బ్రహ్మ మహా పురాణము

అదితికృత భగవత్ స్తుతి

వ్యాసుడు ఇట్లు చెప్పెను.

గరుత్మంతుడు వరుణుడు ఇచ్చిన ఛత్రమును, మణిపర్వతమును పత్నీ సమేతుడైన హరిని విలాసముగ వహించుచు పయనించెను. స్వర్గద్వారమునకు జేరి హరి శంఖము నొత్తెను. దేవతలు అర్ఘ్య పాత్రమునుగొని ఎదురువచ్చిరి. వేల్పులచే పూజింపబడి తెల్లని మేఘమువలె ఉన్న శిఖరములతో నున్న దేవమాతయగు అతిది గృహమున ప్రవేశించి ఇంద్రునితోగూడ తానామెకు నమస్కరించి, మణికుండలములు ఒసంగి, నరకుడు నశించెనని తెల్పెను. జగజ్జనని అదితి సంప్రీతియై జగత్కర్తయగు హరిని, మనస్సు అతని యందు నిలిపి తొట్రుపడక ఇట్లు స్తుతించెను.

“పుండరీకాక్ష! భక్తాభయప్రద! సనాతన స్వరూపా! సర్వ భూతభావన! మనోబుద్ధేంద్రియములకు ప్రేరకుడా! హ్రస్వ దీర్ఘాది వికల్పరహిత! జన్మాదిరహిత! స్వప్నాద్యవస్థాత్రయ వర్జిత! నీవు సంధ్యాది కాలస్వరూపుడవు. భూమ్యాది పంచభూత స్వరూపుడవు. మనోబుద్ధి చిత్తాహంకారములు నీవే. సృష్ట్యాదికర్తవు. కర్తలకు పతివి నీవే. మాయాకృతములగు బ్రహ్మాదిమూర్తులతో అంతట చరాచరాత్మక జగమెల్ల వ్యాపించియున్నాడవు. ఆత్మగాని దాని యందు ఆత్మబుద్ది నీమాయ. దానివలననే అహంకార మమకారములు గల్గును. సంసారమందు ఇదెల్ల నీ మాయ యొక్క చేష్టయే. స్వధర్మపరులచే నీవు ఆరాధింపబడుదువు. వారే ఈ మాయను తరింతురు. బ్రహ్మాదులు మనుష్యులు పశువులు సకలము విష్ణుమాయ అను సుడిలోపడి మోహము అను గాఢాంధకారమున క్రమ్ముకొనబడుదురు. నిన్నారాధించి అభీష్టములంది భవము తరింతురు. నీ పదమునందు కొందురు. పుత్ర కామనచే శతృక్షయము కొరకు నిన్ను నేను ఆరాధించితిని. మోక్షమునకు కాదు. మాయ యొక్క విలాసమిది. ఈ కోరిన కల్పవృక్షము నుండి కూడ గోచిగుడ్డ అడుగుట వంటిది. పుణ్యకర్మలు చేయనివారు ఇట్టి ఫలవాంఛ చేయుట అను అపరాధము తమకుతాము చేసుకున్నదే. సకల జగన్మాయామోహ పరుడవగు ఓ పరాత్పర! నాయెడ ప్రసన్నుడవగుము. కేవల జ్ఞానసత్తా స్వరూపుడవు. నా అజ్ఞానమును నశింపజేయుము. శార్ఙ్గ చక్ర గదా హస్త! నీకు నమస్కారము. స్థూల చిహ్నములచే శోభిల్లు నీ రూపమిదే చూచుచున్నాను. నీ కేవల తత్త్వము నెరుగను. ప్రసన్నుడవగుము.

ఇట్లు స్తుతింపబడి విష్ణువు సురారణిని (దేవమాత) చూచి అల్లన నవ్వి ఇట్లనియె. (అగ్ని పుట్టుటకు ఆధారము అరణి. అట్లే దేవతల ప్రాదుర్భావమునకు ఆధారము అదితి కావున ఆమెను సురారణి అను వైదిక భాషతో చక్కగా వ్యాసులు ఇచ్చట పేర్కొన్నారు. )

దేవీ మాకు నీవు మాతవు. దయచూపుము. వరప్రదాత్రివి కమ్ము అని కృష్ణుడు స్తుతింప నీ ఇష్టమట్లే అగు గాక! సురాసురలకు నీవు అజేయుడవై మనుష్య లోకమున ఉందువని అదితి అనెను. అటుపై శచీదేవితో గూడిన అదితికి సత్యభామ మ్రెక్కి మాయెడ ప్రసన్నురాలవు కమ్మని మరిమరి కోరెను. అదితియు “నా ప్రసాదమున ముదిమియును రూప వికృతియు నీకు కలుగదు. సర్వకామ సిద్ధిని పొందగల”వని దీవించెను.

అదితి అనుజ్ఞగొని దేవేంద్రుడు హరిని సబహుమానముగ యథావిధి పూజించెను. అప్పుడు కృష్ణుడు సత్యభామ వెంబడి రాగా, నందనవనము మొదలైన దేవోద్యాన వనములు అన్నిటిని దర్శించెను. మరియు సువాసనలను ఇచ్చు పూలగుత్తులతో చలువల జిమ్ముచు ఎర్రని చిగుళ్ళతో ఆహ్లాదకరమై అమృత మథనమునందు పుట్టి సువర్ణప్రభ ఒప్పు దివ్యమైన పారిజాతమును దర్శించెను. ఆ దివ్యతరు రత్నమునుగని భామా రత్నము సత్యభామ ఇట్లనియె. కృష్ణా! ఈ దివ్యవృక్షము ద్వారకకు మనమేల గొనిపోరాదు? సత్య నాకెంతేని ప్రియురాలను నీ మాట నిజమే అగునేని నా ఇంటి పెరటిలో నాటుటకు దీనిని గొనిరమ్ము. నీ అంతగ ప్రేమ పాత్రము జాంబవతిగాదు. రుక్మిణియుగాదు అని పలుమారులు పలికితివి. ఆ పలుకులు నిజమైనచో అది మాటమాత్రము కాదేని (ఉపచార మాత్రమున అన్నది కాదేని) ఈ పారిజాతమును నా గృహ భూషణము చేయుము. ఈ పారిజాత కుసుమ మంజరిని నా కొప్పునందు తుఱుముకొని సవతుల నడుమ అందరికన్న మిన్నగ రాణింప గోరుచున్నానని పలుక కృష్ణుడు నవ్వి పారిజాతము గరుడునిపై కెక్కించెను. శ్రీకృష్ణుని చూచిన నందనవనపాలకులు ఇట్లనిరి:

“దేవరాజు పట్టమహిషి శచీదేవి. ఆమెసొత్తు పారిజాతము. గోవింద! దానిని నీవు కొల్లగొనతగదు. శచీదేవి అలంకారమునకే దేవతలు అమృత మంథనమున దీనిని ఆవిర్భవింపజేసినారు. దానిని చేకొని నీవు క్షేమమున అరుగజాలవు. తెలియక దీనిని కోరెదవు. ఎవడు దీనినిగొనిపోగలడు? దీనివలన దేవేంద్రుడు వికృతి నందగలడు. (అతని మనసు చెడునని భావము). వజ్రాయుధమును చేబూనిన శక్రుని అమరులు వెంబడింపగలరు. అచ్యుత! దేవతలందరితోడి విరోధము నీకు వలదు. పరిణామమందు కటువైన (చేదైన) పనిని పండితులు మెచ్చరు” (పర్యవసానమున దేవవిరోధము కొని తెచ్చు విషమమైన పని ఈ పారిజాతాపహరణమని భావము) అని వనపాలకులు పలుక, ప్రచండ కోపమున సత్యభామ ఇట్లనియె:

పారిజాతమునకు శచి ఎవతె? సురాధిపుడు శక్రుడెవరు? ఈ వృక్షము అమృత మథనమునందే పుట్టినయెడల ఇది సర్వలోకములకు చెందిన సమానమైన ఆస్తి, వాసవుడొక్కడే దాని ఎందులకు గైకొనును? దేవతలు, చంద్రుడు, లక్ష్మి, సర్వలోకమునకు సామాన్య ధనమైనట్లు పారిజాత వృక్షముగూడ సామాన్యమే. మగని బాహువులను అండగొని పొందిన గర్వాతిశయముచే ఇపుడు శచి దీనిని నిరోధించుచున్నది. అందువలన పరుగున పోయి పౌలోమికి నా మాటను చెప్పుదును. భర్తృ గర్వమున (సౌభాగ్య గర్వమున) ఉద్ధతమైన భాషలో సత్యభామ ఇట్లు చెప్పుచున్నది. నీవు గనక మగనికి కూర్చుదానవేని అతనికి ప్రియురాలవైన నీ తరువును హరించు నా భర్తను ఆపింపుము. నీమగడగు ఇంద్రుని ఎరుగుదును. దేవతలకు ప్రభువని ఎరుగుదును. అదంతయు అట్లుండ మనుష్య స్త్రీని నేను నా పారిజాతమును గొనిపోజేయుచున్నానని సత్యభామ పలుక వనపాలకులేగి సత్యభామ చెప్పినది చెప్పినట్లు పెద్దగ ఘోషించుచు శచీదేవికి జెప్పిరి. శచీయు దేవాధిపతిని ప్రోత్సహించెను.

అంతట ఎల్ల దేవసేనలు తన్ను అనుగమింప పారిజాతము కొరకు ఇంద్రుడు యుద్ధము చేయింప ప్రవృత్తుడయ్యెను. అవ్వల పరిఘనిస్త్రింశ గదా శూలాది ఆయుధ విశేషములను గొని దేవతలు వజ్రాయుధము గొని ఇంద్రుడు నిలిచి యుద్ధసన్నద్ధులైరి. అంతట గోవిందుడు ఐరావత గజరాజమందున్న దేవేంద్రుని దేవపరివారమును యుద్ధ సన్నద్ధులంచూచి, దిక్కులు పిక్కటిల్ల శంఖ నిర్ఘోష మొనరించెను. వేలు లక్షలుగ బాణములను వదలెను. దిక్కులు ఆకాశము బాణములునిండ దేవతలు అనేక శస్త్రాస్త్రములను విసరిరి. జగదీశ్వరుడు మధుసూదనుడు ఒక్కొక్క అస్తమును శస్తమును వేవేలు తునకలుగ భేదించెను. వరుణునిపాశము ఉరగాశనుడు. (గరుత్మంతుడు), పాముపిల్ల దేహమన్నట్లు ఖండ ఖండములుగా ఎగిరెను. భగవంతుడు దేవకీ కుమారుడు యముడు వదలిన దండమును గదచే అడచి ఖండించి పొడిమిచేసి వైచెను. ఆ ప్రభువు శౌరి కుబేరుని పల్లకిని చక్రముచే నువ్వుగింజంత తునకతునకలు చేసెను. సూర్యచంద్రులను తేరిపార జూచి తేజోహీనుల గావించెను. అగ్ని దేవుడు వందల కొలది బాణములకు గురి అయ్యెను. వసువులు నలుదిక్కులకు తరుమబడిరి. చక్రాయుధముచే శూలాగ్రములు తెగబడ రుద్రులు పుడమిపై పడగొట్టబడిరి. శారిఙ్గ (శార్ఙ్గమను ధనుస్సును పట్టెడి హరి) సాధ్యులను విశ్వేదేవతలను, మరుత్తులను, గంధర్వులను అమ్ములచే ఆకాశమున బూరుగు పింజలు అగునట్లుగా ఎగురగొట్టెను. గరుడుడు తుండముతో రెక్కలతో గోటికొనలతో దేవదానవులను తినుచు చంపుచుండెను.

ఇంద్ర ఉపేంద్రులు రెండు మేఘములు వర్షధారలట్లు బాణసహస్రములు ఒకరిపై ఒకరు వర్షించుకొనిరి. సంకుల యుద్ధమున గరుడుడు, ఐరావతముతో దేవతలతో పోరగా జనార్దనుడు ఇంద్రునితో పోరిరి. శస్త్రములు అస్త్రములును తెగి విరిగి విడిపోవ సత్త్వరముగ ఇంద్రుడు వజ్రమును బట్టెను. కృష్ణుడు సుదర్శన చక్రమును ఎత్తెను. అంత చరాచరమగు ముల్లోకమెల్ల వజ్ర చక్రధరులైన ఆ దేవరాజ, జనార్దనులను చూచి హాహాకార మొనరించెను.

ఆ తరువాత ఇంద్రుడు విసరిన వజ్రాయుధమును చేతపట్టుకొని శ్రీకృష్ణుడు చక్రాయుధమును మాత్రము వదలక నిలునిలుమని తర్జించెను. వజ్రము కోల్పోయి తన వాహనము గరుడుని దెబ్బతినునంతట పలాయన మంత్రము జపింపనున్న శచీపతినిగని సత్యభామ ఇట్లనియె:

త్రిలోకేశ్వరా! శచీభర్తకు పారిపోవుట యుక్తముగాదు. పారిజాత కుసుమమాల సిగను ముడుచుకొని శచి నిన్ను సేవింపగలదు. పారిజాతమాలచే తేజరిల్లుచు వలపుగొని ఏతెంచిన శచిని మునుపటి అట్లు చూడని నీ దేవ సామ్రాజ్యము ఏపాటిది? ఇంద్రా! చాలుచాలు సిగ్గు పడకుము ! దేవతలు పారిజాతము గొంపోదురుగాక! వారు వ్యధపడకుందురుగాక! పతిగర్వమున తాను గర్వముగొని తన ఇంటికి వచ్చిన నన్ను శచి బహుమానముగ చూడలేదు. స్త్రీని అగుటవలన ఉదారమైన మనస్సు లేనిదాననై నా భర్తను మెచ్చుకొనుటయేపనిగా ఓ ఇంద్రా! నీతో తగవు బెట్టుకొంటిని. చాలు పరుల సొత్తుతో దొంగిలుటతో పారిజాతముతో పనిలేదు. రూపమునకు కీర్తికిని ఏ ఆడుది గర్వింపదు? అని పలుక ఇంద్రుడు సంరంభముడిగి ఓ సఖి! చండి! (తీవ్ర కోపమున) మిగుల భేదపడవలదు. సృష్టి స్థితి సంహార కర్తయగు విశ్వ స్వరూపునిచే ఓడుటకు నేను సిగ్గుపడను. ఎవని యందీ జగమెల్ల ఉన్నదో, కల్గుచున్నదో, లయించుచున్నదో అట్టి ప్రభువుచేత ఓడిన వానికి సిగ్గేల కల్లును. సకల భువన స్వరూపుడగు అయన సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపము. సకల వేదవిధులచే ఎరుగబడునది, అన్యులచే ఎరుగ బడుటెట్లు? అట్టి అజుని, ఈశ్వరుని, శాశ్వతుని, తనంతట తాను జగదుపకారము చేయు మొట్టమొదటి వానిని ఎవ్వడు జయింప సమర్థుడు? (203)