విష్ణువు సహస్రశీర్షుడు. సహస్రాక్షుడు. సహస్రముఖుడు, సహస్రకరుడు, సహస్ర జిహ్వుడు, సహస్ర కిరీటుడు, సహస్రభుజుడని ఆ యజ్ఞపురుషుని విష్ణుని పురుషసూక్త విధానమున బ్రహ్మజ్ఞులు స్తుతింతురు. హవనము, హోమము, సవనము (ప్రాతర్మధ్యాహ్న సాయంసవనములు మూడు) హోత హవ్యము (హోమ ద్రవ్యము) పాత్రలు పవిత్రములు వేది దీక్ష సమిధ స్రువము స్రుక్కు సోమము సూర్యుడు ముసలము ప్రోక్షణి దక్షిణాయనము అధ్వర్యుడు సామగుడు (ఉద్గాత) సదస్యుడు (యజ్ఞశాల) సదస్సు యూపము చక్రము ధ్రువ దర్వి చరువు ఉలూఖలము ప్రాగ్వంశము త్రేతాగ్నులుండుశాల. హ్రస్వములు అణువులు స్థావరములు జంగమములు ప్రాయశ్చిత్తములు అర్ఘ్యము స్థండిలములు (అగ్ని ప్రతిష్ఠ చేయుటకు కల్పింపబడిన ప్రదేశ విశేషములు) కుశలు మంత్రములు, యజ్ఞముల వహించు వహ్నిహవిర్భాగము భాగవహము (హవిర్భాగములను వహించు పాత్ర విశేషము) అగ్రాసి సోమభుజుడు హోమము చేయబడిన శ్రుత్యుక్త ఆయుధములను ధరించిన అగ్నిగ వేదవేత్తలు పిలుతురో అట్టి శాశ్వతుని యజ్ఞేశ్వరుని శ్రీవత్సాంకిత వక్షుడగు విష్ణువు యొక్క అవతార సహస్రములు ఎన్నో జరిగినవి. జరుగనున్నవి. చతుర్ముఖ బ్రహ్మ ఇట్లు చెప్పెను. విష్ణువు యొక్క అవతారమునకు సంబంధించిన కథలను శ్రద్ధతో వినుడు. ఈ వాసుదేవ మాహాత్మ్యము చరిత్ర దేవమర్త్య లోకములకు హితకరము. శుభప్రదము.
సర్వ భూతాంతరాత్మ అవతారములు పెక్కు గలవు. వేయి దివ్య యుగములు నిదురించి ఒకానొక పనికై మరల మేల్కొనును. బ్రహ్మ, కపిలుడు, త్ర్యంబకుడు, దేవతలు, సప్తర్షులు, నారదుడు, అప్సరసలు, సనత్కుమారుడు, మనువు మొదలగు వారిని ఆయన ఆవిర్భవింపజేసెను. అతడు అగ్నివంటి తేజస్వి.
సముద్రమధ్యమందా సనాతనమూర్తి ఉండగా ప్రళయమైన తఱి మధుకైటభులు ఇద్దరు భగవంతునిచేత వరములంది యుద్ధము చేయబూనిరి. కమలనాభుడు నిదురించిన తఱి పుష్కరమునుండి దేవతలు ఋషులు పుట్టిరి. ఆ ప్రాదుర్భావమే పౌష్కరమను పేర పురాణమునందు శ్రుతి సమ్మతమై వర్ణింపబడినది.
హరీ వరాహ రూపము ఎత్తిన అవతారము శ్రుతి ముఖము. అనగా వేదములే ఆ మూర్తి యొక్క ముఖాద్యవయవ స్వరూపములందె నన్నమాట.