ఇట్లు నారాయణుని యథావిధి పూజించి సముద్రునకు నమస్కరించవలెను. అపుడు ‘ప్రాణస్త్వం’ అను మంత్రమును జపించవలెను. స్నానము చేసి వచ్చి ఒడ్డున నారాయణుని పూజించి బలరాముని కృష్ణుని, సుభద్రను, సముద్రునికి నమస్కారము చేసి అశ్వమేధ ఫలమును మానవుడు పొందును. అంతేకాక సూర్యప్రభగల విమానమును ఎక్కి గంధర్వ అప్సరసలు సేవింప, ఇరువదియొక్క తరముల వారిని ఉద్ధరించి విష్ణులోకమున కేగును. నూరు మన్వంతరములు విష్ణులోక భోగములను అనుభవించి ఈ భారత భూమి యందు శ్రీమంతుడై సర్వైశ్వర్యసంపన్నుడయి వేదశాస్త్ర వేత్తయై వర్తించి వైష్ణవ యోగమున మోక్షమును పొందును. ఈ సముద్రమున పుణ్యకాలమందు అనగా గ్రహణ సంక్రాంతి అయన విషువ యుగాది షడశీతి వ్యతీపాతము దిన క్షయ ఆషాఢీ, కార్తిక, వైశాఖీ పూర్ణిమలయందు స్నానదానాదులు చేసి పితృతర్పణ పిండ ప్రదానాదులు చేసిన అనంత పుణ్య నిధి అగును. పిండ ప్రదానము వలన ఆయువు, కీర్తి, భుక్తి, ముక్తి సిద్ధించును. ఈ వార్త నాస్తికులకు చెప్పరాదు. పుష్కర తీర్థములు ఇంతకుముందు చెప్పబడిన ఆయా ఫలములను ఈయగలవు. ఈ తీర్థరాజము సర్వతీర్థ ఫలప్రదము. సాగరుడు సర్వతీర్థ రాజు. సూర్యోదయ మందు చీకటి విరిసినట్లు ఈ తీర్థరాజ సేవనమున పాపమెల్ల విరియును. స్నాన దాన తపో హోమాదులు ఇచట అక్షయఫలప్రదములు అగును. (62)