బ్రహ్మ మహా పురాణము

ప్లక్ష ద్వీప వర్ణనము

పాల సముద్రముచే జంబూద్వీపము చుట్టబడినట్లు ప్లక్షద్వీపము ఉప్పు సముద్రముచే పరివృతమై ఉన్నది. జంబూద్వీప విస్తృతి లక్ష యోజనములు, దానికి రెట్టింపు ప్లక్ష ద్వీపము. ప్లక్ష ద్వీపేశ్వరుడు మేధాతిథి. వాని కుమారులు ఏడుగురు. శాంతమయుడు (జ్యేష్ఠుడు), శిశిరుడు, సుఖోదయుడు, ఆనందుడు, శివుడు, క్షేమకుడు, ధ్రువుడు అనువారు వారీ ద్వీపమును ఏలినవారు. వారిపేర మర్యాదా (హద్దు) కౌరవ పర్వతములు అనగా సరిహద్దులుగా గల పర్వతములు ఏడుగలవు. అట్లే వర్షపర్వతములు మఱి ఏడు గలవు. మునులారా! వాని పేర్లు వినుడు. గోమోదము, చంద్రము, నరదము, దుందుభి, సోమకము, సుమనస్సు, వైభ్రాజము అనునవి ఆ ఏడు.

పుణ్యాత్ములారా! రమ్యములగు ఈ వర్ష పర్వతములందును, వర్షములందును ప్రజలు దేవ గంధర్వులతో గూడి వసింతురు. అందలి దేశములు పవిత్రములు. వీర్యవంతములు. అందు జనులు మృతి నందరు. అధివ్యాధులు లేక సర్వకాలము సుఖముగా ఉందురు. అందు నదులుగూడ ఏడే. అవి సముద్ర గాములు. అనగా సముద్రము వైపు ప్రవహించి అందు కలియునట్టివి. వానిపేర్లు అనుతప్త, శిఖ, విప్రాశ, త్రిదివ, క్రము, అమృత, సుకృత అనునవి. వాని పేర్లను వినినంతనే పాపములు హరించును. ప్రధానములైన నదులు, పర్వతములు పేర్కొనబడినవి. చిన్నచిన్న నదులు పర్వతములు వేలకొలది గలవు. అచటి వారు ఎప్పుడును ఆ నదీ జలములనే త్రాగుచుందురు. కాని నదులు తగ్గవు పెరుగవు.

ఆ ప్రదేశములు ఏడింటియందును యుగ వ్యవస్థలేదు. ఎల్లప్పుడు త్రేతాయుగ సమముగనే కాలము నడచును. ప్లక్షద్వీపము మొదలు శాకద్వీపము వరకు జనులు అయిదు వేలేండ్లు ఆయువుగల్గి నిరోగులై ఉందురు, వర్ణాశ్రమ విభాగానుసారము అక్కడ ధర్మము నాల్గు విధములుగ ఉండును. అక్కడ వర్ణములు నాలుగు. వానిని మీకు చెప్పుచున్నాను వినుడు.

ఆర్యకులు, కురువులు, వివిశ్వులు, భావులు అనుపేర విప్ర క్షత్రియ వైశ్య శూద్రులు అను నాలుగు వర్ణముల వారుందురు.

జంబూ ద్వీపమున జంబువృక్షమున్నట్లు అంత పరిమాణముగల జువ్విచెట్టు ప్లక్ష ద్వీప మధ్యమందున్నది. అందుచే దానికాపేరుకల్గినది, అందు ఆర్యకాది వర్ణములవారిచే జగత్కర్తయు సర్వేశ్వరుడును సోమరూపియు అగు అహరి ఆరాధింపబడును, ప్లక్షద్వీప ప్రమాణముగల ఇక్షు (చెఱుకురసము) సముద్రముచే ప్లక్ష ద్వీపమావరింపబడి యున్నది. మునులారా! ఇట్లు మీకు ప్లక్షద్వీపము సంగ్రహముగ వర్ణించితిని. ఇక నేను చెప్పబోవు శాల్మల ద్వీపమును గూర్చి తెలిసికొనుడు-

ఇక శాల్మల ద్వీపము-దీనికి వీరుడైన వువష్మంతుడు అధీశ్వరుడు. వాని కుమారుల నామములతో శ్వేతము, హరితము, జీమూతము, రోహితము, వైద్యుతము, మానసము, సుప్రభము అను వర్షపర్వతములు ఏడును ప్రసిద్ధములు. శాల్మల ద్వీపము ఇక్షురస సముద్రముచే పరివేష్టితము. అ సముద్రము ఈ ద్వీపమునకు రెట్టింపు ప్రమాణము గలది. అక్కడ రత్నగర్భములైన సప్తకులాచలములు, సప్తనదులు గలవు. అందు కుముదము, ఉన్నతము, వలాహకము, ద్రోణము, కంకము, మహిషము, కకుద్మంతము అను పర్వతములు ఉన్నవి. ద్రోణగిరియందు మహౌషధులు ఉండును. ఇందలి నదులు: శ్రోణి, తోయ, వితృష్ణా, చంద్ర, శుక్ర, విమోచని, నివృత్తి అనునవి. అవి స్మరణ మాత్రాన పాపముల హరించును.

ఇందలి వర్షములు శ్వేతము, లోహితము, జీమూతము, హరితము, వైద్యుతము, మానసము, సుప్రభము అనునవి. ఇందు చాతుర్వర్ణ వ్యవస్థ యున్నది. కపిల=తేనెరంగు, అరుణ=ఎఱుపు, పీత=పసుపు, కృష్ణము=నలుపు అను రంగులు గల్గి క్రమముగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణముల వారిందు నివసింతురు. ఇచట యాగకర్తలకు ఉపాస్య దైవము విష్ణువు. యజ్ఞమందు వాయు స్వరూపునిగ ఆ దైవమును యజ్వలు సేవింతురు. అతి మనోహరమైన ఈ ద్వీపమందు దేవతలు సన్నిధిచేసి యుందురు. శాల్మల వృక్షముండుటచే ఈ ద్వీపమునకు శాల్మల ద్వీపమని పేరు. కుశద్వీపము చుట్టును సురా సముద్రము ఉన్నది. అది శాల్మల ద్వీపమునకు రెట్టింపు విస్తారము గలది.

ఇందు రాజైన జ్యోతిష్మంతుని కుమారులు-ఉద్భిదుడు, వేణుమంతుడు, స్వైరధుడు, రంధనుడు, ధృతి, ప్రభాకరుడు, కపిలుడు అనువారి పేరులతో వర్షములు ఉన్నవి. ఇందు మనుజులతోబాటు దైత్య, దానవ, దేవ, గంధర్వ, యక్ష, కింపురుషులును వసింతురు. ఇక్కడ స్వధర్మానుష్ఠానపరులయిన బ్రాహ్మణాది చతుర్వర్ణ ప్రజలు వరుసగా దములు, శుష్మిణులు, స్నేహులు, మాందహులు అనుపేర ఉందురు. అక్కడ పరబ్రహ్మ రూపుడు జనార్దనుడు ఆరాధ్యదైవము. అచట జనులు జనార్ధనుని గూర్చి యజ్ఞములు చేసి ఆధికారిక పురుషులుగా అవతరింప వలసిన పురాకృత పుణ్యకర్మ ఫలమును క్షయింప జేసికొందురు. అనగా కేవల నైష్కర్మ్య విషయమైన ముక్తినే కోరుదురని తాత్పర్యము. విద్రుమము, హేమశైలము, ద్యుతిమంతము, పుష్టిమంతము, కుశేశయము, హరిమందరము అనునవి అచ్చట వర్ష పర్వతములు ఏడు.

ధూతపాప, శివ, పవిత్ర, సమ్మతి, విద్యుదంభస్సు, మహీ అనునవి మరికొన్ని చిన్న చిన్న ఏరులు. వేలకొలది సర్వపాపహరములైనవి అక్కడ ఉన్నవి. కుశద్వీపమధ్యమున కుశస్తంభమున్నది. అందుచే దానికా పేరు కల్గినది. ఘుృతసముద్రము క్రౌంచద్వీపముచే ఆవృతమై అచ్చట ఉన్నది.

ఇక క్రౌంచ ద్వీపము, కుశద్వీపము కంటే రెట్టింపు విరివిగలది. ఇచట ద్యుతిమంతుని కుమారులు ఏడుగురు, పరిపాలకులు. కువగుడు, మందగుడు, ఉష్ణుడు, పీవరుడు, అంధకారకుడు, ముని, దుందుభి అనువారు. దేవగంధర్వ నిషేవితములు రమ్యములు అయిన వర్షపర్వతములు ఇందున్నవి. అవి క్రౌంచము, వామనము, అంధకారకము. దేవవ్రతము, ధమము, పుండరీకవంతము, దుందుభి అనునవి ఒకదాని కంటె ఒకటి రెట్టింపు ప్రమాణముగలవి. ఇక్కడ దేవగణములతో గూడి పుష్కరులు, పుష్కలులు అనువారు ధన్యులై చరింతురు. బ్రాహ్మణాది చతుర్వర్ణములు ఇందుగలవు. ఇందు ప్రధాన నదులు ఏడు. గౌరి, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజవ, ఖ్యాతి, పుండరీక అనునవి. అక్కడ పుష్కరాదులచే ధ్యాన యోగమున యజ్ఞమందు రుద్రరూపుడైన జనార్దనుడు ఆరాధింపబడును. ఇది మీగడ సముద్రముచే ఆవృతము. అది ఆ ద్వీప పరిమాణము గలది. దానిచుట్టును శాక ద్వీపమున్నది.

శాక ద్వీపవతియైన భవ్యునికి జలదుడు, కుమారుడు, సుకుమారుడు, మనీరకుడు, కుశమోదుడు, మోదాకి, మహాద్రుముడు అను పుత్రులుగలరు. అందలి వర్షములు వారిపేర ఉన్నవి. అందు ఏడు వర్ష పర్వతములు ఉదయగిరి, జలధార, రైవతకము, శ్యామము, అంభోగిరి, అస్తికేయము,కేసరి అనునవి. సిద్ధ గంధర్వ సేవితమై, ఇచట శాకమను (టేకుగాని, కడిమిగాని) మహావృక్షమున్నది. దాని ఆకుల గాలి తాకినచో పరమాహ్లాదము గల్గును. అక్కడ పవిత్రములయిన చతుర్వర్ణ ప్రజలతో గూడిన జనపదములు గలవు. అచటి జనులు నిరాటంకులు ఏ అభ్యంతరములు లేనివారు నీరోగులు. నదులు మహాపుణ్యములు. పాపభయహరములు. సుకుమారి, కుమారి, నళిని, రేణుక, ఇక్షువు, ధేనుక, గభస్తి అనునవి యేడు చిన్నచిన్న ఏరులు, గిరులు వేలున్నవి. జలదాది గిరులపై వసించు జనులు ఆ నదీ సలిలములను త్రాగుదురు. ఈ నదులు స్వర్గమునుండి వచ్చినవి. అచటి ప్రజలలో ధర్మహాని సుఖదుఃఖములు, శాస్త్రము హద్దుమీరీ నడచుట అనునవి లేవు. మగులు, మాగధులు, మానసులు, మందగులు అనుపేర బ్రాహ్మణాది చతుర్వర్ణ ప్రజలు అచట నివసింతురు. శాకద్వీపవాసుల కులదైవము విష్ణువు, సూర్యరూపుడుగా యథావిధి శ్రీహరి ఈ ప్రజలచే అర్చింపబడును.

శాకద్వీపము అదే ప్రమాణముగల క్షీరాబ్దిచే ఆవరింపబడి ఉన్నది. క్షీరాబ్ది పుష్కర ద్వీప సమావృతము. శాకద్వీపము కంటె రెట్టింపు ప్రమాణము కలది పుష్కరము. పుష్కర ద్వీపమందు సవనుని కుమారులు మహావీతుడు, ధాతకి అనువారు. వారిపేర వర్షములు రెండు. ఇక్కడ వర్ష పర్వతము మానసోత్తరము అనునది ఒక్కటియే. అది ఈ ద్వీపము నడుమ వలయాకారమున ఉన్నది. ఏబది వేల యోజనముల ఎత్తు, అంతే వెడల్పుగలది. అది పుష్కర ద్వీపమండలమును నడిమికి రెండు భాగములు చేయుచున్నట్లున్నది. దాని మూలముననే ఈ ద్వీపము రెండు వర్షములుగా విభక్తమైనది. అవి వలయాకారములు. వాని నడుమ పెద్దగిరి కలదు. అచటి జనులు పదివేలేండ్లు జీవింతురు. వారు రాగద్వేష శోకములు లేనివారు. ఆరోగ్యవంతులు. వారిలో అధమోత్తమ భేదములేదు.చంపువాడు చంపబడువాడును లేరు. ఈర్ష్యాసూయ లెరుగరు. భయము, రోషము, దోషము, లోభము శూన్యములు. మానసోత్తర పర్వతమునకు మహావీత ఖండము వెలుపలిది. ధాతకీ ఖండము లోపలిది. దేవదైత్యులు వసింతురు. ఈ వర్షద్వయమున పుష్కర ద్వీపమందు సత్యానృతము (వాణిజ్యము) లేవు. నదులు లేవు కొండలులేవు. ద్వీపములు లేవు.

మనుష్యులు అందరి వేషమొక్కటే. వారు దేవసమరూపులు. అట వర్ణాశ్రమాచార ధర్మ విచక్షణ లేదు. వేదత్రయము, వార్త, దండనీతి, శుశ్రూష అనునవి లేనేలేవు. ఈ వర్షద్యయము భూలోక స్వర్గమే. కాలము జరారోగములు లేక సర్వసుఖప్రదమగును. ఈ రెండు ఖండములందు పుష్కర ద్వీపమందు న్యగ్రోధ (మఱ్ఱి) మహావృక్షము బ్రహ్మ ఉండు స్థానము. బ్రహ్మ అచట సురాసురులచే పూజింపబడుచుండును. తియ్యని నీటి సముద్రముచే అది చుట్టుకొన్నది. దాని ప్రమాణము పుష్కర ద్వీప సమానము.

ఇట్లు ద్వీపములు ఏడును సముద్రములు ఏడింటిచే అవరింపబడి ఉన్నవి. ద్వీపములు అన్నియు సమప్రమాణములు. సముద్రములు అన్నియు వానికి రెట్టింపు ప్రమాణము గలవి. అన్ని సాగరములందలి నీరు ఎల్లప్పుడును సమము. హెచ్చు తగ్గులు లేకుండా ఉండును. నిప్పుచే గిన్నెలో నీరు పొంగినట్లు, చంద్రుని వృద్ధిని అనుసరించి అందలి నీరుపొంగును. ఆ పొంగు క్రుంగు కూడ అన్నిట సమానమే. అన్ని సాగరములు సమముగ పొంగును తగ్గును. శుక్ల కృష్ణ పక్షములందు చంద్రోదయాస్తమయములందు పదునైదు అంగుళములు పొంగుచు క్రుంగుచు ఉండును. పుష్కర ద్వీపవాసులందరు అన్నివేళల స్వయంసంప్రాప్తమైన షడ్రసోపేత భోజనము చేయుచుందురు.

స్వాదూదక (మంచినీటి) సముద్రము చుట్టు లోకమున్నది. దానికి రెట్టింపు బంగారు భూమి కలదు. అది జంతు రహితము ఆ మీద లోకాలోక పర్వతము పదివేల యోజనములు విరివైనది, అంతే ఎత్తును అంతే లోతుగలది. ఆ శైలము ఆవరించి చీకటి ఉన్నది. ఆ చీకటి అండకటాహమంతట నావరించి ఉన్నది. ఇంతవరకుగల ఈ భూమి ఏబది కోట్ల యోజనముల ప్రమాణముగలది. బ్రహ్మాండకటాహముతో ద్వీపములతో పర్వతములతో ఈధాత్రి (సృష్టిహేతువు) యై సర్వభూతములలో గుణాధిక్యముగలదై సర్వజగదాధారమై ఉన్నది. (20)