ఇక పంచ తీర్థములందు స్నానము, దానములు చేయుట అచటి దేవతలను దర్శించుట వల్ల కల్గు ఫలమును తెల్పెదను. మార్కండేయమను మడుగున ఉత్తరముగ తిరిగి శుచియై ముమ్మారు
సంసారసాగరేమగ్నం పాపగ్రస్తం అచేతనం,
త్రాహిమాం భగనేత్రఘ్న త్రిపురారే నమోZస్తుతే
నమశ్శివాయ శాంతాయ సర్వపాపహరాయచ
స్నానం కరోమి దేవేశ మమనశ్శతుపాతకమ్
(సంసారసాగరమందు మునిగి పాపగ్రస్తుడనై తెలివిదప్పి ఉన్న నన్ను ఓ త్రిపురహర! రక్షింపుము. మంగళ స్వరూపుడు శాంతుడు సర్వ పాపహరుడునగు నీకు నమస్కారము. ఈశ్వర! ఇదిగో స్నానము చేయుచున్నాను. నా పాతకము నశించుగాక!) అను మంత్రము చెప్పుచు స్నానము చేయవలెను.
బొడ్డు లోతున స్నాన మొనరించి యథావిధిగ దేవతలకు ఋషులకు పితరులకు మొదలగు వారికి తిలోదక తర్పణములు కావింపవలెను. అవ్వల దేవాలయమందు మూడు మారులు ప్రదక్షిణము చేసి మూలమంత్రముతో అఘోర మంత్రముతోను మార్కండేయ ఈశ్వరుని పూజించి సాష్టాంగ నమస్కారము గావించి ఓ త్రినేత్ర చంద్రభూషణ ఓ విరూపాక్ష నన్ను రక్షింపుము. ఓ మహాదేవ నీకు నమస్కారము అని ఈ విధముగ స్తుతించి ప్రసన్నుని జేసికొనవలెను.
మార్కండేయ ప్రదమందిట్లు స్నానమాడి శంకరుని దర్శించిన అతడు పది అశ్వమేధములు కావించిన ఫలమందును. సర్వపాప విముక్తుడై శివలోకమునకు పోవును. అచ్చట మహా భోగములను ప్రళయకాలము వరకు అనుభవించి ఈ లోకమందు (కర్మభూమియందు) విప్రుడై జనించి వేదవేదాంగ విద్యాసంపన్నుడై శంకర సాలోక్య సారూప్య యోగమునంది అవ్వల మోక్షమును పడయును.
అట్లే కల్పవృక్షము (మఱ్ఱిచెట్టు) దరికేగి
ఓం నమోవ్యక్త రూపాయ మహాప్రళయ కారిణే
మహద్రసోపవిష్టాయ న్యగ్రోధాయ నమోస్తుతే
అమరస్త్వం సదాకల్పే హరేశ్చాయతనంవట
న్యగ్రోధహరమే పాపం కల్పవృక్ష నమోస్తుతే
(అవ్యక్తమయిన పరమాత్మయొక్క వ్యక్తరూపము నీవు. మహా ప్రళయకర్తవు. అనగా ముక్తినిచ్చు వాడవు. అమృత మయుడవు. కల్పాంతము నశింపవు. హరికి నివాసమవు నీవు నాపాపమును హరింపుము. నీకిదే నమస్కారము.) అను ఈ మంత్రము జపించుచు పూజించి మూడుసార్లు ప్రదక్షిణము చేయవలెను.
భక్తితో ప్రదక్షిణము చేసి కల్ప వృక్షమునకు మ్రొక్కిన అతడు పాము కుబుసమును విడిచినట్లు పాపమునుండి విడివడును. ఆ కల్పము నీడ వసించి బ్రహ్మహత్యాపాపమునే పోగొట్టుకొనవచ్చును. మఱి ఇతర పాపముల మాట చెప్పనేల? కృష్ణ శరీరము నుండి జనించి బ్రహ్మ తేజస్సుతో నిండిన వటవృక్ష స్వరూపముననున్న విష్ణువునకు మ్రెక్కి రాజసూయ అశ్వమేధ యాగఫలమును పొందును. అట్లు స్వవంశమును ఉద్ధరించి విష్ణు లోకమును పొందును. కృష్ణుని కెదుటనున్న గరుడమూర్తికి మ్రొక్కి, సర్వపాపము వెడలి విష్ణు లోకమును పడయును. వటవృక్షమును, గరుడుని దర్శించి పురుషోత్తముని, సంకర్షణుని, సుభద్రను దర్శించినవాడు పరమోత్తమగతి కేగును. విష్ణ్వాలయము చొచ్చి ముమ్మారు ప్రదక్షిణము చేసి సంకర్షణ మంత్రముచే ఆ మూర్తిని పూజించి ఇట్లు ప్రసన్నుని చేసికొనవలెను.
నాగలిని ధరించి నీకు నమస్కారము. రోకలిచేకొనిన నీకు నమస్కారము. రేవతీ ప్రియ! భక్తవత్సల! నీకు నమస్కారము. బలశాలుర కెల్ల మిన్నయగు నీకు నమస్కారము. ధరణింధరించు నీకు నమస్కారము. ప్రలంబాసురుని సంహరించిన నీకు నమస్కారము. కృష్ణునికి అన్నగారైన నీకు నమస్కారము అని ప్రార్థించెను.
అటు పిమ్మట హరిని ప్రసన్నుని చేసికొని నీలాంబరుడైన ఏక కుండలుని బలరాముని రోహిణీ కుమారుని అనుగ్రహింపజేసికొని, అతడు పాపము వాసి విష్ణులోకమున కేగును. ప్రళయముదాక అట సుఖములంది పుణ్యానుభవ అనంతరము భువికివచ్చి యోగి కులమందు విప్రుడై జనించి సర్వశాస్త్ర పారగుడై జ్ఞానమంది ముక్తినందును. ఆమీద హరిని ద్వాదశాక్షర మంత్రముచే పూజించి సద్గతి నందును. గంధ పుష్పాదులచే కృష్ణుని అర్చించి జయజయ అని స్వామి నామములను కీర్తించి నిస్సార సంసార సాగర మందు మునిగితిని. ఇది దుఃఖమను నురుగు, క్రోధమను మొసళ్ళు, విషయములను ఉదకము, నానా రోగములనెడి కెరటములు, మోహమను సుళ్ళుగలది. ఈ మహాభయంకర స్థితి నుండి నన్ను పురుషోత్తమా! కాపాడుమని స్వామిమూర్తిని పద్మ పత్రాయతేక్షణాది కల్యాణ లక్షణములు గలదానిని ధ్యానించి మ్రొక్కిన యతడశ్వ మేధములు వేయి చేసిన పుణ్యము నందును.
సర్వతీర్థ స్నానదాన ఫలమును కృష్ణదర్శనము చేసి పొందును. ఇట్లు కృష్ణదర్శనము చేయునతడు పాపరహితుడయి ఐశ్వర్యవంతుడు, గుణవంతుడునై, కల్పశతము అఖిల భోగములను అనుభవించి గంధర్వాప్సరసలు అనుగమింప విష్ణులోకమంది ఇటకు తిరిగి వచ్చి విప్రుడై జనించి సర్వవేది సర్వజ్ఞుడు, స్వధర్మ నిష్ఠుడై శాంతుడై సర్వ భూతహితము కోరుచు వైష్ణవ జ్ఞానము పొంది ముక్తినందును.
ఆ మీద మంత్రపురస్సరముగా భక్తవత్సలను సుభద్రను అర్చించి ‘నమస్తే సర్వగే’ అను ఈ మంత్రముచే నమస్కరించి కామగమన విమానమున విష్ణుపురమేగి ప్రళయము దాక అట క్రీడించి వేదవేత్తయై విష్ణుయోగమంది ముక్తి నందును. (57)