దేవతలు ఆమెను “దేవీ నీవు స్వాహా స్వధా విద్యా సుధా స్వరూపిణివి. జ్యోతి స్వరూపురాలవు. సర్వలోక రక్షణమునకై భూలోక మందు అవతరించితివి. దేవీ! ప్రసన్ను రాలవగుము. ఎల్ల జగత్తునకు మేలు చేయుము. ఎవ్వనిచే ఎల్ల జగము తరింపచేయబడెనో ఆ ఈశ్వరుని నీవు ప్రీతితో ధరింపుము” అని స్తుతించిరి. ఇట్లు స్తుతింపబడిన ఆ తల్లి జగద్రక్షిణ కారణమైన పుండరీకాక్షుని గర్భమున దాల్చెను. ఎల్ల లోకములనెడి పద్యములను వికసింప చేయుటకు అచ్యుతుడు సూర్యుడు పూర్వసంధ్యా సమయమందు దేవకి యందు ఆవిర్భావము జేసెను. అఖిల జగదాధారమూర్తియైన జనార్దనుడు నడిరేయి జనించుచుండగ మేఘములు అల్లన గర్జనము చేసినవి. దేవతలు పుష్పవృష్టి కురిపించిరి. వికసించిన నల్లకలువ రంగులో నాల్గు బాహువులతో శ్రీవత్సవక్షుడై ఉన్న ఆ మూర్తిని చూచి వసుదేవుడు స్తుతించెను. ప్రసాద గుణభరితములైన వాక్కులతో స్తుతించి అతడు కంసుని వలన జడిసి “ఓ దేవదేవ! శంఖ చక్ర గదాధరా! నీకలరూపు జూపితివి. నేనది తెలిసికొంటిని. దయచేసి ఈ రూపమును మరుగుపరచుము. ఇది తెలిసినయెడల కంసుడు ఈక్షణము నన్ను అనేక యాతనలకు గురిచేయును. ఈ కారాగారమున నీవు అవతారము తాల్చితివని వానికి దెలియుట ప్రమాదము” అని విన్నవించెను. అప్పుడు దేవకియు అనంతరూపుడు విశ్వరూపుడునై తనయందెల్ల లోకములను భరించు దేవదేవుడు తన మాయంగొని బాల రూపమున వెలువడిన ఈ స్వామి మా ఎడల ప్రసన్నుడగుగాక! ఓ సర్వాత్మమూర్తి ఈ చతుర్భుజ రూపమును ఉపసంహరింపుము. ఓ దైత్యాంతక నీయీ అవతారమును కంసుడు ఎరుగకుండుగాక. అనగావిని శ్రీ భగవంతుడు పుత్రార్ధినివై మున్ను నన్ను స్తుతించితివి కావున అది ఇప్పుడు సఫలమైనది. నీ ఉదరమునుండి ఇపుడందులకే అవతరించితిని అని పలికి స్వామి మిన్నకుండెను.
వసుదేవుడు ఆరాత్రియే ఆ శిశువును ఎత్తుకొని కారాగారము వెడలెను. కారాగార రక్షకులు యోగనిద్రా మోహితులైరి. మధురానగర పాలకులుగూడ అక్కడ నిద్రావశులైరి. నడిరేయి మేఘములు మిక్కిలిగా వర్షించుచుండ శేషుడు తన పడగలు విప్పి పైని కప్ప, సుళ్ళుతిరిగి కెరటములు ఉవ్వెత్తుగ పరవళ్ళు దుక్కు లోతైన యమునానదిని, మోకాలిబంటి లోతు ఉన్న దానిని వసుదేవుడు విష్ణువు నెత్తుకొని దాటెను. అదే సమయమున కంసునికి కప్పము చెల్లింప అచ్చటకు వచ్చియున్న నందుడు మొదలగు గోపవృద్ధులను అతడు యమున దరిని దర్శించెను. మఱియు అతడు బాలుని యశోదప్రక్కలో నుంచి అందున్న పిల్లను ఎత్తుకొని వచ్చెను.
అప్పుడు యశోద మెళుకువగొని, పుట్టిన కుమారుని చూచెను. నల్లకలువ రేకుల బోలి నిగనిగలాడు నల్లని మేనిగల శిశువునిచూచి, ఎంతో సంబరబడెను. అట వసుదేవుడును ఆ బాలికను ఇంటికి తీసుకొని వచ్చి దేవకి ప్రక్కలో ఉంచి ఎప్పటి యట్ల ఉండెను. పిమ్మట కారాగార రక్షకులు పిల్ల ఏడుపువిని తటాలునలేచి దేవకి ప్రసవించిన వార్తను కంసునికి నివేదించిరి. కంసుడు అపుడు వెంటనే వచ్చి, ఆ పిల్లను పట్టుకొనెను. దేవకి మృదుస్వరమున విడువు, విడువుమని వారించుచున్నను, వాడటనున్న బండపైకి ఆ బాలికను విసరి కొట్టెను. ఆ శిశువు అక్షణము ఆకాశమందు నిలచి ఆయుధములతో గూడిన ఎనిమిది బాహువులతో అపురూపమైన రూపుగొని, బిగ్గరగా నవ్వి రోషముగొని కంసుని చూచి, కంసా! నన్ను విసరినంత ఏమయ్యెను. నిన్ను చంపువాడు ఒకడు పుట్టి ఉన్నాడు. క్రూరుడవగు నీ పాలిటికి మృత్యువు. దేవతల సర్వస్వమూర్తి అవతరించి ఉన్నాడు. ఇది నీమనస్సులో పెట్టుకొని నీకేది హితమో అది చేసికొనుము అని పలికి ఆ దేవి దివ్య గంధమాల్యభూషణ ధారిణియై కంసుడు చూచుచుండ సిద్ధులు పొగడుచుండ ఆకసము వెంట వెళ్ళెను. (182)