బ్రహ్మ మహా పురాణము
నృసింహమాహాత్మ్యము
బ్రహ్మ ఇట్లు అనియె-ఇట్లు బలరాముని కృష్ణుని సుభద్రనుజూచి మ్రొక్కిన అతడు ధర్మాది పురుషార్థములను నాల్గింటిని బడయును. దేవాలయము వెడలి నమస్కరించి ఇసుకలో దాగియున్న ఇంద్ర నీలమణి స్వరూపుడగు విష్ణుని దర్శించిన భక్తుడు వైకుంఠమునకు ఏగును.
హిరణ్యకశిపుని సంహరించిన నరసింహమూర్తి సర్వదేవతామయము నిచట దర్శించిన అతడు సర్వ పాప విముక్తుడగును. నరసింహ భక్తులకు అసాధ్యములేదు. సర్వాభీష్టములు లభించును. ఆయన సర్వ పురుషార్థ ప్రదాత.
నరసింహమూర్తి ప్రభావమును విపులముగా వినకోరుచున్నాను. ఆయన ఎట్లు ప్రసన్నుడగును. ఆయన వలన కలుగు సిద్ధులేవి. దయచేసి తెల్పుము అనగా బ్రహ్మ ఇట్లు అనెను. మునులార! ఆయన అజేయుడు ఊహకందడు, భుక్తి ముక్తి ప్రదుడు ఆయన గుణ సంపదను తెలుపవశముగాదు. ఆయన అనుగ్రహముచే దైవ మానుష సర్వ సిద్ధులు లభించును. ఆయన దయచే స్వర్గ మర్త్య పాతాళాదులందు అప్రతిహతమైన గమనమేర్పడును. చరాచరముల యందు నరసింహ భక్తునకు అసాధ్యము లేదు. నరసింహస్వామి ప్రసన్నుడగుటకు సురాసురులకు కూడ తెలియని ఆయన తత్త్వమును - ఉపాసనా కల్పమును తెల్పెదను వినుడు.
నృసింహోపాసకుడు ఆకులు, దుంపలు, యవలు, పండ్లు, పేలపిండి, జలము మాత్రముతో వసించుచు, పట్టుగోచి పెట్టుకొని అరణ్యమందు, పర్వతమునందు, నదీ సంగమమునందు, ఊషర క్షేత్రమునందు, సిద్ధ క్షేత్రమునందు స్వామిని ప్రతిష్ఠించి జితేంద్రియుడై సమాధినిష్ఠుడై కల్పవిధానముచే పూజింపవలెను. శుక్లపక్ష ద్వాదశినాడు ఉపవసించి నృసింహ మంత్రమును ఇరువది లక్షలు జపింపవలెను. దానిచే మహాపాతక ఉపపాతకముల నుండి ముక్తుడగును.
స్వామికి ప్రదక్షిణ మాచరించి షోడశోపచార పూజల నొనరించి నమస్కారము చేయవలెను. పచ్చ కర్పూరమునందు అద్దిన పూవులను శిరసునందుంచిన సిద్ధిని బడయగలరు. అన్నిపనులు అప్రతిహతముగ సఫలమగును. బ్రహ్మ రుద్రాదులేని ఆయన తేజస్సును ఓర్వజాలరు. దానవ, సిద్ధ, గంధర్వ, మానుషాదుల విషయము చెప్పనేల. అసురములైన మంత్రములు అభిచారికములును నృసింహ మంత్ర జపముచే ప్రళయము చెందును. నృసింహ కవచము ఒక్కసారి జపించిన, సర్వోపద్రవముల నుండి రక్షించును. రెండుసార్లు జపించిన దేవదానవ యక్ష భూత ప్రేత పిశాచాదుల బాధలు నశించును. మూడు సార్లు జపించిన పండ్రెండు యోజనముల మేరలో సురాసురులకు అభేద్యుడగును.
ఇట్లు ఆ భగవంతుని పూజించి ఆ సాధకుడు నృసింహ బిలద్వారమునకు ఏగి మూడు రాత్రులు మోదుగ సమిధలచే అగ్నిని జ్వలింపజేసి త్రిమధు రసపూతములైన మోదుగ సమిధలను హోమము చేయవలెను. రెండువందల హోమములను వషట్కార పూర్వకముగా జేయవలెను. అంతట నరసింహబిల ద్వారము తెరుచుకొనును. నిశ్శంకముగా నృసింహకవచ న్యాసము చేసికొని లోనికి ప్రవేశించిన సాధకునకు తమో మోహము కల్గును. వెంటనే సువిశాలమైన రాజమార్గము కనిపించును. అట తేనెటీగల బాధ కనిపింపదు. నృసింహుని స్మరించుచు అటనుండి సాధకుడు పాతాళము ప్రవేశించును.
ఆ లోనికేగి నృసింహ మంత్రజపము జేయగా వీణా మేళనము జేయు వేలకొలది స్త్రీలెదురై స్వాగతమిచ్చి చేయి పట్టుకొని లోనికి బ్రవేశింప జేయుదురు. తరువాత ఒక దివ్య రసాయన పానముచే దివ్య శరీరియు బలశాలియు అగును. భూత ప్రళయముదాక ఆ కన్యలతో క్రీడించి శరీరము బాసి వాసుదేవుని యందు లీనమగును.
ఆ గుహయందు వసింప గోరని వాడటనుండి వెలికి వచ్చి, పట్టము శూలము ఖడ్గము రోచనము మణిరసము రసాయనము పాదుకాంజనము కృష్ణాజినము మనోహరమైన కమండలువు అక్షమాల సంజీవని విద్యయును శస్తములను చేకొని జ్వలించెడి విస్ఫులింగములచే అవరింపబడిన త్రిశిఖము నొక్కసారి హృదయమందు అనించినంతనే అనేక కోటిజన్మ పాపము దహింపబడును. ఆ త్రిశూలమును విషమునందుంచిన విషము విరిగిపోవును. శరీరమునకు తాకించిన కుష్ఠువ్యాధి పోవును. తన దేహమందు మోపిన భ్రూణహత్య మొదలైన పాపములు పోవును. తీవ్రమయిన గ్రహబాధలు జ్వలించు ఆ త్రిశూలమును ధ్యానించినంతనే నశించును. బాలురకు కంఠమందు కట్టిన రక్ష ఇచ్చును. అది గరళరోగములను, గండపిండకలూతాది రోగములను నశింపజేయును. ఆవునేతితో, ఆవు పాలతో, సమిధలతో ఒక నెల మూడు సంధ్యలయందును ఆ మంత్ర జపముచే హోమము చేసినయెడల అసాధ్యరోగములు కూడ నశించును. త్రిలోకము లందేది కోరినను సిద్ధించును. నృసింహుని పూజించిన యెడల కోరికలెల్ల సిద్ధించును.
నరసింహుని అష్టోత్తర శతనామములతో పూజించి, పుట్టమన్ను, శ్మశానమందలి మట్టి, రాజవీధిని నాలుగు దారులు కలియుచోటనుండియు ఏడేసి మట్టి ఉండలు గ్రహించి రక్తచందనము కలిపి ఆవుపాలతో మెదిపి ఆరంగుళముల నరసింహ ప్రతిమ తయారుజేసి భూర్జ పత్రమునందు గోరోచనముతో మంత్రమును వ్రాసి నరసింహస్వామి కంఠమునందు గట్టి మంత్రమును లెక్కలేకుండగ మడుగులో నిలిచి ఏడురోజులు పూజించి జపింపవలెను. అందువలన ముహూర్తమాత్రములో ఎల్లభూమియు జల సమృద్ధమగును. ఎండిన చెట్టుచివర నరసింహమూర్తిని పూజించి నూట యెనిమిది మార్లు ఆ మంత్రము జపించిన ఎడల వర్షము ఆగిపోవును. అట్లే నరసింహస్వామిని పిండిముద్దలోనుంచి గిరగిర త్రిప్పిన ఎడల వెంటనే పెనుగాలి వీచును. తరువాత ఏడుసార్లు జపించి మంత్రించిన జలముచే ఆ ప్రతిమ అభిషేకించి దానిని తాను ధరింపవలెను.
దానిని ఎవ్వని గృహద్వారమందు పాతిపెట్టునో, వానివంశము నశించును. ఆ ప్రతిమను వెలికితీయగా ఆ ఉపద్రవము శాంతించును. కావున సర్వాభీష్టములను ఒసంగు నరసింహమూర్తిని భక్తితో పూజింపవలెను. దానిచే పాపముక్తుడై విష్ణులోకమందును. బ్రాహ్మణాది వర్ణములవారు అంత్యజులుకూడ ఆ స్వామిని పూజించి అమంగళములను తరింపగలరు. అంతియకాదు దేవత్వ దేవేంద్రత్వములు యక్ష విద్యాధర గంధర్వాది దేవ విశేష భావములను రాజ్య స్వర్గ సుఖములను దుర్లభమైన మోక్షమును గూడ పొంద గలరు. నృసింహ దర్శన మొకసారి చేసినను పాప విముక్తి నంది అభీష్టములను పొంద గలరు. యుద్ధమందు, సంకటములందు, దొంగలు, కిరాతులు మొదలైనవారి పీడచే దుర్గమమైన అడవి అందు ప్రాణసందేహము కల్గినపుడు విషాగ్ని జలోపద్రవముల నుండియు రాజులవలన, సముద్రమువలన, గ్రహములవలన కలుగు పీడనుండి తరించును. నృసింహస్వామిని స్మరించినంతనే రాజోపద్రవములనుండి ముక్తుడగును. ఉదయ మందు చీకటి విడిపోయినట్లు స్వామి దర్శనముచే సమస్త కష్టములు నశించును. ఘుటిక, కాటుక, పాదుక అను వానియందు రసాయన సిద్ధిని పొందవచ్చును. ఎల్ల కోరికలు ఫలించును.
స్వామిని పూజించి నమస్కరించి దర్శించి యశ్వమేధ యాగముల ఫలమందును, సద్గుణ సంపన్నుడగును. జరా మరణములు లేనివాడై, చిరుగంటలతో మెరయు మొరయు కామదమైన స్వర్గ విమానమెక్కి ఉదయసూర్యునివలె దివ్యవర్చస్సుతో ముత్యాల హారములు మెరయు దివ్య స్త్రీ శతముతో గంధర్వగాన రమ్యమైన విమానమెక్కి ఇరువది యొక్క తరములవారిని ఉద్ధరించుచు సాక్షాద్దేవతా స్వరూపముతో సమ్మోదముతో సుఖముతో అప్సరసలు స్తుతింప విష్ణు లోకమున కేగును. అందు అనుపమ భోగములను అనుభవించి చతుర్భుజములు దాల్చి మనోహరమైన రూపముతో భూత ప్రళయము దాక ఆనందించి ఆపుణ్యము భుక్తమయిన తరువాత ఉత్తమమయిన యోగుల కులమందు పుట్టి చతుర్వేద వేదాంగ పాఠగుడై విష్ణుదేవతా భక్తి యోగము నంది మోక్షమును పొందును. (58)