బ్రహ్మ-సుభద్రా కృష్ణ బలరాములు గుడివా మండపమునకు రధయాత్ర చేయుదురు, ఆ ఉత్సవము దర్శించిన వారు విష్ణులోక మందుదురు.”
అది విని మునులు “దక్షిణ దిక్కునందు ఆ యాత్రా విధానమును ఏర్పరిచిన వారెవరు? ఆ యాత్రా సందర్శన ఫలమేమి? ఇంద్రద్యుమ్న రాజ నిర్మితమగు ఆ సరస్సు యొక్క తీరమందుగల ఆ మండపమున తమ దేవాలయమును వదలి ఆముగ్గురును ఏడు రాత్రులు నిర్జనమైన ఆ పవిత్ర ప్రదేశమున ఎందులకు వసింతురో తెల్పుడు” అన బ్రహ్మ ఇట్లు అనియె.
ఇంద్రద్యుమ్నుడు ప్రార్ధింప శ్రీహరి గుడివా యాత్రజేసి ఏడు రోజులచ్చట నివసింతునని వరమిచ్చెను. ఈ యాత్రా దర్శనము సర్వకామ ఫలప్రదము. బ్రాహ్మణాది వర్ణముల వారు యథావిధిగ షోడశోపచార పూజలు గావించి, గీత నృత్యాదులచే పరమాత్మను సేవించిన ఎడల వారికి సర్వా భీష్టములు సిద్ధించును అని ఈ విషయమును స్వయముగా తెల్పి అంతర్థానమయ్యెను. ఆరాజ శ్రేష్టుడా యాత్రను నిర్వహించి భగవద్దర్శనము చేసి కృతార్ధుడయ్యెను. (66)