వ్యాసుడు ఇట్లనియె -
శ్రీకృష్ణునికి రుక్మిణి యందు గల్గిన ప్రద్యుమ్నాదులగు పుత్రులను గూర్చి తెల్పితిని. సత్యభామ యందు భానువు మొదలగు కుమారులు గల్గిరి. దీప్తిమంతుడు ప్రపక్షుడు మున్నగువారు రోహిణీయందు గల్గిన తనయులు. సాంబాదులు జాంబవతికి ఉదయించిరి. నాగ్నజితియందు భద్రవిందాదులు పుట్టిరి. శైబ్యయందు సంగ్రామజిత్తు మొదలయిన కొడుకులు గల్గిరి. మాద్రి కుమారులు వృకాదులు. లక్ష్మణ గాత్రవంతుడు మొదలగు వారిని కనెను. కాళిందికి శ్రుతాదులు ఉదయించిరి. మఱి ఇతర భార్యలందు చక్రికి ఎనిమిద యుతములు (నూరు వేలును) కుమారులు జనించిరి. (అయుతము పది వేలు x 8 = 80000 + 100000 = అనగా ఒక లక్ష యెనుబది వేల మంది హరి వంశమన్న మాట) అందరిలో రుక్మిణీ కుమారుడు ప్రద్యుమ్నుడు మొదటివాడు. అతని వలన అని రుద్ధుడు ఉదయించెను. అతనికి వజ్రుడు పుట్టెను. యుద్ధములందు అనిరుద్ధుడు = నిరోధింపబడనివాడు. కావున అనిరుద్ధుడను పౌరుషనామమును పొందిన అతడు బలి పౌత్రిని బాణుని కుమార్తెను ఉషను పెండ్లాడెను. ఆ సందర్భముననే హరి హరులకు ఘోరయుద్ధమే జరిగి బాణాసురుని వేయి బాహువులు చక్రిచే తెగగొట్టబడినవి.
అని తెలుపగా మునులువిని ఉషా నిమిత్తముగనైన ఆ యుద్ధ విశేషములు పూర్తిగ తెల్పుము. విన కుతూహల మగుచున్నదన వ్యాసులు ఇట్లనిరి:
బాణుని కూతురు ఉష శంకరునితో క్రీడించు పార్వతిని చూచి తనలో తానెంతో ముచ్చటపడెను. అంత గౌరి అందరి డెందములను ఎఱిగినది కావున తాపపడకు! నీవును మగనితో ఇట్లే క్రీడింతువు లెమ్మనెను. అదివిని ఆ ముగ్ధ ఎప్పుడు, నామగడు ఎవ్వడు అని అడుగగా మరల పార్వతి ఓ రాచకన్నియ! వైశాఖ శుక్ల ద్వాదశినాడు కలలో నీకు అభిభవము = తిరస్కారమును (మానభంగమును) చేయునో అతడే నీకు భర్త కాగలడు అనెను.
చెలి చిత్రలేఖ మెల్లన లాలించి విశ్వాసము గల్గించినంత ఉషాదేవి గౌరి పలికినది పలికినట్లు చెలికత్తెకు తెలిపి వానికి ఉపాయము చేయమనెను. అంతట చిత్రలేఖ పటము నందు సురలను, దైత్యులను, గంధర్వులను ప్రధానముగా మనుష్యులను లిఖించి చూపెను. ఆ బాలిక అందఱును తిలకించి మనుష్యుల చిత్తర్వులందు చూపు ఉంచెను. వారిలో కూడ అంధక వృష్టి వంశములందు దృష్టిపెట్టెను. అందును కృష్ణుని బలరాముని చూసి సిగ్గుదొలకి, కన్నులు విప్పార, ప్రద్యుమ్నుని జూడ లజ్జనిండిన చూపును ప్రసరింప జేసెను. అప్పుడు అనిరుద్ధుని గాంచియు ఆ సిగ్గు ఎటు పోయెనో అతడే ఈతడు నాకని (నాకు కనబడిన వాడని బాహ్యార్థము) నాకు కావలసినవాడని చెప్పగా సఖియగు ఆ చిత్రలేఖ నెచ్చెలిని ఓదార్చి, యోగశక్తిచే ద్వారవతికేగెను. (205)