బ్రహ్మ మహా పురాణము

హరి అంశావతారము

వ్యాసుడు అనియె -

భూ భారము హరింప ఈ భారత వర్షమందు హరి అవతరించిన వృత్తాంతమును తెలిపెదను. ఓ మునివరులార వినుడు. ధర్మహననము, అధర్మాభివృద్ధి అయిన తఱి జనార్దనుడు తన మూర్తిని రెండు విధములు ఒనర్చికొని సాధు రక్షణకు ధర్మ స్థాపనకును దుష్టుల దేవద్వేషుల నిగ్రహమునకును యుగయుగమందు ఉదయించును. మున్నీ భూమి బహుభార పీడితమై, మేరువునందున్న దేవ సమాజమున కేగి, బ్రహ్మాది దేవతలకు మ్రెక్కి తన కష్టమును ఇట్లు మొఱపెట్టుకొనెను.

అగ్ని బంగారమునకు గురువు. గ్రహములకు సూర్యుడు గురువు. నాకును మఱి ఎల్ల లోకములకు వంద్యుడైన గురువు నారాయణుడు. ఇప్పుడు కాలనేమి మొదలుగా గల ఈ దైత్యులు మర్త్య లోకమునకు వచ్చి రేయింబవళ్ళు ప్రజలను బాధించుచున్నారు. ప్రభువైన విష్ణువుచే కాలనేమి కూల్చబడెను. ఉగ్రసేనుని కొడుకు కంసుడను, మహాసురుడు పుట్టియున్నాడు. అరిష్టుడు, ధేనుకుడు, కేశి, ప్రలంబుడు, నరకుడు, సుందుడు, మహోగ్రుడగు బాణుడు (బలికొడుకు) మఱియెందఱో రాజుల ఇండ్లలో పుట్టినారు. వారిని లెక్కపెట్ట ఉత్సహించను. దివ్యమూర్తిధరులగు దేవతలు మదించియున్న దైత్యరాజులు గలిసి అక్షౌహిణు అనేకములు నామీద ఉన్నవి. ఆ బరువు సైపలేకున్నానని మీకు విన్నవించు కొనుచున్నాను. నేను పాతాళమునకు క్రుంగిపోకుండ ఈ నా బరువును మీరు దింప వలయును. అని అవని మాటవిని సురల ప్రేరణచే బ్రహ్మ భూభార హరణార్థమై ఇట్లు పలికెను.

ఓ వేల్పులారా! భూదేవి ఇప్పుడు అన్నది యెల్ల నిజము. నేను భవుడను (శివుడు) మీరు మఱి అంతయు నారాయణ స్వరూపము. ఇవన్నియు హరియొక్క విభూతులే. ఆ విభూతుల హెచ్చు తగ్గులను అనురించియే ఒకరినొకరు బాధింపబడువారు, ఒకరు బాధించువారుగ తోచుచుందురు. అందుచే మనమందరము పాలకడలి ఒడ్డునకు వెళ్ళుదము. అచట హరిని ఆరాధించి ఆయనకు విన్నవింతము. ఆ దేవుడు జగన్మయుడు భూమి ఉపకారమునకై సత్వ గుణాంశమున అవనిపై అవతరించి ధర్మస్థితిని గావించును అని బ్రహ్మ సురలతో ఏగి మనసు నిలిపి గరుడధ్వజుని ఇట్లు స్తుతించెను.

సహస్రమూర్తీ! సహస్రపాద! సహస్రముఖ! సృష్టి స్థితి లయకారణ! అప్రమేయ! నీకు నమస్కారము. సూక్ష్మాతి సూక్ష్మము! బృహత్ప్రమాణము! గొప్పవాని కెల్ల గొప్పది ప్రధానము బుద్ధి ఇంద్రియములు వాగ్రూపమైన వేదములకు మూలము పరమునైన ఓ భగవంతుడా! ప్రసన్నుడవగుము. ఈ భూమి, భూమిపై పుట్టిన మహాసురులచే పీడ నొందిన పర్వతబంధములుకలదై జగత్పరాయణమైన నిన్ను భారము దింపగోరి అరు దెంచినది. మేము, ఇంద్రుడు, అశ్వినీదేవులు, వరుణుడు, ఇరుగో రుద్రులు, వసువులు, సూర్యులు, వాయువు, అగ్ని మొదలగు ఎల్లరను అరుదెంచితిమి. మేము ఒనరింప వలసినపని ఆనతిమ్ము. నీ చెప్పినది విధేయులమై చేసెదము. దోషములు వాసి నీ హద్దున నిలుతుము.

వారు ఇట్లు భగవంతుని స్తుతింపగా, పరమేశ్వరుడు కావున వారిని అనుగ్రహింప తన రెండు శిరోజములను తెలుపు నలుపు వానిని నూడబెరికి వారికి జూపి ఈ కేశములు వసుధ యందు అవతరించి, భూ భారక్లేశమును హరింపగలవు. సురలెల్లరు తమతమ అంశములచే అవనీతలమందు అవతరించి మదోన్మత్తులైపుట్టి ఉన్న మహారాక్షసులతో యుద్ధమును ఒనరింతురు గాక! అందుచే నానాయుధ హతులై అశేష దైత్య కూటము నశించును. సందియము లేదు. వసుదేవుని ధర్మపత్ని దేవతా సమానురాలు దేవకి. ఆమె ఎనిమిదవ గర్భముగ నా యొక్క కేశము అవతరించును. కంసాదులను సంహరించును అని హరి అంతర్థానమందెను.

అదృశ్యుడయిన ఆ మహాత్మునికి నమస్కరించి ఆ దేవతలును మేరుగిరునకు వెళ్ళి అటనుండి అవనికి దిగిరి. నారద భగవానుడు కంసుని కడకేగి దేవకి ఎనిమిదవ గర్భము (శిశువు) అవతరించునని తెల్పెను. కంసుడువిని కోపగించి దేవకీ వసుదేవులను కారాగారమున ఉంచెను. తాను ఇంతకు పూర్వము ఇచ్చిన మాటను అనుసరించి వసుదేవుడు పుట్టిన వానిని పుట్టినట్లు బిడ్లలను తీసుకొనిపోయి కంసునికి అప్పగించెను. అట్లు జనించిన కొడుకులు ఆరుగురు. తొలి జన్మమున హిరణ్యకశిపుని పుత్రులు. విష్ణు ప్రేరణము నొంది నిద్రాదేవి (యోగనిద్ర) గర్భమునందు వారిని ఆవేశించెను. ఆమె వైష్ణవియైన మాయ. అవిద్యారూపమైన ఆ మాయచేతనే జగమెల్ల మోహితమగుచుండును. ఆమెను చూచి హరి.

ఓ నిద్రా! నా ఆజ్ఞచే నీవు వెళ్ళి పాతాళమందున్నవారిని ఒక్కక్కరిని దేవకీ జఠరమున చేర్పుము. కంసునిచే వారు చంపబడగా శేషుని అంశమున పుణ్యమూర్తి ఆ దేవకి ఏడవ గర్భమగును. గోకులమునందు వసుదేవుని భార్య రోహిణి గలదు. ఆమె ప్రసవ సమయమందు ఈ సప్తమ గర్భమును కొనిపోయి ఆమె ఉదర మందుంచుము. భోజరాజగు కంసుని వలని జడుపుచే బంధనముచే దేవకి గర్భము భంగమైనదని జనశ్రుతి పుట్టును. గర్భసంకర్షణముచే ఆ శిశువు ‘సంకర్షణుడు’ అని పేరొందును. తరువాత నేను ఆ దేవకి శుభస్థానమైన గర్భమందు ఉందును. నీవిప్పుడు యశోద ఉదరమునందు విలంబము లేకుండ ఉండవలెను. వర్షర్తువున శ్రావణ బహుళ అష్టమినాడు అర్థరాత్రి నేను పుట్టెదను. నాశక్తి ప్రేరణమందిన బుద్ధితో వసుదేవుడు దేవకి పక్కలో ఉన్న నిన్ను యశోద ప్రక్కలోనికిని చేర్చును. కంసుడు నిన్ను పట్టుకొని, ఒక కొండబండపైకి విసరికొట్టును. నీవు అంతరిక్షమున కెగిరి నిలుతువు. అంతట నిన్ను ఇంద్రుడు నా మీది గౌరవముచే పలుమారులు నమస్కరించి తలవంచి తన చెల్లెలుగా గౌరవించును. అటుపై నీవు శుంభ నిశుంభాది దైత్యులను వేలకొలదిగ సంహరించి పృథివియందు వేఱువేఱు స్థానములందు వేఱువేఱు రూపములచే అలంకరింతువు. నీవే భూతివి, సన్నతివి, కీర్తివి, కాంతివి, పృథివివి, భృతివి, లజ్జ, పుష్టి రూపా (రోషము), మఱి ఏమేమి శక్తులుగలవో అన్నియు నీవే. ఆర్య దుర్గ, వేదగర్భ, అంబిక, భద్ర, భద్రకాళి, క్షేమ్య, క్షేమంకరి అని ప్రాతఃకాలమున అందు అపరాహ్ణమున జనులు వినతులై నిన్ను పెక్కురీతుల స్తుతింతురు. వారి వాంఛిత మెల్ల నా ప్రసాదమున సమకూరును. కల్లు, మాంసము, భక్ష్య భోజ్యములు నివేదించి పూజించిన మానవుల ఎల్ల కోరికలను నీవు ప్రసన్నవై ఎవరికి అనుగ్రహింతువో వారందఱు అన్నివేళల నా అనుగ్రహమున భద్రమూర్తులగుదురు. సందేహములేదు. దేవి! నేను చెప్పినట్లు చేయుము పొమ్ము (181) అని ఆనతిచ్చెను.