బ్రహ్మ మహా పురాణము

అష్టావక్ర కథ

మున్ను సనాతన బ్రహ్మోపాసనము జేయుచు అష్టావక్రుడు పెక్కేండ్లు నీటనే నివాస ముండెను. అసురులు ఓడినతరువాత మేరువుపై పెద్ద ఉత్సవము అయ్యెను. అది చూడనేగుచు దేవతా స్త్రీలు అతనిని జూచిరి. రంభా, తిలోత్తము మొదలైనవారు నూర్లు వేలుగ ఆమహాత్ముని స్తుతించిరి. ప్రశంసించిరి. అతడు కంఠమువరకు జలమున మునిగి పెనుజడలు దాల్చి ఉన్నను, వినయమున అమరాంగనలు మ్రొక్కిన ప్రసన్నుడై ఇట్లనియె.

“నేను ప్రసన్నుడనైతిని. తామేదికోరిన నిచ్చెదను కోరుకొనుడన రంభ, తిలోత్తమ మొదలైనవారు నీవు ప్రసన్నుడవైన మేము పడయని భాగ్యమేమున్నదనిరి. కాని వారిలో కొందరు ప్రసన్నుడ వైతివేని నిన్ను భర్తగా కోరెదమనిరి. అట్లే అగునని అతడు నీళ్ళనుండి లేచెను. అయ్యెడ అతని ఎనిమిది వంకరలుగల వికృత రూపునిగా చూచిరి. చూచి చాటు వడుచున్న ఆయింతుల పరిహాసము అతనికి స్పష్టమయ్యెను. దానికి కోపించి అతడు నా విరూపము చూచి హసించి అవమానముచేసితిరి కావున నా దయచేతనే పురుషోత్తముని భర్తగ బొంది నా శాపముచే దొంగలచేత చిక్కెదరనెను.

ఆ మాటలకు భీతలై వారు బ్రతిమాలగా, ఆ ముని ఇంద్రలోకమునకు ఆ మీద ఏగుదురని అనుగ్రహించెను. ఇట్లు అష్టా వక్రుని శాపము వలన జరిగిన దానికి నీవు కొంచెముకూడ శోకింపబనిలేదు. ఈ సంహా రమేకాదు కొలది కాలములో మీరును ఉపసంహరింపబడుదురు. పుట్టినవానికి గిట్టుటయు, మీద ఉండుటయు సంచయము ప్రోగుచేయుట క్షయము (పోగొట్టుకొనుట) కలిసి విడి వడుటయును తప్పదు. స్వభావమని దీనిని ఎరిగిన పండితులు క్రుంగరు పొంగరు. అట్టి పండితుల నడవడిని అలవరచుకొన్న వారు కూడ వారివలెనే ఉన్నవారును కాగలరు.

కావున నరశ్రేష్ఠ! సోదరులతో ఇది ఎటిగి రాజ్యము విడిచి తపముచేయ వనమునకు వెళ్ళదగును. ఈ నామాటను ధర్మరాజునకు చెప్పుము. ఎల్లుండి సోదరులతో గూడ ఉత్తమ గతి మహాప్రస్థానము జేయుడు. అని తెలుపబడి పార్థుడు ధర్మరాజు దగ్గరకు వచ్చి ఆ వృత్తాంతమునంతయు తెల్పెను. వారందరు అర్జునుని వచనము విని పరీక్షిత్తును రాజ్యమున నుంచి వనమునకు చనిరి. ఓ మునిశ్రేష్ఠులార! విస్తరముగ ఇట్లు యదు వంశమునందు పుట్టిన వాసుదేవుని యొక్క చరిత్రము మీకు దెలిపితిని” అని వ్యాసుడు వారితో అనెను. (212)