బ్రహ్మ మహా పురాణము

శ్రీకృష్ణ జన్మ కథనము

వ్యాసులు ఇట్లు అనియె -

జగత్కర్త్రియైన అ విష్ణుమాయ దేవదేవుడు చెప్పినట్లు దేవకి ఆరు కాన్పుల ఒనరించి తరువాతి గర్భమును ఆకర్షించెను. ఆ తరువాత దేవకీ గర్భమందు హరి ప్రవేశించెను. అదే సమయమున యోగనిద్ర యశోద ఉదర మందు బ్రహ్మ చెప్పిన విధముగ జనించినది. అంతట గ్రహములు శుభ స్థానములందు సంచరించినవి. విష్ణు అంశము భూమియందు అవతరించు సమయమున ఋతువులు సుశోభనమయ్యెను. దేవకి ముఖకాంతి అతి శయించి ఆమెవంక జూచుటకు ఎల్లరకు అశక్యమయ్యెను. దేదీప్యమానమై ఉన్న ఆమెను జూచిన వారిమనసులు కలతజెందినవి. ఏరికిని తేరిపార చూడ శక్యముగాని దివ్యప్రభతో విష్ణువును తన ఉదరమందు భరించుచున్న ఆమెను దేవతలు అహర్నిశము స్తుతించు చుందురు.