బ్రహ్మ మహా పురాణము
శ్యమంతకోపాఖ్యానము
సూతుడు ఇట్లు అనెను-శ్రీకృష్ణుడు సత్రాజిత్తునకు మణిరత్నము నొసగగా, దానిని బభ్రువు (అక్రూరుడు), భోజవంశీయుడగు శతధన్వునిచే హరింపజేసెను. అక్రూరుడు అవకాశము కనిపెట్టి సత్యభామను, స్యమంతకమును అడుగుచునే ఉండెను. శతధన్వుడు సత్రాజిత్తును సంహరించి రాత్రివేళ మణినిగొనివచ్చి అక్రూరున కొసగెను. అక్రూరుడు దానిని తీసుకొని ఈ అంశమెవ్వరికి ఎన్నడును తెలుపనని వానిచే ప్రమాణము చేయించెను.
తండ్రి హతుడగుటకు తపించి సత్యభామ రథమెక్కి వారణావతమునకేగెను. అక్కడ ఈ వృత్తాంతమును, భోజ వంశీయుడగు శతధన్వుడు చేసిన దుష్ర్కియను భర్తకుతెలిపి కంటనీరు గ్రుక్కుకొనెను, లక్కయింట దగ్ధులైన పాండవులకు ఉదక క్రియ చేసి కృష్ణుడు సాత్యకిని వారియొక్క ఉత్తర క్రియయందు నియోగించి వెంటనే ద్వారక కేతెంచి బలరామునితో ఇట్లనెను.
సింహము ప్రసేనుని చంపినది, శతధ్వనుడు సత్రాజిత్తును చంపెను, స్యమంతకము నాకు చెందవలసి ఉన్నది. కావున త్వరగా రథమెక్కుము. ఆ భోజుని కూల్చి ఆమణిని తెచ్చెదము, ఆ స్యమంతకము మనది కాగలదనెను.
అని చెప్పి సూతుడు ఇట్లు అనెను-
శతధ్వనుడు కృష్ణునితో పోరుచు అక్రూరుడు ఎక్కడున్నాడని చూచుచుండెను. అక్రూరుడు శక్తుడయ్యు, శాపభీతిచే యుద్ధమున తోడ్పడడయ్యెను. అప్పుడు భోజుడు భయార్తుడై వెనుదిరుగ నిశ్చయించెను. భోజుని స్వాధీనమున ‘హృదయ’ అను గుఱ్ఱము నూరు యోజనములు మించి దూక కలిగినది కలదు. దానితోనే కృష్ణునితో తలపడెను. నూరు యోజనముల మేఱ అరిగి వేగముడుగుటయు, తన రథవేగము హెచ్చుటయు చూచి కృష్ణుడు శతధన్వుని నొప్పించెను. ఆ గుఱ్ఱము డిల్లవడి తుదకు ప్రాణములు గోల్పోవుట చూచి కృష్ణుడు బలరామునితో ఇట్లనియె.
“ఓ శూరాగ్రేసర! నీవు ఇక్కడే ఉండుము. గుఱ్ఱము నష్టమైనది. పాదచారినై వెళ్ళి మణిరత్నమైన స్యమంతకము హరించగలను.”
అటు పిమ్మట హరి పాదచారియై శతధన్వుని పైకేగి మిధిలా ప్రాంతమున వానిని సంహరించెను. కాని వాని దగ్గర స్యమంతకము కానరాదయ్యెను. మరలివచ్చిన కృష్ణుని చూచి హలాయుధుడగు బలరాముడు మణిని ఇమ్మని అడిగెను. కృష్ణుడు లేదని బదులు చెప్పెను. అంతట బలరాముడు రోషముగొని ఛీ! ఛీ! అని కేకలు వేసి కృష్ణునితో
“తమ్ముడవని సైరించితిని. నీకు స్వస్తి యగుగాక. నాకు ద్వారకతోగాని, నీతోగాని, వృష్ణులతో గాని పనిలేదు. నేను వెళ్ళుచున్నాను” అని పలికెను.
బలరాముడు మిథిల ప్రవేశించెను. మిథిలాధిపతి సత్కారమంది ఇష్టోపభోగియై అక్కడనే ఉండెను. ఈ సమయములోనే బుద్ధిశాలియగు బభ్రువు (అక్రూరుడు) పెక్కు విధములగు క్రతువుల ఆచరించెను. గాందీపుత్రుడగు ఆ అక్రూరుడు దీక్షామయమైన రక్షా కవచము తొడిగికొని స్యమంతకము కొఱుకు యజ్ఞము చేసెను. అరువదేండ్లు వివిధ రత్న ధనరాసులను అధ్వరములందు వినియోగించెను. ‘అక్రూర యజ్ఞము’ అను పేర అవి ప్రఖ్యాతి పొందినది. ఆ యజ్ఞములు విపులాన్నదాన దక్షిణలు సర్వకామ ప్రదములునై విలసిల్లెను. అంతట దుర్యోధనుడు మిథిలకు వెళ్ళి బలరామునివద్ద గదాయుద్ధ శిక్షణమును పొందెను.
మహారథులగు వృష్ణ్వంధకులతో పోయి కృష్ణుడు బలరాముని ద్వారకకు మరల తెచ్చెను. బంధువులతో గూడ నిద్రలో ఉన్న సత్రాజిత్తును జంపిన అక్రూరుడు అంధకులతో కలసి మరల ద్వారకకు వచ్చెను. అప్పుడు కృష్ణుడు జ్ఞాతులతో బెడియునను భయమువలన వానిని ఉపేక్షించెను. అప్పుడు అక్రూరుడు మిథిలకుపోగా ఇంద్రుడు వర్షించక పోయెను. అనావృష్టితో రాజ్యము అనేక విధముల క్షీణించిపోయెను. అందువలన కుకురాంధకులు అక్రూరుని ప్రసన్నుని జేసికొని మరలద్వారకకు కొనివచ్చిరి. అంత దానపతియగు అతడు ద్వారకకు రాగానే జలనిధి తీరమున వాసవుడు బాగుగా వర్షించెను. అక్రూరుడు వాసు దేవునికి ప్రీతికలుగునట్లు శీలవతి అగు తన చెల్లెలిని ఇచ్చెను. అంతట కృష్ణుడు యోగ శక్తిచే స్యమంతకమణి అక్రూరుని దగ్గర ఉన్నదని గమనించి సభామధ్యమున అక్రూరునితో
“నీ చేజిక్కిన మణిని నాకు ఇమ్ము. నా మర్యాద కాపాడుము. అఱువది యేండ్లు నాకీమణి నిమిత్తముగ రోషము గల్గినది, కాలమెంతో గడచిపోయినది” అని పలికెను.
అంతట అక్రూరుడు కృష్ణుని పలుకులను బట్టి సర్వ యాదవ సమాజమునందు మణిని గొనివచ్చి బుద్ధిమంతుడు కావున మనస్సు నొచ్చకుండ దానిని హరికిచ్చెను. అరిభీకరుడైన కృష్ణుడు బభ్రుహస్తమునుండి సూటిగ లభించిన ఆమణిని చేకొని హర్షముగొని తిరిగి దానిని అక్రూరునకే ఇచ్చెను. గాందినీ పుత్రుడగు అక్రూరుడు కృష్ణుని హస్తమునుండి లభించిన ఆ స్యమంతక మణిరత్నమును దాల్చి సూర్యునివలె తేజరిల్లెను. (17)