బ్రహ్మ మహా పురాణము

పృథువు మొదలైన సర్వదేవతల రాజ్యాభిషేకము

అని ఇట్లు వారికి సర్వసృష్టిని గురించి తెలిపి ఇంకను లోమహర్షణుడు ఇట్లనెను..

బ్రహ్మ వేన కుమారుడు పృథుని, చక్రవర్తిగా అభిషేకించి క్రమముగా వారివారికి రాజ్యములను నిర్ణయించి ఇచ్చెను. ద్విజులు ధాన్యములు, నక్షత్రములు, గ్రహములు, యజ్ఞములు, తపస్సులు అనువాని రాజ్యాధికారమందు సోమునకు పట్టాభిషేకము చేసెను. అప్పులకు వరుణుని, రాజులకు రాజరాజును (కుబేరుని), ఆదిత్యులకు విష్ణుని, వసువులకు అగ్నిని, ప్రజాపతులకు దక్షుని, మరుత్తులకు వాసవుని, దైత్య దానవులకు ప్రహ్లాదుని, పితరులకు వైవస్వతుని (యముని), యక్ష రాక్షస పార్థివ సర్వభూత పిశాచములకు శూలపాణియైన గిరీశుని (శివుని), శైలమునకు హిమవంతుని, నదులకు సాగరుని, గంధర్వులకు చిత్రరథుని, నాగులకు వాసుకిని, సర్పములకు తక్షకుని, ఏనుగులకు ఐరావతుని, అశ్వములకు ఉచ్ఛైఃశ్రవమును, పక్షులకు గరుడుని, మృగములకు శార్దూలమును, గోవులకు గోవృషమును, వనస్పతులకు జువ్విచెట్టును రాజు గావించెను.

తూర్పు దిశకు వైరాజ ప్రజాపతి కుమారుడైన సుధన్వుని, దక్షిణ దిశకు కర్దమ ప్రజాపతి కొడుకు శంఖపదుని, పడమటి దిశకు రజస్సు కుమారుడు (అచ్యుతుని) కేతు మంతుని, ఉత్తర దిశకు పర్జన్య ప్రజాపతి తనయుడు హిరణ్య రోముని అధిపతులనుగా అభిషేకించెను.

సప్త ద్వీప పరివృతమయిన ఈ పృథ్వి పట్టణములతో గూడి వారివారిచేత ఇపుడును ధర్మముతో పాలించబడుచున్నది. ఈ నరపతులచే వేద విహితముగ రాజసూయాభిషిక్తుడై, రాజ్యాభిషిక్తుడుగా కూడా అయిపృథువు చక్రవర్తియై ఇమ్మేదినిని ఏలెను. చాక్షుష మన్వంతరము గడచి వైవస్వత మన్వంతరము ఆరంభమయ్యెను. ఆ మన్వంతర వృత్తాంతమును అంతయును సాకల్యముగా వినిపింతును వినుడు అని చెప్పగా శ్రద్ధతో ఆ లోమహర్ష ణుని మాటలను వినుచున్న మునులు ......

లోమహర్షణ! పృథు చక్రవర్తి మహానుభావుడు. ఈ భూమిని గోవును చేసి వస్తు సారమును పిదికెను అందురు. నరసురాసుర నాగ యక్షద్రుమ శైల పిశాచ గంధర్వ రాక్షసాది మహాసత్వ జాతులచే ఈ భూమి ఎట్లు పిదుకబడినది. వారు వారు పిదికిన పాత్ర విశేషములేవి? దూడలు ఎవరు? దోగ్ధ (పాలు పితికినవాడు) ఎవరు? దుగ్ధము (పాలు) ఎట్టిది? కుపితులైన మహర్షులు ఎట్లు వేనుని హస్తము మథించిరి? దానికి కారణమేమి? ఈ సర్వవృత్తాంతమును ఆనతిమ్ము అనగా -

లోమహర్షణుడు ఇట్లు అనెను !

ఏకాగ్ర మనస్కులై ఆలింపుడు. అశుచికి, నీచ మనస్కునకు, శిష్యుడు కాని వానికి, వ్రత దూరునికి, కృతఘ్నునికి, అహితునకు దీనిని నేను తెలుపను. ఈకథ స్వర్గప్రదము, కీర్తిదము, ఆయుష్యము, ధన్యము, వేదసమ్మితము. ఋషులు రహస్యముగా ఆనతిచ్చినది వినుడు.

మున్ను అత్రి వంశమున ధర్మ ప్రభువు అత్రిసమానుడు. అంగుడు అను ప్రజాపతి ఉదయించెను. వాని సుతుడు వేనుడు. మృత్యువు కూతురగు సునీధయందు కలిగినవాడు. మాతామహ దోషముచే అతడు స్వధర్మమును వెనుకఁబెట్టి కామలోభియై ప్రవర్తించెను. ధర్మము యొక్క హద్దులను తారుమారు చేసెను. వేద ధర్మమును అతిక్రమించెను. వాని రాజ్యమున స్వాధ్యాయము, అగ్నియందు హవిస్సులను వ్రేల్చునప్పుడు చేయు వేద ధ్వనియును వినరాదయ్యెను. దేవతలు యజ్ఞములందు సోమరసమును త్రాగి ఎఱుగరు. హవిస్సులను ఆరగింపరు. ఆ నరపతికి వినాశకాలము దాపురించెను కావలయు యజ్ఞములు వలదు హోమములు వలదు అని శాసించి, క్రూర ప్రతిజ్ఞ చేసెను. నేను యజ్ఞేశ్వరుడను, యజ్ఞకర్తను, యజ్ఞమునందు నన్నుగూర్చియజింపవలయును. నాకై హోమములు ఆచరింపవలెనని వాడు శాసించెను. మర్యాదను అతిక్రమించి ఉత్పథగామియై ఉన్న వానిని చూచి మరీచి ప్రముఖులైన ఋషులు వేన! మేము పెక్కు సంవత్సరములు దీక్షా ప్రవేశము కావించెదము. అధర్మము చేయకుము. ఇది సనాతన ధర్మము. అత్రి తరువాత నీవు ప్రజాపతి అను కీర్తితో అవతరించిన వాడవు. ప్రజలను పాలింతునని ప్రతిజ్ఞచేసి కదా రాజు అయితివి. అన విని వాడు వారలను పరిహసించి దుర్బుద్ధి అనర్థపరుడు కావున ఇట్లనెను.

ధర్మమునకు నాకంటే కర్త ఎవ్వడు? నేను ఎవ్వనిమాట వినవలయును? శ్రుతమున (పాండిత్యమున), వీర్యమందు, తపస్సులో, సత్యములో నాతో సమానమైనవాడు ఎవ్వడు? సర్వభూతముల యొక్కయు, ధర్మము యొక్కయు మొదలు తుదియు తెలియని మూర్ఖులు మీరు. నిజముగ మీరు నన్ను ఎఱుగరు. తలచితినేని ఈ ఇలాతలమును అంతను దహించి వేయగలను. నీటి వెల్లువలలో ముంచెత్తి వేయగలను. భూమ్యాకాశముల దారులను బంధించగలను అనవిని పొగరెక్కి మూర్ఖుడై ఉన్న వానిని సరిచేయుట అసంభవమని మహర్షులు క్రుద్ధులైరి.

వానిని బట్టి కట్టివైచి వాని ఎడమ తొడను మథించిరి. అందుండి నల్లనివాడు, పొట్టివాడు జనించి భయపడుచు దోసిలొగ్గి నిలువబడెను. బెదురుచున్న వానిని జూచి అత్రి మహర్షి ‘నిషీద’ (కూర్చుండుము) అనెను. అందుచే వాడు నిషాద వంశమునకు (బోయలకు) మూల పురుషుడు అయ్యెను. ఆ మీదట ‘ధీవరులు’ చేపలుపట్టు వారిని మేనికల్మషము కలవానిని కనెను. వాని వలన కోయలు మొదలగు కొండజాతుల వారు జనించిరి. వేనుని కల్మషముచే పుట్టిన వారందరు అధర్మ ప్రియులైరి.

ఆ మీదట వేనుని కుడిచేయిని అరణినట్లు మథింపగా అందుడి ‘అజగవమ’ను ధనువును దివ్య బాణములను గొని కవచమును ధరించి పృథువు అగ్నివలె వెలుగుచు ఉదయించెను. అప్పుడు సర్వభూతములు సంతుష్టములయ్యెను. వేనుడు ఆ క్షణమే స్వర్గం అలంకరించెను. మహానుభావుడైన పుత్రుని వలన అతడు పున్నామ నరకము నుండి రక్షింపబడెను. ఆ పృథుని సన్నిధికి రత్నములుగొని సముద్రము, నదులు వచ్చి పవిత్ర ఉదకములతో అభిషేకించినవి. బ్రహ్మయు అంగిరసుడు మొదలగు దేవతలతో అచ్చటకి వచ్చెను. స్థావర జంగమములు అయిన భూతములు కూడ వచ్చినవి, అందరు అతనికి పట్టాభిషేకము కావించిరి. యధావిధిగా ధర్మ నిపుణులచే నభిషిక్తుడయిన యా చక్రవర్తి తండ్రిచే బాధితులు అయిన ప్రజల అనురాగముచే రంజింపజేసెను. దానివలన అతడు ‘రాజు’ యను పేరందెను. అతడు సముద్రమునకు పోగా ఉదకములు స్తంభించి కడకు అనుకూలము అయ్యెను. పర్వతములు అతని టెక్కెము(ధ్వజము)నకు భంగమురాకుండ దారి ఇచ్చెను. తలచుకొన్న మాత్రమున ధరణి దున్నకయే సర్వసస్యములను పండెను. గోవులు కామధేనువులయ్యెను. పట్టుపట్టునందును తేనియలు కురిసెను. ఈ సమయమందు ఒక యజ్ఞమున హవిన్సునందు సూతి అనువానికి మహామేధావి అగు సూతుడు అవతరించెను. అయ్యజ్ఞ మందు ప్రాజ్ఞుడయిన మాగధుడును కలిగెను. వారు ఇరువురును పృథు చక్రవర్తిని స్తుతించుటకై మునులు పిలువగా ఏతెంచిన మహానుభావులు. ఋషులు పృథు చక్రవర్తిని మీరిద్దరు స్తుతింపుడు అని ఆదేశించిరి. అప్పుడు సర్వ ఋషులను గూర్చి ఆ సూతమాగధులిట్లు పలికిరి.

ఆ సూత మాగధులు మేము దేవతలను ఋషులను కీర్తించి, సంతుషులుగా ఒనరించు వారము. ఇతడెవడో? ఈతని పేరేమో? చేసిన చేతయేమో? లక్షణము ఎటువంటిదో? కీర్తి ఎటువంటిదో? ఎఱుగము. చూచుటకు మహా తేజస్వియై కనిపించు చున్నాడు. కాని ఏమని ఈతనిని నుతింతుము? అనగా మునులు జరుగబోవు ఈతని సత్కార్యములను భావించి గానము చేయుము అనిరి. వారు ఆతని చరితమును ఊహించి కొనియాడిరి. అది మొదలు లోకమునందు జరుగు స్తవములై ఆశీర్వాద ప్రధానములయి సూత మాగధ వంది జన ముఖమున ప్రవర్తించొచ్చెను. వారి స్తుతికి మిక్కిలి సంతసించి పృథుచక్రవర్తి సూతునకు (అనూపదేశము) అనగా సముద్రతీర ప్రాంతమును మాగధునకు మగధ దేశమును బహుమానమిచ్చెను. ఆ తర్వాత మహర్షులందరు పరమ ప్రీతులయి ప్రజలను ఉద్దేశించి ఈ ఱేడు (రాజు) మీకు అందరకు వృత్తులను ఏర్పాటు చేయగలడు అనిరి. అదివిని ప్రజలు వేనసుతని దరికి పరుగులెత్తిరి.

ఆ సమయమున ఆ రాజు విల్లు అమ్ములుదాల్చి భూమినిగూర్చి పరుగెత్తిన ఆ భూదేవి భయపడి పారిపోయిన ఆతడు వెంబడించి ఆమెను తఱుమజొచ్చెను. ఆమె పృథునికి జడిసి బ్రహ్మాది లోకముల వెంట పరుగులు పెట్టి పెట్టి తాను చేరిన చోటయెల్ల ఎట్టయెదుట ధనుర్బాణ పాణియై జ్వలితాగ్నివలెనున్న ఆ రాజునే చూచి ఇతడు దేవతలకు కూడా ఓర్వరాని వాడని భావించి దిక్కుతోచక ఆతనినే శరణు వేడెను. త్రిభువన పూజ్యయైన ఆ వసుంధర (భూదేవి) అంజలిగాంచి ‘స్త్రీ’ వధ అధర్మమని నీకు తెలియదా? నేను లేకుండ ప్రజలను ఎట్లు ధరింతువు? లోకములన్నియు నాయందే ఉన్నవి. నా చేతనే ఈ జగము ధరింపబడుచున్నది. నేను పోయిన ప్రజలెల్లరు పోదురు. ఆ విషయమును తెలుసుకొనుము. నీవు ప్రజా శ్రేయస్సు చేయవలెనని భావించుచున్న ఎడల నన్ను తుదముట్టింప తగదు. ఇంకా ఒకమాటను కూడ వినుము. నిరపాయమైన ఉపాయమున సర్వకార్యములు సిద్ధించును. ఈ ప్రజల ధరించుటకు నేను ఒక ఉపాయము చెప్పెద వినుము. నన్ను సంహరించిన నీవు ప్రజలను పోషింపజాలవు. నేను నీకు అనుకూలనయ్యెదను. కోపము ఉపసంహరింపుము. పశుపక్షులలో ఆడది అవధ్యురాలని అందురు. నీవు ధర్మమును వీడుట తగదు అని పెక్కు విధముల పలికిన ధరిత్రి పలుకులు ఆలించి మహామతి కావున ఆ నృపతి కోపమును నిగ్రహించి వసుమతిని (భూమిని) చూచి ఇట్లనెను.

తనకుగాని ఇతరునికి గాని ఒక్కనికి మాత్రము క్షేమముగల్గుటకు పెక్కు ప్రాణులను సంహరించినవానికి అంతులేని పాపము గల్గును. ఏ దుష్టుడు సంహరింపబడుట వలన పెక్కుమంది జీవులు సుఖమును పొందుదురో అట్టివానిని సంహరించుటవలన పాతకము ఉపపాతకము అను ఏవియు కలుగవు. వసుంధరా! నేను చెప్పినట్లు జగద్ధితము చేయని ఎడల నిన్ను పెక్కుమంది ప్రజల క్షేమము నిమిత్తమై ఇదిగో ఇపుడే సంహరించెదను. నా శాపమునకు పెడమొగమైన నిన్ను నా బాణముచే ఇప్పుడు కూల్చి మెప్పుఁగొని ప్రజలను కాపాడెదను. ధర్మశీలురకెల్ల ఉత్తమురాలవు నీవు. నాశాసనమునకు కట్టువడి ప్రజల బ్రతికింపుము. ప్రజాధారణ మందు నీవు సమర్ధురాలవు గదా! నాకు కుమార్తెవు కమ్ము. అప్పుడు ఈ భయంకరమైన బాణమును ఉపసంహరించెదను అని రాజు అనెను. ఆ మాటలకు వసుధ ఇట్లని జవాబిచ్చెను:

“దీనిని అంతయు నేను చేసెదను. సంశయము లేదు. కాని నాకు ఒక దూడను సంపాదింప యత్నింపుము. దాని మూలమున నేను పాలు చేపెదను. అదిగాక నన్ను మెట్టపల్లములు లేనట్లుగా చేయుము. అపుడు నాచేపిన క్షీరము నలుమూలల సమముగా జాలువారును. ఆ మాటలు విని, పృథుచక్రవర్తి తన ధనుష్కోటిచే వేలకొలది కొండలను మీదికి లేవగొట్టెను. ఇంతకుముదు సృష్టియందు భూతలము విషమముగ అనగా ఎత్తు పల్లములుగా ఉండెను. ఆ యెగుడు దిగుడు నేల యందుపురములు, గ్రామములు అను విభాగమే లేకుండెను. పంటలు లేవు. గోరక్షణ లేదు. కృషి లేదు. వర్తకమునకు దారి లేదు. సత్యానృతము (వాణిజ్యము) లేదు. లోభము లేదు. మత్సరము లేదు. వైవస్వతమనువు తరము అట్లు గడిచినది. ఇప్పుడు పృథు చక్రవర్తి మొదలు ఇది అంతయు ఏర్పడినది. ఎక్కడెక్కడ ఈ ధరిత్రి సమముగ ఉండిన అక్కడ ప్రజలు నివాస మేర్పరచు కొనకోరిరి. ఆనాటికి కందమూలములు ఆహారము. అది మిగుల కష్టజీవనమని విందుము. పృథువు స్వాయంభువ మనువును దూడగా ఒనరించి తన హస్తమే పాత్రముగ భూమిని పిదికెను. ఆ పిదికిన క్షీరము సర్వ సస్యస్వరూపము. ఆ అన్నముచేతనే ఈ నాటికిని ప్రజలు సుఖజీవనులు అగుచున్నారు. ఋష్యాదులు తమతమ ఆహార రూపమైన క్షీరమును తమకు అభిమతమైన పాత్రములందు పిదుకుకొనిరి.

ఆ క్రమము ఇట్టిది

ఋషులకు సోముడు వత్సము (దూడ), దోగ్ధ (పిదుకువాడు) బృహస్పతి. క్షీరము. తపో బ్రహ్మము పాత్రము ఛందోమయము దేవతలకు ఇంద్రుడు దూడ. దోగ్ధ రవి, పాలు ఓజస్సు (తేజస్సు) పాత్రము కాంచనము. పితృ దేవతలకు దూడ యముడు, దోగ్ధ అంతకుడు. పాలు సుధ (స్వధ). పాత్రము రజతము (వెండిగిన్నె) నాగులకు తక్షకుడు దూడ దోగ్ధ ఐరావతుడను నాగుడు. క్షీరము విషము పాత్రము సొరకాయ. అసురులకు విరోచనుడు వత్సము (దూడ) దోగ్ధ మధువు. పాలు మాయామయము. పాత్ర ఆయనము ఇనుపగిన్నె (అయోమయము) యక్షులకు దూడ వైశ్రవణుడు. దోగ్ధ రజతనాభుడు. పాలు అంతర్థానము పాత్ర. మట్టికుండ. రాక్షసేంద్రులకు దూడ సుమాలి దోగ్ధ రజతనాభుడు, పాలు శోణితము (రక్తము) పాత్ర కపాలము. గంధర్వులకు దూడ చిత్రరథుడు పిదుకువాడు సురుచి పాలు సుగంధము. పాత్ర పద్మము పర్వతములకు దూడ. హిమవంతుడు దోగ్ధ మేరువుపాలు రత్నౌషధులు పాత్రము శైలము. వృక్షములకు దూడ ప్లక్షము (జువ్వి) దోగ్ధ పుష్పించిన శాలము, వృద్ధిపాలు. తెగిన (కాలినచోట) మొలపించుశక్తి అనునది. పాత్రము మోదుగాకుల దొన్నె (పాలాశ పత్రము) ఈ విధముగ ఈధాత్రి నిజముగ ధాత్రియే (పాలిచ్చి పెంచెడి దాదియే) విధాత్రి (జీవన విధాత్రి- బ్రతుకుతెఱవు చూపెడి తల్లి) పావని. చరాచర భూతములకు నిలుచు ఆదరవు. (యోని కారణము) సర్వ కామ దోగ్ద్రి సర్వసస్య ప్రరోహణి. ఆ సముద్ర పర్యంతమైన ఈ భూమి మధుకైటభుల మేదస్సుచే (మెదడుచే) మేదిని అని ప్రఖ్యాతి గొన్నది. ఈ పేరు వేదవాడులు పెట్టినది. ఈవల ఈమె పృథు నృపతికి కన్నకూతురు అయ్యెను కావున పృథివి అను ఖ్యాతి గన్నది.

అతనిచే వసుంధర సువిభక్త అయినది. సువిశోధితమై సస్యములు, గనులు కల్గి, పురపట్టణ గ్రామాదులచే నిండుతనము సంతరించుకొన్నది. వైన్య (వేనుని కుమారుడైన) రాజన్య చూడామణి ఇట్టి అసామాన్య ప్రభావుడు రాజసత్తముడు, భూత-గ్రామములకు నమస్కరింప తగినవాడు. పూజింప అర్హుడు. వేదవేదాంగపారగులైన బ్రాహ్మణులకుగూడ పృథు చక్రవర్తి నమస్కరింపతగినవాడు. పార్థివత్వమును కోరు రాజుకు మహానుభావులకు అది రాజుగ అభివంద్యుడు. ప్రతాపశాలి శ్రీ పృథువు. విక్రమశీలురైన యోధులకు జయాకాంక్షులైనవారికి యోధులకెల్ల ప్రథముడైన పృథువు వంద్యుడు. పృథుని ధ్యానించి, కీర్తించిన యోధుడు ఘోరమయిన సంగ్రామ రంగము నుండి క్షేమముగ మరలి రాగల్గును. వాణిజ్య వృత్తిని అనుసరించు వైశ్యులకు, విత్త సమృద్ధికై వృత్తిదాతయైన పృథువు వందనీయుడు. శుచివర్తనులై త్రివర్ణములను ఉపచరించు శూద్రులకును పృథుచక్రవర్తి నమస్కారానికి అర్హుడు. దానివలన వారు పరమ శ్రేయస్సు పొందగలరు. మహర్షులార! మహానుభావులార! మఱియేమి వినదలంతురు? సెలవిండు అని ఆ లోమహర్షుణుడు అడుగగా (4)