లోమహర్షణుడు ఇంకను ఆ మహర్షులతో
మునులారా! ఇది నూఱేండ్లు చెప్పినను తీరదు, సంక్షేపించి తెల్పెదను వినుడు. జంబూ + ప్లక్ష + శాల్మల + కుశ + క్రౌంచ + శాక + పుష్కరములు అనునవి సప్త ద్వీపములు. ఇవి లవణ=ఉప్పు, ఇక్షు=చెఱకురసము, సురా=కల్లు, సర్పిః=నెయ్యి, దధి = పెరుగు, దుగ్ధ = పాలు, జల=నీరునుగల ఏడు సముద్రములచే చుట్టుకొనబడినవి. వీని నడుమ జంబూద్వీపమున్నది. దానికి నడుమ ‘మేరువు’ అను బంగారు కొండ ఉన్నది. అది ఎనుబదినాల్గు యోజనములయెత్తు, పదునారువేల యోజనములలోతు, ముప్పది రెండు వేల యోజనముల వైశాల్యముగల ఉపరిభాగము కలిగి ఉన్నది. మూలము పదునాఱు వేల యోజనముల విస్తారమై ఉన్నది. భూమి అను పద్మమునకు అది నడిమి కర్ణిక (దుద్దు)వలె ఉన్నది.
హిమవంతము-హేమకూటము నిషధము అనునవి దానికి దక్షిణమునను, నీలము, శ్వేతము, శృంగి అనునవి ఉత్తరమునను వర్ష పర్వతములు ఈ రెంటి నడుమ ఉన్నవి. అవి లక్ష యోజన ప్రమాణములు, తక్కినవి తొంబదివేల యోజనముల ప్రమాణము గలవి. రెండువేల యోజనముల ఎత్తు, అన్ని యోజనముల వెడల్పు కలవి.
భారత, కింపురుష, హరివర్షములు మేరువునకు దక్షిణమున ఉన్నవి. రమ్యకము ఉత్తరమందున్నది. అది కనకమయము. ఉత్తర కురుభూములక్కడనే ఉన్నవి. ఈవర్షము లొక్కొక్కటి భారతవర్షమువలె తొమ్మిదివేల యోజనముల వైశాల్యము గలవి.
ఇలావృతము నడుమ బంగారు మేరుగిరి కలదు. మేరువు నలుదిశల ఇలావృతము తొమ్మిదివేల యోజనముల వైశాల్యము కలది. ఇందు నాల్గు పర్వతములు మేరువునకు విష్కంభములు (గడియలు), పదివేల యోజనముల పొడవుగలవి. తూర్పున మందర పర్వతము, దక్షిణమున గంధమాధనము, పడమట విపులము, ఉత్తరమున సుపార్శ్వము అనునవి గలవు. వీనియందు క్రమముగ కదంబము (కడిమి), జంబువు (నేరేడు), పిప్పలము (రావి), వటము (మఱ్ఱి) అను చెట్లు పదునొకండు వందల యోజనముల విరివి గల వృక్షములు, ‘గిరికేతువులు’ (పర్వతాగ్ర పతాకములు) గలవు. జంబూ వృక్ష సమృద్ధినిబట్టి అది జంబూద్వీపము అనుపేర ప్రసిద్ధిని పొందెను.
ఆ నేరేడు పండ్లు మహాగజ ప్రమాణ రూపమున రాలుచుండునట. అవి ప్రిదిలి కారిన రసము ఏరైపారి జంబూనది అని పిలువబడుచున్నది. ఆ జంబూరసము త్రాగిన వారు కష్టము, దుర్వాసన, ముదిమి, ఇంద్రియక్షయము ఎఱుగరు. ఆ జంబూనది ఒడ్డున కల మన్ను ఆ రసముచే తడిసి సుఖవాయువున అరి జాంబూనదమను బంగారము ఏర్పడును. అది సిద్ధభూషణము అనగా సిద్ధులు ధరించునట్టిదన్నమాట.
మేరువునకు తూర్పుదెస భద్రాశ్వము. పడమట కేతుమూలము, అనురెండు వర్షములున్నవి. వానికి నడుమ ఇలావృతము. తూర్పున చైత్రరథము, దక్షిణమున గంధమాదనము, పడమట వైభ్రాజము, ఉత్తరమున నందనవనము ఉన్నవి. అరుణోదయము, మహాభద్రము, అసితోదము, మానసము అను సరస్సులు నాల్గు దేవభోగ్యములుగలవు.
శాంతవంతము, చక్రకుంజము, కురరీ, మాల్యవంతము, వైకంకము అనునవి మేరువు యొక్క కేసరపర్వతములు. త్రికూటము, శిశిరము, పతంగము, రుచకము, నిషధము, మొదలైనవి దాని దక్షిణదిశలోగల మేరువుయొక్క కేసర పర్వతములు, శిఖివాసము, వైదూర్యము, కపిలము, గంధమాదనము, జానుథి మొదలైనవి మేరు పశ్చిమకేసరగిరులు. అవి మేరువునంటి జఠరాది స్థానములందు ఉన్నవి. శంఖకూటము, ఋషభము, హంసము, నాగము, కాలంజరము, మొదలగునవి మేరూత్తర దిశ కేసర శైలములు. మేరువుమీద బ్రహ్మయొక్క నగరము పదునాలుగువేల యోజనముల వైశాల్యముగలది. అందు ఎనిమిది మూలలందు అష్టదిక్పాలుర పురములుకలదు. విష్ణు పాదము నుండి వెడలి చంద్రమండలమున ప్రవహించుచు ఆకాశగంగ బ్రహ్మపురి నలు వైపుల పడుచున్నది. అట్లుపడి, నాల్గుదెసల నాల్గుపాయలైనది. సీత, అలకనంద, చక్షువు, భద్ర అనునవి ఆ నాల్గుపాయలు. సీత పూర్వ శైలమునుండి మరియొక శైలమున అంతరిక్ష సంచారము చేయును. అవ్వల భద్రాశ్వ వర్ష పర్వతము మీదుగా సముద్రుని పొందును. అలకనంద దక్షిణదిశగా భారత వర్షముంజేరి యేడు భాగములయి సముద్రము జొచ్చును. చక్షువు పడమటి గిరులన్నియు దాటి పడమటగల కేతుమాల వర్షమునందు ప్రవేశించి సముద్రమున కలియును. భద్ర ఉత్తరగిరులనుదాటి ఉత్తర కురుభూములందు ప్రవహించి ఉత్తర సముద్రమున చేరును.
నీల పర్వతమునుండి నిషధ పర్వతమువరకు పొడవయినదై మాల్యవంతము గంధమాదనమునుగలవు. వానినడిమి భాగమున తామర పువ్వులోని దుద్దువలె మేరువు ఉన్నది. మర్యాదా పర్వతమునకు ఆవల లోకాలోకమను పర్వతమునకు భారతములు, కేతుమాలములు, భద్రాశ్వములు, కురుభూములును రేకులట్లున్నవి. జఠరము దేవకూటము అనునవి రెండు మర్యాదా పర్వతములు. అవి దక్షిణోత్తరములందు నీలపర్వతమునుండి నిషధ పర్వతముదాక వ్యాపించియున్నవి. గంధమాదన కైలాస పర్వతములు తూర్పు పడమరలందు ఎనుబది యోజనముల పొడవుగలవై నీలపర్వతమునుండి నిషధ పర్వతము వరకు వ్యాపించి సముద్రములో చొచ్చియున్నవి. నిషధము, పారియాత్రము అనునవి రెండును మర్యాదా పర్వతములు. అరెండు దక్షిణోత్తరములందు నీల పర్వతము నుండి నిషధ పర్వతము వరకు దైర్ఘ్యముగలవై మేరు పర్వతమునకు పశ్చిమ భాగమునందు యధాపూర్వముగ నున్నవి. త్రిశృంగము, జారుధియు సుత్తరదిశ వర్షపర్వతములు. తూర్పు, పడమరగా వ్యాపించి సముద్ర మధ్యమున ఉన్నవి. మర్యాదాగిరులు నాచే చెప్పబడినవి. వీనిలో రెండు రెండు పర్వతములు మేరు పర్వతమునకు జఠర (గర్బ) భాగములుగా నలుదెసల ఉన్నవి. మేరువు నలుదెసలగల కేసర పర్వతములు చెప్పబడినవి. అవి చల్లని ఆద్యంతములు గలవి. వాని లోపలగల లోయలు మనోహరములై ఉండును. వానియందు రమ్యములైన పురములు వనములుగలవు. లక్ష్మి, విష్ణువు, అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు మొదలగు దేవతల ఆలయ శ్రేష్టములు నరకిన్నరులచే సేవితములై ఉండును. రమ్యములైన ఆ పర్వత ద్రోణు(లోయ)లందు రేయింబవళ్ళు గంధర్వ యక్ష రాక్షస దైత్య దానవులు క్రీడించుచుందురు. ఇవి భౌమ స్వర్గములు. అనగా భూమి మీద ఉన్న స్వర్గ భూములు. ధర్మనిష్టులకు నివాసములు. ఇందెన్ని జన్మములకైనను పాపాత్ములు చేరజాలరు.
భద్రాశ్వ పర్వతమందు విష్ణుభగవానుడు హయగ్రీవ స్వరూపుడై ఉండును. కేతుమాలమందు వరాహమూర్తి, భారతమందు కూర్మమూర్తి, కురుభూములందు సనాతనుడగు గోవిందుడు మత్స్యమూర్తియునై యుండును. సర్వత్ర సర్వస్వరూపుడై ఆ సర్వేశ్వరుడు హరి విశ్వరూపుడై ఉండును. సర్వాత్మకుడైన ఆ విష్ణువు అందరికి ఆధారభూతుడై ఉండును.
బ్రాహ్మణులారా! కింపురుషాది వర్షములు ఎనిమిదింటియందుగల జీవులకు శోకము, ఆయాసము, ఉద్వేగము, ఆకలి, దప్పిక, భయము మొదలైనవి ఉండవు. అచటి ప్రజలు స్వస్థులు, నిరాతంకులు (అడ్డులేనివారు) ఏ దుఃఖస్పర్శయు లేనివారుగను పది, పండ్రెండు వేల యేండ్లు ఆయువు గలవారుగ ఉందురు. ఆ వర్షములందు ఇతరములగు భూమి యందలి బాధలు కృత, త్రేతాదియుగ విభాగములేదు. వానియందు అన్నిట ఏడేసి కుల పర్వతములు ఉన్నవి. అందుండి వందలకొలది నదులు పుట్టినవి. (18)