బ్రహ్మ మహా పురాణము

ప్రాసాదకరణము

ఇట్లు ఆ రాజు విష్ణు ప్రాసాద నిర్మాణమును గురించి ఆలోచించి ప్రారంభము చేసెను. జోతిష్కులను పిలిపించి భూ శోధనము చేయించెను. అంతే గాక జ్ఞానులు, వేదశాస్త్ర పారంగతులు, అమాత్యులు, మంత్రులు, మొదలగు వారితో సమాలోచించి సుముహూర్తమున చంద్ర తారాబలసంపత్తి గ్రహానుకూల్యతగల శుభసమయమున వాస్తు విద్వాంసులతో ఈ ఆరంభము జరిపించెను. మంగళవాద్యములు, వేదాధ్యయనము మనోహరముగా జరిగెను. పూవులు, అక్షతలు, పేలాలతో, దీపములతో పూర్ణకుంభములతో ఆ మహీపతి భక్తితో భగవంతునకు అర్ఘ్యమిచ్చెను. కళింగ ఉత్కళ, కోసలాధీశ్వరులను ఆహ్వానించెను.

మఱియు ఆ నరేంద్రులను స్వామి విగ్రహము కొఱకు అనువైన శిలకై వెళ్ళుడని ఆనతిచ్చెను. శిల్పులను వెంటగొని వింధ్యాద్రికి చని బండ్లపై పడవలపై ఏగి పాషాణములను గొనిరండని పంపెను. ఇట్లు ఆజ్ఞయిచ్చి అమాత్యులతో పురోహితులకు ఇట్లు ఆనతిచ్చెను.

నా ఆనతిగొని దూతలు ఈపుడమికల రాజులందరికి శుభవార్త తెలిపిరండనెను. దూతలు రాజు వచనమును రాజులకు తెలుపనేగిరి. దూతలేగి రాజులకు వార్త నెఱింగింప వారు ససైన్య పరివారముగా అరుదెంచిరి. నలుదెసల రాజ్యములవారు పర్వత ద్వీపాది ప్రాంతములవారు ఆ ఉత్సవమునకు వచ్చిరి. అట్లరుదెంచిన రాజులనుచూచి, ఈ పుణ్యక్షేత్రము భుక్తిముక్తి ప్రదము. ఇందశ్వమేధమును జేసి విష్ణు ప్రాసాద నిర్మాణమును కూడ చేయుటకుగాను నాకిందు సహకరింప వలెను అని పలికెను. బుద్ధిశాలియగు రాజిట్లు పలుకుటకు నృపతులెల్లరు ఆనందించిరి. అతని శాసనమును అనుసరించి ధన, కనక, రత్న, ముక్తామణి రాసులను అనర్ఘ వజ్ర వైడుర్యాదులను, శాలువలను, నూతనాంబరములను ఏనుగులపై, గుర్రములపై అసంఖ్యాకముగ తరలించుకొని వచ్చిరి. నానావిధ ఆహారపదార్థములను నవ ధాన్యములను, మాష ముద్గ తండుల తిలాదులను (మినుము, పెసలు, బియ్యము, నువ్వులు మొదలైనవానిని) కొనితెచ్చి గాదెలను నింపిరి. ఆ యజ్ఞ సంభారములను చూచి నృపతి పరమానందభరితుడై మహర్షులను, దేవర్షులను, బ్రహ్మచారి ప్రముఖ చతురాశ్రమస్థులను ఆచార్యోపాధ్యాయ ఋత్విజ వర్గమును సర్వశాస్త్ర కుశలురైన సదస్యులను ఆ శ్రీమంతుడు దర్శింపగా ఆనందభరితుడై పురోహితునితో అశ్వమేధాశ్వమునకు వేదపారగులైన బ్రాహ్మలు ఆయా దేశములకేగి పరీక్షింతురుగాక అనెను. రాజ పురోహితుడు ఆనందభరితుడై, రాజులతో బ్రాహ్మణ పురస్పరముగా ఒక గ్రామ ప్రాంతమున యజ్ఞవాటమును శాస్త్రీయముగా నిర్మింప జేసెను. అది అనేక రాజ ప్రాసాదములతో మణిమయములు అయిన వేదికలతో, బంగరు స్తంభములతో తోరణములతో సుమనోహరముగ శోభిల్లుచుండెను. నానాదేశ రాజులకు అంతఃపురములను ఏర్పరచెను. ఆ దేవుని సంతోషపరుప నమూల్యమయిన వస్తువులను స్వర్ణరత్నాదులను కాన్కలనుగొని వారివారి శిబిరములందు విడిసిరి. ఆ సందడి సముద్ర ధ్వనిని మించి అకాశమంటెను.

నానాదేశాగతులైన బ్రాహ్మణ వైశ్యులకును విడుదులను యథావిధిగ ఏర్పాటు చేయించెను. మఱియు అందు ఆగతులైనవారికి శయ్యాసనాదులు మృష్టాన్న సంతర్పణముల నాడేర్పరచెను. ఆ యజ్ఞమునకు మహానుభావులు బ్రహ్మవేత్తలు శిష్యులతో ఏతెంచిరి. ఎట్టి డాంబికములేక రాజు వారికి హృదయపూర్వకముగా స్వయముగా స్వాగతమొసగెను. ఆ మీదట శిల్పులు అందు తమ శిల్పనైపుణ్యము ప్రదర్శించిరి. రాజ మంత్రులతో ఏమాత్రము ఏమరుపాటు లేకుండ ఆ యజ్ఞ సన్నాహము తిలకించి పులకితాంగుడయ్యెను.

ఆ యజ్ఞము ఆరంభమయినంతట సదస్యులు ఒండొరులను గెలువ అత్యద్భుత శాస్త్రార్థములు గావించిరి. దేవేంద్ర వైభవమును మించిన ఆ యజ్ఞవాట నిర్మాణ శోభను తిలకించి, మంగళార్థములయిన పూర్ణ కలశముల వీక్షించి శ్రౌతము చెప్పినట్లు నిలువబడిన దారు మయ యూపస్తంభములగని, జల స్థలములందు పుట్టిన యజ్ఞ పశువులను, ఆవులను, గేదెలను ఆలోకించి యజ్ఞమునకు ఏతెంచిన ప్రజలానంద భరితులైరి. జరాయు జాదులు నాల్గురకముల జీవులు పర్వతములందు పండెడి ధాన్యములు మొదలయిన యజ్ఞ సంభారములు అనేకములను చూచి రాజులు ఆశ్చర్యానంద వివశులైరి. బ్రాహ్మణాదులకు మృష్టాన్న సంతర్పణములు జరిగెను. ఇట్లు విప్రసహస్ర సంకులమైన ఆయజ్ఞవాటమునందు మంగళార్థములైన దుండుభి ధ్వనులు వినసొంపైనవి. పాలు పెరుగులు అందు ఏరులై ప్రవహించెను. జంబూద్వీపమంతయు అచ్చటకు ఏతెంచినట్లు కనిపించెను. విప్రులు సువర్ణ మణికుండలాదులను వేలకొలది బహుమానములు అందుకొని ఎగిరి. అందు బ్రాహ్మణులు రాజ భోజ్యుములయిన విందులు ఆరగించిరి. ఋత్విజులకు భూరి దక్షిణ లొసంగెను. మరియు ఆమహారాజు, యజ్ఞదర్శనార్థము వచ్చిన రాజులను గూడ మిక్కిలి సత్కరించెను. ఆ రాజు అంతఃపురము యజమాన పత్నీగణము కులశీల సంపన్నము పరమశోభన స్వర్ణ రత్నాభరణములను దాల్చి ముకారత్న హారములు మెఱయ ఆ యజ్ఞమున అద్భుతశోభను సంపాదించెను. మహాగజములు సింధు జాతములైన అశ్వములు పలురంగులుగలవి నానావిధ ఆయుధ ధారులయిన భటులు నా యజ్ఞమునకు రక్ష ఇచ్చుచుండ చూచి ఆ యజమాని మానవేశ్వరుడు ఉప్పొంగుచు ఇట్లనెను.

సర్వ శుభలక్షణలక్షితమైన అశ్వమేధాశ్వమును కొనిరండు. సుసన్నద్ధులై రాజకుమారులు ఆ గుఱ్ఱము వెంట రక్షణ ఇచ్చుచు అనుగమింతురుగాక ! ధర్మశాస్త్ర విదులు అయిన విప్రులు ఋత్విజులు ఇక్కడ హోమాదులను నిర్వర్తింపుడు. నల్లమేక, నల్లలేడి, జాతి గల ఎద్దు, దున్నపోతు, గోవులు, గోపాలురను ఇందు గొనిరండు. ఇష్టి విశేషములను జరిపింపుడు. ఆ మీద విష్ణు దేవాలయ నిర్మాణము నిర్వర్తింపబడును. విప్రులేది కోరిన అది ఎల్ల సమకూర్చుడు. మఱి ఇందువచ్చు యాచకులు ఎల్లరకు లేదనకుండ సర్వద్రవ్యములు ఈయబడుగాక. నాకు భగవంతుడు విష్ణువు సాక్షాద్దర్శనము ఇచ్చు దాక ఈ యజ్ఞము జరుగవలసినదే అని ఆరాజు బంగారురాసులను, గజ, తురగ, గో, వృషభాదులను కోట్లు అర్బుదములుగా దానములు గావించెను. గోవుల కొమ్ములకు బంగారు తొడుగులు, పాలు పితుకుటకు కంచు బిందెలు జతసేసి అనేక గోవులను వేదవిదులకు ఒసంగెను.

అనర్ఘ సువర్ణ మణిమయాంబరాభరణములను తెల్లని శయ్యాసనాస్తరణములను, పగడములను వజ్ర వైడూర్య గోమేధికాది రత్నములను అమూల్యము ఈనమేయములను ఇచ్చెను. సాలంకృత కన్యాదానములు చేసెను. సర్వాంగసుందరులయిన అంగనామణులను విలాసవతులను చీరలతో రవికలతో హారకేయూర నూపుర కంకణాదులతో కాన్కలిచ్చెను. భక్ష్య భోజ్య చోష్య లేహ్యాత్మములు అయిన చతుర్విధ మృష్టాన్న సంతర్పణము ఘృత పాయసాపూప సమృద్ధముగ కావించెను. సర్వజీవ సంతృప్తిగ అన్నదానము చేసెను. ఆ దానములకు అంతు దరికానరాదయ్యెను. ఈ అద్భుత యజ్ఞ వైభవమును గాంచి దేవతలు దైత్యులు, చారణులు, గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, ఋషులు, రాజులు ఎంతని ఆశ్చర్య మందిరి. ఋత్విగ్వర్గము, పురోహిత, మంత్రి, సామంతులు, పొందిన ఆనందమునకు హద్దులు లేవు. అందు ఒడలు, వలువలు మాసినవాడు, దీనుడు, ఆకలి గొన్నవాడు, ఇబ్బందులకు లోనైనవాడు, దిగులుపడినవాడు, వ్యాధిగ్రస్తుడు, మనోవ్యాధిగ్రస్తుడునైన జీవి ఒక్కడును లేడు.

ఆ రాజ్యమున అకాలమరణము, గ్రహావేశము భూతప్రేత పిశాచావేశము విషస్పర్శము అన్నది లేనే లేదు. హృష్ట పుష్ట జనసంకులము అ ఱేని దేశము. మునులు తాము చేయు తపస్సులందు పరమ సిద్ధిని పడసిరి. చిరంజీవులైరి. ఎన్నడును అప్పటివరకు ఇట్లు ధన ధాన్య సమృద్ధముగ యజ్ఞము జరిగినది లేదు. ఇట్లు ఆ రాజేంద్రుడు ఇంద్రద్యుమ్నుడు యధావిధిగ ఆ అశ్వమేధమును విష్ణుప్రాసాదమును నిర్వర్తించి జగన్మంగళము చేకూర్చెను. (47)