బ్రహ్మ మహా పురాణము

వసంతర్తు సమాగమము

అమంచు సోనలచే ఘనీభావమునంది హిమవంతుడు చూపరులకు క్షీరసాగరము వలె మనోహరముగా కనిపించెను. ఒకానొక దుర్జనుడు సాధుపరిచర్యజేసి కృతార్థుడైనట్లు, ఆ పర్వత సార్వభౌముడు హేమంత, శిశిర పర్యాయ శోభచేత ఇంపుకొల్పెను. మంచు చుట్టుముట్టిన మహిత శిఖములచే శ్వేత ఛత్ర ఛాయలో ఉన్న చక్రవర్తివలె వెలుగొందెను.

వసంతుడును గిరికన్య కల్యాణమునకు వచ్చెను. సురలకు సురాంగనలకు మదన ఉద్రేక కరములైన మందమంద మలయా నిలములును, స్వచ్ఛమైన నీటి ధారలతో నిండి ఉండి సరస్సులును, తామర, నల్లకలువల సంభారములచేత నిండి ఉండి విమల రస పూర్ణములై ముత్తైదు వులపగిది ముస్తాబుచేసికొని పార్వతి పెండ్లి పేరంటమునకు వచ్చెను. కొలదికొలదిగా కనిపించుచున్న పయోధరాగ్రములచే (మేఘములచే) చూచుటకు ఇంపు కలిగించు కుమారికలవలె మిక్కిలి శోభించెను. ఎక్కువ వేడి, ఎక్కువ చల్లదనములు కానివై కుసుమ కీలాగ్రములందలి పుప్పొడిచేత ప్రకాశించుచున్న శరీర శోభచే చక్ర వాకముల జంటల కలకలారావములచే ప్రతిధ్వనులీనుచు సరస్సులు ముచ్చట గొల్పెను. ఐరావతాది దిగ్గజములు లలిత గమనముతో అనందోత్కటములయి పర్వతరాజపుత్రి వివామునకు నడచెను. ప్రియంగు వృక్షములు అమ్రవృక్షములును, అన్యోన్యము బెదరించు కొనుచున్నవా అన్నట్లు పూవుల గుత్తులతో హృదయ రంజకములయ్యెను. తెల్లని హిమ శృంగములందు కుసుమితములైన తిలక వృక్షములు శుభకార్యమని ఎంచి వచ్చిన వృద్ధ జనమో అనునట్లు భాసించెను. వికసించిన అశోక తిలకములు సాల వృక్షములను కౌగిలించుకొని ప్రియుల కంఠములను కౌగలించుకొను ప్రియురాండ్ల జనము వలె చూడముచ్చట గొలిపెను. ఆ వసంత వేళ కదంబ నీప, తాడి, చీకటి మ్రాకులు, సరళ వెలగ, అశోక, సజ్జ, మద్ది, కోవిదార, పున్నాగ, నాగేశ్వర, కర్ణికార, లవంగ, నల్ల అగరు, సప్తవర్ణ, న్యగ్రోధ శోభాంజన నారికేళ ప్రముఖ సకల వృక్ష కదంబము పూలతో పండ్లతో మనోహర కుసుమాంగ రాగములతో హృదయంగమములు అయ్యెను. చిత్రవిచిత్ర వర్ణములయిన రెక్కలచే టిట్టిభ కలవింక బలాకా (బెగ్గురు) మొదలైన నీలి పక్షులతో పద్మోత్పల మీనములతో కూడిన సరస్సులనుండి సుశీతల సుగంధ వాయువులు కొమ్మలను రెమ్మల కదలించి రాల్చిన పూవులతో నగకుమారియైన పార్వతి వివాహ మండప ప్రాంతభూములు పరస్పర సమ్మేళన మందిన ఋతువుల చిహ్నములతో శోభావహములై రాజిల్లెను.

అచ్చట సమద షట్పదములగీతములు, మంగళ గీతములయ్యెను. తుమ్మెదలు ముసిరిన కలువలచే నల్లనివై, తెల్లని మృణాల లతలచే తెల్లనివై, ఎఱ్ఱని అరవిందములచే ఎఱ్ఱగా శోభించుచు సరోవర నీరములు నయన మనోహరములయ్యెను. కొన్ని కొలనులు బంగారు తామర పూవుల నలముకొని మిక్కిలి సొంపు నింపుచుండెను. కొన్ని ఎడల వైడూర్య మణి నాళమయములై కమలవనములు విలసిల్లెను. హేమసోపాన పంక్తులతో నానాపక్షుల కలకూజితములతో కమలోత్పల వనములతో కూడిన దిగుడుబావులు భావ మధురములయి రాణించెను. కుసుమిత కర్ణికారములతో నీహారాద్రి సమున్నత శృంగములు హేమ మయములట్లు రంజిల్లెను. ఇంచుకించుకగ విప్పారి అల్లనల్ల వీచు గాలులకు కదులుచు నిండైన వాసనలను నింపెడి పాటల పుష్పములచే దెసలు పాటలము లయ్యెను. (ఎఱు పెక్కెను) నిండబూసిన కృష్ణ తరువులు, అర్జునములు నీలాశోకములు అల్లనల్లన వికసించిన విరులతోడి అందమున స్పర్ధగొని ఒండొరుల మించి శోభిల్లినవి. గిరినితంబములు అందెల్లెడ వీచు గాలులకు ఊగుచు హోరుమని మ్రోతనించు కింశుకము వనములు అంతరాంతరముల నీలమేఘ సంఘాతములు క్రమ్ము కొన్నవా అనిపించు చీకటి మ్రాను వృక్షముల సమూహములచేత అచ్చమైన హిమగిరి చూడముచ్చట అయ్యెను.

కొమ్మల రెమ్మలనిండ పూసి రాలినపూవులతో, చందనములతో, చంపకములతో, బాగుగా మదించిన పుంస్కోకిలల ఆలాపములతో, గిరిరాజు మిక్కిలి రంజిల్లెను. కోకిలల కల కూజితము లాలించి నీలకంఠములు పురివిప్పి కేకలు పెట్టుచు నాట్యములు ఆరంభించినవి. వాని సడివిని పుష్పబాణుడు (మన్మథుడు) పుష్టిగొని దేవతాస్త్రీలను గురిచేసికొని పూబాణములు విసరదొడగెను. ఎండ తీవ్రమై జలాశయములు ఎండి తనువులకు సుఖమునిండ అత్తఱి గ్రీష్మర్తువు గిరికన్య పెండిలికి వచ్చి గిరిరాజునకు తమతమ సేవలను అందించెను.