మునులు వ్యాసునితో ఇట్లనిరి:
“ఓ విపేంద్రా! శిష్టసమ్మతమగు యోగమార్గ ప్రక్రియను తాము యుక్తియుక్తముగా శిష్యులగు మాకు హితముగా ప్రతిపాదించితిరి. లోకత్రయము నందును ప్రసిద్ధిపొంది ఉన్న సాంఖ్య జ్ఞానమునకు సంబంధించిన శాస్త్రతత్త్వమును దాని యందు సిద్ధిని పొందగోరినవారు పాటించవలసిన ధర్మము ఉన్నది ఉన్నట్లుగా మాకు ప్రవచింప గోరుచున్నాము” అని అడుగగా వ్యాసులు
“ఓ మునులారా! వినుడు. ఆత్మ తత్త్వమును ఎఱిగినవారును సమర్థులును నగు కపిలాది వృద్ధయతులు తెలిపిన విషయమును తెలిపెదను. వారిలో కొందరు ఉత్తమమగు బుద్ధివైశారద్యము కల మునిసత్తములును కలరు. వారు చెప్పిన వానిలో సుగుణము లెన్నియో కలవు. దోషమొక్కటియు లేదు. అది ఏమనిన వివేకముచే దుర్జయములగు విషయములను వాని యందలి దోషములను ఎరుగవలెను. ఆ విషయములు మనుష్యులు పిశాచులు ఉరగులు గంధర్వులు పితరులు తిర్యక్ర్పాణులు గరుడులు మరుత్తులు మహర్షులు రాజర్షులు అసురులు విశ్వేదేవుడు దేవర్షులు యోగులు బ్రహ్మ-వీరనుభవించు విషయములు వేరువేరు విధములుగా ఉండును. వానియందలి దోషములను వివిధములు. కాలపరిమాణము ఆయువు సుఖముననుభవించవలసిన కాలము విషయాభిలాషవలనను తిర్యగ్జన్మల అందును నరకము అందునుగల దుఃఖములును దోషములును స్వర్గసుఖము నందలి గుణములును దోషములును వేదవాదము జ్ఞానము సాంఖ్య యోగము దశ గుణములు కల సత్త్వము నవ గుణములుకల రజస్సు అష్ట గుణములుగల తపస్సు సప్త గుణములుకల బుద్ధి షడ్గుణ యుక్తమగు నభస్సు (ఆకాశము) త్రిగుణమగు తమస్సు ఏక గుణమగు సత్త్వము మోక్షమునకు కొనిపోవు మార్గము. ప్రళయతత్త్వ స్వరూపములు ఎరిగి ఈ చెప్పిన వానియందలి గుణదోషములను గుర్తెరిగి ఆత్మతత్త్వాభ్యాసము చేసిన వారు చెప్పిన యుక్తులతో జ్ఞానమును విజ్ఞానమును (జ్ఞానమనగా విషయమును ఎరుగుట, విజ్ఞానమనగా తెలిసిన దానిని అనుభవములోనికి తెచ్చుకొనుట) సంపాదించి నిఃశ్రేయస మను సర్వ శుభతమమగు మోక్షమును పొందుదురు.
చక్షుస్సు రూపముతో అగ్నితో ఘోణము గంధముతో పృథివితో శ్రోత్రము శబ్దముతో ఆకాశముతో జిహ్వరసముతో జలముతో త్వగింద్రియము స్పర్శతో వాయువుతో నిత్య సంబంధముకలవి. తమస్సునందు మోహము నందు లోభము నిలిచి ఉన్నవి. నడకయందు విష్ణువు బలమునందు ఇంద్రుడు ఉదరమునందు అగ్ని జలము నందు భూదేవి తేజస్సునందు జలము వాయువునందు తేజస్సు ఆకాశమునందు వాయువు మహత్తత్త్వమునందు ఆకాశము మహస్సునందు సత్త్వరజస్తమస్సులు నిలిచి ఉండును. సత్వము ఆత్మయందు, ఆత్మనారాయణునందు ఆశ్రయించి యుండును. నారాయణుడు మోక్షమునందు నిలిచి యుండును. మోక్షమున కాశ్రయమేదియు లేదు. స్థూల దేహము పదునారు గుణములతో ఏర్పడినది. స్వభావము భావన అనునవి దేహము నాశ్రయించి యుండును. ఆత్మ మాత్రము ఏ పాపములు అంటక తటస్థమయి యుండును. విషయ సుఖాభిలాష కలవాడు చేయు కర్మలను ఇంద్రియములను ఆత్మయందలి ఇంద్రియార్థములను మోక్షము దుర్లభమను విషయమును శాస్త్ర ప్రమాణమున తెలిసికొనవలెను. ప్రాణాపాన వ్యానోదాన సమాన వాయువులను ప్రాణతత్వోత్పత్తిని ఏడు విధములుగా ఉన్న శీర్షణ్యములగు ప్రాణములను ప్రజాపతులను ఋషులను సృష్టులను సప్తర్షులను రాజర్షులను దేవర్షులను మరుత్తులను సూర్యసమానులగు బ్రహ్మర్షులను ఉత్తమలోక సుఖానుభవము తరువాత అచటినుండి జారి అధోలోకగతి పొందువారిని మహాభూత సంఘ నాశమును శుభమగు వాక్కుల గతులను దశలను పూజార్చనోపాసన మొదలగు పాపకర్ములు పొందెడి వైతరణి యమలోకము లందలి దుఃఖమును వివిధ జన్మల యందు జీవుని అశుభ సంచారమును శోణితము ఉదకము శ్లేష్మ మూత్ర పురీషములు తీవ్ర దుర్గంధము-వీటితో నిండిన మాతృ గర్భమున నివాసము శుక్రము శోణితము మజ్జు స్నాయువు వందల కొలది సిరలు-వీటితో ఏర్పడిన ద్వారములుగల పురమగు దేహమున జీవుని నివాసమును తనకు హితమైనదానిని తామస రాజస సాత్త్విక ప్రాణులు సాధించగల యోగముల వైవిధ్యమును-తమః ప్రధాన యోగ సాధకుల కుత్సితగతి విశేషములను ఆత్మతత్త్వము నెరిగిన సాంఖ్యులు ఉత్తమ విషయములు సాధించుటలో పొందు ఉపద్రవములను గ్రహముల తారలు చంద్రునియొక్క నక్షత్రముల యొక్క పతనములను నక్షత్రముల తారుమారును జంటలు దీనముగా ఎడబాయుటను ఆయా ప్రాణులు పరస్పరము భక్షించుకొను అశుభ కృత్యమును బాల్యము నందలి అజ్ఞానమును స్థూలదేహపు అశుభస్థితిని సత్త్వగుణమును ఆశ్రయించి కూడ ఉండెడి రాగమోహములను వేలమందిలో ఏ ఒక్కడో మాత్రమే ముముక్షువు అగుటను వేదప్రమాణ విజ్ఞానముతో సాధించు మోక్షము దుర్లభము అగుటను లభించని కోరికలపై ఆదరమును అదితీరగానే ఉపేక్షా భావమును విషయ సుఖములలోని దోషములను ప్రాణము పోయిన వారి అశుభ స్థితులను ప్రాణత్యాగము తానే చేయ నిశ్చయించుకొనిన మహానుభావులు తమ శుభమైన దేహములను కూడ భేదించుకొని పోవుటను శుభమైన వంశములయందు తమ సంకల్పముతో జన్మింప గలుగుటను సాత్త్వికులైన ప్రాణులు కూడ దుఃఖ మనుభవించుటను బ్రహ్మఘ్నులు పతితులు పొందెడి దారుణగతిని బ్రాహ్మణులై ఉండియు దురాత్ములై సురాపానము గురుదార గమనము మొదలగు మహా పాపములుచేసి పొందు దుర్గతిని మాతృద్రోహి పొందు దుర్గతిని ఉత్తములు పొందెడి దేవలోక గతిని అశుభ కర్మల గతులను తిర్యక్ ప్రాణులు పొందెడి మూఢ గతులను వేదవాదముల వైవిధ్యమును ఋతువుల తారుమారును సంవత్సర మాస పక్ష దివసముల క్షయమును చంద్రుని వృద్ది క్షయములను సముద్ర వృద్ధిని ధన క్షయమును మరల అది పెరుగుటను యుగముల సంయోగములను దేహము శిథిల మగుటను దేహము మూలమున ఆత్మ యందు కలుగు దోషములను మలిన దేహమునుండి వెలువడు అశుభ గంధములను ఎరిగి వివేచించి ముముక్షువై మోక్షమునకై యత్నించి దానిని పొందవలెను.
“జీవుడు దేహమును గ్రహించుట వలన కలుగు దోషముల విషయములో మాకు గల సంశయములను బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడవగు ఓ వ్యాస మహామునీ! తీర్చవేడెదము” అనగా వ్యాసులు బ్రాహ్మణులతో ఇట్లు పలికెను:
ఓ మునిసత్తములారా! కపిలుడు ప్రవచించిన సాంఖ్య మార్గము నెరిగిన విద్వాంసులు దైహిక దోషములు కామ క్రోధ భయ నిద్రా శ్వాసములు ఐదనియు అవి అన్ని ప్రాణులకు కలవనియు చెప్పుదురు. క్షమచే క్రోధమును సంకల్పములు విడుచుటచే కామమును సత్త్వగుణము నాశ్రయించి నిద్రను ఎచ్చరికచే భయమును అల్పాహారముచే శ్వాస-అయాసమును జయించవలెను. అనేక గుణములనుండి ఉత్తమ గుణమును అనేక దోషములనుండి ప్రధాన దోషములను అనేక యుక్తులనుండి మోక్షసాధకమగు యుక్తులను అనేక వైచిత్ర్యముల నుండి ప్రధానమైన వైచిత్ర్యములను గుర్తించి విష్ణుని అనేక మాయలతో ఏర్పడిన ఈ లోకము నీటిమీద నురుగుతో సమానమని తెలిసికొని అజ్ఞానముచే నీటి బుడగవలె తిరుగుచు సుఖమువలె కనబడుచు నాశముతో నిండి నాశము తరువాత మహాభయము కలిగించుచు బురదలో దిగిన ఏనుగువలె రజస్తమో గుణము లందు దిగబడి ఉన్నదని గుర్తించి వైరాగ్యము పొందవలెను. మహాప్రాజ్ఞులగు సాంఖ్యతత్త్వము ఎరిగినవారు దారపుత్రాదులపై ప్రీతిలేక పూజ్యమై సర్వవ్యాపియైన సాంఖ్యజ్ఞానముచే రాజస తామస అశుభ సంస్కారములను సత్త్వగుణ ప్రధానమైన పుణ్య సంస్కారములను విషయాభిలాషలను తపస్సు అనెడి కఱ్ఱతోను ఆత్మజ్ఞానమను ఖడ్గముతోను ఛేదించి దుఃఖచింతా శోకములనెడి పెద్దగోతిని దాట గలుగుదురు. ఆ గోతిలో వ్యాధులు మృత్యువు వలన మహాఘోర భయమనెడి సర్పములు అజ్ఞానమనెడి తాబేళ్ళు రజోగుణమనెడి చేపలు కలవు. దానిని దాటుటకు ప్రజ్ఞయే నావ. అదియొక సముద్రము. ప్రపంచ విషయములపై ప్రీతి అనెడి బురద ముసలితనము అనెడి దుర్గములు విషయ సుఖములనెడి ద్వీపములు కథలు అనెడి అగాధములు సత్త్వము అనెడి తీరము హర్షములు అనెడి మహావేగములు అనేక అభిరుచులు అనెడి కల్లోలములు నానావిషయములపై ప్రీతి అనెడి మహారత్నములు దుఃఖ సంతాపములు అనెడి వాయువు శోకము అనెడి పెద్దసుడులు. తీక్ష్ణవ్యాధి మహాబాధలు ఎముకల రాశులు అనెడి ఎదురు దెబ్బలు దానము అనెడి ముత్యముల రాసులు రక్తము అనెడి పగడములు నవ్వులు అనెడి అలల ధ్వనులు నానా విధములైన అజ్ఞానములు దుఃఖాశ్రువులు అనెడి ఉప్పు ఈ సముద్రము నందు కలవు. దీనిని సిద్ధులై పూజ్యులైన యతులు జ్ఞాన యోగమను నావతో తరింతురు. వారు దేహత్యాగము తరువాత నిర్మలమగు ఆకాశములో ప్రవేశించగానే అది ఎరిగి సూర్యుడు తనకిరణములతో వారిని పైకికొని పోవును. తపోధనులును యోగ వీర్యవంతులును వైరాగ్యవంతులును సిద్ధులును అగు ఆ యతులను సప్త వాయువులలో శ్రేష్ఠుడును చల్లనై సుఖస్పర్శ గలిగి సుగంధముతో కూడి సూక్ష్మమైన ప్రవాహము అను వాయువు ఆకాశములో అత్యున్నత స్థానమునకు కొనిపోవును. ఆ ఆకాశోన్నత స్థానము వారిని రజోగుణము యొక్క సత్త్వ గుణముయొక్క ఉన్నత స్థితికిని సత్త్వోన్నత స్థితి శుద్ధాత్ముడగు పరమ ప్రభువగు నారాయణుని లోనికిని కొనిపోగా ఆ నారాయణుడు ఈ యతులను తనలో చేర్చుకొని తన రూపమునకు తీసికొని పోవును. ఇట్లు అమరులు అగు ఈ యతులు నారాయణుడను పరమాత్మ తత్త్వమును చేరి ఆ తత్త్వముగానేయై అమృతులగుదురు. వారు మరల జన్మ పరంపరలోనికి రానక్కర లేదు. సుఖదుఃఖాది ద్వంద్వములకు అతీతులై సత్యము ఆర్జవము సర్వభూత దయ కలిగి వర్తించిన ఆ మహాత్ములకు ఆ సాయుజ్యస్థితి పరమోత్తమ గతి”.
ఇదివిని మునులు వ్యాసునితో ఇట్లు పలికిరి. “ఉత్తమమగు ఆ భగవత్తత్త్వ రూపమైన ఉత్తమ స్థానమును చేరిన ఆ స్థిర వ్రతులు జన్మ మరణ రూపమైన సంసార ప్రవృత్తిని నారాయణుడు మరల ఆరంభించు వరకు ఆ మోక్షస్థితిలో ఆనందించు చుందురా లేదా? ఈ విషయములో వాస్తవమేమో చెప్ప వేడెదము. ఓ ఋషిసత్తమా! ఈ సంశయము నిన్ను తప్ప ఎవరిని అడుగజాలము. ఏలయన ఈ స్థితి పొందిన ఋషులు అచ్చటనే అనుభూతి యందు ఉండిపోయినచో మరల ఈ లోకమున ప్రవృత్తి లక్షణమైన ధర్మమును దేనిని చూచుచున్నామో దానిని సాధించు వారెవరు? లేక వారు మరల జీవులై లోక ప్రవృత్తి లోనికి వచ్చినచో మరల దుఃఖము లోనికి వచ్చుటయే గదా? ఈ విధముగా మీరు వివరించిన మోక్ష స్వరూపములో దోషమొకటి కనబడుచున్నది. ఈ సంశయమును తీర్చ ప్రార్థించుచున్నాము”.
ఓ మునిశ్రేష్ఠులారా! ఈ ప్రశ్నము యుక్తి యుక్తమేగాని మిగుల క్లిష్టమైనది. ఈ విషయములో మహాత్ములగు కపిలాచార్యుల జ్ఞానమే శ్రేష్ఠమైనది. ఇంద్రియములు దేహమందుండి దానిని ఎరుగును. అవి ఆత్మకు ఉపకరణములు కాని ఆత్మలేనిచో కఱ్ఱల వలె గోడలవలె జడములై నశించును. ఇంద్రియములతోకూడ జీవుడు నిద్రించి ఆకాశములో వాయువువలె సూక్ష్మరూపమున సంచరించుచు ఎన్నియో చూచుచు మేల్కాంచిన తరువాత నిద్రకు పూర్వము తన అనుభవములో ఉండిన వాటిని మరల జ్ఞాపకము చేసికొని ఆయా పనులలో మొదటివలె ప్రవృత్తులగును. ఆత్మ నిద్రావస్థలలో ఉన్నప్పుడు మాత్రము ఆ ఇంద్రియములు తామేమియు చేయలేక లయమునొంది పడి ఉండును. కాని ఆత్మ ఆ ఇంద్రియముల సూక్ష్మ తత్త్వమును తీసికొని సత్త్వ రజస్తమో గుణముల మనోబుద్ధుల పంచభూతముల లక్షణములను వెంటబెట్టుకొని స్వప్న లోకమున సంచరించును. అట్లే ఓ బ్రాహ్మణులారా? ఇచ్చటను పరమాత్ముడగు నారాయణుడు లోక వ్యవహారము నందలి ఆత్మ వంటివాడు ఆయనలో సాయుజ్యము పొందిన ఈ ముక్త యతులు ఈ ఆత్మకు ఉపకరణములైన ఇంద్రియముల సత్త్వరజస్తమో గుణముల, మనోబుద్ధుల వంటివారు. ఆ పరమాత్మునిలో లయము నొందిన ఈ మహా యతులు మరల నారాయణుని సృష్టి కాలమున నిద్ర మేల్కాంచిన జీవుని అధీనములో అతని ఇంద్రియాదులు మొదటివలె పనిచేసినట్లే వీరును సృష్టి ధర్మములో ప్రవృత్తి పొంది లోక వ్యవహారములో ప్రవర్తిల్ల జేయుదురు. ఇదియే వాస్తవమైన సాంఖ్య తత్త్వము. దీనిలో సమానమైన జ్ఞానతత్త్వము మరియొకటి లేదు. ఈ చెప్పిన నారాయణ పరమాత్మ తత్త్వము అక్షరము ధ్రువము సర్వ పూర్వము సనాతన బ్రహ్మతత్త్వము అనాది మధ్య నిధనము ద్వంద్వ రహితము సర్వకర్త శాశ్వతము కూటస్థము (ఎట్టి స్థితులలో ఏ మార్పులను పొందని అఖండతత్త్వము) ఆ తత్త్వము నుండియే సృష్టి స్థితి లయములు విప్రులు వేదములు ప్రవర్తిల్లును అని శాస్త్ర ప్రవక్తలగు మహర్షులు సర్వ విప్రులు ప్రణవ తత్త్వము ఎరిగిన మహనీయులు చెప్పుచున్నారు. సాంఖ్య, యోగ పరులిద్దరును ఆయన తోడి సాయుజ్యమే కోరి సాధన చేయుదురు. ఏమైనను ఈ ప్రపంచము నందలి భూతములు అగమ్యములు గమ్యములు అని రెండు విధములు. ఈ రెంటిలో గమ్య భూతములు మేలైనవి. (అగమ్యము అనగా తాము పొందు సుఖదుఃఖాది అనుభవములను స్పష్ట వాక్కుతో చెప్పజాలనివి) వేదపురాణ యోగములు ఇతిహాస శాస్త్రము లోక వ్యవహారము వీటియందు కనబడు జ్ఞానమంతయు సాంఖ్య తత్త్వము నుండి వచ్చినదే. పరమాత్ముని ఉత్తమోత్తమ బలము జ్ఞానము మోక్షము తపస్సులు వేదశాస్త్ర విహితములైన ఇతర సూక్ష్మ విషయములు ధర్మము అన్నియు సాంఖ్యము నుండి వచ్చినవే. కనుక ఈ పై చెప్పిన ముక్తజీవాత్మలు ఈ ఉత్తమ తత్త్వములను తమలో నిలుపుకొని సాయుజ్య మోక్షముతో కృతార్థులైయుండి మరల సృష్టి కాలమున పవిత్రులైన వారి గృహముల యందు జన్మింతురు. మరల ఈదేహమును విడిచినతరువాత మొదటివలె మోక్షమును పొందుదురు. ఇట్టివారికి ఉత్తరోత్తరముగ ఉన్నత గతులేకాని తిర్యక్ జన్మలు నరక నివాసము కలుగవు. ఈ చెప్పిన సాంఖ్యతత్త్వము విశాలము శ్రేష్ఠము విమలము ఉదారమైనది. అనాది మహా సముద్రము వంటిది. కనుక మీరును ఓ మునులారా! సాంఖ్యతత్త్వ పరాయణులై అప్రమేయుడును, మహాత్ముడును అగు నారాయణుని యందు చిత్తము నిలుపుడు. నేను చెప్పిన ఈ పరతత్వ సారాంశ మేమనగా అనాదియగు ఈ ప్రపంచము నారాయణుని నుండియే ప్రభవించినది. అతడే దీనిని సృష్టి కాలములో సృజించును. ప్రళయ కాలము వచ్చినప్పుడు సంహరించును. (240)