దక్షిణ సముద్ర తీరమందు ఓఢ్రదేశము కలదు. అది స్వర్గ మోక్ష ప్రదము. సముద్రమునకు ఉత్తరముగా విరజ మండలము సరిహద్దులదాక అది ఉన్నది. అచటి బ్రాహ్మణులు జితేంద్రియులు. తపస్స్వాధ్యాయ నిరతులు. వంద్యులు, పూజ్యులును, యజ్ఞ దాన వివాహాది శుభ కర్మములందు శ్రాద్ధాదుల యందు వీరు చాలా ప్రశస్తులు. షట్కర్మ నిరతులు. ఇతిహాస పురాణార్ధ విశారదులు. సర్వశాస్త్రార్ధ సమర్థులు. మాత్సర్యహీనులు పుత్ర దారధనక్షేత్ర సంపన్నులు. సత్యవచనులు. దాతలు. క్షత్రియాది వర్ణములవారును స్వధర్మనిరతులు ధార్మికులు శాంతులు, ఆదేశమందు కోణాదిత్యుడను పేర సూర్య భగవానుడు వెలసి యున్నాడు. తద్దర్శనము సర్వపాప నికృంతనము. లవణ సముద్రోత్తర తీరము వాలుకాకీర్ణము. మనోహరము సర్వపుష్ప ఫల భరితతరుసుందరము రమారమి సార్ధ యోజన విశాలముగా అచట సూర్య క్షేత్రము భక్తి ముక్తి ప్రదము. అది నానాతరులతా సుందరము.
మాఘమాస శుక్ల సప్తమినాడు వేకువన అక్కడి సముద్రమున స్నానముచేసి దేవ ఋషి పితృ తర్పణముచేసి ధౌతవస్త్రములు దాల్చి ఆచమించి అమ్మహోదధియందు ఉదయ వేళ ఆసీనుడై రక్తచందన జలముల సూర్యునకు ఎనిమిది రేకులుగల కేసరా వృతమైన వర్తులాకార పద్మమును (అష్టదళ పద్మమును) కర్ణికతో గూడ లిఖించి తిలతండుల తోయముల రక్తచందనముతో గూర్చి రక్త పుష్పములు దర్భలు రాగిపాత్ర యందు ఉంచి దానిని మరొక పాత్రతో మూసి అంగన్యాస కరన్యాసములుచేసి తనను భాస్కరునిగా ధ్యానించి శ్రద్ధతో నడుమ నగ్నిదశమందు నైఋతి వాయవ్య ఈశాన్యస్థాన మధ్యయందు పూజచేయవలెను. (కేసరము= కింజల్కము)
ఆ పద్మమును ఆరాధించి, అందు గగనమునుండి భాస్కరుని ఆహ్వానించి, తామర పువ్వు దుద్దు మీద ప్రతిష్ఠించి, ముద్రా ప్రదర్శనముచేసి రెండు భుజములు తేనెరంగు కన్నులుగల వానినిగా అరుణ పద్మారుణాంబరధారిగా, సర్వాభరణ భూషితునిగా, సర్వలక్షణ లక్షితునిగా, శాంతమూర్తిగా, వరదముద్రధారిగా, ప్రభామండలమండితునిగా, సాంద్ర సిందూర వర్ణునిగ, ఉదయ భాస్కరుని ధ్యానించి మోకాళ్ళపై కూర్చుండి ఆ పాత్రను పైకెత్తి, శిరంబున దాల్చి, త్ర్యక్షర మంత్రముతో సూర్యునకు అర్ఘ్యమీయవలెను. సూర్య మంత్ర దీక్షలేనివాడు సూర్య నామముతోనే అర్ఘ్య మీయవచ్చును. ఆగ్నేయ-నైఋతి, వాయు-ఈశ-మధ్య పూర్వాదిదిశలందు-హృదయ-శిర శ్శిఖా-కవచ-నేత్ర అస్త్రములను పూజింపవలెను. అర్ఘ్యము అర్పించి, గంధ ధూపదీప నైవేద్యాదు లొసగి, జపముచేసి నమస్కరించి, స్తుతించి, ముద్రాబంధముతో విసర్జనము చెప్పవలెను, భక్తితో ఈ విధముగా సూర్యునకు అర్ఘ్యమిచ్చిన పుణ్యులు భుక్తిముక్తులను బడయుదురు. త్రైలోక్య దీపనుడైన భాస్కరదేవుని, గగన సంచారిని, ఎవ్వరు ఆశ్రయింతురో ఆ జనులు సుఖభాజనులు. భాస్కరున అర్ఘ్యమీయ కుండ విష్ణు శంకర సురేశ్వరులను అర్చింపగూడదు.
రోగవిముక్తి-ధనసంపత్తి-విద్యాసిద్ధి-పుత్ర పౌత్రాభివృద్ధి అన్నియు దీని వలన కల్గును. చేతిలో పూవులు ధరించి సూర్యాలయమునకు వెళ్ళవలయును. మూడుమార్లు ప్రదక్షిణము చేయవలెను. ఆ మీద ఆ దేవుని పూజింపవలెను. దానిచేత దశాశ్వమేధ ఫలము కల్గును, తుదకు సూర్యునివలె వెలుగు విమానమును ఎక్కి గంధర్వులచే ఉపగీయమానుడై, సూర్య భక్తుడు సూర్యలోకమందును తిరిగి వచ్చి యోగి కులమందు ఉదయించి భానుయోగము నంది ముక్తినందును. చైత్రశుక్లమందు మదనభంజిక అను (కామదహనము) యాత్రను చేసినను ఈ ఫలమందును. శయనోత్థాన ఏకాదశీ తిథులందు భాను సంక్రమణమందు ఈ యాత్ర చేసినవారు విమానయానులై భానులోకమునకు పోవుదురు. ఆ సముద్ర తీరమున రామేశ్వరుడను పేర శివుడున్నాడు. ఆయనను అర్చించినవారికి రాజసూయ ఫలమొదవును. కామగమైన విమానమున ఈమున్ను చెప్పిన ప్రభావముతో శివపురికేగును. ఈ రవి క్షేత్రమున మరణించిన యెడల జీవి సూర్యలోకమంది, మానవ జన్మమెత్తి, ధార్మిక ప్రభువై సూర్య సారూప్యమంది మోక్షమందును. ఇది కోణార్కస్వామి మహిమ. అని లోమ హర్షుణుడు చెప్పగా మునులు హెచ్చిన కుతూహలముతో మహానుభావా (28)