బ్రహ్మ మహా పురాణము

మార్తండ మాహాత్మ్యము

మునులు అంతట

పితామహ! సూర్యకథ ఎంతవిన్నను తృప్తి లేదు. అగ్నిరాశివలె వెలుంగు నీ మూర్తికి ప్రభావమెందుండి అయ్యెనో తెలియనెంతుము. ఇంకను అశుభచరిత్ర మాకు ఆనతిమ్ము అనగా బ్రహ్మ ఇట్లు అనియె-లోకములు, తమఃప్రాయములు కాగా చరాచరసృష్టి నష్టప్రాయము కాగా ప్రకృతి యొక్క గుణ వికారమునకు కారణమై బుద్ధి జనించెను. అందుండి యహంకారము, దాని నుంచి మహాభూతములు అవ్వల ఒక అండము జనించెను. ఈ లోకములెల్ల దానియందు ఉన్నవి. అందు నేను, విష్ణువు, శివుడు ఉండి తామస వృత్తులమై ఈశ్వరుని ధ్యానించితిమి అపుడు విజ్ఞాన స్వరూపుడు ధ్యానయోగమందు మాకు సూర్యరూపుడై గోచరించెను. విశ్వరూపునిగ మేము ఆయనను స్తుతించితిమి.

‘ఆదిదేవోZసిదేవానాం నీవు దేవతలకెల్ల మొదటి దేవతవు’ అనుచుసోత్ర పాఠము చేసితిమి. ఈ స్తోత్రము పారాయణమునకు అర్హమైనది. ఆ స్తోత్రమిది.

ఆదిదేవోZసి దేవానా మైశ్వర్యార్చ త్వమీశ్వరః |

ఆదికర్తాసి భూతానాం దేవదేవో దివాకరః ||

జీవనః సర్వభూతానాం దేవగంధర్వ రక్షసామ్ |

మునికిన్నర సిద్ధానాం తథై వోరగపక్షిణామ్ ||

త్వం బ్రహ్మాం త్వం మహాదేవ స్త్వం విష్ణుస్త్వం

ప్రజాపతిః వాయురింద్రశ్చ సోమశ్చ వివస్వాన్ వరుణ స్తథా ||

త్వం కాలః సృష్టికర్తాచ హర్తా భర్తా తథా ప్రభుః |

సరితః సాగరాః శైలా విద్యుదింద్ర ధనూంషిచ ||

ప్రళయః ప్రభవశ్చైవ వ్యక్తావ్యక్తః సనాతనః |

ఈశ్వరా త్పరతో విద్యాZవిద్యాయాః పరతః శివః ||

శివాత్పరతరో దేవస్త్వమేవ పరమేశ్వరః |

సర్వతః పాణిపాదాంతః సర్వత్తోZక్షి శిరోముఖః ||

సహస్రాంశుః సహస్రాస్యః సహస్ర చరణేక్షణః

భూతాది ర్భూర్భువః స్వచ్ఛ మహః సత్యం తపో జనః ||

ప్రదీప్తం దీపనం దివ్యం సర్వలోక ప్రకాశకమ్ |

దుర్నిరీక్షం సురేంద్రాణాం యద్రూపం తస్య తే నమః ||

సుర సిద్ధ గణైర్జుష్టం భృగ్వత్రిపులహాధిభిః |

స్తుతం పరమ వ్యక్తం యద్రూపం తస్య తే నమః||

వేద్యం వేదవిదం నిత్యం సర్వజ్ఞాన సమన్వితమ్ |

సర్వదేవాది దేవస్య యద్రూపం తస్య తే నమః ||

విశ్వకృ ద్విశ్వభూతం చ వైశ్వానరసురార్చితమ్ |

విశ్వస్థిత మచింత్యం చ యద్రూపం తస్య తే నమః ||

పరం యజ్ఞాత్ పరం వేదాత్ పరం లోకాత్ పరం దివః |

పరమాత్మే త్యభిఖ్యాతం యద్రూపం తస్య తే నమః ||

అవిజ్ఞేయ మనాలక్ష్య మధ్యానగత మవ్యయమ్ |

అనాదినిధనం చైవ యద్రూపం తస్య తే నమః ||

నమో నమః కారణ కారణాయ నమోనమః పాపవిమోచనాయ |

నమో నమస్తే దితిజార్దనాయ, నమోనమో రోగ విమోచనాయ ||

నమోనమః సర్వవర ప్రదాయ, నమోనమః సర్వసుఖ ప్రదాయ |

నమోనమః సర్వధన ప్రదాయ, నమోనమః సర్వమతి ప్రదాయ ||

తరువాత దేవతలు జగత్ ప్రభూ! నీ తేజో రూపమును ఎవ్వడును సహింపనేరడు. కావున లోకహితము కొఱుకు అది ప్రశాంతమగు గాక! అనినంతట సూర్యభగవానుడు ఘర్మమును వర్షమును చలువను గూడ ఈయగలవాడు కావున జగత్కార్య సిద్ధికి అట్లే అగుగాక అనెను. సాంఖ్యులు, యోగులు ముముక్షువులు భాస్కరుని హృదయమందు చైతన్య రూపమున ఉన్నవాని దర్శించి ధ్యానింతురు. బహుదక్షిణములైన క్రతువులు వానికి ఆధారమైన వేదములు సూర్య నమస్కారము యొక్క కలామాత్రమున కేని (లేశమాత్రమున కేని) సరిగావు, అది తీర్థముల కెల్ల తీర్థము. మంగళములకెల్ల మంగళము. పవిత్రములకెల్ల పవిత్రము అయిన దివాకరమూర్తిని అందరు శరణు పొందుదురు. సూర్య నమస్కారము సర్వ పాపహరము. ‘ప్రజాపతీ! చాలకాలము నుండి మాకు సూర్యుని అష్టోత్తర శతనామములను వినవలెనని కోరిక యున్నది. కాన దయచేసి తెలుపుమని’ మునులడిగిరి.

బ్రాహ్మణులారా! మిక్కిలి రహస్యమును స్వర్గ మోక్షములను ఇచ్చునదియు అగు సూర్యుని అష్టోత్తర శతనామములను చెప్పుచున్నాను. వినుడు -