బ్రహ్మ మహా పురాణము
కృష్ణస్నాన మాహాత్మ్య వర్ణనము
మునులడుగగ బ్రహ్మ బలరామ కృష్ణ సుభద్రా ప్రీతిగ చేసిన స్నాన ఫలమును గూర్చి ఇట్లు చెప్పెను. “జ్యేష్ఠ మాసమందు చంద్ర దేవతాక మగు నక్షత్రమందు పూర్ణిమనాడు సర్వ తీర్థములు పురుషోత్తమ క్షేత్రమునందున్న నూతియందు ఉండును. భోగవతి అను పుణ్యతీర్థము అచ్చట ప్రత్యక్షమగును. ఆనాడు బంగారు కలశములచే ఆ కూప జలమును తోడి ఆముగ్గురి దేవతలకు అభిషేకము చేయవలెను. ఒక మంచము, వస్త్ర పుష్పాదులచే అలంకరించి, పతాకములెత్తి, తెల్లని వస్త్రము పఱచి, ధూప దీపాదులు అలంకరించి, వివిధ మంగళ వాద్యములు మ్రోగ, బలరామ కృష్ణులను సుభద్రను పూజింపవలెను. సుభద్రను వారిద్దరికి నడుమ నిలుపవలెను. ఆ విధముగ యధావిధి పూజచేసి మంగళ వాద్యములను మ్రోయించి వేద పారాయణముకూడ చేయించవలెను. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసులు కూడ ఈ పూజ చేయవచ్చును. ఆపైన స్తుతి చేయవలెను. ఆ సుతియందు ‘నమస్తే దేవదేవేశ’ అను స్తోత్రమును పఠింపవలెను. ఈ పూజకు ఇంద్రాది దేవతలు కూడ వత్తురు.
ఈ విధముగ దేవతలు మొదలగువారు సమస్త అభిషేక సామాగ్రిచేతను, సమస్త మంత్ర లాభముల చేతను యథావిధిగా బలరామ సుభద్రా కృష్ణులను అర్చింతురు. ఈ అర్చనవలన సర్వాభీష్టములు సిద్ధించును. సర్వదాన ఫలము కల్గును. గ్రహబాధలు తొలుగును. సంతాన సిద్ధి కలుగును. అయా దానములచేత ఫల సిద్ధులు సంపూర్ణముగా పొందగలరు. (65)