పార్వతి ఇట్లు పలికెను-
“ఏ శీలము, ఏ ఆచరణము కలిగి ఏ కర్మములు ఆచరించి ఏ దానములు చేసి మానవుడు స్వర్గమును పొందును?”
మహేశ్వరుడు ఇట్లు పలికెను-
బ్రాహ్మణులను అదరించుచు దీనులు అర్తులు బీదలు అగువారికి భక్ష్యములు భోజ్యములు అన్న పానములు వస్త్రములు ఉదారబుద్ధితో దానము చేయవలెను. బాటసారులకు ఆశ్రయములను సభామండపములను కోనేరులను నిర్మించుచు నిత్య నైమిత్తిక కామ్యకర్మలను ప్రయతుడై శుచియై చేయుచు, ఆసనములు శయనములు వాహనములు గృహములు రత్నము ధనము పొలములు పైరులు స్త్రీలు మొదలగునవి ప్రశాంత మనస్సుతో నిరతము దానముచేయునతడు దేవలోకమునకు పోవును. అచ్చట చాల కాలముండి శ్రేష్ఠములగు భోగముల అనుభవించి అప్సరసలతో కూడి నందనోద్యానము మొదలగుచోట సంతోషముతో గడిపి, అక్కడి నుండి క్రిందికి జారియు భూలోకమునందు ధన ధాన్యములతో నిండిన మహాభాగుల ఇంట జన్మించును. అచ్చట అన్ని కోరికలను అనుభవించుచు సంతోషించుచు మహాభోగములను అనుభవించును. మహా కార్యములు చేయును. ధనవంతుడగును. అందరకు చూడముచ్చటయగు బ్రాహ్మణుడగును.
ఉండియు దానము చేయక అన్నముపెట్టక దీనులను అంధులను పేదలను భిక్షుకులను అతిథులను చూచియు, వారు యాచించుచున్నను నాలుక కదలించి మాటనైన ఆడక, ధనము సువర్ణము వస్త్రములు భోగములు గోవులు వివిధములగు అన్నములు దానము చేయక లోభులై, నాస్తికులై అవివేకులై ఉండువారు నరకము పొందుదురు. ఇట్టివారు నరకయాతనలైన తరువాత మానవులుగా జన్మించినను ఆకలిదప్పులు బాధలు పడుచు జనులచే వెలివేయబడి ఏ భోగములను అనుభవించు అశయులేక జీవనాధారము లేక తక్కువ భోగములతో బీదలై ఉందురు. కపటులై గర్వముకలిగి అల్పబుద్ధులై పీఠముతో గౌరవించదగినవారిని అట్లు గౌరవించక త్రోవ ఈయవలసిన వారికి త్రోవ ఈయక పూజించదగినవారిని పాద్యము ఆచమనీయము మొదలగు వానితో పూజించక గురువులతో ప్రేమగా శుభము అభిమతమైన మాటలాడక దురభిమానము లోభము కలవారై సన్మానించదగిన పెద్దలను సన్మానించక పోగా అవమానించువారు అందరును నరకమును పొందుదురు. ఎన్నో వేల ఏండ్లు నరకము అనుభవించి మరల మానవులై పుట్టినను శునక మాంసము వండితినువారి వంటి బుద్ధిహీనుల, నింద్యుల ఇండ్లలో నింద్యులుగా పుట్టుదురు.
దంభము దురభిమానములేక దేవతలను అతిథులను గౌరవించుచు జనులచే పూజింపబడుచు పెద్దలకు నమస్కరించుచు తీయని మాటలాడుచు సర్వకర్మలచే ఇతరులకు ప్రీతికలిగించుచు ఏ ప్రాణిని ద్వేషించక మంచి ముఖ లక్షణములు స్నేహభావము కలిగి ఎదుటి వారికి స్వాగతము పలుకుచు యథార్థముగా సత్కార పూర్వకముగా త్రోవ ఈయదగిన వారికి త్రోవ ఇచ్చుచు గురువుల గౌరవించుచు అతిథులను అభ్యాగతులను పూజించు నరుడు స్వర్గము పొందును. తరువాత కూడ మానవ లోకమున గొప్ప ఇంటపుట్టి సర్వ రత్నములు-శ్రేష్ఠ వస్తువులు లభించి సర్వ భోగములను పొంది తగిన విధమున దానము చేయుచు ధర్మములను ఆచరించుచు సర్వ ప్రాణుల సమానమును నమస్కారములను అందుకొనువాడగును. మొత్తము మీద మనుష్యుడు ఎప్పుడును తాను చేసిన కర్మమునకు అనుగుణమగు ఫలమును పొందును అని నిర్ణయము. విధాత బ్రహ్మ స్వయముగానే చెప్పిన ఈ ధర్మమును నీకు చెప్పితిని. సర్వ ప్రాణులకు భయమును కలిగించు ప్రవర్తనము కలిగి హస్తములతోనో పాదములతోనో, త్రాటితోనో, కఱ్ఱతోనో, గడ్డలతోనో, స్తంభముల వంటి ఇతరోపాయములతోనో, ప్రతీకార బుద్ధితో ప్రాణులను బాధించుచు, భయపెట్టుచు ఉండువాడు నరకమును పొందును. ఎంతో కాలము తరువాత అతడు మనుష్యుడై పుట్టినను జనులకు ద్వేష్యుడై అధముడై జ్ఞాతులకు బంధువులకు ఇష్టుడు కాక ఉండును.
సర్వ భూతములను దయతో మైత్రితో చూచుచు వానికి తండ్రివలె మెలగుచు వైరము చూపక ఇంద్రియముల జయించి హస్త పాదాదులతో ప్రాణుల హింసించక భయపెట్టక అన్ని ప్రాణులకు విశ్వసనీయుడై శుభకర్మలను ఆచరించుచుండువారు స్వర్గమును పొంది అచ్చట దేవతల వలెనే దివ్యమగు భవనమున సంతోషమునొందును. స్వర్గసుఖాను భవము ముగిసిన తరువాతను కూడ మానవుడు పుట్టి శ్రమలు భయములు లేక సుఖమును అనుభవించును.
మానవులలో కొందఱు ఊహలు అపోహలు, విషయముల వింగడించుకొనుట, చేయుటలో నేర్పుకలిగి ఆధ్యాత్మిక విషయజ్ఞానము లౌకిక విషయములలో విజ్ఞానము కలిగి ప్రజ్ఞావంతులై అర్థ విషయములలో నేర్పుకలిగి యున్నారు. మఱికొందఱు ప్రజ్ఞారహితులై జ్ఞానవిజ్ఞానములు లేక ఉన్నారు. కొందఱు పుట్టుగ్రుడ్డివారు, రోగార్తులు నపుంసకులు అగుచున్నారు. ఏ కర్మఫలముగా వీరు ఇట్లు వైవిధ్యము పొందుచున్నారో, సర్వధర్మములను ఎరిగిన వారిలో శ్రేష్ఠుడవగు ఓ విరూపాక్షా! నాకు తెలిపి నా సంశయము తీర్చుము.
వేదార్థముల నెఱిగిన బ్రాహ్మణులను సిద్ధులను ధర్మముల ఎఱిగిన వారిని అనుదినము మంచి చెడులను అడుగుచు, అశుభకర్మముల విడిచి శుభకర్మలను ఆచరించువాడు ఇహలోకమున సుఖములు అనుభవించి పరమున స్వర్గమును పొందును. అతడు మరల మానవుడై పుట్టినను మేధావంతుడు యజ్ఞాది కర్మలయందు ఆసక్తితో కూడిన శుభమగు శాస్త్ర సంస్కారము కలవాడగును. దుష్ట స్వభావముతో పరదారలను చెడుచూపు చూచువాడు పుట్టు గ్రుడ్డి అగును. వివస్తయగు స్త్రీని అధిక దుష్టమగు మనస్సుతో చూచువాడు ఈ దుష్కృతమునకు ఫలముగా రోగములచే బాధనొందును. మూఢులై దురాచరణము కలిగి, యోనికానిచోట్ల మైథునము చేయువారు ప్రజ్ఞారహితులు నపుంసకులు అగుదురు. మైథునమునకై పశువులను బంధించువారు గురుపత్నితో సంగమించు వారు వివిధములుగ మైథునము చేయువారును నపుంసకులు అగుదురు.
ఓ దేవశ్రేష్ఠా! దోషముతో కూడిన ఏ కర్మను విడిచి దోష రహితమగు ఏ కర్మను ఆచరించి మానవుడు శ్రేయమును పొందును?
శ్రేయస్సు కలిగించు మార్గమును ధర్మములను సద్గుణములను కోరుచు అవి ఎరిగిన బ్రాహ్మణులను అడిగి తెలిసి ఆచరించువాడు స్వర్గము నొందును. తరువాత మనుష్యుడై పుట్టినను ఇంద్రియ నిగ్రహము మేధ ధారణాశక్తి కల ప్రాజ్ఞుడుగా జన్మించును. మానవులకు క్షేమము కలిగించు సన్మార్గము ఇది. మానవుల శ్రేయము కోరి నీకు తెలిపితిని.
ఓ పరమేశ్వరా! కొందఱు అల్ప విజ్ఞానము ధర్మ ద్వేషము కలవారై వేదధర్మములను ఎఱిగిన బ్రాహ్మణులను ధర్మమును అడిగి తెలిసికొనగోరక ఉన్నారు. మంచి నియుమములను కర్మలను ఆచరించక నియమ భ్రష్టులై రాక్షసులవలె ఉందురు. మఱి కొందఱు మంచి వ్రతములను ఆచరించుచు శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము కలిగి యజ్ఞాదుల నాచరించుచు మూఢత్వములేక ఉందురు. ఏ కర్మములకు ఫలముగా ఇట్లగుదురో తెలుపుము.
పూర్వులు నిర్మించిన ధర్మశాస్త్రముల లోక ధర్మముల వ్యవస్థలను శాస్త్ర ప్రమాణానుసారము ఆచరించువారు దృఢవ్రతులై ఆయాశాస్త్రీయ కర్మలను గట్టిగా ఆచరించువారుగా ఉన్నారు. అజ్ఞానవశమున అధర్మమును కూడ ధర్మము అని చెప్పుచు సద్ర్వతములను ఆచరించక శాస్త్ర మర్యాదలను విడిచినవారు బ్రహ్మరాక్షసులగుదురు. కాలమును అనుసరించి పనులనాచరించుచు, హోమము వషట్కారమువంటి వైదిక కర్మానుష్ఠానమునకు దూరముగా ఉండువారు నరాధములు అగుదురు. ఓ దేవీ! నీ సర్వ సంశయములను ఛేదించుటకుగాను మానవుల శ్రేయమునకు అశ్రేయమునకును హేతువగు ధర్మ సముద్రమును ఈ విధముగా వివరించితిని” (225)