ్రవణము చేయదగని వానికి శాస్త్రముల శ్రవణము చేయుట, సన్యాసికాని బ్రహ్మచారికాని కాముకుడై ప్రవర్తించుట-వీనివలన కలుగు పాపముల పొందుదును అని చండాలుడు రాక్షసునకు శపథము చేసెను.

బ్రహ్మ రాక్షసుడు చండాలుని మాటవిని ఆశ్చర్యపడి ఈ సత్య శపథముతో వెళ్ళి అన్నమాట కాపాడుము అనెను. ఆ చండాలుడును పుష్పములు తీసికొని దేవాలయమునకు పోయి బ్రాహ్మణునకు ఇచ్చెను. అతడవి నీటితో కడిగి విష్ణుని అర్చించి తన ఇంటికి పోయెను. చండాలుడు ఆనాడు ఉపవసించి గుడివెలుపలనుండి విష్ణు గీతుల పాడుచు రాత్రి జాగరము చేసెను. తెల్లవారగనే అతడు స్నానమాడి విష్ణునికి నమస్కరించి తన సత్యమును కాపాడుకొనుటకై రాక్షసుని దగ్గరకు బయలుదేరెను. త్రోవలో తనకెదురైన ఒకనరునకును చండాలునకును ఇట్లు సంభాషణము జరిగెను.

నరుడు ‘నాయనా! ఎక్కడకు పోవుచున్నావు?”

చండాలుడు తనకు రాక్షసుని విషయమున జరిగినదంతయును చెప్పెను.

నరుడు: ‘ధర్మ అర్థ కామ మోక్షములకు శరీరమే సాధనము. కావున వివేకవంతుడు మహాప్రయత్నముతో నైనను శరీరము రక్షించుకొనవలెను. జీవించినచో కీర్తియు లభించును. మరణించిన వాని మాట ఎవడు తలచును?”

చండాలుడు యుక్తి యుక్తముగా ఇట్లనెను. ‘అయ్యా నేను చాల శపథములు చేసితిని. సత్యము కాపాడుటకై నేను పోవుచున్నాను.

నరుడు ‘నీవు ఇట్లు మూఢబుద్ధివై ఉన్నావేమి? ఓ సత్పురుషుడా! గోవులను స్త్రీలను ద్విజులను రక్షించుటకును వివాహము విషయమునను సురత సందర్భమునను ప్రాణములును సర్వధనమును పోవుచున్నప్పుడును అసత్యమాడుట పాతకముగాదు. స్త్రీల విషయమున వివాహ సందర్భమునను శత్రువు విషయమునను మోసము ధనహాని ఆత్మనాశము జరుగునప్పుడును, ఇతరులు అసత్యము చేయునప్పుడును ధర్మ వాక్యములను పాటించరాదు అని మనువు చెప్పినది నీవు వినలేదా?”

ఛండాలుడు ‘అయ్యా! అట్లు పలుకకుము. సత్యము లోకములందు పూజింపబడును. లోకమందలి సర్వ సౌఖ్యములును సత్యముచే లభించును. సత్యముచేతనే సూర్యుడు వెలుగును. నీరు ప్రవహించును. అగ్ని జ్వలించును. గాలి వీచును. చతుర్విధ పురుషార్థములు సత్యము చేతనే లభించును. సత్యము పర బ్రహ్మము. ఉత్తమ యజ్ఞము, స్వర్గము నుండి వచ్చినది సత్యము, సత్యమును విడువరాదు”.

అని ఇట్లు పలికి ఆ చండాలుడు ఆ నరుని వదలివేసి ప్రాణి ఘాతుకుడగు ఆ బ్రహ్మరాక్షసుడున్న చోటికి పోయెను. వాడు ఆశ్చర్యముతో కన్ను విప్పారించి తల ఆడించుచు ఇట్లు పలికెను. ‘సత్య వాక్యమును అనుపాలించిన ఓ మహాభాగా! మేలు మేలు! సత్యమే లక్షణముగా గల నీవు చండాలుడవు కావని నా అభిప్రాయము. నీవు చేసిన ఈ పనిని బట్టి నీవు శుచియై అవ్యయుడగు ఏ వికారమును లేని బ్రాహ్మణుడవే. శుభ స్వరూపుడవగు నీతో ధర్మమును గూర్చి కొంచెము మాటలాడెదను. నీవు రాత్రి విష్ణ్వాలయమున ఏమి చేసితివో చెప్పుము.’ చండాలుడు ఇట్లు పలికెను. ‘వినుము. రాత్రికాలమున విష్ణ్వాలయమున నేనేమి చేసితినో ఉన్నది ఉన్నట్లు చెప్పెదను. ఆలయమునకు దిగువ వినయముతో వంగియుండి నిలిచి రాత్రి అంతయు ప్రజాగరము చేసి విష్ణు గీతికలు గానము చేసితిని. రాక్షసుడు నీవు భక్తితో ఎంతకాలము ఆలయమున జాగరణము చేసితివి?’ అనెను. ప్రతిమాసము నందును ఏకాదశీ తిథులందు ఇరువది సంవత్సరములు జాగరణము చేసితిని అని చాండాలుడు నవ్వుచుపలికెను. అదివిని బ్రహ్మ రాక్షసుడు నీవు ఒక రాత్రి ప్రజాగరము చేసి పొందిన ఫలము నాకిమ్ము. అట్లేననే కాని నేను నిన్ను విడువను అని పలికెను. ఓ రాక్షసుడా! నా దేహము నీకు అర్పించితిని. మాటలతో పనియేమి? స్వేచ్ఛగా నన్ను నీవు తినుమని చాండాలుడు పలికెను. అయ్యా! దయతో నీవు రెండు జాములు ప్రజాగరము చేసి సంగీతము పాడి సంపాదిచిన ఫలమునైన ఇమ్మని రాక్షసుడు బ్రతిమాలెను. అసంబద్ధముగా ఏల మాటాడెదవు? నేను జాగరణ ఫలమును ఈయను. స్వేచ్ఛగా నన్ను నీవు తినుమని చండాలుడనెను. ఆ మాటవిని బ్రహ్మ రాక్షసుడు ఇట్టనెను; ఏమందుడగు దుష్టబుద్ధి ధర్మకర్మలచే రక్షితుడవగు నిన్ను చూచుటకుగాని బెదరించుటకుగాని పీడించుటకుగాని శక్తి కలవాడు అగును? అదికాక దీనుడు పాపగ్రస్తుడు విషయసుఖములచే మోహము పొందినవాడు నరక యాతనలచే పీడింపబడు వాడు మూఢుడు అగువాని విషయములో సత్పురుషులు దయ చూపుదురు. ఇట్టి నా మీద నీవు దయచూపి ఒక జాము జాగరణముచేసి సంపాదించిన ఫలమునైన ఇమ్ము. లేదా నీ ఇంటికి మరలిపొమ్ము. నీకు యామప్రజాగరణ ఫలమును కూడ ఈయను. ఇంటికిని మరలిపోను అని చండాలుడనెను. రాత్రి చివరలో వినోదార్థము పాడిన పాట ఫలమునైన ఇచ్చి నన్ను పాపము నుండి సముద్ధరింపుము అని బ్రహ్మరాక్షసుడు బ్రతిమాలెను. అది విని నీవు పూర్వము ఏ వికృత కర్మముచేసి ఆ దోషరాశిచే ఇట్లు బ్రహ్మరాక్షసుడవైతివని చండాలుడు అడుగగా విని వాడు దుఃఖముచే సంతప్తుడగుచు తానుచేసిన దుష్కృతమును జ్ఞాపకము చేసికొనుచు ఇట్లు పలికెను:

నేను పూర్వము ఎవడనో ఏమి పాపము చేసినందున రాక్షసుడనై పాపయోని యందు జన్మించితినో చెప్పెదను వినుము. సోమయాజియు వేదాధ్యయనము చేసినవాడు అగు దేవశర్మయను బ్రాహ్మణుని కుమారుడగు సోమశర్మ అనువాడనుగా ఉంటిని. యజ్ఞోపవీత ధారణమునకు వేదమంత్ర గ్రహణమునకు అధికారము లేకయు యజ్ఞకర్మ చేయవలెనను ఆసక్తి కల ఒక యజమాని యజ్ఞకర్మను జరిపించుటయందు శ్రద్ధ వహించి లోభముచే, మోహముచే బాధింపబడిన వాడనగుచు అగ్నీధ్రుడుగా (అగ్నీధ్రము అను స్థానమున నుండు ఋత్విక్ గా) ఉంటిని. అ యజమానుని అ యజ్ఞము ముగియగానే మూర్ఖుడనై ద్వదమును అవలంబించి, ద్వాదశాహ (పండ్రెండు) మను హవిస్సులతో చేయదగిన-మహాక్రతువును చేయింప నారంభించితిని. అది జరుగుచుండగా నాకు కడుపునొప్పి కలిగెను. అప్పటికి పదినాళ్ళు మాత్రము గడచెను. యజ్ఞము ముగియలేదు. రాక్షస సమయమునందు విరూపాక్షునకు ఆహుతి ఈయబడుచున్న సమయమున నేను మరణించి ఆ దోషముచే బ్రహ్మరాక్షసుడ నైతిని. మూర్ఖుడనై మంత్రము సూత్రము స్వరము సరిగ తెలియక యజ్ఞవిద్య తెలియక యజ్ఞము చేయుటచే, చేయించుటచే, ఆ దోషమున బ్రహ్మ రాక్షసుడనైతిని. కనుక ఇట్లు పాప మహాసముద్రమున మునిగియున్న నన్ను నీ జాగరణములో కడపటి ఒక పాటయొక్క ఫలమునైన దానముచేసి ఉద్ధరింపుము అని బ్రహ్మరాక్షసుడు వేడెను. నీవు ఇకనుండి ప్రాణివధను మానుకొందువేని నా కడపటి పాట ఫలమిత్తునని చండాలుడనగా బ్రహ్మ రాక్షసుడు అంగీకరించెను. తన జాగరణములో కడపటి సగము జాములో పాడిన పాట ఫలమును చండాలుడు వానికి దానము చేసెను. వెంటనే వాడును చండాలునికి నమస్కరించి తీర్థ శ్రేష్ఠమగు పృథూదక తీర్థమునకు పోయి అక్కడ సంకల్పపూర్వకముగా ఆహారము విడిచి ప్రాణములు విడుచుటతో ఆ చండాలు డిచ్చిన గీతికా ఫలబలముచే రాక్షసత్వము నుండి విముక్తుడయ్యెను. పృథూదక తీర్థప్రభావమున పదివేల ఏండ్లు దుర్లభమగు బ్రహ్మలోకమున నిరంతరముగా నుండి పిమ్మట పూర్వ జన్మస్మృతియు ఇంద్రియ నిగ్రహమునుగల బ్రాహ్మణుడై జన్మించెను. ద్విజులారా! అతని కథను మీకు మరల చెప్పెదను.

చండాలుని కథాశేషమును చెప్పెదను వినుడు. బుద్ధిశాలియు శుచియు అగు ఆ చండాలుడు అనంతరము తన ఇంటికిపోయి ఆ బ్రాహ్మణుని కథను తలచుకొనుచు వైరాగ్యము చెంది భార్యను కుమారులకు అప్పగించి కోకాముఖ క్షేత్రమునకు బయలుదేఱి కుమార స్వామి దర్శనమగువరకు భూ ప్రదక్షిణము చేసెను. కుమారస్వామిని, స్కందుని దర్శించి ధారాచక్రమును ప్రదక్షిణము చేసి పర్వతమును చేరి పాపప్రమోచన తీర్థమున స్నానముచేసి పాపవిముక్తుడై తన పూర్వ జన్మములు అనేకములు జ్ఞాపకము చేసికొనెను. ఆ జన్మపరంపరా విషయము ఇట్లున్నది ఈ చండాలుడు ఒక పూర్వ జన్మములో బుద్ధి శాలియు వేదవేదాంగములు కడవరకు నేర్చినవాడును, త్రికరణములయందు నిగ్రహము కలవాడును అగు భిక్షువుగా నుండెను. ఒకప్పుడు దొంగలు హరించుకొనిపోవుచున్న గోవులచే రేగిన ధూళిచే ఆ భిక్షువు యొక్క భిక్ష కప్పబడగా దానిని అతడు వదలివేసెను. ఆ అధర్మ దోషముచే ఆతడు చండాలుడై పుట్టెను. అతడు నర్మదా తీరము నందలి పాప ప్రమోచన తీర్థమున స్నానమాడిన పుణ్యమున, మరణానంతరము వారణాసియందు మూర్ఖుడగు బ్రాహ్మణ శ్రేష్ఠుడుగా పుట్టెను. అతడు ముప్పది ఏండ్ల వాడై ఉండగా అచటికి యోగమాయా బలము కలవాడును విరూపుడును అగు సిద్ధుడు సంచరించుచు వచ్చి ఇతనికి కనబడెను. అతనిని చూచి ఈ మూర్ఖ బ్రాహ్మణుడు ఉపహాసమునకై అతనికి నమస్కరించి ఓ సిద్ధపురుషా! కుశలమా! ఎక్కడినుండి వచ్చుచున్నావు? అని ప్రశ్నించెను. ఆ సిద్ధుడు తన్ను ఈతడు తెలిసికొనెనని తలచి స్వర్గము నుండి వచ్చుచున్నాను అనెను. స్వర్గమునందు నారాయణముని నుండి జన్మించిన అప్సరసయగు ఊర్వశిని ఎఱుగుదువా? అని మూర్ఖ బ్రాహ్మణుడడిగెను. ఆమె నారాయణముని నుండి జన్మించినది. స్వర్గమునకు ఆభరణము వంటిది. ఇంద్రునికి చామర గ్రాహిణి, ఇట్టి ఊర్వశిని నేనెఱుగక పోవుటేమి? అని సిద్ధుడనెను. ఆ మూర్ఖ బ్రాహ్మణుడును సరళ మార్గము విడిచి వక్ర మార్గమున ఇట్లనెను. ఓ మిత్రమా! నా మీద ఆదరము చూపి నా వృత్తాంతము ఊర్వశికి తెలిపి ఆమె చెప్పిన సమాధానమును నాకు వచ్చి చెప్పుమనెను. సిద్ధుడు సరే అనెను. విప్రుడు సంతసించెను. సిద్ధుడు మేరుపర్వత సానువు నందలి స్వర్గమునకు పోయి ఈ బ్రాహ్మణుడు చెప్పిన మాట ఊర్వశికి చెప్పెను. కాశీపతియగు బ్రాహ్మణుడెవరో నేనెఱుగను. కనుక నీవు చెప్పినమాట నిజమని నేననుకొనుటలేదు అని ఊర్వశి సిద్ధునితో పలికెను.

ఊర్వశి చెప్పిన ఈ మాటలు విని సిద్ధుడు వెడలిపోయి చాలాకాలము తరువాత మరల వారాణసికి పోయెను. అతనిని చూచి మూర్ఖ బ్రాహ్మణుడు ఊర్వశి ఏమి చెప్పెనని అడుగగా అమె తాను నిన్ను ఎఱుగనని సిద్ధుడు పలికెను. అది విని మూర్ఖ విప్రుడు చిరునవ్వు నవ్వి, ఈమాఱు పోయినప్పుడు నీవు అతనిని ఏ గుర్తుతో గుర్తింపగలవని ఊర్వశిని అడుగుమనగా సిద్ధుడును సరేయని స్వర్గమునకు పోయినప్పుడు ఇంద్ర భవనము నుండి బయటికి వచ్చుచున్న ఊర్వశిని చూసి మూర్ఖ బ్రాహ్మణుడు చెప్పిన మాట ఆమెకు చెప్పెను. అమె ఆ బ్రాహ్మణుడు ఏదైన నియమమును పూనినచో దానినిబట్టి అతనిని గుర్తింపగలననెను. ఆ మాటకు సిద్ధుడు మరల మూర్ఖ బ్రాహ్మణునితో చెప్పగా అతడును నేను ఇక మీదట శకటము భక్షింపను. ఇది నా నియమమని ఊర్వశితో చెప్పుమనెను. సిద్ధుడు సరే అని తాను మరల స్వర్గమునకు పోయినప్పుడు ఈ విషయము ఊర్వశితో చెప్పెను. ఇప్పుడు నేను అతనిని ఈ నియమమును బట్టి గుర్తింపగలను. ఆ మూర్ఖుడు నన్ను ఉపహాసము చేయుటకే ఇట్లు చెప్పెను అని పలుకుచు ఊర్వశి వెడలిపోయెను. సిద్ధుడును తన ఇచ్ఛానుసారముతో లోకసంచారము చేయుచుండెను. మహాసుందరి అగు ఊర్వశియు వారాణసికి పోయి దివ్య శరీరము ధరించి మత్స్యదరీతీర్థమున స్నానము చేయుచుండెను. ఆ సమయమున యాదృచ్ఛికముగ అచటకు వచ్చిన ఆ మూర్ఖ బ్రాహ్మణుడు అట్టి ఊర్వశిని చూచి కామముచే కలతనొందెను. అందుచే అతడు చేసిన చేష్టలను బట్టి మునుపు సిద్ధుడు చెప్పిన మూర్ఖవిప్రుడు ఈతడేయని ఊర్వశి గుర్తించి చిఱునవ్వు నవ్వుచు అతనితో ఓ మహాభాగా! నా వలన నీకు ఏమి కావలెనో చెప్పుము. నీ మాట ప్రకారము చేయుదును. నీవు నన్ను విశ్వసింపుము అనెను. నిన్ను నాకు అర్పణము చేసికొని ఓ సుందరీ! నా ప్రాణములను కాపాడుమని అతడనెను. నేను ఇప్పుడు వ్రత నియమము నందున్నాను. క్షణకాలము నా రాకకై వేచియుండుమని ఊర్వశి పలుకగా ఆతడు సరేయనెను. ఆమెయు స్వర్గమునకేగి ఒక మాసము తరువాత మరల వారాణసికి రాగా ఆ విప్రుడు కృశించి కనబడెను. ఆతడంతవరకును నిరాహారుడై నదీతీరమందే నిశ్చయముతో నుండెనని ఆమె తెలిసికొని వృద్ధురాలి రూపము ధరించి వచ్చి నదీతీరమున శర్కరతో తేనెతో నేతితో నిండిన శకటమును కావించి మత్స్యదరీ తీర్థమునకు పోయి స్నానమాడి ఒడ్డునకు వచ్చి శకటము కడ నిలిచి ఆ మూర్ఖ బ్రాహ్మణుని పిలిచి ఇట్లు పలికెను. ఓ విప్రా! నేను తీవ్రమగు వ్రతమును సౌభాగ్యము నిమిత్తము ఆచరించితిని. వ్రతాంతమున ఉద్యాపనమునకై ఇది దానము చేయుచున్నాను. ప్రతి గ్రహించుము అనెను.

అతడు ఇట్లనెను: ఇది ఏమి? లోకములో శర్కరతో నిండిన శకటము దానము చేయుదురా? ఓ పూజ్యురాలా! అకలిచే ఎండిన కంఠముతో ఉండి అడుగుచున్నాను. చక్కగా చెప్పుము అనగా ఆమె ఇట్లనెను. ఓ విప్రా! ఈశకటము శర్కరతోను పిండితోను నిండి ఉన్నది. దీనిని నీవు తీసికొని నీ ప్రాణములను తృప్తిని పొందించుకొనుము. ఆలస్యము చేయకుము. ఆ మాటవిని ఆతడు ఆకలితో బాధపడుచుండియు జ్ఞాపకము చేసికొని ఇట్లనెను. ఓ పూజ్యురాలా! నేను ఇది తీసికొనను. నేను సిద్ధవర్యునికడ శకటమును భక్షింపనని నియమమును ఊర్వశికి గుర్తుగా చేసితిని. కనుక దీనిని మఱి ఎవ్వరికైన దానము చేయుము అని చెప్పగా ఆమె ఇట్లు పలికెను. ఓ విప్రా! పూజ్యుడా! నీవు కొయ్యతో చేసిన శకటమును తిననని నియమము పూనితివి. ఇది కొయ్యతో చేసినదికాదు. శర్కరతో చేసిన శకటము. దీనినిని భక్షింపుము. నీవును ఆకలిచే చాల బాధనొంది యున్నావు” బ్రాహ్మణుడు ఇట్లు అనెను: నేను శకటము అని సామాన్యముగా పలికితిని. కాని దేనితో చేసినది అని విశేషముతో చెప్పలేదు. ఊర్వశి ఇట్లనెను. ఓవిప్రుడా! సరే, నీవు తినకున్నను నీ కుటుంబమువారు తిందురు. నీవీ చక్కెర బండిని కొనిపొమ్ము. బ్రాహ్మ ణుడు ఇట్లు పలికెను. ఓ సుదతీ! నేనిపుడింటికి పోవను. మూడు లోకముల యందును గుణములచే అందరికంటె అధికురాలును సుందరియు అగు ఆమె ఇక్కడకు వచ్చినది. నేను కామార్తుడనై వేడగా క్షణములో వత్తును. ఉండుమని నన్ను ఓదార్చి ఆమె వెళ్ళినది. ఓ వ్రతస్థురాలా! ఆమెయొక్క సత్యవచనమునందు అనురక్తుడనై ఆమె సంగమముకోరి ఆమె వెళ్ళి ఇప్పటికి మాసము గడిచినను ఇక్కడనే ఉన్నాను. ఆ మూర్ఖ విప్రుని మాటలువిని ఊర్వశి తన స్వరూపము ధరించి నవ్వుచు భావ గంభీరముగా ఇట్లు పలికెను: ఓ విప్రుడా! నీవు నా దర్శనముగోరి హఠముతో నిష్ఠతో కూడిన మనస్సుతో వ్రతమును నిర్వహించినమాట సత్యము. నీ విషయము తెలిసికొనగోరి వచ్చితిని. ఓ విప్రా! నేనే ఊర్వశిని. నిన్ను పరీక్షించి నీవు సత్యతపస్కుడు అను ఋషివని నిశ్చయించితిని. రూపతీర్థమని ప్రసిద్ధి పొందిన శూకరవ క్షేత్రమునకు పొమ్ము. అచ్చట నీకు సిద్ధికలుగును. అప్పుడు నేను నీకు లభింతును అని ఇట్లు పలికి ఆ ఊర్వశి స్వర్గమునకు ఎగిరిపోయెను. ఆ సత్యతపోఋషియు రూపతీర్థమునకు పోయి అచట శాంతిపరుడై నియమ వ్రతములను పూని శుచియై జీవించి దేహత్యాగానంతరము ఉత్తమమగు గంధర్వలోకమునకు పోయెను. అచ్చట నూరులకొలది మన్వంతరములు వాస్తవములగు భోగములను అనుభవించి పిమ్మట భూలోకమున ప్రజారంజకుడగు రాజై జన్మించెను. సమగ్రమగు దక్షిణలతో వివిధములగు యజ్ఞములు ఆచరించి కుమారులకు రాజ్యమును అప్పగించి మరల శూకరవ క్షేత్రమునకు ఏగెను. ఆ రూపతీర్థమున మృతిపొంది ఇంద్రలోకమునకు పోయి అచట నూరులకొలది మన్వంతరములు భోగములను అనుభవించి అచటనుండి దిగి భూమిపై ప్రతిష్ఠాన నగరమున బుధుని కుమారుడగు పురూరవుడుగా జన్మించి ఊర్వశితో సంగమము పొందెను. ఈ విధముగ సత్య తపస్కుడను బ్రాహ్మణుడు శూకరవ క్షేత్రమను రూప తీర్థమున శ్రీమహా విష్ణువును ఆరాధించి భోగములను అనుభవించి ముక్తిని కూడ పొందెను. (ఈ ప్రతిష్ఠా నగరమే ఈనాటి అలహాబాదు) (228)