బాణయుద్ధ వర్ణనము

వ్యాసుడు ఇట్లు అనియె -

బాణుడు త్రిలోచనునికి మ్రొక్కి ఇట్లనియె. వేయి బాహువులతో యుద్ధములేక నేను నిస్పృహుడనైతిని. ఈ చేతులున్నందులకు ఇవి సాఫల్యము నందుటకు ఏదేని రణము సంఘటింపవలెను? అదిలేనపుడు ఈ చేతులు బరువుచేటుగదా. ఇవి యెందులకు? అన శంకరుడు నీ నెమలి టెక్కెమెప్పుడు విఱుగునో అప్పుడు మాంసాశనులగు జనములకు ఆనందమగు యుద్ధము నీకు సంఘటించుననెను.

ఆ మాటలకు సంతసించిన బాణుడు శంభునికి మ్రెక్కి ఇంటికివచ్చి రాగానే ధ్వజభంగమగుట చూచి మిక్కిలి హర్షమొందెను. ఇదే సమయమున చిత్రలేఖ ఆ అనిరుద్ధుని యోగబలమున కన్యాంతఃపురమునకు గొనివచ్చి ఉంచగా, ఉషాదేవితో క్రీడించుచున్న వానిని చూచి కావలివాండ్రు దైత్యపతి కెఱిగించిరి. బాణుని ఆనతిచే వచ్చిపైబడిన సేవక సైన్యము అమహాత్ముడు అనిరుద్ధుడు ఇనుపపరిఘచేత చావమోదెను.

వారు అట్లు హతులైనంత బాణుడు రథమెక్కివచ్చి పోరి ఆ వీరుని వలన పరాజయమొందెను. తరువాత బాణుడు మంత్రము జపించి మాయాయుద్ధము చేయుట అరంభించెను. సర్పాస్త్రముచే యదునందనుని బంధించెను. అనిరుద్ధుడెటువోయెనని ద్వారకలో అనుకొనుచున్న యదువులకు నారదుడు అతని బాణునిచే బద్ధుడయినట్లు తెలియజేసెను. అప్పుడు యాదవులు ఆనిరుద్ధ కుమారుని యోగవిద్యా విశారదయగు ఒక అంగన శోణిత పురమునకు గొంపోయినట్లువిని విచారించిరి.

అంతట తలచినంతనే వచ్చిన గరుడునెక్కి బలరామునితో ప్రద్యుమ్నునితో గూడి హరి బాణపురమునకు ఏగెను. పురప్రవేశమందే బలశాలురగు ప్రమథగణముతో రణమయ్యెను. హరి వారిని క్షయమొందించి బాణపుర ప్రాంతములకు వెళ్లెను.

ఆ తరువాత త్రిపాదము త్రిశిరస్కమునైన మహేశ్వర మహాజ్వరము బాణుని కాపుదలకై శారఙ్గధన్వునితో (హరితో) పోరజొచ్చెను. కృష్ణశరీరస్పర్శ వలన భస్మస్పర్శవలన జనించిన ఒకానొక తాపమును బలరాముడు కూడ పొంది కన్నులు మూసికొనెను. కృష్ణునితో పోరుచున్న మహేశ్వర జ్వరము, వైష్ణవ జ్వరముచే కృష్ణదేహము నుండి త్రోసివేయ బడెను. నారాయణ భుజాఘాతముచే కల్గిన బాధచే కన్నులు తీసివేసిన మహేశ్వర జ్వరమును చూచి బ్రహ్మ వీనిని క్షమింపుమని హరిని కోరెను. అటు మీద క్షమించితినని వైష్ణవ జ్వరమునుదనయందు లయింపజేసికొనెను. నీతో నాకైన ఈ యుద్ధమును ఎవ్వరు స్మరింతురో వారు విజ్వరులు (జ్వరబాధలేనివారు) అయ్యెదరని హరియేగెను. అవ్వల శత్రు ప్రయుక్తములగు పంచాగ్నులగెల్చి క్షీణింపజేసి దానవుల సేనలను విష్ణువు లీలగ పిండిచేసెను.

అటు పిమ్మట బాణుడు శంకరుడు, కుమారస్వామియు సమస్త సైన్యముతో కృష్ణునెదిరించి యుద్ధము చేసిరి. హరిహరుల పోరాటము మిక్కిలి దారుణమయ్యెను. శస్త్రాస్తములచే లోకములు సంక్షోభించెను. ఇది సర్వ జగత్ర్పళయము కొరకే వచ్చినదని దేవతలుతలచిరి. గోవిందుడు జృంభణాస్త్రముచే శంకరుని జృంభింప జేసెను. అంతట దైత్యులు ప్రమథులును నశించిరి. జృంభణమువలన ఓటువడి, హరుడు రథమధ్యమందు ఒరగెను. కృష్ణునితో పోరలేడయ్యెను కుమారస్వామి గరుడునిచే పొడువబడిన బాహువులతో ప్రద్యుమ్నుని అస్తముల దెబ్బతిని కృష్ణుని హుంకారములచే శక్త్యాయుధము చెదర రణభూమి నుండి తొలగిపోయెను. హరిచే శంకరుడూదరగొన రాక్షస సైన్యము నాశముకాగా గుహుడోటువడ ప్రమథసేన క్షయమొందగా నందీశుడు అశ్వములను పూన్చిన రథమెక్కి, బాణుడు కృష్ణునితోను కృష్ణుని బలముతోను యుద్ధము చేయుటకు ఎత్తి వచ్చెను.

మహావీరుడు బలభద్రుడు బాణుని సైన్యమును అనేక విధముల చండాడెను. ప్రద్యుమ్నుడు రణధర్మమును అనుసరించి పారిపోక (వెనుదిరుగక) పోరెను. బలరాముడు నాగలి కొనచే పట్టి లాగి రోకలిని చక్రి బాణములచే నుగ్గు చేయుటను బాణుడు చూచెను. అప్పుడు కృష్ణుడును బాణుడును తలపడిరి. ఒండొరులు మెఱుగులు క్రమ్ము కవచములను ఖండించుకొనిరి. ఒండొరుల బాణములచేతను ఒండొరులను కొట్టుకొనిరి. తుదకు హరి బాణుని సంహరింపవలెనని దృఢ నిశ్చయముచేసికొనెను. అంతట నూరుగురు సూర్యులవలె వెలుగు చక్రమును సుదర్శ నాఖ్యమును దైత్యచక్రవైరి హరిచేపట్టెను. మధువైరి ఈసారి బాణుడు నశించి తీరవలెనని చక్రాయుధమును వదలినంతట రాక్షసుల మాయా మంత్రశక్తి కోటరి అనునది దిగంబరి అయ్యెను. అనగా వెల్లడియయ్యెను. ఆ శక్తిని గని కనులు మూసికొని బాణుని బాహు వనమును ఖండించుటకు సుదర్శనమును విసరెను. ఆ చక్రాయుధము బాణుని బాహుసమూహమును నరకెను. హరి ఆమీద బాణునిగూడ సంహరింపనెంచి నంతట త్రిపురవైరి (శివుడు) బాణుడు చేతులు తెగి రక్తము వర్షించు చుండగని తటాలున వచ్చి హరితో సామరస్యపూర్వకముగ ఇట్లనియె.

కృష్ణా! కృష్ణా! జగన్నాథ! నీవు పురుషోత్తముడవు, పరాత్పరుడవు, అద్యంతములు లేనివాడవు అని ఎఱుంగుదును. దేవ మనుష్య పశుపక్ష్యాదులందు శరీరమును గ్రహించుట దైత్యసంహారము చేయుట అను లక్షణముగల ఈ చేష్ట నీలీల. కావున ప్రసన్నుడవు అగుము. ఈ బాణునకు నేను అభయమిచ్చి ఉన్నాను. నాపల్కినపలుకు నీవు అబద్ధము చేయ తగదు. నా ఆశ్రయమదముచే పెరిగినవాడు వీడు. నీ అపరాధమిందు లేదు. ఈ దైత్యునికి నేను వరములు ఇచ్చితిని. కావున నిన్ను నేను సైరణ గొనుమని కోరుచున్నాను అని చెప్పగా, గోవిందుడు మాధవుని శూలపాణిని గూర్చి ప్రసన్నముఖుడై బాణునియెడ కసివిడచి ఇట్లనియె.

శంకర! నీచే వరములు ఈయబడిన వాడు కావున నీ బాణుడు బ్రతుకుగాక! నీ మాటపై గల గౌరవముచే ఇదిగో చక్రమును మఱలించితిని. నీవు అభయమిచ్చుట నేను ఇచ్చుటయే. నాకంటె నీవు వేఱుగావని చూడదగును. నేను ఎవ్వడనో అతడు నీవే. సదే వాసుర మానుషమైన ఈ జగత్తు గూడ మనమే. అవిద్యా మోహితులైనవారు భేదదృష్టిని వహింతురు. అని కృష్ణుడు పలుక ప్రద్యుమ్నుని చుట్టుకొని ఉన్న పాములు చచ్చుపడి పోయినవి. అంతట పత్నితోగూడిన అనిరురుద్ధని గరుడునిపైకి ఎక్కించుకొని బలరామకృష్ణ కృష్ణ సంబంధి పరివారములు ద్వారకాపురికి వచ్చిరి. (206)