బ్రహ్మ మహా పురాణము

వరాహావతార వర్ణనము

 “ఓ మునీంద్రా! కృష్ణుని మహిమ అద్భుతము. బలరాముని యొక్కయు ప్రభావం అట్టిదే. నీ వలన ఎంత విన్నను తృప్తి కలుగుటలేదు. పురాణములందు విష్ణువు వరాహావతార మెత్తినట్లు విన్నాము. అది విస్తరముగా నానతిమ్ము. వరాహమన స్వరూపమేమి? దేవత యెవరు? ఏవిధమైన ఆచారము ప్రభావము కృత్యము జరిపెనో తెలుపుము. యజ్ఞకర్తలకు పరలోకమేగు వారికి బ్రాహ్మణులకు ఈ చరిత్ర పుణ్యలోక ప్రదము. ఆయన కోరతుదతో భూమినెత్తిన కథ వినగోరెదము. అదిగాక పరమాత్మ యొక్క అవతార విశేషములు కూడ దెల్పు” మన వ్యాసుడు ఇట్లు అనియె.

ఇది గొప్ప ప్రశ్న. యథాశక్తిగ తెల్పెదను. ఆవిష్ణు యశస్సు శ్రవణము చేయ వలెనన్న తలపు మీకు కల్గుట అదృష్టము. అందువలన విష్ణు లీలలను వినుడు.