బ్రహ్మ మహా పురాణము
సూర్యపూజా ప్రకరణము
మీరు చెప్పిన భాస్కర క్షేత్రమహిమ వింటిమి. కాని మాకు తృప్తి కలుగలేదు. కావున పూజా విధానము దానము నమస్కారము-ప్రదక్షిణము ధూపదీపాది సమర్పణ ఉపవాసము, సూర్యాలయ మార్జనము-మొదలగు వాని విశేషములను వినగోరెదము. సూర్య ప్రీతికరములైన పూవులను, నమస్కార విశేషములను, సూర్య అర్ఘ్య విధానము, సూర్యుని ఉద్దేశించి చేయు ఉపవాసము, నక్తము (పగలు ఉపవాసముండి రాత్రి భోజనము చేయుట) మొదలగువాని ఫలము, దేశకాల విశేషములను వినవలెనని కుతూహల పడుచున్నాము. అని మునులడుగ బ్రహ్మ ఇట్లు అనియె.
మనస్సుచేత జేయు భావన భక్తి, శ్రద్ధ, ధ్యానము, సమాధి అనుపేర్లచే పిలువబడును. భక్తి, సమాధి, స్తుతి అనువానిచే పత్ర, పుష్ప, ఫలతోయములు ఏకొంచెము ఒసగినను అది భగవంతుడు స్వీకరించి ప్రీతి చెందును. రవికి భక్తితో చేసిన ప్రదక్షిణము అఖిల భూప్రదక్షిణమే అగును. అది సర్వదేవతా ప్రదక్షిణమే కూడా. షష్ఠి తిథియందు ఏకభుక్తము చేసిగాని, సప్తమినాడు భానుని అర్చించిన అది అశ్వమేధ ఫలమిచ్చును. కృష్ణపక్ష సప్తమీ తిధియందు భాస్కరుని పూజించిన పద్మప్రభగల విమానములో ఎక్కి సూర్యలోకమునకు ఏగును. శుక్లపక్ష సప్తమినాడు ఉపవసించి తెల్లనిపూజా ద్రవ్యములచే అబ్జబాంధవుని పూజించిన అదియే ఫలము. అర్క సంపుటముతో (రాగి అరివాణముతో) కూడిన తీర్థమునే అనగా రాగి పళ్ళెములో ఉంచిన మంచినీటిని ఏకోత్తర వృద్ధిగా, అనగా క్రమముగా ఒకటి పెంచుచు, ఇరవై నాలుగు రోజులు పానము చేసి క్రమముగా తగ్గించుకొనివచ్చుచు, సేవించుచు ఇట్లు రెండేండ్లకు వ్రతసమాప్తి చేసినచో ఆ సూర్య సప్తమీ వ్రతము అశేష కామప్రదము. శుక్లపక్ష సప్తమి భానువారము కలసివచ్చెనేని అది విజయ సప్తమి అనబడును. అందు స్నాన దానములు అనంత ఫలదములు అగును.
ఆదివారము శ్రాద్ధము పెట్టినను, మహాశ్వేతము (తెల్ల జిల్లేడు)తో హోమమొనర్చినను అభీష్టసిద్ధి కలుగును. వారి వంశమున దరిద్రుడుగాని, రోగిగాని పుట్టడు. తెల్లని ఎఱ్ఱని, పసుపుపచ్చని, మృత్తికతో పూసికొన్నవాని కోర్కెలు నెరవేరును. రంగురంగుల పూలతో చిత్రభానుని అర్చించి ఉపవాసము ఉండిన అభీష్టములు సిద్ధించును. ఆవు నెయ్యితో గాని, నువ్వుల నూనెతోగాని దీపము పెట్టి ఆదిత్యుని పూజించిన వానికి నేత్ర వ్యాధులుండవు. దీపదాతకు జ్ఞానదీపము లభించును. తిలలు పవిత్రములు కావున తైలగోదానము పుణ్యప్రదము. నలుదారులు కలిసినచోట (చతుష్పథములందు) రాజమార్గములందు అట్టి దీపదానము చేసిననరుడు అందగాడు (సుభగుడు) భాగ్యవంతుడు అగును. దీపము హవిర్ద్రవ్యములు (ఆవు నెయ్యి) మొదలైన వానిచే పెట్టుట ప్రథమ కల్పము. ఓషధీరసముల చేత పెట్టుట రెండవ కల్పము. వసామేదోస్థి సంబంధమైన (క్రొవ్వుపదార్థములు) దీపము నిషిద్ధము. దీపము ఎప్పుడును ఊర్ధ్వముగా ప్రసరించును. కావున దీపదాత ఎపుడు ఊర్ధ్వ గతినే గాని అథోగతి పొందడు. వెలుగుచున్న దీపమును తగ్గింపరాదు. ఆర్పివేయరాదు. అట్లు చేసినవాడు బంధము, నాశనము, కోపము, తమోగుణమును పొందును. దీపదాత స్వర్గమందు దీపమాలవలె వెలుగును. కుంకుమ అగరు చందనములచే రక్తచందన రక్త పుష్పములచే ఆదిత్యుని అర్చించిన వాడు ఉదయమందు అర్ఘ్యమిచ్చివాడు సంవత్సరములో ఇష్టసిద్ధిని గాంచును.
సూర్యుడు ఉదయించి అస్తమించుదాక నిలబడి సూర్యాభిముఖుడై ఏదేని మంత్రము జపించినవాడు, సూర్య స్తోత్రమేదేని చేసినవాడు సర్వ పాపములనుంచి విముక్తుడు అగును. దీనిని ఆదిత్య వ్రతమందురు. సువర్ణ గోవృషభ వస్త్ర దానములతో సూర్యార్ఘ్యమును ఇచ్చిన పుణ్యుడు ఆ ఫలము ఏడు జన్మలదాక అనుభవించును. అగ్ని నీరు అంతరిక్షము, పవిత్రభూమి ప్రతిమ పిండితో చేసిన సూర్యమూర్తి అనువానియందు అర్ఘ్యమీయవలెను. సవ్యముగా గాని అపసవ్యముగ (కుడి ఎడమ ప్రక్కల) అర్ఘ్యమీయరాదు. అభిముఖముగ మాత్రమే సూర్యార్ఘ్యమీయ వలెను. రవికి గుగ్గులు కర్ర, మారేడు, దేవదారువులతో చేసిన నలుపలకల ఆసనము, కర్పూర అగరు ధూపము లొసగినవారు స్వర్గమందుదురు. విషు వములందు (రాత్రి పగలు సమముగా ఉన్న పర్వములందు) ప్రభాకరుని అర్చించిన సర్వ దురితములు తొలగును. కృసరము (పులగము) పాయసము, అపూపములు, పండ్లు, దుంపలు, నెయ్యి అనువానిచే సూర్యబలి ఇచ్చిన సర్వకామసమృద్ధి నందును. ఆవునేతితో తర్పణము చేసిన సర్వసిద్ధినందును. ఆవుపాలతో తర్పణము మనస్తాపహరణము, ఆవు పెరుగుతో చేసిన కార్యసిద్ధి. పవిత్ర తీర్థజలముచే మార్తండునకు స్నానము నిర్వర్తించినచో పరమగతి వడయును. ఛత్రముధ్వజము వితానము (చాందినీ) పతాక చామరములు భానునకు సమర్పించిన అభీష్టగతి లభించును. ఏ ద్రవ్యము అర్కునకు భక్తితో సమర్పించునో, ఆ ద్రవ్యము అనంతముగా లభించును. త్రికరణకృత దురితజాలమెల్ల జలజబంధువు (సూర్య దేవుడు) వారింపగలడు. యథోక దక్షిణముగా చేసిన క్రతుశతము వలన ఫలము ఒక్కనాడు సూర్యుని భక్తితో ఆరాధించినను లభింపగలదు. అనగా మునులు (29)