బ్రహ్మ మహా పురాణము
యోగవిధి
“ఓ మునిసత్తమా! తాము అన్ని విషయములను ఎఱిగినవారు. సాంఖ్య దర్శనము నందు కంటె యోగదర్శనమునందుకల విశిష్టత ఏమియో మాకు తెలుప ప్రార్ధించుచున్నాము” అని మునులు వ్యాసుని ప్రార్థించిరి.
సాంఖ్యలును యోగులును ఉత్తమములగు యుక్తులతో తమతమ పక్షములను సమర్థించుకొనుచు ప్రశంసించుకొనుచు ఉందురు. కాని విద్వాంసులగువారు మాత్రము సాంఖ్య సంప్రదాయమునందు ఈశ్వరుని అంగీకరింపరు కావున ఈశ్వరుని అంగీకరింపని వారికి మోక్షము సిద్ధించుటేమి? అను తలంపుతో సాంఖ్యమును గ్రహింపక యోగ దర్శనమును ప్రశంసింతురు. ఇహమునందలి సర్వగతులను వాని యందలి దోషములను ఎఱిగి విషయములందు విరక్తుడైనవాడు దేహత్యాగమునకు తరువాత తప్పక ముక్తి నందును అని సాంఖ్యుల సిద్ధాంతము. సమర్థములగు యుక్తులను హితములగు వచనములను గుర్తించి స్వపక్షమునకు తగినవానిని గ్రహించుట న్యాయము. ప్రత్యక్షమును, తత్త్వ సాక్షాత్కారమును ప్రమాణముగా గ్రహించువారు యోగదర్శనపరులు. శాస్త్రప్రమాణ బలముచే విషయ నిర్ణయము చేయువారు సాంఖ్యులు. ఓ ద్విజోత్తములారా! ఈ రెండు తత్త్వములును అవినాభావ సంబంధము కలవి. రెండును శిష్టులకు సమ్మతమైనవి. శాస్త్ర ప్రమాణానుసారము అనుష్ఠించినచో రెండు దర్శనములును మోక్షమును ఇచ్చునవే. శౌచము భూతదయ ఆయా వ్రతానుష్టానములు రెండు దర్శనములందును సమానమే. ఐనను దర్శన సిద్ధాంతములు మాత్రము రెంటికిని భిన్నములు.
“ఐనచో ఓ ద్విజోత్తమా! ఈ దర్శనములకు రెంటికి భేదమేమో తెలియగోరెద”మని మునులు వ్యాసునడిగిరి.
చేపలు వలను చించివేసి మరల నీటిలో ప్రవేశించినట్లు, మృగములు ఉరులను త్రెంచుకొని మరల తమ మార్గమున తాము పోవునట్లు యోగబలమును సాధించినవారును లోభ బంధనములను త్రెంచుకొని విమలమును శుభము అగు ముక్తి మార్గము చేరెదరు. యోగబలమును సాధించజాలనివారు వలలో చిక్కిన చేపలవలె, ఉరులలో చిక్కిన మృగముల వలె ఆ బంధనములలో చిక్కి నశింతురు. మొదటి బంధనములలో చిక్కని యోగులు చాల అరుదు. అగ్ని అల్పముగా నుండగా దానిపై లావైన కట్టెలు అంటించు నపుడు అది చల్లారును. అదే అగ్నికి గాలి బాగుగా తోడైనపుడు ప్రజ్వలించి భూమండలము నంతటిని కూడ దహించగలుగును. యోగశక్తి కూడ ఈ అగ్నివంటిదే. తత్త్వజ్ఞానబలము కల యోగి మహాబలమును అంతటిని కూడ దహించగలుగును. యోగశక్తి కూడ ఈ అగ్ని వంటిదే. తత్త్వజ్ఞాన బలము కల యోగి మహాబలమును, దీప్తమగు తేజస్సును కలవాడై ప్రళయ కాలసూర్యునివలె జగత్తునంతటిని కాల్చగలుగును. దుర్బలుడగు మానవుడు ప్రవాహములో కొట్టుకొని పోయినట్లు యోగబలమును తగినంతగ సాధించని యోగియు విషయప్రవాహములో కొట్టుకొనిపోవును. ఏనుగు ప్రవాహమును ఎదుర్కొన గలిగినట్లు యోగబలమును సాధించిన యోగియు విషయ ప్రవాహముతో కొట్టుకొనిపోడు. యోగ బలాన్వితులగు యోగులు ఈశ్వరులు, సమర్థులు అయి ప్రజాపతులు మనువులు మహా భూతములు మొదలగు తత్త్వములను అన్నిటిని ప్రవేశింపగలరు. కాని క్రుద్ధుడైన ఆగంతకుడగు యముడుకాని భయంకర విక్రమముకల మృత్యువుకాని వీరెవ్వరును యోగబలము సాధించిన యోగియందు ప్రవేశింపజాలరు. యోగసాధన చేయవలెను. బలము సంపాదించి ఆ బలములతో మహీమండల మంతట సంచరింపవచ్చును. యోగియగు వాడొకడు విషయ సుఖములను యోగ బలముచే సాధింపవచ్చును. అవి కొంత కాలమనుభవించి మరల ఉగ్రమగు తపస్సును చేయవచ్చును. సూర్యుడు తన కిరణముల వలె తన శక్తులను ముడుచుకొనవచ్చును. ఓ సత్తములారా! బలముగా సాధింపబడిన యోగ శక్తిగల యోగియొక్క బంధనమునకు ముక్తి ప్రదాతయగు విష్ణువుకూడ లోబడును. యోగబల ప్రభావమును మీకు తెలుపుటకు మీకు ఇవి కొన్ని నిదర్శనములు తెలిపితిని. ఇంకను సూక్ష్మతరములైన మరికొన్ని అంశములు మీకు తెలిపెదను. మనస్సమాధానమునకును ధారణకును సంబంధించిన నిదర్శనములును మరికొన్ని తెలిపెదను. అవి ఎరిగి అనుష్టించిన యోగి అప్రమత్తుడైన విలుకాడు శ్రద్ధతో లక్ష్యమును కొట్టగలిగినట్లు తానును లెస్సగా మోక్షమును పొందగలుగును. ఇది నిశ్చయము.
సూర్యునివలె ప్రకాశించుచు కనబడెడి పూర్ణమైన నూనె పాత్రయందు నిశ్చలమగు మనస్సును నిలిపి తన్నుతాను అమలునిగా చేసికొనునో అట్లే ముముక్షువు అగువాడు మనస్సును నిశ్చలమొనర్చుకొని యోగసోపానమును ఆరోహించవలెను. మహాసముద్రములో ఉన్న బ్రాహ్మణ శ్రేష్ఠులు నావపై ఎక్కి శ్రద్ధావంతుడగు నావికుని సాయమున ఒడ్డునకు చేరినట్లే యోగసాధకుడును యోగ సహాయమున మనస్సును సమాహితముచేసి తత్త్వమునందు నిలిపి దేహత్యాగానంతరము మోక్షమును పొందగలుగును. గుఱితప్పని బాణము వలెను, మంచి గుఱ్ఱమును పూన్చిన రథమునెక్కి సమర్థుడగు సారథిని సహాయముగా తీసికొన్న రథికునివలెను, సాధకుడు తన గమ్యమగు సిద్ధిని పొందగలడు. తన మనస్సును ఆత్మతత్త్వమునందు దృఢముగా నిలిపి నిశ్చలుడైయున్న యోగి నిశ్చలముగా ఉన్న జాలరి వలవేసి చేపలను చిక్కించుకొన్నట్లు తత్త్వమును స్వాధీనము చేసికొనుచు మహాశక్తిశాలియు మహానియమములయందు శ్రద్ధ వహించినవాడును అగుచు, నాభి శిరస్సు, కుక్షి, హృదయము, వక్షస్సు, రెండు పార్శ్వములు, నేత్రములు, శ్రవణములు, ఘ్రాణము ఈ స్థానముల యందు చిత్తమును దృఢముగా నిలిపి సాధనచేసినచో పర్వతములంత రాసులుగా నున్న శుభాశుభ కర్మరాసులను దగ్ధముచేసి ఉత్తమ యోగ సిద్ధిని సాధించి తన సంకల్పానుసారము ముక్తుడగును.”
“యోగ సాధకుడు ఏ ఆహారములను తినుట వలనను వేటిని జయించుట వలనను యోగబలమును సాధించునో మాకు తెలుపుడు” అని మునులు వ్యాసునడిగిరి.
వ్యాసుడిట్లు చెప్పెను:
రవ్వతోను, తెలికపిండితోను చేసిన వంటకమును తినుచుండవలెను. నూనెను వదలవలెను. నూనెలేని యవపిండి వంటకములను అదికూడ ఒక పూట మాత్రమే తినినచో యోగబలము కలుగును. పక్షముల మాసముల ఋతువుల కొలదిగా చిత్ర ప్రదేశము లందును గుహలయందును సంచరించవలెను. వీటితో కలిపిన పాలు త్రాగవలెను. ఒక మాసమైనను నిరతోపవాసముచేసి మనశ్శుద్ధి సాధించవలెను. కామక్రోధ శీతోష్ణ వర్షభయ శోక నిద్రలు అను విషయ సుఖములను వేటియందును అభిరుచి లేకపోవుట, సోమరితనము వీటిని జయించవలెను. వైరాగ్యము పొందిన మహాప్రాజ్ఞుడు స్వాధ్యాధ్యయన సంపత్తి సాయమున ఆత్మను ఉన్నతముగా చేసికొని సూక్ష్మముగా ఒనర్చుకొని ప్రకాశవంతముగా చేసికొనును. ఎంత విద్వాంసులకును బ్రహ్మతత్త్వ సిద్ధిని కోరిన ముముక్షువులకును ఈ మార్గము దుర్గమమైనది. ఏ ఒక్కరైన ఈ మార్గమున నడువగలిగిన వారు క్షేమమును తప్పక పొందుదురు. ఘోరమును, సర్పములతో సరీ సృపములతో గుంతలతో నిండినదియు, నీరులేనిదియు, నడువసాధ్యము కానిదియు, ఎన్నో ముండ్లతో నిండినదియు, ఎవరును ఉండనిదియు, అడవులతో నిండినదియు, దొంగలతో నిండినదియు అగు మార్గమున నడచుచుండియు ఒకానొకడు క్షేమముగానే తన గమ్యమును చేరగలుగును. ఈ యోగసాధన మార్గమునను అరుదుగా ఎవరో ఒక్కరు సిద్ధిపొంద గలుగుదురు. వాడియైన క్షురధారల, మంగలికత్తుల పదునుల, మీదనైన క్షేమముగా నడువవచ్చును కాని మనోనిగ్రహము లేని వారికి మాత్రము ఈ యోగ మార్గము మిగుల దుర్గమమైనది. అట్టివారికి ధారణ సాధ్యముకాదు. వారు సిద్ధిని పొంద జాలరు. కర్ణధారుడులేని నావపై ఎక్కినవారు సరిగా ఒడ్డుకు చేరజాలరు కదా! సాధకుడు యథావిధిగా యోగ మార్గానుసారము ధారణయందు నిలిపి ఉండి జన్మమరణ దుఃఖములను లౌకిక సుఖములను అతిక్రమించి మోక్ష సుఖమును పొందును. నానా శాస్త్రములచేతను విధింపబడినదియు, అనేక మునులు అనుష్ఠించినదియు, నిశ్చితమును అగు యోగ మార్గము ద్విజాతులకు ప్రశస్తమైనది. దీనిని అనుష్ఠించిన సాధకుడు పరబ్రహ్మ తత్త్వ రూపుడగు బ్రహ్మను ఈశ్వరుని విష్ణుని మహానుభావ తత్త్వమగు ధర్మమును మహానుభావులును బ్రహ్మపుత్రులును అగు సనత్కుమారాదులను నీచమగు మనస్సును అంతకంటె గొప్పది యగు రజస్సును శుద్ధమగు సత్వమును పరా ప్రకృతిని వరుణుని పత్నియగు సిద్ధిదేవి సమగ్రమగు తేజస్సును మహాధైర్యమును ఆకాశమున అనేక తారలతో కూడి ప్రకాశించు చంద్రుని, విశ్వేదేవులను, నాగులను, పితరులను, సమస్త శైలములను, సర్వ సముద్రములను, సమస్త నదులను, వృక్షములను, సాధ్యులను, యక్షులను, దిక్కులను, గంధర్వులను, సిద్దులను, సమస్త పురుషులను, స్త్రీలను, పరస్పరము ప్రవేశించి మహామహాత్ముడై శీఘ్రముగానే విముక్తుడగును. ఓవిప్రవరులారా! మహావీర్యుడును మహామతియునగు భగవంతుని విషయమున ప్రసక్తమగు కథలన్నిటిలో ఇది శుభమైనది. ఈ యోగము అనుష్టించిన యోగులు ఈ చెప్పిన యోగసిద్ధుల అన్నిటిని పొంది అనుభవించి శీఘ్రముగా నారాయణుని చేరుదురు.” (239)