వ్యాసుడు ఇట్లు అనియె -
సురేశ్వరునికి, సృష్టికారణునకు, విష్ణువునకు, పురాణపురుషునకు చతుర్వ్యూహ స్వరూపుడైన నిర్గుణ స్వరూపునకు, గుణరూపునకు, సర్వాధికునకు, యజ్ఞాంగ స్వరూపునకు, సర్వాంగునకు నమస్కారము. ఎవనికంటె అణువైన వస్తువు ఎవనికంటె పెద్దదైన వస్తువు లేదో, జననము లేని ఎవ్వనిచేత విశ్వము వ్యాప్తమైనదో, పుట్టుట గిట్టుట దృశ్యమగుట అదృశ్యమగుట అను లక్షణములచే విలక్షణమైన చరాచర విశ్వవ్యాప్తమైనవానినిగా తెలుపుదురో, ఎవనివలన జగత్తు పుట్టినది, నశించినది అని బ్రహ్మణ్యులు పేర్కొందురో, అట్టి నిర్వికారము శుద్ధము నిత్యము ఏకైక రూపము విష్ణువు జిష్ణువు (సర్వవ్యాపకము, జయ శీలము) అని వర్ణింపబడు పరమాత్మకు నమస్కారము. హిరణ్యగర్భునకు (స్వర్ణమయమైన బ్రహ్మాండము గర్భముగా గలవాడు) హరికి, శంకరునకు, వాసుదేవునకు, (సర్వదేవ నివాసమైనవానికి, తారునికి (సంసారమును తరింపజేయువాడు), ఏకరూపునికి, స్థూలము, సూక్ష్మమునైన వానికి, అవ్యక్తము, వ్యక్తమునైన వానికి, ముక్తి హేతువగు విష్ణునకు, జగన్మూలము అయినవానికి నమస్కారము. విశ్వమునకు ఆధారమై అణువుల కంటె అణువై సర్వ భూతములందు ఉండి చ్యుతిలేని వానికి (అచ్యుతునకు) నమస్కారము. పరమార్థముగ కేవల జ్ఞాన రూపము అయినను అర్థ స్వరూపముగ భ్రాంతి దర్శనమున దృశ్యాత్మక జగత్తుగ కనిపించువానినిగ మునులు పేర్కొనెడి భగవత్తత్వమును గుఱించి బ్రహ్మ పూర్వము ఒక మారు చెప్పినట్లు నేనును చెప్పుచున్నాను.
ఎవడు తన ముఖములచేత ఋక్ సామవేద మంత్రములను పఠించుచు ఏకార్ణవము నుండి వెలువడివచ్చి ముల్లోకములను పవిత్రముజేయునో అట్టి ఈశానునకు నమస్కరించి దేవతలు యజ్ఞములొనరించు వారి అజ్ఞాచరణమునకు లోపము రానీయరో అయనకు నమస్కరించి, అవ్యక్తమునుండి పుట్టిన బ్రహ్మయొక్క సమగ్రమైన అభిప్రాయమును తెలుపుచున్నాను. ఆయన సృష్టిని ఉద్దేశించి ధర్మార్ధకామమోక్షములను పురుషార్థములను వేదరూపమున ప్రకటించి ఉన్నాడు. ఆపః (దీనికి నీరు సామాన్యార్థము. కాని దానికి మూల పదార్ధమైన విద్యుత్తు ప్రకాశోదకమును పేర అనర్థమని ఋషులు చెప్పినారు) వానికి నారములని నామాంతరము. అవియే, యనము అనగా గమ్యస్థానము (ఉనికి)గ గలవాడు నారాయణుడు. సృష్టిమూలమైన ఆపోరూపమున సర్వవ్యాపకమై ఉన్నతత్త్వమే నారాయణతత్త్వమని తాత్పర్యము, ఆ భగవత్తత్వము నాలుగు విధములై ఉన్నది. ఒక మూర్తి శుక్ల వర్ణము. అది జ్వాలా మాలమయము. దానిని యోగులు జ్ఞానులు మాత్రమే దర్శింతురు. అది దూరమందును దగ్గరనుగూడ ఉండునది. అది గుణముల కతీతమైనది. వాసుదేవ నామమున ఉండునది. మమకారము లేని స్థితిలోనే అది కనబడును. రూపము రంగు మొదలగు కల్పిత భావములు దానికి లేవు. కేవల శుద్ధ స్వరూపము. మిక్కిలి నిలకడగల వస్తువు. ఇక రెండవ వ్యూహము. శేషుడను పేర భూమిని ధరించుచున్నది. అది తమోగుణ మూర్తి. తిర్యగ్భావమును బొందినది. అనగా పశుత్వము నొందినదని అర్థము. మూడవ వ్యూహము సత్వ ప్రధానమూర్తి ధర్మసంస్థాపన మొనరించి ప్రజారక్షణ నిమిత్తమైన కర్మను (స్థితిరూపమును జేయునది). నాలుగవ వ్యూహము (మూర్తి) శేష తల్పమున సముద్ర మధ్య మందు ఉండును. రజోగుణ రూపము సర్గకారణము (సృష్టి కారణము) ఈ చెప్పిన వానిలో మూడవ మూర్తియగు హరి స్వరూపము ధర్మ వ్యవస్థాపనము జేయును. ధర్మనాశము చేయ చెలరేగిన అసురులను సంహరించును. ధర్మపరాయణులైన దేవగంధర్వాదులను రక్షించును. ఈ మూర్తి ఎపుడు ధర్మము వాడిపోవునో, అధర్మము ప్రకోపించునో, అప్పుడు తననుతాను సృజించుకొనును. మున్ను వరాహమై ముట్టెతో ఉదకమును చిమ్ముకొని వచ్చి తనయొక్క కొమ్ముచేత ఈ వసుంధరను పద్మిని (తామర తీగ)వలె పైకెత్తినది. ఈ మూర్తియే నరసింహమూర్తియై హిరణ్యకశిపుని సంహరించినది. దీనిచేతనే విప్రచిత్తి మొదలుగా మఱెందరో దానవులు గూల్పబడిరి. వామన రూపమూని మాయచే బలిని బంధించి దైత్యులనుగెలచి ముల్లోకములు ఆక్రమింపబడినవి. భృగు వంశమందు జమదగ్ని కుమారుడై పుట్టి అద్భుత ప్రతాపముచే ఒక రాచపురుగు తండ్రిని సంహరించి నాడని సర్వక్షత్రియ నాశనమొనరించినది. అట్లే అత్రి కుమారుడై ప్రతాపశీలియై దత్తాత్రేయుడను పేర ఉదయించి మహాత్ముడైన అలర్కునకు అష్టాంగ యోగమును ఉపదేశంచినది. దశరథ కుమారుడై, రాముడనుపేర పుట్టి రావణుని సంహరించినది. సర్వ జగత్తు ఒకే సముద్రమైనపుడు ఈసర్వజగత్ప్రభువు అనేక యుగసహస్రములు నాగపర్యంక శయనుడై యోగనిద్ర వహించి తన మహిమయందు తాను ఇమిడియుండి ముల్లోకములను గర్భమున తాల్చి జనోలోక మందున్న సిద్ధులు స్తుతింప విలసిల్లుచుండును.
ఆ అనంత శయన మూర్తి నాభినుండి దిక్కులే రేకులుగా భాసించు ఒక పద్మము పుట్టినది. అందలి కేసరములు మరుద్గణము. (వాయు). అది పితామహుడైన చతుర్ముఖుని పుట్టిల్లు. యోగ నిద్రనున్న ఆస్వామి గులిమినుండి మధుకైటభులను దానవులు పుట్టిరి. మహావీర్యులు మహాబలశాలులునై, బ్రహ్మను చంపబోయిన, ఆ ఇద్దరను తల్పము నుండి లేచి ఆ ప్రభువు సంహరించెను. ఆయన అనేక లీలలు అసంఖ్యాకములు. అట్టి అజుడు అవికారుడు మధురానగరములో అవతరించి ఉన్నాడు. ఈ సాత్విక మూర్తి జగత్ స్థితి హేతువై అవతరించగా ప్రద్యుమ్న నామమున నాల్గవ వ్యూహముగ చెప్పబడినది. ఈ మూర్తి ఒకప్పుడు దేవభావమును, నొకతఱి మనుష్య భావమును, వేరొక యెడ పశుపక్ష్యాది భావమునుగూడ గ్రహించుచుండి తదనురూప స్వభావమునై వాసు దేవాఖ్యమై పూజింపబడి అభీష్టముల అనుగ్రహించుచున్నది. కృతకృత్యుడయ్యు (ఏ కర్తవ్యములేని వాడయ్యు) సర్వప్రభువైన విష్ణువునుగూర్చి నేనింతవరకు తెల్పితిని. ఇటుపై ఆయన మనుష్యత్వమును పొంది చేసిన లీలావిశేషములను ఆలింపుడు. (180)