మఱియు తరువులనుండి విరులను రాల్చి ప్రాలేయ గిరి శృంగములను సింగారించెను. పాటల కుసుమ విస్తీర్ణ కదంబ అర్జున సుమనోహర వాయువులు చల్లగ వీచెను. దిగుడు బావులు వికచకమల కేసర పుంజ రంజితములై ఎఱుపెక్కకలహంస కదంబముల అచ్చపు జిగి ఎంతేని ముచ్చట గొలిపెను. పూలగోరంటలు, పువ్వుల తెలినిగ్గుల నెఱనీటుగులుకు తుమ్మెదలకు వలపు కూర్చుచుండెను. హిమశైల విశాల నితంబము (శిఖరము) లందు పొగడలు, నలువంకల తావులు జిమ్ము పూవులరాసులం గ్రుమ్మరించినవి. ఓ ముని ప్రవరులారా! వింటిరే ఇట్లు ఆరుఋతువులు గౌరీ వివాహ కౌతుకమునకు కుతూహలముగొని కుసుమ విచిత్ర శృంగారతరులతా బృందముతో అందముగా ఏతెంచినవి.
మంగళ వాద్యములు మ్రోయ ఇట్లు సాగిన కల్యాణ వైభవమున బ్రాహ్మణ సముదాయములతో శైలపుత్రిని సకలాభరణ భూషిత గావించి, వెంటగొని, నేను స్వయముగా పురప్రవేశము చేయించితిని. అటుతరువాత నేను బ్రహ్మస్థానమందు ఉండి ఈశ్వరునితో నీ వివాహ నిమిత్తముగ అగ్నియందు ఆజ్యాది హవిస్సులను హోమము నిర్వహించెద ఆజ్ఞ ఇమ్మని అడిగితిని. అందుకు శివుడు-ఓ సురేశ్వర! ఏమిచేయ ఉద్దేశింపబడినదానిని ఎల్లను నీ ఇష్టానుసారము కావింపుము, నీ చెప్పినట్లు అంతయు నేను చేయుదును అని అనెను.
ఆమాటలకు ఆనందపడి, నేను దర్భలనుగ్రహించి ఆదేవుని యొక్కయు దేవియొక్కయు హస్తములను యోగబంధమున జతచేసితిని. శ్రుతి గీతములయిన మహామంత్రములై మూర్తిమంతములయి సన్నిధిచేయ, అగ్ని కూడా హవిర్భాగములను స్వయముగా అందుకొన దలచినట్లుగా దోసిలిపట్టి నిలిచెను. యథావిధిగ అమృత రూపమైన హవిస్సును హోమముచేసి సనాతనులయ్యు, నూతనులయిన ఆ దంపతులు చేయి చేయియుంగొని అగ్నికి ప్రదక్షిణమునొనరించిన తరువాత వారి చేయి విడిపింప, సర్వదేవతలు నామానస పుత్రులు సిద్ధులు ప్రహృష్టాంతరంగులై నన్ను అనుగమింప అందఱము ఆపెండ్లివేళ వృషధ్వజునకు ప్రణామములు గావించితిమి. ఇట్లు ఆ సనాతన మిధునమునకు యోగము చేతనే ఈ వివాహ మహోత్సవము జరిగినది. ఈ అందము మున్నెన్నడు దేవతలు కూడా చూచి యెఱుగరు. ఈ మహేశ్వర స్వయంవర కల్యాణ వృత్తాంతము మీకెల్ల వినిపించితిని. ఇది సకల జగత్కల్యాణకరము. (36)